ఆదికాండం 35:1-29
35 తర్వాత దేవుడు యాకోబుతో ఇలా అన్నాడు: “లేచి, బేతేలుకు+ వెళ్లి అక్కడ నివసించు. నువ్వు నీ అన్న ఏశావు నుండి పారిపోతున్నప్పుడు+ నీకు కనిపించిన సత్యదేవునికి అక్కడ ఒక బలిపీఠం కట్టు.”
2 అప్పుడు యాకోబు తన ఇంటివాళ్లకు, తన దగ్గరున్న వాళ్లందరికీ ఇలా చెప్పాడు: “మీ మధ్య ఉన్న అన్యదేవతల విగ్రహాల్ని తీసిపారేయండి.+ మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, మీ బట్టలు మార్చుకోండి.
3 మనం లేచి, బేతేలుకు వెళ్దాం. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా ప్రార్థనకు జవాబిచ్చి, నేను వెళ్లిన ప్రతీచోట* నాకు తోడుగా ఉన్న సత్యదేవునికి+ అక్కడ నేను ఒక బలిపీఠం కడతాను.”
4 కాబట్టి వాళ్లు తమ దగ్గరున్న అన్యదేవతల విగ్రహాలన్నిటినీ, తమ చెవులకు ఉన్న పోగుల్ని యాకోబుకు ఇచ్చారు. అతను వాటిని షెకెముకు దగ్గర్లో ఉన్న పెద్ద చెట్టు కింద పాతిపెట్టాడు.*
5 వాళ్లు ప్రయాణమై వెళ్తున్నప్పుడు, చుట్టుపక్కల నగరాల వాళ్లకు దేవుడు భయం పుట్టించాడు. అందువల్ల వాళ్లు యాకోబు కుమారుల్ని వెంటాడలేదు.
6 చివరికి యాకోబు, అతనితో పాటు ఉన్నవాళ్లంతా కనాను దేశంలోని లూజుకు+ అంటే బేతేలుకు చేరుకున్నారు.
7 అతను అక్కడ ఒక బలిపీఠం కట్టి, ఆ చోటుకు ఏల్-బేతేలు* అని పేరు పెట్టాడు. ఎందుకంటే అతను తన అన్న దగ్గర నుండి పారిపోతున్నప్పుడు అక్కడ సత్యదేవుడు తనను తాను అతనికి బయల్పర్చుకున్నాడు.+
8 తర్వాత రిబ్కా దాది దెబోరా+ చనిపోయింది. ఆమెను బేతేలుకు దిగువన సింధూర చెట్టు కింద పాతిపెట్టారు. కాబట్టి అతను దానికి అల్లోను-బాకూత్* అని పేరు పెట్టాడు.
9 యాకోబు పద్దనరాము నుండి వస్తున్నప్పుడు దేవుడు అతనికి ఇంకొకసారి కనిపించి, అతన్ని దీవించాడు.
10 దేవుడు అతనితో ఇలా అన్నాడు: “నీ పేరు యాకోబు.+ ఇకమీదట నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు.” దాంతో దేవుడు అతన్ని ఇశ్రాయేలు అని పిలవడం మొదలుపెట్టాడు.+
11 దేవుడు అతనితో ఇంకా ఇలా అన్నాడు: “నేను సర్వశక్తిగల దేవుణ్ణి.+ నువ్వు పిల్లల్ని కని, ఎక్కువమంది అవ్వు. జనాలు, ఎన్నో గోత్రాలున్న పెద్ద సమూహం నీ నుండి వస్తాయి.+ రాజులు నీలో* నుండి వస్తారు.+
12 నేను అబ్రాహాముకు, ఇస్సాకుకు ఇచ్చిన దేశాన్ని నీకు, నీ తర్వాత నీ సంతానానికి* ఇస్తాను.”+
13 తర్వాత దేవుడు అతనితో మాట్లాడిన చోటు నుండి పైకి వెళ్లిపోయాడు.
14 కాబట్టి దేవుడు తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక రాయిని స్మారక చిహ్నంగా నిలబెట్టి, దానిమీద పానీయార్పణను, తైలాన్ని పోశాడు.+
15 దేవుడు తనతో మాట్లాడిన ఆ చోటును యాకోబు మళ్లీ బేతేలు అని పిలిచాడు.+
16 తర్వాత వాళ్లు బేతేలు నుండి బయల్దేరారు. వాళ్లు ఎఫ్రాత్కు కాస్త దూరంలో ఉండగానే రాహేలుకు పురిటినొప్పులు మొదలయ్యాయి, ప్రసవం ఆమెకు చాలా కష్టమైంది.
17 బిడ్డను కనడానికి ఆమె కష్టపడుతుండగా, మంత్రసాని ఆమెతో, “భయపడకు, ఈ కుమారుణ్ణి కూడా నువ్వు కంటావు”+ అంది.
18 అయితే రాహేలు ప్రాణం పోతుండగా చివరి క్షణాల్లో తన పిల్లవాడికి బెనోని* అని పేరు పెట్టింది, కానీ అతని తండ్రి బెన్యామీను*+ అని పేరు పెట్టాడు.
19 చివరికి రాహేలు చనిపోయింది. ఆమెను ఎఫ్రాత్కు వెళ్లే దారిలో, అంటే బేత్లెహేముకు+ వెళ్లే దారిలో పాతిపెట్టారు.
20 యాకోబు ఒక రాయి తీసుకొని ఆమె సమాధి మీద స్మారక చిహ్నంగా నిలబెట్టాడు; నేటికీ అది రాహేలు సమాధికి గుర్తుగా ఉంది.
21 తర్వాత ఇశ్రాయేలు అక్కడి నుండి ప్రయాణమై వెళ్లి, ఏదెరు బురుజు అవతల కొంతదూరంలో డేరా వేసుకున్నాడు.
22 ఇశ్రాయేలు ఆ ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు ఒకరోజు, రూబేను వెళ్లి వాళ్ల నాన్న ఉపపత్ని బిల్హాతో పడుకున్నాడు. ఆ విషయం ఇశ్రాయేలుకు తెలిసింది.+
యాకోబుకు మొత్తం 12 మంది కుమారులు.
23 లేయా ద్వారా పుట్టిన కుమారులు ఎవరంటే: యాకోబు పెద్ద కుమారుడు రూబేను,+ తర్వాత షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను.
24 రాహేలు ద్వారా పుట్టిన కుమారులు ఎవరంటే: యోసేపు, బెన్యామీను.
25 రాహేలు సేవకురాలైన బిల్హా ద్వారా పుట్టిన కుమారులు ఎవరంటే: దాను, నఫ్తాలి.
26 లేయా సేవకురాలైన జిల్పా ద్వారా పుట్టిన కుమారులు ఎవరంటే: గాదు, ఆషేరు. వీళ్లంతా యాకోబుకు పద్దనరాములో పుట్టిన కుమారులు.
27 యాకోబు చివరికి మమ్రేలో వాళ్ల నాన్న ఉన్న చోటికి వచ్చాడు.+ అది కిర్యతర్బాలో అంటే హెబ్రోనులో ఉంది. అబ్రాహాము, ఇస్సాకులు పరదేశులుగా నివసించింది అక్కడే.+
28 ఇస్సాకు మొత్తం 180 ఏళ్లు బ్రతికాడు.+
29 అలా ఇస్సాకు చాలా ఏళ్లు బ్రతికి, మంచి వృద్ధాప్యంలో సంతృప్తితో తుదిశ్వాస విడిచాడు; తన ప్రజల దగ్గరికి చేర్చబడ్డాడు.* అతని కుమారులు ఏశావు, యాకోబు అతన్ని పాతిపెట్టారు.+
అధస్సూచీలు
^ లేదా “మార్గంలో.”
^ లేదా “దాచిపెట్టాడు.”
^ “బేతేలు దేవుడు” అని అర్థం.
^ “ఏడ్పు సింధూర చెట్టు” అని అర్థం.
^ అక్ష., “నీ గర్భవాసం.”
^ అక్ష., “విత్తనానికి.”
^ “కుడిచేతి పుత్రుడు” అని అర్థం.
^ “నా దుఃఖ పుత్రుడు” అని అర్థం.
^ మరణాన్ని కావ్యరూపంలో ఇలా వర్ణించారు.