ఎజ్రా 10:1-44

  • విదేశీ భార్యల్ని పంపించేయమని ఒప్పందం (1-14)

  • విదేశీ భార్యల్ని పంపించేశారు (15-44)

10  ఎజ్రా సత్యదేవుని మందిరం ముందు ప్రార్థిస్తూ,+ పాపాల్ని ఒప్పుకుంటూ, ఏడుస్తూ, సాష్టాంగపడుతుండగా, ఇశ్రాయేలు పురుషులు, స్త్రీలు, పిల్లలు పెద్ద గుంపుగా అతని చుట్టూ చేరారు. ప్రజలు కూడా విపరీతంగా ఏడుస్తున్నారు.  అప్పుడు ఏలాము+ కుమారుల్లో ఒకడైన యెహీయేలు+ కుమారుడు షెకన్యా ఎజ్రాతో ఇలా అన్నాడు: “మేము చుట్టుపక్కల దేశాల స్త్రీలను పెళ్లి చేసుకుని మా దేవునికి నమ్మకద్రోహం చేశాం.+ అయినా ఇశ్రాయేలీయులకు ఇంకా ఆశ మిగిలేవుంది.  ఇప్పుడు మనం యెహోవా నిర్దేశం ప్రకారం, మన దేవుని ఆజ్ఞల పట్ల భయభక్తులున్న వాళ్ల నిర్దేశం ప్రకారం,+ ఈ భార్యలందర్నీ, వాళ్లకు పుట్టిన పిల్లల్ని పంపించేలా మన దేవునితో ఒక ఒప్పందం* చేసుకుందాం.+ మనం ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుందాం.  లే, ఈ బాధ్యత నీది; మేము నీకు మద్దతిస్తాం. ధైర్యంగా ఉండి చర్య తీసుకో.”  అప్పుడు ఎజ్రా లేచి, ఆ మాట ప్రకారం చేసేలా యాజకుల, లేవీయుల, ఇశ్రాయేలీయులందరి ప్రధానులతో ఒట్టు వేయించాడు.+ వాళ్లు ఒట్టేశారు.  తర్వాత ఎజ్రా సత్యదేవుని మందిరం ముందు నుండి లేచి, ఎల్యాషీబు కుమారుడైన యెహోహానాను గదిలోకి* వెళ్లాడు. ఎజ్రా అక్కడికి వెళ్లినా ఆహారం తినలేదు, నీళ్లు తాగలేదు. ఎందుకంటే చెర నుండి తిరిగొచ్చిన ప్రజల నమ్మకద్రోహాన్ని బట్టి అతను దుఃఖిస్తూనే ఉన్నాడు.+  తర్వాత వాళ్లు, చెర నుండి తిరిగొచ్చిన వాళ్లంతా యెరూషలేములో సమావేశమవ్వాలని యూదా అంతటా, అలాగే యెరూషలేములో ఒక ప్రకటన చేయించారు;  అధిపతుల, పెద్దల నిర్ణయం ప్రకారం ఎవరైనా మూడు రోజుల్లో రాకపోతే, ఆ వ్యక్తి వస్తువులన్నీ స్వాధీనం చేసుకోబడతాయి;* చెర నుండి తిరిగొచ్చినవాళ్ల సమాజం నుండి అతను వెలివేయబడతాడు.+  కాబట్టి యూదా, బెన్యామీను పురుషులందరూ మూడు రోజుల్లో, అంటే తొమ్మిదో నెల, 20వ రోజున యెరూషలేములో సమావేశమయ్యారు. ప్రజలందరూ సత్యదేవుని మందిర ప్రాంగణంలో కూర్చున్నారు; పరిస్థితి ప్రాముఖ్యతను బట్టి, భారీ వర్షాన్ని బట్టి వాళ్లు వణికిపోతున్నారు. 10  అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వాళ్లతో ఇలా అన్నాడు: “విదేశీ స్త్రీలను పెళ్లి చేసుకుని+ మీరు నమ్మకద్రోహం చేశారు. అలా మీరు ఇశ్రాయేలీయుల అపరాధాన్ని పెంచారు. 11  ఇప్పుడు మీ పూర్వీకుల దేవుడైన యెహోవా ముందు మీ పాపాన్ని ఒప్పుకుని, ఆయన ఇష్టప్రకారం నడుచుకోండి. చుట్టుపక్కల దేశాల ప్రజల నుండి, ఈ విదేశీ భార్యల నుండి మిమ్మల్ని మీరు వేరుపర్చుకోండి.”+ 12  దానికి అక్కడ సమావేశమైన వాళ్లందరూ బిగ్గరగా ఇలా జవాబిచ్చారు: “నువ్వు చెప్పినట్టు చేయడం మా బాధ్యత. 13  అయితే ప్రజలు చాలామంది ఉన్నారు, అంతేకాదు ఇది వర్షాకాలం. కాబట్టి బయట నిలబడివుండడం సాధ్యం కాదు. పైగా ఇది ఒకట్రెండు రోజుల్లో పూర్తయ్యే పని కాదు. ఎందుకంటే ఈ విషయంలో పాపం చేసినవాళ్లు మాలో చాలామంది ఉన్నారు. 14  కాబట్టి దయచేసి సమాజమంతటి తరఫున మా అధిపతుల్ని ప్రాతినిధ్యం వహించనివ్వండి;+ ఈ విషయంలో మా దేవుని తీవ్రమైన కోపం మా మీద నుండి తొలగిపోయేలా, మా నగరాల్లో విదేశీ స్త్రీలను పెళ్లి చేసుకున్న వాళ్లందరూ ఆయా నగరాల పెద్దలతో, న్యాయమూర్తులతో పాటు ఫలానా సమయానికి రావాలి.” 15  అయితే అశాహేలు కుమారుడైన యోనాతాను, తిక్వా కుమారుడైన యహజ్యా దీనికి అభ్యంతరం చెప్పారు. లేవీయులైన మెషుల్లాము, షబ్బెతై+ వాళ్లకు మద్దతు ఇచ్చారు. 16  కానీ చెర నుండి తిరిగొచ్చినవాళ్లు మాత్రం ముందు నిర్ణయించబడినట్టే చేశారు; యాజకుడైన ఎజ్రా, అలాగే పేర్లు నమోదు చేయబడిన పూర్వీకుల కుటుంబాల పెద్దలందరూ విషయాన్ని పరిశీలించడానికి పదో నెల, మొదటి రోజున వేరుగా సమావేశమయ్యారు; 17  వాళ్లు, మొదటి నెల మొదటి రోజుకల్లా విదేశీ స్త్రీలను పెళ్లి చేసుకున్న పురుషులందరి సంగతి పరిశీలించారు. 18  యాజకుల కుమారుల్లో కొంతమంది విదేశీ స్త్రీలను పెళ్లి చేసుకున్నట్టు తేలింది.+ వాళ్లెవరంటే: యేషూవ+ కుమారుల్లో యెహోజాదాకు కుమారుడు, అతని సహోదరులైన మయశేయా, ఎలీయెజెరు, యారీబు, గెదల్యా. 19  అయితే వాళ్లు తమ భార్యల్ని పంపించేస్తామని మాటిచ్చారు. వాళ్లు అపరాధులు కాబట్టి తమ అపరాధం కోసం మంద నుండి ఒక పొట్టేలును అర్పిస్తారు.+ 20  పాపం చేసిన మిగతావాళ్లు ఎవరంటే: ఇమ్మేరు+ కుమారుల్లో హనానీ, జెబద్యా; 21  హారీము+ కుమారుల్లో మయశేయా, ఏలీయా, షెమయా, యెహీయేలు, ఉజ్జియా. 22  పషూరు కుమారుల్లో+ ఎల్యోయేనై, మయశేయా, ఇష్మాయేలు, నెతనేలు, యోజాబాదు, ఎలాశా. 23  లేవీయుల్లో: యోజాబాదు, షిమీ, కెలాయా (అంటే కెలిథా), పెతహయా, యూదా, ఎలీయెజెరు; 24  గాయకుల్లో: ఎల్యాషీబు, ద్వారపాలకుల్లో షల్లూము, తెలెము, ఊరి. 25  ఇశ్రాయేలీయుల్లో: పరోషు కుమారుల్లో+ రమ్యా, యిజ్జీయా, మల్కీయా, మీయామిను, ఎలియాజరు, మల్కీయా, బెనాయా; 26  ఏలాము కుమారుల్లో+ మత్తన్యా, జెకర్యా, యెహీయేలు,+ అబ్దీ, యెరేమోతు, ఏలీయా; 27  జత్తూ కుమారుల్లో+ ఎల్యోయేనై, ఎల్యాషీబు, మత్తన్యా, యెరేమోతు, జాబాదు, అజీజా; 28  బేబై కుమారుల్లో+ యెహోహానాను, హనన్యా, జబ్బయి, అత్లాయి; 29  బానీ కుమారుల్లో మెషుల్లాము, మల్లూకు, అదాయా, యాషూబు, షెయాలు, యెరేమోతు; 30  పహత్మోయాబు కుమారుల్లో+ అద్నా, కెలాలు, బెనాయా, మయశేయా, మత్తన్యా, బెసలేలు, బిన్నూయి, మనష్షే; 31  హారీము కుమారుల్లో+ ఎలీయెజెరు, ఇష్షీయా, మల్కీయా,+ షెమయా, షిమ్యోను, 32  బెన్యామీను, మల్లూకు, షెమర్యా; 33  హాషుము+ కుమారుల్లో మత్తెనై, మత్తత్తా, జాబాదు, ఎలీపేలెటు, యెరేమై, మనష్షే, షిమీ; 34  బానీ కుమారుల్లో మాదై, అమ్రాము, ఊయేలు, 35  బెనాయా, బేదయా, కెలూహు, 36  వన్యా, మెరేమోతు, ఎల్యాషీబు, 37  మత్తన్యా, మత్తెనై, యహశావు; 38  బిన్నూయి కుమారుల్లో షిమీ, 39  షెలెమ్యా, నాతాను, అదాయా, 40  మక్నద్బయి, షాషయి, షారాయి, 41  అజరేలు, షెలెమ్యా, షెమర్యా, 42  షల్లూము, అమర్యా, యోసేపు; 43  నెబో కుమారుల్లో యెహీయేలు, మత్తిత్యా, జాబాదు, జెబీనా, యద్దయి, యోవేలు, బెనాయా. 44  వీళ్లందరూ విదేశీ స్త్రీలను పెళ్లి చేసుకున్నవాళ్లు;+ వీళ్లు తమ భార్యల్ని వాళ్ల పిల్లలతో సహా పంపించేశారు.+

అధస్సూచీలు

లేదా “నిబంధన.”
లేదా “భోజనశాలలోకి.”
లేదా “నిషేధించబడతాయి.”