ఆదికాండం 49:1-33
49 తర్వాత యాకోబు తన కుమారుల్ని పిలిచి ఇలా అన్నాడు: “అందరూ నా దగ్గరికి రండి. చివరి రోజుల్లో మీకు ఏమి జరుగుతుందో చెప్తాను.
2 యాకోబు కుమారులారా, మీరంతా ఒక చోటికి వచ్చి మీ తండ్రి ఇశ్రాయేలు చెప్పే మాటలు వినండి.
3 “రూబేనూ,+ నువ్వు నా పెద్ద కుమారుడివి.+ నువ్వు నా బలానివి, నా శక్తికి* ప్రథమఫలానివి, అందరికన్నా ఎక్కువ గౌరవాన్ని, బలాన్ని పొందినవాడివి.
4 కానీ నువ్వు ఉధృతమైన ప్రవాహంలా అదుపులేకుండా ప్రవర్తించావు, కాబట్టి నువ్వు వర్ధిల్లవు. నువ్వు నీ తండ్రి పరుపు మీదికి ఎక్కావు.+ ఆ సమయంలో నువ్వు నా పరుపును అపవిత్రం చేశావు. అతను నిజంగా దాని మీదికి ఎక్కాడు!
5 “షిమ్యోను, లేవి అన్నదమ్ములు.+ వాళ్ల ఖడ్గాలు హింసాయుధాలు.+
6 నా ప్రాణమా,* వాళ్లతో సహవాసం చేయకు. నా వైభవమా,* వాళ్ల గుంపులో చేరకు. ఎందుకంటే కోపంతో వాళ్లు మనుషుల్ని చంపారు,+ సరదా కోసం ఎద్దుల గుదికాలి నరం తెగగొట్టారు.
7 వాళ్ల కోపం శపించబడాలి, అది క్రూరమైనది. వాళ్ల ఆగ్రహం శపించబడాలి, అది కఠినమైనది.+ యాకోబు దేశంలో వాళ్లను చెదరగొడతాను, ఇశ్రాయేలు దేశంలో వాళ్లను చెల్లాచెదురు చేస్తాను.+
8 “యూదా,+ నీ సహోదరులు నిన్ను ఘనపరుస్తారు.+ నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది.+ నీ తండ్రి కుమారులు నీకు వంగి నమస్కారం చేస్తారు.+
9 యూదా ఒక సింహం పిల్ల.+ నా కుమారుడా, నువ్వు వేటాడిన జంతువును తప్పకుండా పట్టుకొని వస్తావు. అతను పొంచివున్న సింహంలా నేలమీద చాచుకొని పడుకున్నాడు. సింహంలాంటి అతన్ని లేపడానికి ఎవరు సాహసించగలరు?
10 షిలోహు* వచ్చేవరకు+ యూదా దగ్గర నుండి రాజదండం తొలగిపోదు,+ అతని కాళ్ల మధ్య నుండి అధికార దండం తొలగిపోదు. జనాల విధేయత అతనికే చెందుతుంది.+
11 అతను తన గాడిదను ద్రాక్షచెట్టుకు, తన గాడిద పిల్లను శ్రేష్ఠమైన ద్రాక్షచెట్టుకు కట్టి ద్రాక్షారసంలో తన బట్టల్ని, ద్రాక్షల రక్తంలో తన వస్త్రాన్ని ఉతుక్కుంటాడు.
12 ద్రాక్షారసం వల్ల అతని కళ్లు చాలా ఎర్రగా ఉన్నాయి, పాల వల్ల అతని పళ్లు తెల్లగా ఉన్నాయి.
13 “జెబూలూను+ సముద్రతీరాన ఓడలు లంగరు వేసివున్న చోట నివసిస్తాడు.+ అతని సరిహద్దు సీదోను వరకు ఉంటుంది.+
14 “ఇశ్శాఖారు+ రెండు జీనుసంచుల మధ్య పడుకొని ఉన్న బలమైన గాడిదలాంటివాడు.
15 అతను విశ్రాంతి చోటు చక్కగా ఉందని, నేల రమ్యంగా ఉందని చూస్తాడు. అతను బరువు మోయడానికి తన భుజం వంచి, వెట్టిచాకిరి చేసే దాసుడౌతాడు.
16 “దాను+ ఇశ్రాయేలు గోత్రాల్లో ఒక గోత్రంగా ఉండి తన ప్రజలకు తీర్పుతీరుస్తాడు.+
17 దాను దారిపక్కన ఉండే పాములా, అలాగే గుర్రం మడిమెల్ని కాటువేసి దాని రౌతును వెనక్కి పడిపోయేట్టు చేసే కొమ్ములుగల పాములా ఉంటాడు.+
18 యెహోవా, నువ్విచ్చే రక్షణ కోసం నేను ఎదురుచూస్తాను.
19 “గాదు+ విషయానికొస్తే, దోపిడీ ముఠా అతని మీద దాడి చేస్తుంది, కానీ అతను వాళ్లమీద ఎదురుదాడి చేసి వాళ్లను తరిమికొడతాడు.+
20 “ఆషేరు+ దగ్గర ఆహారం సమృద్ధిగా ఉంటుంది. అతను రాజుకు తగిన ఆహారాన్ని అందజేస్తాడు.+
21 “నఫ్తాలి+ వేగంగా పరుగెత్తే లేడి. అతను వినసొంపుగా ఉండే మాటలు మాట్లాడుతున్నాడు.+
22 “యోసేపు+ ఫలవంతమైన చెట్టు రెమ్మ. అతను నీళ్ల ఊట పక్కన ఉండే ఫలవంతమైన చెట్టు రెమ్మ, ఆ చెట్టు కొమ్మలు గోడ మీదుగా వ్యాపిస్తాయి.
23 అయితే విలుకాండ్రు అతన్ని వేధిస్తూ వచ్చారు, అతని మీద బాణాలు వేశారు, అతని మీద ద్వేషం పెంచుకుంటూ వచ్చారు.+
24 కానీ అతని విల్లు స్థిరంగా ఉంది,+ అతని చేతులు బలంగా, చురుగ్గా ఉన్నాయి.+ యాకోబు శక్తిమంతుని వల్ల, ఇశ్రాయేలుకు కాపరిగా, ఆధారశిలగా* ఉన్న వ్యక్తి వల్ల ఇది జరిగింది.
25 అతను* తన తండ్రి ఆరాధించిన దేవుడు ఇచ్చిన బహుమానం. దేవుడు అతనికి సహాయం చేస్తాడు. అతను సర్వశక్తిమంతుడితో ఉన్నాడు. ఆయన ఆకాశ దీవెనలతో, అగాధ జలాల దీవెనలతో,+ స్తనముల-గర్భముల దీవెనలతో అతన్ని దీవిస్తాడు.
26 అతని తండ్రి దీవెనలు శాశ్వతకాలం ఉండే పర్వతాల దీవెనల కన్నా, ఎల్లకాలం నిలిచే కొండల మధ్య దొరికే శ్రేష్ఠమైన వాటికన్నా గొప్పగా ఉంటాయి.+ ఆ దీవెనలు యోసేపు తల మీద అలాగే నిలిచివుంటాయి, తన సహోదరుల నుండి వేరుచేయబడిన అతని నడినెత్తి మీద అలాగే నిలిచివుంటాయి.+
27 “బెన్యామీను+ తోడేలులా చీల్చివేస్తూనే ఉంటాడు.+ ఉదయం అతను వేటాడిన జంతువును తింటాడు, సాయంకాలం దోపుడుసొమ్మును పంచుకుంటాడు.”+
28 వీళ్ల నుండే ఇశ్రాయేలు 12 గోత్రాలు వచ్చాయి; వాళ్ల నాన్న వాళ్లను దీవిస్తున్నప్పుడు అన్న మాటలు అవి. అతను వాళ్లలో ప్రతీ ఒక్కరికి తగిన దీవెనను ఇచ్చాడు.+
29 తర్వాత అతను వాళ్లకు ఈ ఆజ్ఞలు ఇచ్చాడు: “నేను నా ప్రజల దగ్గరికి చేర్చబడుతున్నాను.*+ నన్ను హిత్తీయుడైన ఎఫ్రోను పొలంలో ఉన్న గుహలో+ నా తండ్రుల దగ్గర పాతిపెట్టండి.
30 ఆ గుహ కనాను దేశంలో మమ్రే ఎదురుగా ఉన్న మక్పేలా పొలంలో ఉంది. అబ్రాహాము ఆ పొలాన్ని సమాధుల స్థలం కోసం హిత్తీయుడైన ఎఫ్రోను దగ్గర కొన్నాడు.
31 అబ్రాహామును, అతని భార్య శారాను అక్కడే పాతిపెట్టారు.+ ఇస్సాకును, అతని భార్య రిబ్కాను కూడా అక్కడే పాతిపెట్టారు.+ నేను కూడా లేయాను అక్కడే పాతిపెట్టాను.
32 అబ్రాహాము ఆ పొలాన్ని, అందులోని గుహను హేతు కుమారుల దగ్గర కొన్నాడు.”+
33 అలా యాకోబు తన కుమారులకు నిర్దేశాలు ఇవ్వడం పూర్తయ్యాక, మంచం మీద పడుకొని తుదిశ్వాస విడిచాడు, తన ప్రజల దగ్గరికి చేర్చబడ్డాడు.*+
అధస్సూచీలు
^ లేదా “పిల్లల్ని కనే శక్తికి.”
^ లేదా “స్వభావమా” అయ్యుంటుంది.
^ “అది ఎవరిదో ఆయన; అది ఎవరికి చెందుతుందో ఆయన” అని అర్థం.
^ అక్ష., “రాయిగా.”
^ అంటే, యోసేపు.
^ మరణాన్ని కావ్యరూపంలో ఇలా వర్ణించారు.
^ మరణాన్ని కావ్యరూపంలో ఇలా వర్ణించారు.