ఎజ్రా 4:1-24

  • ఆలయాన్ని తిరిగికట్టే పనికి వ్యతిరేకత (1-6)

  • శత్రువులు అర్తహషస్త రాజుకు ఫిర్యాదు చేయడం (7-16)

  • అర్తహషస్త జవాబు (17-22)

  • ఆలయ నిర్మాణం ఆగిపోయింది (23, 24)

4  చెర నుండి తిరిగొచ్చినవాళ్లు+ ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఆలయాన్ని కడుతున్నారనే విషయం యూదుల, బెన్యామీనీయుల శత్రువులు+ విన్నప్పుడు,  వాళ్లు వెంటనే జెరుబ్బాబెలు దగ్గరికి, పూర్వీకుల కుటుంబాల పెద్దల దగ్గరికి వచ్చి, “మమ్మల్ని కూడా మీతో కలిసి కట్టనివ్వండి; మేమూ మీలాగే మీ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం;+ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన అష్షూరు రాజైన ఏసర్హద్దోను+ కాలం నుండి మేము ఆయనకు బలులు అర్పిస్తూ ఉన్నాం” అని అన్నారు.  అయితే జెరుబ్బాబెలు, యేషూవ, ఇశ్రాయేలు మిగతా పూర్వీకుల కుటుంబాల పెద్దలు, “మాతో కలిసి మా దేవుని కోసం మందిరాన్ని కట్టే హక్కు మీకు లేదు.+ పారసీక రాజైన కోరెషు మాకు ఆజ్ఞాపించినట్టు+ మేము మాత్రమే ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మందిరాన్ని కడతాం” అన్నారు.  అప్పుడు చుట్టూ ఉన్న ప్రజలు యూదావాళ్ల ధైర్యాన్ని నీరుగారుస్తూ,* నిర్మాణ పని విషయంలో వాళ్లను నిరుత్సాహపరుస్తూ వచ్చారు.+  వాళ్లు యూదా ప్రజల్ని వ్యతిరేకించడానికి, వాళ్ల ప్రణాళికల్ని చెడగొట్టడానికి సలహాదారులకు డబ్బులిచ్చారు.+ పారసీక రాజైన కోరెషు కాలమంతా అలాగే రాజైన దర్యావేషు+ పరిపాలన వరకు వాళ్లు అదేవిధంగా చేస్తూ వచ్చారు.  వాళ్లు అహష్వేరోషు పరిపాలన ఆరంభంలో యూదా, యెరూషలేము నివాసుల మీద నింద మోపుతూ ఒక లేఖ రాశారు.  అంతేకాదు, పారసీక రాజైన అర్తహషస్త కాలంలో బిష్లాము, మిత్రిదాతు, టాబెయేలు, అలాగే అతనితో ఉన్న మిగతా సహోద్యోగులు రాజైన అర్తహషస్తకు లేఖ రాశారు; వాళ్లు దాన్ని అరామిక్‌​లోకి+ అనువదించి అరామిక్‌ అక్షరాలతో రాశారు.*  * ప్రభుత్వ ముఖ్య అధికారైన రెహూము, శాస్త్రి అయిన షిమ్షయి యెరూషలేముకు వ్యతిరేకంగా అర్తహషస్త రాజుకు ఇలా లేఖ రాశారు:  (దీన్ని ప్రభుత్వ ముఖ్య అధికారైన రెహూము, శాస్త్రి అయిన షిమ్షయి, వాళ్లతో ఉన్న మిగతా సహోద్యోగులు, న్యాయమూర్తులు, కింది స్థాయి అధిపతులు, కార్యదర్శులు, ఎరెకు+ ప్రజలు, బబులోనీయులు, సూస+ నివాసులు, అంటే ఏలామీయులు,+ 10  అలాగే ఘనుడూ గౌరవనీయుడూ అయిన ఆస్నప్పరు చెరగా తీసుకెళ్లి, సమరయ నగరాల్లో+ నివసింపజేసిన మిగతా దేశాల ప్రజలు, నది అవతలి ప్రాంతంలోని* మిగతావాళ్లు రాశారు. 11  వాళ్లు అతనికి పంపిన లేఖ నకలు ఇది.) “అర్తహషస్త రాజుకు, నది అవతలి ప్రాంతంలో ఉన్న మీ సేవకులు రాస్తున్న లేఖ: 12  మీ దగ్గర నుండి మా ప్రాంతానికి వచ్చిన యూదులు యెరూషలేముకు చేరుకున్నారని మీకు తెలియజేస్తున్నాం. వాళ్లు, తిరుగుబాటు చేసే దుష్ట నగరాన్ని మళ్లీ కడుతున్నారు. వాళ్లు ప్రాకారాల్ని కట్టడం పూర్తిచేస్తున్నారు,+ పునాదుల్ని బాగుచేస్తున్నారు. 13  ఈ నగరాన్ని తిరిగి కడితే, దీని ప్రాకారాలు పూర్తయితే, వాళ్లు మీకు పన్ను గానీ కప్పం గానీ+ సుంకం గానీ చెల్లించరని రాజైన మీరు తెలుసుకోవాలి. అది రాజుల ఖజానాలకు నష్టం కలిగిస్తుంది. 14  మేము రాజు* ఉప్పు తినేవాళ్లం కాబట్టి, రాజుకు నష్టం వాటిల్లుతుంటే చూస్తూ ఉండడం సరికాదు. అందుకే దీన్ని మీ దృష్టికి తీసుకురావాలని ఈ లేఖ పంపిస్తున్నాం. 15  మీ పూర్వీకుల దస్తావేజుల్ని+ తనిఖీ చేయాలని అలా పంపిస్తున్నాం. ఆ దస్తావేజుల్ని తనిఖీ చేస్తే, ఈ నగరం తిరుగుబాటు చేసే నగరమని, అది రాజులకు, సంస్థానాలకు హానికరమైనదని, పూర్వకాలాల నుండి ఆ నగరంలో రాజద్రోహాన్ని పురికొల్పేవాళ్లు ఉన్నారని మీకు తెలుస్తుంది. అందుకే ఆ నగరం నాశనం చేయబడింది.+ 16  ఒకవేళ ఆ నగరం మళ్లీ కట్టబడితే, దాని ప్రాకారాలు పూర్తయితే, నది+ అవతలి ప్రాంతం మీద మీకు నియంత్రణ* ఉండదని రాజైన మీకు తెలియజేస్తున్నాం.” 17  అప్పుడు రాజు, ప్రభుత్వ ముఖ్య అధికారైన రెహూముకు, శాస్త్రి అయిన షిమ్షయికి, సమరయలోని వీళ్ల మిగతా సహోద్యోగులకు, నది అవతలి ప్రాంతంలో ఉన్న మిగతావాళ్లకు ఈ సందేశం పంపించాడు: “మీకు క్షేమం కలగాలి! 18  మీరు మాకు పంపిన లేఖ నా ముందు స్పష్టంగా చదవబడింది.* 19  నా ఆజ్ఞ మేరకు దస్తావేజుల్ని తనిఖీ చేశారు. అందులో తేలిందేమిటంటే, పూర్వకాలం నుండి ఈ నగర ప్రజలు రాజుల మీద తిరగబడుతూ వచ్చారు. ఆ నగరంలో తిరుగుబాట్లు, విప్లవాలు చోటుచేసుకున్నాయి.+ 20  యెరూషలేమును పరిపాలించిన శక్తివంతమైన రాజులు నది అవతలి ప్రాంతాన్నంతా పరిపాలించారు. వాళ్లకు పన్ను, కప్పం, సుంకం చెల్లించబడేవి. 21  అయితే ఇప్పుడు నిర్మాణ పనిని ఆపేయమని ఆ మనుషులకు ఆజ్ఞ జారీ చేయండి. నేను ఆజ్ఞ జారీ చేసేంతవరకు ఆ నగరాన్ని మళ్లీ నిర్మించకూడదు. 22  ఈ విషయంలో అశ్రద్ధ చేయకుండా చర్య తీసుకోండి. అప్పుడు రాజుకు ఇంకా నష్టం కలగకుండా ఉంటుంది.”+ 23  రాజైన అర్తహషస్త పంపిన అధికార పత్రం నకలు రెహూము, శాస్త్రి అయిన షిమ్షయి, వాళ్లతో ఉన్న మిగతా సహోద్యోగుల ముందు చదవబడింది; ఆ తర్వాత వాళ్లు వెంటనే యెరూషలేములోని యూదుల దగ్గరికి వెళ్లి బలవంతంగా వాళ్ల పనిని ఆపుజేయించారు. 24  అప్పుడు యెరూషలేములోని దేవుని మందిర పని ఆగిపోయింది; పారసీక రాజైన దర్యావేషు పరిపాలనలో రెండో సంవత్సరం వరకు అలాగే నిలిచిపోయింది.+

అధస్సూచీలు

అక్ష., “చేతుల్ని బలహీనపరుస్తూ.”
లేదా “అది అరామిక్‌​లో రాయబడి, తర్వాత అనువదించబడింది” అయ్యుంటుంది.
ఎజ్రా 4:8 నుండి 6:18 వరకు మొదట్లో అరామిక్‌​లో రాయబడింది.
ఇది యూఫ్రటీసు నదికి పడమటి వైపున్న ప్రాంతాల్ని సూచిస్తుంది.
లేదా “రాజభవనం.”
లేదా “ప్రాంతంలో మీకు భాగం.”
లేదా “అనువదించబడి చదవబడింది” అయ్యుంటుంది.