ఆదికాండం 4:1-26
4 ఆదాము తన భార్య హవ్వతో కలిసినప్పుడు ఆమె గర్భవతి అయ్యింది.+ ఆమె కయీనును+ కన్నప్పుడు, “నేను యెహోవా సహాయంతో ఒక మగబిడ్డను కన్నాను” అంది.
2 తర్వాత ఆమె కయీను తమ్ముడు హేబెలును+ కన్నది.
హేబెలు గొర్రెల కాపరి అయ్యాడు, కయీను రైతు అయ్యాడు.
3 కొంతకాలానికి కయీను, పొలంలోని కొంత పంటను యెహోవాకు అర్పణగా తీసుకొచ్చాడు.
4 అయితే హేబెలు తన మందలో మొదటపుట్టిన వాటిలో+ కొన్నిటిని, వాటి కొవ్వుతో సహా తీసుకొచ్చాడు. యెహోవా హేబెలును, అతని అర్పణను ఆమోదించాడు;+
5 కానీ కయీనును, అతని అర్పణను ఏమాత్రం ఆమోదించలేదు. దాంతో కయీను కోపంతో రగిలిపోయి, ముఖం చిన్నబుచ్చుకున్నాడు.
6 అప్పుడు యెహోవా కయీనుతో ఇలా అన్నాడు: “నువ్వు ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు? ఎందుకు ముఖం చిన్నబుచ్చుకున్నావు?
7 నువ్వు నీ ప్రవర్తన మార్చుకుని మంచి చేయడం మొదలుపెడితే, నేను నిన్ను ఆమోదించనా? కానీ నువ్వు నీ ప్రవర్తన మార్చుకుని మంచి చేయకపోతే, పాపం నీ వాకిట్లో పొంచి ఉంటుంది, అది నీ మీద అధికారం చెలాయించాలని తపిస్తుంది; నువ్వు దాన్ని జయించాలి.”
8 తర్వాత కయీను తన తమ్ముడు హేబెలుతో, “మనం పొలంలోకి వెళ్దాం, రా” అన్నాడు. వాళ్లు పొలంలో ఉన్నప్పుడు, కయీను తన తమ్ముడు హేబెలు మీద దాడిచేసి అతన్ని చంపేశాడు.+
9 ఆ తర్వాత యెహోవా కయీనును, “నీ తమ్ముడు హేబెలు ఎక్కడ?” అని అడిగాడు. అందుకు కయీను, “నాకు తెలీదు, నేనేమైనా నా తమ్ముడికి కాపలావాణ్ణా?” అన్నాడు.
10 అప్పుడు దేవుడు ఇలా అన్నాడు: “నువ్వు చేసిన పనేంటి? ఇదిగో! నీ తమ్ముడి రక్తం నేల నుండి నాకు మొరపెడుతోంది.+
11 కాబట్టి ఇప్పుడు నువ్వు శపించబడ్డావు, నువ్వు చిందించిన నీ తమ్ముడి రక్తాన్ని తాగడానికి నోరు తెరిచిన ఈ నేల నుండి నువ్వు బహిష్కరించబడ్డావు.+
12 నువ్వు నేలను సాగుచేసినప్పుడు, అది నీకు దాని పంటను* ఇవ్వదు. నువ్వు దేశదిమ్మరిగా ఉంటూ, భూమ్మీద ఒకచోటి నుండి ఇంకోచోటికి తిరుగుతూ ఉంటావు.”
13 అప్పుడు కయీను యెహోవాతో ఇలా అన్నాడు: “నా దోషశిక్ష నేను భరించలేనంత పెద్దది.
14 ఈ రోజు నువ్వు నన్ను ఈ నేల నుండి వెళ్లగొడుతున్నావు, ఇక నేను నీ కళ్లముందు ఉండను; నేను దేశదిమ్మరిగా ఉంటూ, భూమ్మీద ఒకచోటి నుండి ఇంకోచోటికి తిరుగుతూ ఉంటాను, నేను ఎవరి కంటైనా పడితే వాళ్లు ఖచ్చితంగా నన్ను చంపేస్తారు.”
15 అప్పుడు యెహోవా అతనితో ఇలా అన్నాడు: “కాబట్టి, ఎవరైనా కయీనును చంపితే, వాళ్లు ఏడు రెట్లు శిక్ష అనుభవిస్తారు.”
అందుకే, కయీను ఎవరి కంటైనా పడినప్పుడు వాళ్లు అతన్ని చంపకుండా ఉండేలా యెహోవా కయీనుకు ఒక గుర్తును ఏర్పాటుచేశాడు.
16 తర్వాత కయీను యెహోవా ముందు నుండి వెళ్లిపోయి, ఏదెనుకు+ తూర్పున ఉన్న నోదు* దేశంలో నివసించడం మొదలుపెట్టాడు.
17 ఆ తర్వాత కయీను తన భార్యతో+ కలిసినప్పుడు ఆమె గర్భవతి అయ్యి హనోకును కన్నది. తర్వాత కయీను ఒక నగరాన్ని నిర్మించి దానికి తన కుమారుడైన హనోకు పేరే పెట్టాడు.
18 ఆ తర్వాత హనోకుకు ఈరాదు పుట్టాడు. ఈరాదుకు మహూయాయేలు పుట్టాడు, మహూయాయేలుకు మతూషాయేలు పుట్టాడు, మతూషాయేలుకు లెమెకు పుట్టాడు.
19 లెమెకు ఇద్దరు స్త్రీలను పెళ్లిచేసుకున్నాడు. మొదటి భార్య పేరు ఆదా, రెండో భార్య పేరు సిల్లా.
20 ఆదా యాబాలును కన్నది. డేరాల్లో నివసిస్తూ, పశువుల్ని పెంచేవాళ్లకు అతను మూలపురుషుడు.
21 అతని సహోదరుడి పేరు యూబాలు; వీణ* వాయించే, పిల్లనగ్రోవి* ఊదే వాళ్లందరికీ ఇతను మూలపురుషుడు.
22 సిల్లా తూబల్-కయీనును కన్నది. అతను అన్నిరకాల రాగి, ఇనుప పనిముట్లు తయారు చేసేవాడు. తూబల్-కయీను సహోదరి పేరు నయమా.
23 తర్వాత లెమెకు తన భార్యలైన ఆదా, సిల్లాల కోసం ఈ పద్యాన్ని కూర్చాడు:
“లెమెకు భార్యలారా, నా మాట వినండి;
నేను చెప్పేది ఆలకించండి:
నన్ను గాయపర్చినందుకు ఒక మనిషిని చంపాను,
అవును, నన్ను కొట్టినందుకు ఒక యువకుణ్ణి చంపాను.
24 కయీనును చంపేవాళ్లకు పడే శిక్ష 7 రెట్లు+ అయితే,
లెమెకును చంపేవాళ్లకు పడే శిక్ష 77 రెట్లు.”
25 ఆదాము మళ్లీ తన భార్యతో కలిసినప్పుడు, ఆమె ఒక కుమారుణ్ణి కన్నది. ఆమె అతనికి షేతు*+ అని పేరు పెట్టింది. ఆమె, “కయీను హేబెలును చంపాడు+ కాబట్టి హేబెలు స్థానంలో దేవుడు నాకు ఇంకో కుమారుణ్ణి* నియమించాడు” అంటూ అతనికి ఆ పేరు పెట్టింది.
26 షేతుకు కూడా ఒక కుమారుడు పుట్టాడు. షేతు అతనికి ఎనోషు+ అని పేరు పెట్టాడు. ఆ సమయంలో, ప్రజలు యెహోవా పేరును వాడడం మొదలుపెట్టారు.
అధస్సూచీలు
^ అక్ష., “సారాన్ని; శక్తిని.”
^ “దేశదిమ్మరిగా ఉండే స్థితి” అని అర్థం.
^ ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
^ అంటే, ఫ్లూటు.
^ “నియమించబడిన; ఇవ్వబడిన” అని అర్థం.
^ లేదా “సంతానాన్ని.” అక్ష., “విత్తనాన్ని.”