ఆదికాండం 48:1-22
48 ఇవి జరిగాక, “మీ నాన్న పరిస్థితి ఏం బాలేదు” అనే వార్త యోసేపుకు అందింది. దాంతో అతను తన ఇద్దరు కుమారుల్ని అంటే మనష్షేను, ఎఫ్రాయిమును+ తీసుకొని అక్కడికి వెళ్లాడు.
2 అప్పుడు ఎవరో యాకోబుకు, “నీ కుమారుడు యోసేపు నిన్ను చూడడానికి వచ్చాడు” అని చెప్పారు. దాంతో ఇశ్రాయేలు తన బలాన్నంతా కూడగట్టుకొని లేచి మంచం మీద కూర్చున్నాడు.
3 తర్వాత యాకోబు యోసేపుతో ఇలా అన్నాడు:
“సర్వశక్తిగల దేవుడు కనాను దేశంలోని లూజు దగ్గర నాకు కనిపించి, నన్ను దీవించాడు.+
4 ఆయన నాతో, ‘నువ్వు పిల్లల్ని కని, ఎక్కువమంది అయ్యేలా చేస్తాను; నిన్ను ఎన్నో గోత్రాలున్న పెద్ద సమూహం అయ్యేలా చేస్తాను.+ నీ తర్వాత నీ సంతానానికి* ఈ దేశాన్ని శాశ్వతమైన ఆస్తిగా ఇస్తాను’ అన్నాడు.+
5 నేను ఐగుప్తుకు రాకముందు, ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నాకు చెందుతారు.+ రూబేను, షిమ్యోనుల్లా ఎఫ్రాయిము, మనష్షేలు కూడా నా కుమారులు అవుతారు.+
6 కానీ వాళ్ల తర్వాత నీకు పుట్టే పిల్లలు నీ పిల్లలే అవుతారు. వాళ్లు తమ సహోదరులకు వారసత్వంగా వచ్చే భూమిలో కొంత భాగాన్ని పొందుతారు.+
7 అయితే నేను పద్దనరాము* నుండి వస్తూ కనాను దేశంలో ఎఫ్రాత్‌కు+ కొంతదూరంలో ఉన్నప్పుడు మీ అమ్మ రాహేలు నా కళ్లముందే చనిపోయింది.+ కాబట్టి నేను ఆమెను అక్కడే ఎఫ్రాత్‌కు వెళ్లే దారిలో, అంటే బేత్లెహేముకు+ వెళ్లే దారిలో పాతిపెట్టాను.”
8 తర్వాత ఇశ్రాయేలు యోసేపు కుమారుల్ని చూసి, “వీళ్లు ఎవరు?” అని అడిగాడు.
9 అందుకు యోసేపు, “వీళ్లు ఈ దేశంలో దేవుడు నాకు అనుగ్రహించిన కుమారులు”+ అని చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలు, “దయచేసి వాళ్లను నా దగ్గరికి తీసుకురా, నేను వాళ్లను దీవించాలి” అన్నాడు.+
10 వృద్ధాప్యం కారణంగా ఇశ్రాయేలుకు కంటిచూపు తగ్గిపోవడంతో అతను చూడలేకపోయాడు. కాబట్టి యోసేపు వాళ్లను ఇశ్రాయేలుకు దగ్గరగా తీసుకొచ్చాడు. అప్పుడు అతను వాళ్లను ముద్దుపెట్టుకొని కౌగిలించుకున్నాడు.
11 ఇశ్రాయేలు యోసేపుతో ఇలా అన్నాడు: “నేను మళ్లీ నీ ముఖం చూస్తానని అనుకోలేదు,+ కానీ దేవుడు నీ సంతానాన్ని* కూడా చూసే అవకాశం నాకు ఇచ్చాడు.”
12 యోసేపు వాళ్లను ఇశ్రాయేలు మోకాళ్ల దగ్గర నుండి పక్కకు తీసి, నేలకు వంగి సాష్టాంగ నమస్కారం చేశాడు.
13 తర్వాత యోసేపు తన కుడిచేతితో ఎఫ్రాయిమును,+ ఎడమచేతితో మనష్షేను+ తీసుకొచ్చి ఇశ్రాయేలు ఎడమపక్కన ఎఫ్రాయిమును, కుడిపక్కన మనష్షేను నిలబెట్టాడు.
14 అయితే ఇశ్రాయేలు మాత్రం ఎఫ్రాయిము చిన్నవాడే అయినా తన కుడిచేతిని చాపి అతని తలమీద పెట్టాడు, తన ఎడమచేతిని మనష్షే తలమీద పెట్టాడు. మనష్షే పెద్దవాడని+ తెలిసినా, ఇశ్రాయేలు కావాలనే అలా పెట్టాడు.
15 తర్వాత అతను యోసేపును దీవిస్తూ ఇలా అన్నాడు:+
“నా తండ్రులైన అబ్రాహాము, ఇస్సాకులు ఆరాధించిన సత్యదేవుడు,+ఈ రోజు వరకు నా జీవిత కాలమంతట్లో నన్ను కాచికాపాడిన సత్యదేవుడు,+
16 కష్టాలన్నిటి నుండి నన్ను గట్టెక్కిస్తూ వచ్చిన దేవదూత+ ఈ అబ్బాయిల్ని దీవించాలి.+
వీళ్లు నా పేరుతో, నా తండ్రులైన అబ్రాహాము, ఇస్సాకుల పేర్లతో పిలవబడాలి.వీళ్లు భూమ్మీద పెద్ద జనం అవ్వాలి.”+
17 తన తండ్రి ఇశ్రాయేలు తన కుడిచేతిని ఎఫ్రాయిము మీద పెట్టడం చూసినప్పుడు, అది యోసేపుకు నచ్చలేదు. దాంతో అతను తన తండ్రి చేతిని ఎఫ్రాయిము తలమీద నుండి తీసి మనష్షే తలమీద పెట్టడానికి ప్రయత్నించాడు.
18 అతను తన తండ్రితో “అలాకాదు నాన్న, ఇదిగో ఇతను పెద్దవాడు.+ నీ కుడిచేతిని ఇతని తలమీద పెట్టు” అన్నాడు.
19 కానీ అతని తండ్రి దానికి ఒప్పుకోకుండా ఇలా అన్నాడు: “నాకు తెలుసు బాబూ, నాకు తెలుసు. ఇతను కూడా ఒక జనం అవుతాడు, ఇతను కూడా గొప్పవాడు అవుతాడు. కానీ, ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడు అవుతాడు,+ అతని సంతానం* పెద్ద జనసమూహాలతో సమానమౌతుంది.”+
20 కాబట్టి ఇశ్రాయేలు ఆ రోజు వాళ్లను ఇంకా దీవిస్తూ+ ఇలా అన్నాడు:
“ఇశ్రాయేలు ప్రజలు దీవిస్తున్నప్పుడు ఇలా మీ పేర్లు ప్రస్తావిస్తూ దీవించాలి:‘దేవుడు నిన్ను ఎఫ్రాయిములా, మనష్షేలా చేయాలి.’ ”
అలా ఇశ్రాయేలు ఎఫ్రాయిమును మనష్షే కన్నా పైస్థానంలో ఉంచాడు.
21 తర్వాత ఇశ్రాయేలు యోసేపుతో ఇలా అన్నాడు: “ఇదిగో, నేను చనిపోతున్నాను.+ కానీ దేవుడు ఖచ్చితంగా ఇకమీదట కూడా నీకు తోడుగా ఉంటాడు, నిన్ను తిరిగి నీ పూర్వీకుల దేశానికి తీసుకెళ్తాడు.+
22 నేనైతే నీకు నీ సహోదరుల కన్నా ఒక వంతు భూమి ఎక్కువ ఇస్తాను. నేను ఆ భూమిని నా కత్తితో, నా విల్లుతో అమోరీయుల్ని జయించి వాళ్ల దగ్గర నుండి తీసుకున్నాను.”