ఎజ్రా 9:1-15

  • ఇశ్రాయేలీయులు అన్యుల్ని పెళ్లి ​చేసుకున్నారు (1-4)

  • పాపాలు ఒప్పుకుంటూ ఎజ్రా ప్రార్థించడం (5-15)

9  ఈ విషయాలు జరిగిన వెంటనే అధిపతులు నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పారు: “ఇశ్రాయేలు ప్రజలు, యాజకులు, లేవీయులు చుట్టుపక్కల దేశాల ప్రజల నుండి, అంటే కనానీయుల, హిత్తీయుల, పెరిజ్జీయుల, యెబూసీయుల, అమ్మోనీయుల, మోయాబీయుల, ఐగుప్తీయుల,+ అమోరీయుల+ నుండి, వాళ్ల అసహ్యమైన ఆచారాల నుండి తమను తాము వేరుపర్చుకోలేదు.+  వాళ్లూ, వాళ్ల కుమారులూ ఆ దేశాల స్త్రీలలో కొంతమందిని పెళ్లి చేసుకున్నారు.+ ఇప్పుడు వాళ్లు, అంటే పవిత్రమైన ప్రజలు*+ చుట్టుపక్కల దేశాల ప్రజలతో కలిసిపోయారు.+ ఈ పాపంలో ముఖ్యమైన దోషులు అధిపతులు, ఉప పాలకులే.”  ఇది విన్న వెంటనే నేను నా వస్త్రాన్ని, చేతుల్లేని నిలువుటంగీని చింపుకుని, నా జుట్టును, గడ్డాన్ని పీక్కుని, దిగ్భ్రాంతికి లోనై కూర్చుండిపోయాను.  అప్పుడు ఇశ్రాయేలు దేవుని మాటల మీద భయభక్తులున్న వాళ్లందరూ చెర నుండి తిరిగొచ్చిన వాళ్ల పాపాన్ని బట్టి నా చుట్టూ చేరారు. సాయంకాల ధాన్యార్పణ+ అర్పించే సమయం వరకు నేను దిగ్భ్రాంతికి లోనై అలాగే కూర్చుండిపోయాను.  సాయంకాల ధాన్యార్పణ+ అర్పించే సమయంలో, చిరిగిపోయిన బట్టలతో బాధపడుతూ కూర్చున్న నేను ఆ చోటు నుండి లేచాను. నేను మోకాళ్లూని నా దేవుడైన యెహోవా వైపు చేతులు చాపి,  ఇలా అన్నాను: “నా దేవా, నీ వైపు ముఖం ఎత్తాలంటే నాకు సిగ్గుగా, ఇబ్బందిగా ఉంది. నా దేవా, మేము ఎన్నో పాపాలు చేశాం. మా అపరాధం ఆకాశాన్నంటింది.+  మా పూర్వీకుల రోజుల నుండి నేటివరకు మేము ఎన్నో అపరాధాలు చేశాం;+ మా దోషాల్ని బట్టి నువ్వు మమ్మల్ని, మా రాజుల్ని, మా యాజకుల్ని వేరే దేశాల రాజుల చేతికి అప్పగించావు; మేము కత్తితో చంపబడ్డాం,+ చెరగా తీసుకెళ్లబడ్డాం,+ దోచుకోబడ్డాం,+ అవమానాలపాలయ్యాం. ఇప్పుడు మేము అదే పరిస్థితిలో ఉన్నాం.+  కానీ మా దేవా, యెహోవా, నువ్వు మిగిలినవాళ్లను తిరిగిరానిచ్చి, నీ పవిత్ర స్థలంలో మాకు సురక్షితమైన స్థానాన్నిచ్చి ఇప్పుడు క్షణకాలం మా మీద అనుగ్రహం చూపించావు;+ మా దేవా, అలా నువ్వు మా కళ్లు ప్రకాశించేలా, మా దాసత్వంలో మేము కాస్త తేరుకునేలా చేశావు.  మేము దాసులమే+ అయినా, మా దేవుడివైన నువ్వు మమ్మల్ని మా దాసత్వంలో విడిచిపెట్టేయలేదు; మేము తేరుకుని మా దేవుని మందిరాన్ని తిరిగి కట్టేలా,+ దాని శిథిలాల్ని బాగుచేసేలా, అలాగే యూదా, యెరూషలేములో మాకు రక్షణ గోడ* ఉండేలా నువ్వు పారసీక రాజుల ముందు మామీద నీ విశ్వసనీయ ప్రేమ చూపించావు.+ 10  “అయితే మా దేవా, ఇదంతా జరిగాక ఇప్పుడు మేము ఏమి అనగలం? మేము నీ ఆజ్ఞల్ని విడిచిపెట్టాం. 11  నువ్వు నీ సేవకులైన ప్రవక్తల ద్వారా వాటిని ఇస్తూ ఇలా అన్నావు: ‘మీరు స్వాధీనం చేసుకోబోయే దేశం, ఆ దేశాల ప్రజల అశుద్ధతను బట్టి, వాళ్ల అసహ్యమైన ఆచారాల్ని బట్టి అశుద్ధమైపోయింది. వాళ్లు దాన్ని ఈ చివర నుండి ఆ చివర వరకు తమ అపవిత్రతతో నింపేశారు.+ 12  కాబట్టి, మీ కూతుళ్లను వాళ్ల కుమారులకు ఇవ్వకండి. వాళ్ల కూతుళ్లను మీ కుమారుల కోసం తీసుకోకండి;+ వాళ్ల శాంతి కోసం, శ్రేయస్సు కోసం మీరు ఎప్పటికీ పాటుపడకూడదు.+ అప్పుడు మీరు బలంగా తయారై, దేశంలోని మంచివాటిని తిని, మీ కుమారులకు దాన్ని శాశ్వత ఆస్తిగా ఇవ్వగలుగుతారు.’ 13  మా చెడ్డపనుల్ని బట్టి, మా గొప్ప దోషాన్ని బట్టి ఇదంతా మాకు జరిగింది. కానీ మా దేవా, నువ్వైతే మా తప్పులకు తగినట్టు మమ్మల్ని శిక్షించలేదు,+ బదులుగా ఇక్కడున్న మమ్మల్ని తిరిగి రానిచ్చావు.+ 14  మేము మళ్లీ నీ ఆజ్ఞల్ని మీరి, ఈ అసహ్యమైన పనులు చేసే ప్రజలతో పెళ్లి సంబంధాలు+ కుదుర్చుకుంటామా? అలాచేస్తే, మాలో ఎవ్వరూ మిగలకుండా, తప్పించుకోకుండా మమ్మల్ని పూర్తిగా నాశనం చేసేంతగా నీకు కోపం రాదా? 15  ఇశ్రాయేలు దేవా, యెహోవా, నువ్వు నీతిమంతుడివి.+ అందుకే నేటివరకు మాలో కొందరు ఇంకా మిగిలివున్నారు. ఇప్పుడు మేము మా అపరాధంతో నీ ముందు ఉన్నాం. ఇంత జరిగిన తర్వాత నీ ముందు నిలబడే అర్హత మాలో ఎవ్వరికీ లేదు.”+

అధస్సూచీలు

అక్ష., “పవిత్రమైన విత్తనం.”
లేదా “రాతి గోడ.”