ఎజ్రా 1:1-11
1 పారసీక* రాజైన కోరెషు+ పరిపాలన మొదటి సంవత్సరంలో, అతను తన రాజ్యమంతటా ఒక ప్రకటన చేయించేలా యెహోవా అతని మనసును ప్రేరేపించాడు; యిర్మీయా ద్వారా యెహోవా చెప్పిన మాట+ నెరవేరడానికి అలా జరిగింది. పారసీక రాజైన కోరెషు ఆ ప్రకటనను ఇలా రాయించాడు:+
2 “పారసీక రాజైన కోరెషు చెప్పేదేమిటంటే, ‘పరలోక దేవుడైన యెహోవా భూమ్మీదున్న రాజ్యాలన్నిటినీ నాకు అప్పగించాడు.+ ఆయన యూదాలోని యెరూషలేములో తన కోసం ఒక మందిరం కట్టించమని నన్ను ఆదేశించాడు.+
3 మీ మధ్య ఆయన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వాళ్ల దేవుడు తోడుగా ఉండాలి. వాళ్లు యూదాలో ఉన్న యెరూషలేముకు వెళ్లి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరాన్ని తిరిగి కట్టాలి. ఆయనే సత్యదేవుడు. యెరూషలేములో ఆయన మందిరం ఉండేది.*
4 ఆయన ప్రజల్లో ఎవరైతే పరదేశుల్లా నివసిస్తున్నారో+ వాళ్లు ఏ ప్రాంతంలో ఉన్నాసరే, వాళ్ల పొరుగువాళ్లు వాళ్లకు వెండిని, బంగారాన్ని, వస్తువుల్ని, పశువుల్ని ఇచ్చి సహాయం చేయాలి, అలాగే యెరూషలేములోని సత్యదేవుని మందిరం కోసం స్వేచ్ఛార్పణను ఇవ్వాలి.’ ”+
5 అప్పుడు యూదా, బెన్యామీను పూర్వీకుల కుటుంబాల పెద్దలు, యాజకులు, లేవీయులు, సత్యదేవుడు ఎవరెవరి మనసును ప్రేరేపించాడో వాళ్లందరూ, యెరూషలేముకు వెళ్లి యెహోవా మందిరాన్ని తిరిగి కట్టడానికి సిద్ధమయ్యారు.
6 వాళ్ల పొరుగువాళ్లు వెండిబంగారు పాత్రలు, వస్తువులు, పశువులు, ఇతర విలువైన వస్తువులు ఇచ్చి వాళ్లకు సహాయం చేశారు,* అలాగే స్వేచ్ఛార్పణల్ని ఇచ్చారు.
7 నెబుకద్నెజరు యెరూషలేము నుండి తీసుకెళ్లి, తన దేవుని గుడిలో పెట్టించిన యెహోవా మందిరంలోని పాత్రల్ని కూడా కోరెషు రాజు బయటికి తెప్పించాడు.+
8 పారసీక రాజైన కోరెషు తన కోశాధికారి మిత్రిదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించాడు, మిత్రిదాతు యూదా ప్రధానుడైన షేష్బజ్జరు* కోసం వాటి లెక్క రాశాడు.+
9 వాటి వివరాలు ఇవి: బుట్ట ఆకారంలో ఉన్న బంగారు పాత్రలు 30, బుట్ట ఆకారంలో ఉన్న వెండి పాత్రలు 1,000, వేరే పాత్రలు 29,
10 బంగారు గిన్నెలు చిన్నవి 30, వెండి గిన్నెలు చిన్నవి 410, వేరే పాత్రలు 1,000.
11 బంగారు, వెండి పాత్రలు మొత్తం కలిపి 5,400. చెరలో ఉన్నవాళ్లు+ బబులోను నుండి యెరూషలేముకు తీసుకురాబడినప్పుడు షేష్బజ్జరు వీటన్నిటినీ తీసుకొచ్చాడు.
అధస్సూచీలు
^ లేదా “పర్షియా.”
^ లేదా “ఆయన యెరూషలేములో ఉన్నాడు” అయ్యుంటుంది.
^ అక్ష., “వాళ్ల చేతుల్ని బలపర్చారు.”