ఎజ్రా 6:1-22

  • దర్యావేషు వెదికించి, ఆజ్ఞ జారీ చేయడం (1-12)

  • ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేసి, ప్రతిష్ఠించడం (13-18)

  • పస్కాను ఆచరించడం (19-22)

6  కాబట్టి దర్యావేషు రాజు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. దాంతో బబులోనులో విలువైన వస్తువుల్ని ఉంచే దస్తావేజుల భవనంలో వెదికారు.  అప్పుడు మాదీయ సంస్థానంలోని ఎగ్బతానాలో ఉన్న కోటలో ఒక గ్రంథపు చుట్ట దొరికింది. అందులో ఈ సందేశం రాసి ఉంది:  “రాజైన కోరెషు తన పరిపాలన మొదటి సంవత్సరంలో, యెరూషలేములోని దేవుని మందిరానికి సంబంధించి ఒక ఆజ్ఞ జారీ చేశాడు:+ ‘వాళ్లు బలులు అర్పించాల్సిన స్థలంగా మందిరాన్ని తిరిగి కట్టాలి. దాని పునాదుల్ని గట్టిగా వేయాలి; దాని ఎత్తు 60 మూరలు,* వెడల్పు 60 మూరలు ఉండాలి.+  దాని గోడల్ని మూడు వరుసల పెద్ద రాళ్లతో, ఒక వరుస దూలాలతో కట్టాలి;+ ఖర్చులు రాజు ఖజానా నుండి చెల్లించాలి.+  అంతేకాదు, నెబుకద్నెజరు యెరూషలేములోని దేవుని ఆలయంలో నుండి బబులోనుకు తీసుకొచ్చిన వెండిబంగారు పాత్రల్ని+ తిరిగిచ్చేయాలి. వాటిని యెరూషలేము ఆలయంలో వాటి స్థలంలో పెట్టాలి. దేవుని మందిరంలో వాటిని పెట్టాలి.’+  “కాబట్టి, నది అవతలి ప్రాంతానికి* అధిపతైన తత్తెనై, షెతర్బోజ్నయి, నది అవతలి ప్రాంతానికి కింది స్థాయి అధిపతులైన మీ సహోద్యోగులు+ ఆ స్థలానికి దూరంగా ఉండండి.  ఆ దేవుని మందిర పనిలో జోక్యం చేసుకోకండి. యూదుల అధిపతి, యూదుల పెద్దలు ఆ దేవుని మందిరాన్ని అది ఒకప్పుడు ఉన్న చోటే తిరిగి కడతారు.  అంతేకాదు, ఆ దేవుని మందిరాన్ని తిరిగి కట్టడానికి యూదుల పెద్దల కోసం మీరు ఏమి చేయాలనే దాని గురించి ఈ ఆజ్ఞ జారీ చేస్తున్నాను: వాళ్ల పని ఆగకుండా జరిగేలా,+ ఖర్చులకు కావాల్సినవాటిని వెంటనే ఇస్తూ ఉండాలి. వాటిని రాజు ఖజానా నుండి,+ నది అవతలి ప్రాంతంలో వసూలు చేయబడిన పన్ను నుండి ఇవ్వాలి.  అవసరమైన ప్రతీదాన్ని, అంటే పరలోక దేవునికి దహనబలి అర్పించడానికి కావాల్సిన కోడెదూడలు,+ పొట్టేళ్లు,+ గొర్రెపిల్లలు,+ ఇంకా గోధుమలు,+ ఉప్పు,+ ద్రాక్షారసం,+ నూనె+ యెరూషలేములోని యాజకులు అడిగినవి ఏవైనా ప్రతీరోజు వాళ్లకు తప్పకుండా ఇస్తూ ఉండాలి. 10  అప్పుడు వాళ్లు క్రమంగా పరలోక దేవునికి అర్పణలు అర్పిస్తూ ఉండగలుగుతారు; రాజు క్షేమం కోసం, అతని కుమారుల క్షేమం కోసం ప్రార్థన చేస్తారు.+ 11  నేను జారీ చేసే మరో ఆజ్ఞ ఏమిటంటే, ఎవరైనా ఈ శాసనాన్ని మీరితే అతని ఇంటి దూలం పీకేయబడుతుంది, అతను దానిమీద వేలాడదీయబడతాడు. ఆ వ్యక్తి తప్పు చేసినందువల్ల అతని ఇల్లు బహిరంగ మరుగుదొడ్డిగా* చేయబడుతుంది. 12  ఈ శాసనాన్ని మీరడానికి, యెరూషలేములోని ఆ దేవుని మందిరాన్ని నాశనం చేయడానికి ఏ రాజైనా, ప్రజలైనా చెయ్యి ఎత్తితే, తన పేరును అక్కడ ఉంచిన దేవుడు+ వాళ్లను నాశనం చేయాలి. దర్యావేషు అనే నేను ఈ ఆజ్ఞ జారీ చేస్తున్నాను. ఇది వెంటనే జరగాలి.” 13  అప్పుడు, నది అవతలి ప్రాంతానికి అధిపతైన తత్తెనై, షెతర్బోజ్నయి,+ వాళ్ల సహోద్యోగులు రాజైన దర్యావేషు ఆజ్ఞాపించినదంతా వెంటనే చేశారు. 14  హగ్గయి ప్రవక్త,+ ఇద్దో మనవడైన జెకర్యా+ ప్రవచిస్తూ ప్రోత్సహించడంతో యూదుల పెద్దలు నిర్మాణాన్ని కొనసాగించి, పనిని ముందుకు తీసుకెళ్లారు.+ వాళ్లు ఇశ్రాయేలు దేవుని ఆజ్ఞ ప్రకారం,+ అలాగే కోరెషు,+ దర్యావేషు, పారసీక రాజైన అర్తహషస్త+ ఆజ్ఞ ప్రకారం నిర్మాణాన్ని పూర్తిచేశారు. 15  వాళ్లు రాజైన దర్యావేషు పరిపాలన ఆరో సంవత్సరంలో అదారు* నెల, మూడో రోజుకల్లా మందిరాన్ని పూర్తిచేశారు. 16  అప్పుడు ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు,+ చెర నుండి తిరిగొచ్చిన మిగతావాళ్లు దేవుని మందిరాన్ని సంతోషంగా ప్రతిష్ఠించారు.* 17  వాళ్లు దేవుని మందిర ప్రతిష్ఠాపన కోసం 100 ఎద్దుల్ని, 200 పొట్టేళ్లను, 400 గొర్రెపిల్లల్ని అర్పించారు. అలాగే ఇశ్రాయేలీయులందరి కోసం, ఇశ్రాయేలీయుల గోత్రాల లెక్క ప్రకారం 12 మేకపోతుల్ని పాపపరిహారార్థ బలిగా అర్పించారు.+ 18  మోషే గ్రంథంలో రాసివున్న ప్రకారం,+ వాళ్లు యెరూషలేములోని దేవుని సేవ కోసం యాజకుల్ని, లేవీయుల్ని వాళ్లవాళ్ల విభాగాల చొప్పున+ నియమించారు. 19  చెర నుండి వచ్చినవాళ్లు మొదటి నెల+ 14వ రోజున పస్కాను జరుపుకున్నారు. 20  యాజకులు, లేవీయులు అనే తేడా లేకుండా వాళ్లు తమను తాము శుద్ధి చేసుకున్నారు.+ అలా వాళ్లందరూ శుద్ధులయ్యారు; వాళ్లు చెర నుండి తిరిగొచ్చిన వాళ్లందరి కోసం, తోటి యాజకుల కోసం, తమ కోసం పస్కా బలిని వధించారు. 21  అప్పుడు, చెర నుండి తిరిగొచ్చిన ఇశ్రాయేలీయులు, అలాగే ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఆరాధించడానికి దేశంలోని జనాల అపవిత్రత నుండి తమను తాము శుద్ధి చేసుకుని వాళ్లతో కలిసిన ప్రతీ ఒక్కరు తిన్నారు.+ 22  అంతేకాదు, వాళ్లు ఆనందంగా ఏడురోజులు పులవని రొట్టెల పండుగ+ కూడా చేసుకున్నారు. ఎందుకంటే, యెహోవా వాళ్లకు సంతోషాన్ని ఇచ్చాడు, అలాగే అష్షూరు రాజు హృదయాన్ని వాళ్లకు అనుకూలంగా ఉండేలా చేశాడు.+ దానివల్ల ఇశ్రాయేలు దేవుడైన సత్యదేవుని మందిర పని విషయంలో అతను వాళ్లకు సహాయం చేశాడు.*

అధస్సూచీలు

దాదాపు 26.7 మీటర్లు (87.6 అడుగులు). అనుబంధం B14 చూడండి.
ఇది యూఫ్రటీసు నదికి పడమటి వైపున్న ప్రాంతాల్ని సూచిస్తుంది.
లేదా “చెత్త కుప్పగా; పెంట కుప్పగా” అయ్యుంటుంది.
అనుబంధం B15 చూడండి.
లేదా “సమర్పించారు.”
అక్ష., “వాళ్ల చేతుల్ని బలపర్చాడు.”