ఆదికాండం 38:1-30

  • యూదా, తామారు (1-30)

38  ఆ రోజుల్లో, యూదా తన సహోదరుల నుండి దూరంగా వెళ్లి అదుల్లామీయుడైన హీరా నివసించే చోటుకు దగ్గర్లో డేరా వేసుకున్నాడు.  యూదా అక్కడ షూయ అనే ఒక కనానీయుడి+ కూతుర్ని చూశాడు. అతను ఆమెను పెళ్లి చేసుకొని, ఆమెతో కలిశాడు.  ఆమె గర్భవతి అయ్యి ఒక కుమారుణ్ణి కన్నది. యూదా అతనికి ఏరు+ అని పేరు పెట్టాడు.  ఆమె మళ్లీ గర్భవతి అయ్యి కుమారుణ్ణి కని, అతనికి ఓనాను అని పేరు పెట్టింది.  తర్వాత ఆమె మళ్లీ ఒక కుమారుణ్ణి కని, అతనికి షేలహు అని పేరు పెట్టింది. ఆమె అతన్ని కన్నప్పుడు అతను* అక్జీబులో*+ ఉన్నాడు.  కొంతకాలానికి యూదా తన పెద్ద కుమారుడైన ఏరుకు తామారు+ అనే స్త్రీతో పెళ్లి చేశాడు.  కానీ యూదా పెద్ద కుమారుడైన ఏరు ప్రవర్తన యెహోవా దృష్టికి చెడుగా ఉండడంతో యెహోవా అతన్ని చంపేశాడు.  కాబట్టి యూదా ఓనానుతో ఇలా అన్నాడు: “మీ అన్న భార్యను పెళ్లి చేసుకొని, మరిదిగా నీ బాధ్యతను నిర్వర్తించు, మీ అన్న వంశాన్ని నిలబెట్టు.”+  కానీ ఆ సంతానం తనదిగా ఎంచబడదని ఓనానుకు తెలుసు.+ అందుకే అతను తన అన్న భార్యతో కలిసినప్పుడు, తన అన్నకు సంతానాన్ని ఇవ్వకూడదనే ఉద్దేశంతో తన వీర్యాన్ని నేల మీద పడిపోనిచ్చాడు.+ 10  అతను చేసిన పని యెహోవా దృష్టిలో చెడ్డది కాబట్టి ఆయన అతన్ని చంపేశాడు.+ 11  యూదా తన కోడలు తామారుతో, “నా కుమారుడైన షేలహు పెద్దవాడయ్యే వరకు నువ్వు మీ నాన్న ఇంట్లో విధవరాలిగా ఉండు” అన్నాడు. ఎందుకంటే ‘ఇతను కూడా తన సహోదరుల్లా చనిపోతాడేమో’+ అని యూదా అనుకున్నాడు. దాంతో తామారు వెళ్లిపోయి వాళ్ల నాన్న ఇంట్లో ఉంది. 12  కొంతకాలానికి యూదా భార్య అంటే షూయ కూతురు+ చనిపోయింది. ఆమె కోసం దుఃఖించే రోజులు అయిపోయాక యూదా అదుల్లామీయుడైన హీరాతో+ కలిసి తిమ్నాలో+ తన గొర్రెల బొచ్చు కత్తిరించేవాళ్ల దగ్గరికి వెళ్లాడు. 13  “ఇదిగో, మీ మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి తిమ్నాకు వెళ్తున్నాడు” అని ఎవరో తామారుకు చెప్పారు. 14  అప్పుడు ఆమె తన విధవరాలి వస్త్రాలు తీసేసి, తలకు ముసుగు వేసుకొని, శాలువ కప్పుకొని తిమ్నాకు వెళ్లే దారిలో ఉన్న ఏనాయిము ద్వారం దగ్గర కూర్చుంది. ఎందుకంటే షేలహు పెద్దవాడైనా తన మామ తనను అతనికిచ్చి పెళ్లి చేయలేదని ఆమె గమనించింది.+ 15  యూదా ఆమెను చూసిన వెంటనే ఆమె వేశ్య అనుకున్నాడు, ఎందుకంటే ఆమె ముసుగు వేసుకొని ఉంది. 16  అతను దారిపక్కన ఉన్న ఆమె దగ్గరికి వెళ్లి, ఆమె తన కోడలని తెలియక,+ “దయచేసి, ఈ రాత్రి నన్ను నీతో గడపనివ్వు” అన్నాడు. అయితే ఆమె, “అందుకు నువ్వు నాకు ఏమి ఇస్తావు?” అని అడిగింది. 17  అప్పుడు అతను ఆమెతో, “నేను నా మందలో నుండి ఒక మేకపిల్లను నీ దగ్గరికి పంపిస్తాను” అన్నాడు. కానీ ఆమె, “నువ్వు ఆ మేకపిల్లను పంపించేంత వరకు హామీగా ఏదైనా ఇస్తావా?” అని అడిగింది. 18  దానికి అతను, “హామీగా నేను నీకు ఏమి ఇవ్వాలి?” అని అడిగాడు. అందుకు ఆమె, “నీ ముద్ర-ఉంగరాన్ని,+ దాని దారాన్ని, నీ చేతిలో ఉన్న కర్రను నాకు ఇవ్వు” అంది. అప్పుడు అతను వాటిని ఆమెకు ఇచ్చి, ఆ రాత్రి ఆమెతో గడిపాడు. అతని వల్ల ఆమె గర్భవతి అయ్యింది. 19  తర్వాత ఆమె లేచి, అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆమె తన శాలువను తీసేసి, మళ్లీ విధవరాలి వస్త్రాలు వేసుకుంది. 20  తర్వాత, యూదా ఆ స్త్రీకి హామీగా ఇచ్చినవాటిని విడిపించి తీసుకురావడం కోసం తన సహవాసియైన అదుల్లామీయుడికి+ మేకపిల్లను ఇచ్చి పంపించాడు. కానీ అతనికి ఆమె ఎక్కడా కనిపించలేదు. 21  దాంతో అతను ఆమె ఊరివాళ్లను, “ఏనాయిము ద్వారం దగ్గర దారిపక్కన ఉండే ఆ వేశ్య* ఎక్కడ?” అని అడిగాడు. కానీ వాళ్లు, “అసలు ఎన్నడూ ఈ ఊర్లో వేశ్యలు* అనేవాళ్లే లేరు” అన్నారు. 22  చివరికి అతను యూదా దగ్గరికి తిరిగొచ్చి, “ఆమె నాకు ఎక్కడా కనిపించలేదు, దానికితోడు ఆ ఊరివాళ్లు, ‘అసలు ఎన్నడూ ఈ ఊర్లో వేశ్యలు* అనేవాళ్లే లేరు’ అన్నారు” అని చెప్పాడు. 23  అప్పుడు యూదా ఇలా అన్నాడు: “ఆమె కోసం ఇంకా వెతికితే మన పరువు పోతుంది, వాటిని ఆమెనే తీసుకోనీ. ఏదేమైనా, నేను ఈ మేకపిల్లను పంపించాను, కానీ ఆమె నీకు కనిపించలేదు.” 24  అయితే, దాదాపు మూడు నెలల తర్వాత, ఎవరో యూదా దగ్గరికి వచ్చి, “నీ కోడలు తామారు వేశ్యగా ప్రవర్తించింది, దానివల్ల ఆమె గర్భవతి కూడా అయ్యింది” అని చెప్పారు. దానికి అతను, “ఆమెను బయటికి తీసుకొచ్చి, కాల్చేయండి”+ అన్నాడు. 25  ఆమెను బయటికి తీసుకొస్తున్నప్పుడు ఆమె తన మామకు ఈ కబురు పంపింది: “ఈ వస్తువులు ఎవరివో, ఆ వ్యక్తి వల్ల నేను గర్భవతిని అయ్యాను.” ఆమె ఈ విషయం కూడా చెప్పమంది: “దయచేసి ఈ ఉంగరం, దారం, కర్ర ఎవరివో పరిశీలించండి.”+ 26  అప్పుడు యూదా వాటిని పరిశీలించి, “తప్పు చేసింది ఆమె కాదు, నేను. ఎందుకంటే నేను ఆమెను నా కుమారుడు షేలహుకు ఇచ్చి పెళ్లి చేయలేదు”+ అన్నాడు. ఆ తర్వాత యూదా ఎన్నడూ ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోలేదు. 27  కాన్పు సమయం వచ్చినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు. 28  ఆమె ప్రసవిస్తున్నప్పుడు ఒక పిల్లవాడి చెయ్యి బయటికి వచ్చింది. మంత్రసాని వెంటనే వాడి చేతికి ఎర్రని దారం కట్టి, “ఇతను ముందుగా బయటికి వచ్చాడు” అంది. 29  కానీ ఆ పిల్లవాడు చెయ్యి వెనక్కి తీసుకోగానే, అతని తమ్ముడు బయటికి వచ్చాడు. అప్పుడు ఆ మంత్రసాని ఆశ్చర్యపోయి, “నువ్వే భలే సందు చేసుకొని వచ్చావే!” అంది. కాబట్టి ఆ పిల్లవాడికి పెరెసు*+ అని పేరు పెట్టారు. 30  ఆ తర్వాత, చేతికి ఎర్రని దారం ఉన్న అతని అన్న బయటికి వచ్చాడు. అతనికి జెరహు+ అని పేరు పెట్టారు.

అధస్సూచీలు

అంటే, యూదా.
లేదా “కజీబులో.”
లేదా “ఆలయ వేశ్య.”
లేదా “ఆలయ వేశ్యలు.”
లేదా “ఆలయ వేశ్యలు.”
“చీలిక” అని అర్థం. బహుశా మూలాధారానికి సంబంధించిన చీలికను సూచిస్తుంది.