ఆదికాండం 46:1-34
46 ఇశ్రాయేలు తనకున్న వాటన్నిటినీ* తీసుకొని బయల్దేరాడు. అతను బెయేర్షెబాకు+ చేరుకున్నప్పుడు, తన తండ్రి ఇస్సాకు ఆరాధించిన దేవునికి+ బలులు అర్పించాడు.
2 రాత్రిపూట దేవుడు ఒక దర్శనంలో ఇశ్రాయేలుతో మాట్లాడుతూ, “యాకోబూ, యాకోబూ!” అని పిలిచాడు. దానికి అతను, “చెప్పు ప్రభువా!” అన్నాడు.
3 అప్పుడు దేవుడు ఇలా అన్నాడు: “నేను సత్యదేవుణ్ణి, నీ తండ్రికి దేవుణ్ణి.+ ఐగుప్తుకు వెళ్లడానికి భయపడకు, ఎందుకంటే అక్కడ నువ్వు ఒక గొప్ప జనం అయ్యేలా నేను చేస్తాను.+
4 నేను కూడా నీతోపాటు ఐగుప్తుకు వస్తాను, నేనే నిన్ను మళ్లీ ఐగుప్తు నుండి తీసుకొస్తాను.+ నువ్వు చనిపోయినప్పుడు యోసేపు తన చేతితో నీ కళ్లు మూస్తాడు.”+
5 తర్వాత యాకోబు బెయేర్షెబా నుండి బయల్దేరాడు. అతని కుమారులు అతన్ని,* తమ పిల్లల్ని, తమ భార్యల్ని ఫరో పంపించిన బండ్లలోకి ఎక్కించి ఐగుప్తుకు ప్రయాణమయ్యారు.
6 కనాను దేశంలో తాము సంపాదించుకున్న పశువుల మందల్ని, వస్తువుల్ని కూడా తమతోపాటు తీసుకెళ్లారు. అలా యాకోబు, అతనితోపాటు అతని పిల్లలందరూ ఐగుప్తుకు చేరుకున్నారు.
7 యాకోబు తనతోపాటు తన కుటుంబమంతటినీ అంటే కుమారుల్ని, మనవళ్లను, కూతుళ్లను, మనవరాళ్లను ఐగుప్తుకు తీసుకొచ్చాడు.
8 ఐగుప్తుకు వచ్చిన ఇశ్రాయేలు కుమారుల పేర్లు, అంటే యాకోబు కుమారుల పేర్లు ఇవి: యాకోబు పెద్ద కుమారుడు రూబేను.+
9 రూబేను కుమారులు: హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ.+
10 షిమ్యోను+ కుమారులు: యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, షావూలు.+ ఈ షావూలు ఒక కనానీయురాలి కుమారుడు.
11 లేవి+ కుమారులు: గెర్షోను, కహాతు, మెరారి.
12 యూదా+ కుమారులు: ఏరు, ఓనాను, షేలహు,+ పెరెసు,+ జెరహు.+ అయితే ఏరు, ఓనాను ఇద్దరూ కనాను దేశంలో చనిపోయారు.+
పెరెసు కుమారులు: ఎస్రోను, హామూలు.+
13 ఇశ్శాఖారు కుమారులు: తోలా, పువ్వా, యోబు, షిమ్రోను.+
14 జెబూలూను+ కుమారులు: సెరెదు, ఏలోను, యహలేలు.+
15 వీళ్లు లేయా నుండి వచ్చినవాళ్లు.* ఆమె పద్దనరాములో యాకోబుకు వీళ్లను, అతని కూతురు దీనాను కన్నది. యాకోబు వంశస్థులైన వీళ్లంతా 33 మంది.
16 గాదు+ కుమారులు: సిప్యోను, హగ్గీ, షూనీ, ఎస్బోను, ఏరీ, ఆరోదు, అరేలీ.+
17 ఆషేరు+ కుమారులు: ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా. వాళ్ల సహోదరి శెరహు.
బెరీయా కుమారులు: హెబెరు, మల్కీయేలు.+
18 వీళ్లంతా లాబాను తన కూతురు లేయాకు సేవకురాలిగా ఇచ్చిన జిల్పా కుమారులు. వీళ్లను ఆమె యాకోబుకు కన్నది, వీళ్లు మొత్తం 16 మంది.
19 యాకోబు భార్య రాహేలుకు పుట్టిన కుమారులు: యోసేపు,+ బెన్యామీను.+
20 ఐగుప్తులో యోసేపుకు పుట్టిన కుమారులు: మనష్షే,+ ఎఫ్రాయిము.+ వీళ్లను ఓను* పూజారైన పోతీఫెర కూతురు ఆసెనతు+ యోసేపుకు కన్నది.
21 బెన్యామీను కుమారులు:+ బెల, బేకెరు, అష్బేలు, గెరా,+ నయమాను, ఏహీ, రోషు, ముప్పీము, హుప్పీము,+ ఆర్దు.+
22 వీళ్లంతా రాహేలు ద్వారా యాకోబుకు పుట్టిన కుమారులు, మొత్తం 14 మంది.
23 దాను+ కుమారుడు* హుషీము.+
24 నఫ్తాలి+ కుమారులు: యహసేలు, గూనీ, యేసెరు, షిల్లేము.+
25 వీళ్లంతా లాబాను తన కూతురు రాహేలుకు సేవకురాలిగా ఇచ్చిన బిల్హా కుమారులు. వీళ్లను ఆమె యాకోబుకు కన్నది, వీళ్లు మొత్తం ఏడుగురు.
26 యాకోబు కోడళ్లు కాకుండా అతనితో పాటు ఐగుప్తుకు వెళ్లిన అతని వంశస్థులందరు 66 మంది.+
27 యోసేపుకు ఐగుప్తులో పుట్టిన కుమారులు ఇద్దరు. అలా ఐగుప్తుకు వచ్చిన యాకోబు ఇంటివాళ్లందరు మొత్తం 70 మంది.+
28 తాను గోషెనుకు వచ్చే దారిలో ఉన్నానని యోసేపుకు చెప్పడానికి యాకోబు యూదాను+ ముందుగా పంపించాడు. వాళ్లు గోషెను ప్రాంతానికి+ వచ్చినప్పుడు,
29 యోసేపు తన రథాన్ని సిద్ధం చేయించుకొని తన తండ్రి ఇశ్రాయేలును కలవడానికి గోషెనుకు వెళ్లాడు. తన తండ్రి కనబడగానే యోసేపు అతన్ని కౌగిలించుకొని* చాలాసేపు ఏడ్చాడు.
30 తర్వాత ఇశ్రాయేలు యోసేపుతో ఇలా అన్నాడు: “నేను నీ ముఖం చూశాను, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు. కాబట్టి ఇక నేను చనిపోయినా ఫర్వాలేదు.”
31 తర్వాత యోసేపు తన సహోదరులతో, తన తండ్రి ఇంటివాళ్లతో ఇలా అన్నాడు: “నేను ఫరో దగ్గరికి వెళ్లి ఇలా చెప్తాను,+ ‘కనాను దేశం నుండి నా సహోదరులు, నా తండ్రి ఇంటివాళ్లు ఇక్కడికి వచ్చారు.+
32 వాళ్లు గొర్రెల్ని, పశువుల్ని కాస్తారు.+ వాళ్లు తమ మందల్ని, పశువుల్ని, తమకున్న వాటన్నిటినీ తీసుకొని ఇక్కడికి వచ్చారు.’+
33 ఫరో మిమ్మల్ని పిలిచి, ‘మీరేం పని చేస్తుంటారు?’ అని అడిగినప్పుడు
34 మీరు, ‘నీ సేవకులమైన మేము చిన్నప్పటి నుండి ఇప్పటివరకు పశువుల కాపరులం. మేమే కాదు మా పూర్వీకులు కూడా ఇదే పని చేసేవాళ్లు’+ అని చెప్పాలి. అప్పుడు మీరు గోషెను ప్రాంతంలో నివసించవచ్చు.+ ఎందుకంటే గొర్రెల కాపరులంటే ఐగుప్తీయులకు అసహ్యం.”+
అధస్సూచీలు
^ లేదా “తన వాళ్లందర్నీ.”
^ అక్ష., “ఇశ్రాయేలును.”
^ అక్ష., “కుమారులు.”
^ అంటే, హీలియోపొలిస్.
^ అక్ష., “కుమారులు.”
^ అక్ష., “అతని మెడ మీద పడి.”