ఎఫెసీయులు 5:1-33

  • స్వచ్ఛమైన మాటలు, ప్రవర్తన (1-5)

  • వెలుగు బిడ్డల్లా నడుచుకోండి (6-14)

  • పవిత్రశక్తితో నింపబడండి (15-20)

    • మీ సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించుకోండి (16)

  • భర్తలకు, భార్యలకు సలహాలు (21-33)

5  కాబట్టి మీరు, దేవునికి ప్రియమైన పిల్లల్లా ఆయన్ని అనుకరించండి,+  ప్రేమతో నడుచుకుంటూ ఉండండి, క్రీస్తు కూడా మనల్ని* ప్రేమించి,+ మన* కోసం తనను తాను దేవునికి పరిమళభరిత అర్పణగా, బలిగా అర్పించుకున్నాడు.+  లైంగిక పాపం,* అన్నిరకాల అపవిత్రత, అత్యాశ అనేవాటి ప్రస్తావన కూడా మీ మధ్య రానివ్వకండి,+ అది పవిత్రులకు తగదు;+  అంతేకాదు అవమానకరమైన ప్రవర్తన, మూర్ఖంగా మాట్లాడడం, అసభ్యమైన హాస్యం అనేవి కూడా పవిత్రులకు తగవు. బదులుగా, మీరు దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ఉండండి.+  ఎందుకంటే లైంగిక పాపి*+ గానీ, అపవిత్రుడు గానీ, విగ్రహపూజ చేసేవాళ్లతో సమానుడైన అత్యాశపరుడు+ గానీ క్రీస్తు పరిపాలించే దేవుని రాజ్యానికి వారసుడు అవ్వడని+ మీకు తెలుసు, ఈ విషయాన్ని మీరు పూర్తిగా అర్థంచేసుకున్నారు.  పనికిరాని మాటలతో ఎవరూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి, ఎందుకంటే అలాంటివాటి వల్ల అవిధేయుల మీదికి దేవుని ఆగ్రహం వస్తుంది.  కాబట్టి, మీరు వాళ్లలా ఉండకండి;  ఒకప్పుడు మీరు చీకట్లో ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రభువు శిష్యులుగా వెలుగులో ఉన్నారు.+ కాబట్టి వెలుగు బిడ్డల్లా నడుచుకోండి,  ఎందుకంటే వెలుగు ఫలంలో అన్నిరకాల మంచితనం, నీతి, సత్యం ఉన్నాయి.+ 10  ప్రభువుకు ఏది ఇష్టమో జాగ్రత్తగా తెలుసుకుంటూ* ఉండండి;+ 11  పనికిరాని చీకటి పనులు మానేయండి;+ బదులుగా వాటిని బట్టబయలు చేయండి. 12  ఎందుకంటే, ప్రజలు రహస్యంగా చేసే పనుల గురించి ప్రస్తావించడం కూడా సిగ్గుచేటు. 13  వెలుగు అన్నిటినీ బట్టబయలు చేస్తుంది, కాబట్టి బట్టబయలు అయ్యేవన్నీ వెలుగే. 14  అందుకే దేవుడు ఇలా అంటున్నాడు: “నిద్రిస్తున్న ఓ మనిషీ, మేలుకో, మృతుల్లో నుండి బ్రతికి రా,+ క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు.”+ 15  కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉంటూ తెలివితక్కువవాళ్లలా కాకుండా తెలివిగలవాళ్లలా నడుచుకోండి, 16  మీ సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించుకోండి,* ఎందుకంటే రోజులు చెడ్డవి. 17  అందుకే మీరు మూర్ఖుల్లా ప్రవర్తించకండి, బదులుగా యెహోవా* ఇష్టం ఏమిటో అర్థంచేసుకుంటూ ఉండండి.+ 18  అంతేకాదు మద్యం* మత్తులో ఉండకండి,+ అది విపరీత* ప్రవర్తనకు దారి తీస్తుంది. బదులుగా పవిత్రశక్తితో నింపబడుతూ ఉండండి. 19  కీర్తనలు, దేవుణ్ణి స్తుతించే పాటలు, ఆరాధనా గీతాలు పాడుతూ*+ ఒకరినొకరు బలపర్చుకోండి, మీ హృదయాల్లో యెహోవాకు* స్తుతిగీతాలు పాడండి,+ 20  ఎల్లప్పుడూ మన తండ్రైన దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరున ప్రతీ విషయంలో కృతజ్ఞతలు చెప్తూ ఉండండి.+ 21  క్రీస్తు మీద ప్రగాఢ గౌరవంతో* ఒకరికొకరు లోబడివుండండి.+ 22  భార్యలు ప్రభువుకు లోబడివున్నట్టే భర్తలకు లోబడివుండాలి.+ 23  ఎందుకంటే, సంఘం అనే శరీరానికి క్రీస్తు శిరస్సుగా,+ రక్షకుడిగా ఉన్నట్టే, భర్త కూడా తన భార్యకు శిరస్సుగా ఉన్నాడు.+ 24  సంఘం క్రీస్తుకు లోబడివున్నట్టే, భార్య కూడా ప్రతీ విషయంలో భర్తకు లోబడివుండాలి. 25  భర్తలారా, క్రీస్తు సంఘాన్ని ప్రేమించి, దానికోసం తన ప్రాణం పెట్టాడు,+ అలాగే మీరు కూడా మీ భార్యల్ని ప్రేమిస్తూ ఉండండి;+ 26  ఆయన, సంఘాన్ని దేవుని వాక్యమనే నీళ్లతో కడిగి పవిత్రపర్చాలని+ అలా చేశాడు; 27  సంఘం మచ్చ గానీ ముడత గానీ ఇంకే లోపం గానీ లేకుండా+ పవిత్రంగా, నిష్కళంకంగా ఉండాలని,+ అలా అది తన కళ్లముందు వైభవంగా కనిపించాలని ఆయన అలా చేశాడు. 28  అలాగే భర్తలు కూడా తమ సొంత శరీరాన్ని ప్రేమించుకున్నట్టు తమ భార్యల్ని ప్రేమించాలి. తన భార్యను ప్రేమించే వ్యక్తి తనను తాను ప్రేమించుకుంటున్నాడు. 29  ఏ మనిషీ తన శరీరాన్ని ద్వేషించుకోడు కానీ దాన్ని పోషించి, సంరక్షించుకుంటాడు. క్రీస్తు కూడా సంఘాన్ని అలాగే చూసుకుంటున్నాడు. 30  ఎందుకంటే మనం ఆయన శరీర అవయవాలం.+ 31  “అందుకే, పురుషుడు తన అమ్మానాన్నల్ని విడిచిపెట్టి, తన భార్యను అంటిపెట్టుకొని ఉంటాడు,* వాళ్లిద్దరూ ఒక్క శరీరంగా ఉంటారు.”+ 32  ఈ పవిత్ర రహస్యం+ గొప్పది. ఇప్పుడు నేను క్రీస్తు గురించి, సంఘం గురించి మాట్లాడుతున్నాను.+ 33  ఏదేమైనా, మీలో ప్రతీ ఒక్కరు తనను తాను ప్రేమించుకున్నట్టు తన భార్యను ప్రేమించాలి;+ భార్య విషయానికొస్తే, ఆమెకు తన భర్త మీద ప్రగాఢ గౌరవం ఉండాలి.+

అధస్సూచీలు

లేదా “మిమ్మల్ని” అయ్యుంటుంది.
లేదా “మీ” అయ్యుంటుంది.
గ్రీకులో పోర్నియా. పదకోశం చూడండి.
పదకోశంలో “లైంగిక పాపం” చూడండి.
లేదా “నిర్ధారించుకుంటూ.”
అక్ష., “నియమిత సమయాన్ని కొనుక్కోండి.”
అనుబంధం A5 చూడండి.
లేదా “అమర్యాదకరమైన.”
అక్ష., “ద్రాక్షారసం.”
లేదా “మీకోసం పాడుకుంటూ” అయ్యుంటుంది.
అనుబంధం A5 చూడండి.
అక్ష., “భయంతో.”
లేదా “భార్యతోనే ఉండిపోతాడు.”