ఆమోసు 7:1-17

  • ఇశ్రాయేలు అంతం దగ్గరపడిందని చూపించే దర్శనాలు (1-9)

    • మిడతలు (1-3), అగ్ని (4-6), లంబసూత్రం (7-9)

  • ప్రవచించడం ఆపమని ఆమోసుకు చెప్పడం (10-17)

7  సర్వోన్నత ప్రభువైన యెహోవా దర్శనంలో నాకు ఇది చూపించాడు: ఇదిగో! చివరి పంట మొలకెత్తే సమయంలో* ఆయన ఒక మిడతల దండును పుట్టించాడు. రాజుకు చెందిన ఎండుగడ్డిని కోసిన తర్వాత వేసే పంట అది.  మిడతల దండు నేలమీది పంటంతటినీ తినేసిన తర్వాత నేనిలా అన్నాను: “సర్వోన్నత ప్రభువైన యెహోవా, దయచేసి క్షమించు!+ యాకోబు ఎలా లేస్తాడు? అతను బలహీనంగా ఉన్నాడు!”+  దాంతో యెహోవా దాని గురించి ఇంకోసారి ఆలోచించాడు.*+ యెహోవా, “అది జరగదు” అన్నాడు.  సర్వోన్నత ప్రభువైన యెహోవా దర్శనంలో నాకు ఇది చూపించాడు: ఇదిగో! సర్వోన్నత ప్రభువైన యెహోవా అగ్నిని ఉపయోగించి శిక్షించాడు. అది విస్తారమైన అగాధ జలాల్ని, దేశంలోని ఒక భాగాన్ని దహించివేసింది.  అప్పుడు నేను, “సర్వోన్నత ప్రభువైన యెహోవా, దయచేసి అలా చేయకు.+ యాకోబు ఎలా లేస్తాడు? అతను బలహీనంగా ఉన్నాడు!” అన్నాను.+  దాంతో యెహోవా దాని గురించి ఇంకోసారి ఆలోచించాడు.*+ సర్వోన్నత ప్రభువైన యెహోవా, “అది కూడా జరగదు” అన్నాడు.  ఆయన దర్శనంలో నాకు ఇది చూపించాడు: ఇదిగో! లంబసూత్రం* ఉపయోగించి కట్టిన గోడపై యెహోవా నిల్చొని ఉన్నాడు, ఆయన చేతిలో ఒక లంబసూత్రం ఉంది.  అప్పుడు యెహోవా నన్ను, “ఆమోసూ, నీకేం కనిపిస్తోంది?” అని అడిగాడు. దానికి నేను, “ఒక లంబసూత్రం” అన్నాను. తర్వాత యెహోవా ఇలా అన్నాడు: “ఇదిగో, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య నేను ఒక లంబసూత్రాన్ని పెడుతున్నాను. నేనిక వాళ్లను క్షమించను.+  ఇస్సాకు ఉన్నత స్థలాలు+ పాడైపోతాయి, ఇశ్రాయేలు పవిత్రమైన స్థలాలు నాశనమైపోతాయి;+ నేను యరొబాము ఇంటివాళ్ల మీదికి ఖడ్గంతో వస్తాను.”+ 10  బేతేలు యాజకుడైన+ అమజ్యా ఇశ్రాయేలు రాజైన యరొబాముకు+ ఈ సందేశం పంపించాడు: “ఆమోసు ఏకంగా ఇశ్రాయేలు ఇంటివాళ్ల మధ్యే నీ మీద కుట్ర పన్నుతున్నాడు.+ దేశంలోని ప్రజలు అతను చెప్పే మాటలన్నీ భరించలేరు.+ 11  ‘యరొబాము ఖడ్గం చేత చంపబడతాడు, ఇశ్రాయేలీయులు ఖచ్చితంగా తమ దేశం నుండి బందీలుగా తీసుకెళ్లబడతారు’ అని ఆమోసు చెప్తున్నాడు.”+ 12  తర్వాత అమజ్యా ఆమోసుతో ఇలా అన్నాడు: “దర్శనాలు చూసేవాడా, యూదా దేశానికి పారిపో, అక్కడే నీ రొట్టె సంపాదించుకో,* అక్కడే ప్రవచించు.+ 13  కానీ ఇకమీదట నువ్వు బేతేలులో ప్రవచించకూడదు,+ ఎందుకంటే ఇది ఒక రాజు పవిత్రమైన స్థలం,+ ఒక రాజ్యానికి రాజధాని.” 14  అప్పుడు ఆమోసు అమజ్యాతో ఇలా చెప్పాడు: “నేను ప్రవక్తను కాదు, ప్రవక్త కుమారుణ్ణీ కాదు; నేనొక పశువుల కాపరిని,+ అత్తి చెట్లను చూసుకునేవాణ్ణి.* 15  అయితే పశువులు కాస్తున్న నన్ను యెహోవా పిలిచాడు. యెహోవా నాతో ఇలా అన్నాడు, ‘వెళ్లు, ఇశ్రాయేలీయులైన నా ప్రజలకు ప్రవచించు.’+ 16  కాబట్టి ఇప్పుడు యెహోవా చెప్తున్న ఈ మాట విను: ‘ “ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ప్రవచించకు,+ ఇస్సాకు ఇంటివాళ్లకు వ్యతిరేకంగా ప్రకటించకు”+ అని నువ్వు అంటున్నావు. 17  కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు: “నగరంలో నీ భార్య వేశ్య అవుతుంది; నీ కుమారుల్ని, కూతుళ్లను ఖడ్గంతో చంపుతారు. నీ భూమిని కొలనూలుతో కొలిచి పంచుకుంటారు, నువ్వేమో అపవిత్రమైన దేశంలో చనిపోతావు; ఇశ్రాయేలీయులు ఖచ్చితంగా తమ దేశం నుండి బందీలుగా తీసుకెళ్లబడతారు.” ’ ”+

అధస్సూచీలు

అంటే జనవరి, ఫిబ్రవరి నెలల్లో.
లేదా “విచారపడ్డాడు.”
లేదా “విచారపడ్డాడు.”
లేదా “మట్టపుగుండు.”
అక్ష., “తిను.”
లేదా “అత్తి పండ్లకు గాట్లు పెట్టేవాణ్ణి.”