ఆదికాండం 50:1-26

  • యోసేపు యాకోబును కనానులో ​పాతిపెట్టడం (1-14)

  • క్షమించానని యోసేపు భరోసా ఇవ్వడం (15-21)

  • యోసేపు చివరి రోజులు, మరణం (22-26)

    • తన ఎముకల గురించి యోసేపు ఇచ్చిన ఆజ్ఞ (25)

50  తర్వాత యోసేపు తన తండ్రి మీద పడి,+ ఏడ్చి, అతన్ని ముద్దుపెట్టుకున్నాడు.  తర్వాత అతను, సుగంధ తైలాలతో తన తండ్రి మృతదేహాన్ని సిద్ధం చేయమని*+ వైద్యులకు ఆజ్ఞాపించాడు. కాబట్టి వాళ్లు అతను చెప్పినట్టే ఇశ్రాయేలు మృతదేహాన్ని సిద్ధం చేశారు.  అలా సిద్ధం చేయాలంటే మొత్తం 40 రోజుల సమయం కావాలి, కాబట్టి వాళ్లు ఇశ్రాయేలు విషయంలో కూడా 40 రోజులు తీసుకున్నారు. ఐగుప్తీయులు 70 రోజులపాటు అతని గురించి ఏడుస్తూనే ఉన్నారు.  ఇశ్రాయేలు గురించి దుఃఖపడే రోజులు ముగిశాక, యోసేపు ఫరో కింద పనిచేసే అధికారులతో* ఇలా అన్నాడు: “మీ దయ నా మీద ఉంటే, ఫరోకు ఈ వార్త అందజేయండి:  ‘నా తండ్రి నాతో ఒట్టు వేయించుకుంటూ,+ “ఇదిగో, నేను చనిపోతున్నాను.+ కనాను దేశంలో నేను తొలిపించుకున్న సమాధిలో+ నువ్వు నన్ను పాతిపెట్టాలి”+ అన్నాడు. కాబట్టి దయచేసి, వెళ్లి నా తండ్రిని పాతిపెట్టుకోనివ్వు. ఆ తర్వాత నేను తిరిగొస్తాను.’ ”  అందుకు ఫరో, “వెళ్లి, నీ తండ్రి నీతో ఒట్టు వేయించుకున్న ప్రకారమే అతన్ని పాతిపెట్టు”+ అన్నాడు.  అప్పుడు యోసేపు తన తండ్రిని పాతిపెట్టడానికి బయల్దేరాడు. అతనితో పాటు ఫరో సేవకులందరూ అంటే ఫరో దర్బారులో ఉండే పెద్దలు,+ ఐగుప్తు దేశంలోని పెద్దలందరూ బయల్దేరారు.  అంతేకాదు యోసేపు ఇంటివాళ్లందరు, అతని సహోదరులు, అతని తండ్రి ఇంటివాళ్లు+ కూడా బయల్దేరారు. వాళ్లు తమ చిన్నపిల్లల్ని, మందల్ని, పశువుల్ని మాత్రం గోషెనులోనే ఉంచి వెళ్లారు.  రథాలు,+ గుర్రపురౌతులు కూడా అతనితోపాటు వెళ్లడంతో, ఒక పెద్ద సమూహం తయారైంది. 10  తర్వాత వాళ్లు యొర్దాను ప్రాంతంలో ఉన్న ఆఠదు కళ్లం* దగ్గరికి వచ్చారు. అక్కడ వాళ్లు చాలా బిగ్గరగా, తీవ్రంగా ఏడ్చారు. యోసేపు తన తండ్రి గురించి ఏడురోజుల పాటు దుఃఖిస్తూనే ఉన్నాడు. 11  ఆ దేశ ప్రజలు అంటే కనానీయులు ఆఠదు కళ్లం దగ్గర వాళ్లు ఏడ్వడం చూసి, “ఇది ఐగుప్తీయులకు గొప్ప విలాపం!” అన్నారు. అందుకే యొర్దాను ప్రాంతంలోని ఆ చోటుకు ఆబేల్‌-మిస్రాయిము* అని  పేరు పెట్టారు. 12  అలా యాకోబు కుమారులు, సరిగ్గా అతను చెప్పినట్టే చేశారు.+ 13  వాళ్లు అతన్ని కనాను దేశానికి తీసుకెళ్లి, మమ్రే ఎదురుగా ఉన్న మక్పేలా పొలంలోని గుహలో పాతిపెట్టారు. అబ్రాహాము ఆ పొలాన్ని సమాధుల స్థలం కోసం హిత్తీయుడైన ఎఫ్రోను దగ్గర ఆస్తిగా కొన్నాడు.+ 14  యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత తన సహోదరులతో, అలాగే తన తండ్రిని సమాధి చేయడానికి తనతోపాటు వచ్చిన వాళ్లందరితో కలిసి ఐగుప్తుకు తిరిగొచ్చాడు. 15  యోసేపు సహోదరులు తమ తండ్రి చనిపోవడం చూసి, “యోసేపు మనమీద పగ పెట్టుకున్నాడేమో, మనం అతనికి చేసిన కీడంతటికీ ఇప్పుడు ప్రతికీడు చేస్తాడేమో” అనుకున్నారు.+ 16  కాబట్టి వాళ్లు యోసేపుకు ఇలా కబురు పంపారు: “నీ తండ్రి చనిపోకముందు మాకు ఇలా ఆజ్ఞాపించాడు: 17  ‘మీరు యోసేపుతో ఇలా చెప్పాలి: “దయచేసి, నీ సహోదరులు చేసిన తప్పును మన్నించమని, నీకు అలాంటి హాని తలపెట్టి వాళ్లు చేసిన పాపాన్ని క్షమించమని నిన్ను బ్రతిమాలుతున్నాను.” ’ కాబట్టి ఇప్పుడు దయచేసి, నీ తండ్రి ఆరాధించిన దేవుని సేవకులమైన మా తప్పును క్షమించు.” వాళ్ల మాటలు విన్నప్పుడు యోసేపు ఏడ్చాడు. 18  తర్వాత అతని సహోదరులే స్వయంగా వచ్చి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి, “ఇదిగో, మేము నీ దాసులం!” అన్నారు.+ 19  అప్పుడు యోసేపు వాళ్లతో ఇలా అన్నాడు: “భయపడకండి. నేనేమైనా దేవుని స్థానంలో ఉన్నానా? 20  మీరు నాకు హాని చేయాలనుకున్నా+ దేవుడు ఆ పరిస్థితిని మలుపు తిప్పి, నేడు మీరు చూస్తున్నట్టు మంచి జరిగేలా, అనేకమంది ప్రాణాలు కాపాడబడేలా చేశాడు.+ 21  కాబట్టి భయపడకండి. నేను మిమ్మల్ని, మీ చిన్నపిల్లల్ని పోషిస్తూనే ఉంటాను.”+ అలా అతను వాళ్లను ఓదార్చి, వాళ్లకు ధైర్యం చెప్పాడు. 22  యోసేపు, అతని తండ్రి ఇంటివాళ్లు ఐగుప్తులోనే నివసిస్తూ ఉన్నారు. యోసేపు మొత్తం 110 ఏళ్లు బ్రతికాడు. 23  యోసేపు ఎఫ్రాయిము కుమారుల మూడో తరం+ వరకు చూశాడు. అలాగే మనష్షే కుమారుడైన మాకీరు+ కుమారుల్ని కూడా చూశాడు. యోసేపు వాళ్లను తన సొంత కుమారుల్లా చూసుకున్నాడు.* 24  చాలాకాలం తర్వాత యోసేపు తన సహోదరులతో ఇలా అన్నాడు: “నేను చనిపోతున్నాను, కానీ దేవుడు తప్పకుండా మిమ్మల్ని గుర్తుచేసుకుంటాడు.+ మిమ్మల్ని తప్పకుండా ఈ దేశం నుండి బయటికి తీసుకొచ్చి తాను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేసిన దేశంలోకి తీసుకెళ్తాడు.”+ 25  కాబట్టి యోసేపు ఇశ్రాయేలు కుమారులతో ఇలా ఒట్టు వేయించుకున్నాడు: “దేవుడు తప్పకుండా మిమ్మల్ని గుర్తుచేసుకుంటాడు. అప్పుడు మీరు నా ఎముకల్ని ఇక్కడి నుండి తీసుకెళ్లాలి.”+ 26  యోసేపు 110 ఏళ్ల వయసులో చనిపోయాడు. వాళ్లు అతని మృతదేహాన్ని సుగంధ తైలాలతో సిద్ధం చేయించి,+ ఐగుప్తు దేశంలో ఒక శవపేటికలో పెట్టారు.

అధస్సూచీలు

మృతదేహం కుళ్లిపోకుండా ఉండడానికి అలా చేసేవాళ్లు.
లేదా “ఫరో ఇంటివాళ్లతో.”
పదకోశం చూడండి.
“ఐగుప్తీయుల విలాపం” అని అర్థం.
అక్ష., “వాళ్లు యోసేపు మోకాళ్ల మీదే పుట్టారు.”