ఎజ్రా 3:1-13

  • బలిపీఠం కట్టి, బలులు అర్పించారు (1-6)

  • ఆలయాన్ని తిరిగికట్టే పని మొదలవడం (7-9)

  • ఆలయ పునాది వేయబడింది (10-13)

3  ఏడో నెల+ మొదలయ్యాక ఇశ్రాయేలీయులు* తమ నగరాల్లో ఉన్నారు; వాళ్లు ఒకే మనస్సుతో యెరూషలేములో సమావేశమయ్యారు.  యెహోజాదాకు కుమారుడైన యేషూవ,+ అతని తోటి యాజకులు, షయల్తీయేలు+ కుమారుడైన జెరుబ్బాబెలు,+ అతని సహోదరులు లేచి సత్యదేవుని సేవకుడైన మోషే ధర్మశాస్త్రంలో రాయబడినట్టు దహనబలులు అర్పించడానికి ఇశ్రాయేలు దేవుని బలిపీఠం కట్టారు.+  వాళ్లు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు భయపడినా,+ బలిపీఠాన్ని అది ఒకప్పుడు ఉన్న చోటనే నిలిపారు. వాళ్లు దాని మీద యెహోవాకు దహనబలులు అర్పించడం మొదలుపెట్టారు. ఉదయం, సాయంకాలం అర్పించాల్సిన దహనబలులు+ అర్పించడం మొదలుపెట్టారు.  అప్పుడు వాళ్లు ధర్మశాస్త్రంలో రాయబడినట్టు పర్ణశాలల* పండుగను జరుపుకున్నారు,+ లెక్క ప్రకారం ఒక్కోరోజు అర్పించాల్సిన దహనబలుల్ని,+ ఏ రోజుకు ఆ రోజు అర్పించారు.  ఆ తర్వాత వాళ్లు రోజూ అర్పించే దహనబలుల్ని,+ అమావాస్య రోజుల్లో అర్పించే అర్పణల్ని,+ యెహోవా ప్రతిష్ఠిత పండుగ కాలాలన్నిటిలో అర్పించే అర్పణల్ని+ అర్పించారు. ఇంకా యెహోవాకు ఇష్టపూర్వకంగా ఇచ్చిన వాళ్లందరి స్వేచ్ఛార్పణల్ని+ కూడా అర్పించారు.  ఏడో నెల+ మొదటి రోజు నుండి వాళ్లు యెహోవాకు దహనబలులు అర్పించడం మొదలుపెట్టారు. అయితే యెహోవా ఆలయ పునాది ఇంకా వేయబడలేదు.  వాళ్లు రాళ్లు కొట్టేవాళ్లకు,+ నైపుణ్యంగల పనివాళ్లకు+ డబ్బులిచ్చారు. అంతేకాదు, పారసీక రాజైన కోరెషు తమకు ఇచ్చిన అనుమతి ప్రకారం,+ లెబానోను నుండి యొప్పే వరకు సముద్రం మీదుగా దేవదారు మ్రానుల్ని తీసుకురావడానికి+ సీదోనీయులకు, తూరువాళ్లకు ఆహారాన్ని, పానీయాన్ని, నూనెను ఇచ్చారు.  వాళ్లు యెరూషలేములోని సత్యదేవుని మందిరానికి వచ్చిన తర్వాత రెండో సంవత్సరం, రెండో నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, యెహోజాదాకు కుమారుడైన యేషూవ, వాళ్ల మిగతా సహోదరులు, యాజకులు, లేవీయులు, అలాగే చెర నుండి యెరూషలేముకు వచ్చిన వాళ్లందరూ+ పనిని మొదలుపెట్టారు; వాళ్లు యెహోవా మందిర పని మీద పర్యవేక్షకులుగా సేవచేయడానికి 20 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయసున్న లేవీయుల్ని నియమించారు.  కాబట్టి యూదా కుమారులైన యేషూవ, కద్మీయేలు, యేషూవ కుమారులు, అతని సహోదరులు, కద్మీయేలు కుమారులు, అలాగే లేవీయులైన హేనాదాదు వంశస్థులు,+ వాళ్ల కుమారులు, వాళ్ల బంధువులు సత్యదేవుని మందిరంలో పనిచేసేవాళ్లను పర్యవేక్షించారు. 10  కట్టేవాళ్లు యెహోవా ఆలయ పునాదిని వేసినప్పుడు,+ ఆలయ వస్త్రాలు వేసుకున్న యాజకులు బాకాలు+ పట్టుకుని, లేవీయులైన ఆసాపు కుమారులు తాళాల్ని పట్టుకుని ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్దేశం ప్రకారం+ యెహోవాను స్తుతించడానికి లేచి నిలబడ్డారు. 11  వాళ్లు ఒకరి తర్వాత ఒకరు యెహోవాను స్తుతిస్తూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ వంతులవారీగా ఇలా పాడడం+ మొదలుపెట్టారు: “ఎందుకంటే, ఆయన మంచివాడు; ఇశ్రాయేలు మీద ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.”+ తర్వాత ప్రజలందరూ యెహోవా మందిర పునాది వేయబడినందుకు బిగ్గరగా యెహోవాను స్తుతించారు. 12  పాత మందిరాన్ని చూసిన వృద్ధులు,+ అంటే చాలామంది యాజకులు, లేవీయులు, పూర్వీకుల కుటుంబాల పెద్దలు ఆ మందిర పునాది వేయబడుతుండడం చూసినప్పుడు పెద్దగా ఏడ్చారు; అదే సమయంలో చాలామంది ఇతరులు సంతోషంతో గట్టిగా కేకలు వేశారు.+ 13  ప్రజలు చాలా గట్టిగా అరుస్తుండడంతో ఆ అరుపులు చాలా దూరం వరకు వినిపించాయి. కాబట్టి ఎవరు సంతోషంతో కేకలు వేస్తున్నారో, ఎవరు ఏడుస్తున్నారో ప్రజలకు అర్థం కాలేదు.

అధస్సూచీలు

అక్ష., “ఇశ్రాయేలు కుమారులు.”
లేదా “తాత్కాలిక ఆశ్రయాల.”