ఎస్తేరు 3:1-15

  • రాజు హామానును హెచ్చించాడు (1-4)

  • యూదుల్ని నాశనం చేయడానికి హామాను కుట్ర (5-15)

3  ఈ సంగతులు జరిగిన తర్వాత అహష్వేరోషు రాజు అగాగీయుడైన+ హమ్మెదాతా కుమారుడు హామానుకు+ పదోన్నతిని ఇచ్చి, తన దగ్గరున్న మిగతా అధిపతులందరి కన్నా అతన్ని ఉన్నత స్థానంలో పెట్టాడు.+  రాజగృహ ద్వారం దగ్గరున్న రాజ సేవకులందరూ హామాను ముందు వంగి, సాష్టాంగ నమస్కారం చేసేవాళ్లు. ఎందుకంటే అతని ముందు అలా చేయాలని రాజు ఆజ్ఞ జారీచేశాడు. అయితే మొర్దెకై అతనికి వంగి నమస్కరించడానికి, సాష్టాంగపడడానికి నిరాకరించాడు.  దాంతో రాజగృహ ద్వారం దగ్గరున్న రాజ సేవకులు మొర్దెకైని, “నువ్వు రాజాజ్ఞను ఎందుకు పట్టించుకోవట్లేదు?” అని అడిగారు.  ప్రతీరోజు వాళ్లు అతన్ని అలా అడుగుతూ ఉండేవాళ్లు, కానీ అతను వాళ్ల మాటలు పట్టించుకునేవాడు కాదు. అప్పుడు వాళ్లు మొర్దెకై ప్రవర్తనకు శిక్ష పడుతుందో లేదో చూద్దామని దాని గురించి హామానుకు చెప్పారు;+ ఎందుకంటే తాను ఒక యూదుణ్ణని+ మొర్దెకై వాళ్లకు చెప్పాడు.  మొర్దెకై తనకు వంగి, సాష్టాంగ నమస్కారం చేయడానికి నిరాకరించడం హామాను చూసినప్పుడు, హామానుకు చాలా కోపం వచ్చింది.+  అయితే మొర్దెకై ఒక్కడినే చంపడం అతని దృష్టికి చాలా చిన్నదిగా కనిపించింది. ఎందుకంటే మొర్దెకై ప్రజల గురించి కూడా వాళ్లు అతనికి చెప్పారు. కాబట్టి అహష్వేరోషు సామ్రాజ్యమంతటా ఉన్న మొర్దెకై ప్రజలైన యూదులందర్నీ సమూలంగా నాశనం చేయడానికి హామాను ప్రయత్నాలు మొదలుపెట్టాడు.  కాబట్టి ఏ నెలలో, ఏ రోజున అలా నాశనం చేయాలో నిర్ణయించడానికి, అహష్వేరోషు రాజు పరిపాలనలోని 12వ సంవత్సరం+ మొదటి నెలలో, అంటే నీసాను* నెలలో హామాను ఎదుట వాళ్లు పూరు (అంటే, చీటి) వేశారు.+ చీటి* 12వ నెల మీద, అంటే అదారు* నెల మీద పడింది.+  తర్వాత హామాను అహష్వేరోషు రాజుతో ఇలా అన్నాడు: “ఒక జనం మీ సామ్రాజ్యంలోని సంస్థానాలన్నిట్లో+ ఉన్న జనాల మధ్య చెదిరిపోయి ఉంది.+ వాళ్ల చట్టాలు మిగతా జనాలకన్నా భిన్నమైనవి; వాళ్లు రాజు చట్టాలకు లోబడరు, వాళ్లను అలా వదిలేయడం రాజుకు మంచిదికాదు.  ఒకవేళ రాజుకు ఇష్టమైతే, వాళ్లు నాశనం చేయబడాలని ఒక శాసనాన్ని రాయించాలి. రాజు ఖజానాలో ఉంచడానికి నేను అధికారులకు 10,000 వెండి తలాంతులు* ఇస్తాను.”* 10  దాంతో రాజు తన చేతికున్న ముద్ర-ఉంగరం తీసి,+ అగాగీయుడైన+ హమ్మెదాతా కుమారుడు హామానుకు ఇచ్చాడు;+ ఈ హామాను యూదుల శత్రువు. 11  రాజు హామానుతో, “వెండిని, ఆ ప్రజల్ని నీ చేతికి అప్పగిస్తున్నాను, వాళ్లకు ఏమి చేస్తే బావుంటుందని నీకనిపిస్తే అది చేయి” అన్నాడు. 12  మొదటి నెల 13వ తేదీన రాజు దగ్గర పనిచేసే కార్యదర్శుల్ని పిలిపించారు.+ వాళ్లు హామాను ఆజ్ఞలన్నిటినీ రాసి+ రాజు కింద ఉండే ప్రాంత పాలకులకు,* సంస్థానాల్ని చూసుకునే అధిపతులకు, ఆయా జనాల అధిపతులకు పంపించారు. ప్రతీ సంస్థానానికి దాని సొంత లిపిలో, ప్రతీ జనానికి వాళ్ల మాతృభాషలో రాసి పంపించారు. వాటిని అహష్వేరోషు రాజు పేరున రాసి, రాజు ముద్ర-ఉంగరంతో వాటికి ముద్రవేశారు.+ 13  వార్తాహరుల ద్వారా ఆ ఉత్తరాల్ని రాజు పరిపాలనలోని సంస్థానాలన్నిటికీ పంపించారు. అదారు అనే 12వ నెల, 13వ తేదీన ఒకేరోజున యూదులందర్నీ, అంటే వాళ్లలో యువకుల్ని, ముసలివాళ్లను, పిల్లల్ని, స్త్రీలను చంపేయాలని, వాళ్లను సమూలంగా నాశనం చేయాలని,+ వాళ్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలని ఆ ఉత్తరాల ద్వారా ఆజ్ఞాపించారు.+ 14  అంతేకాదు, ప్రజలందరూ ఆ రోజు కోసం సిద్ధంగా ఉండేలా ప్రతీ సంస్థానంలో ఆ తాకీదు ప్రతిని ఒకదాన్ని చట్టంగా జారీ చేసి, చాటింపు వేయాలి. 15  రాజు ఆజ్ఞాపించిన దాని ప్రకారం వార్తాహరులు హుటాహుటిన బయల్దేరారు,+ ఆ చట్టం షూషను*+ కోటలో* జారీ అయ్యింది; రాజు, హామాను ద్రాక్షారసం తాగడానికి కూర్చున్నారు, కానీ షూషను* నగరమంతటా గందరగోళం నెలకొంది.

అధస్సూచీలు

అనుబంధం B15 చూడండి.
పదకోశం చూడండి.
అనుబంధం B15 చూడండి.
అప్పట్లో ఒక తలాంతు 34.2 కిలోలతో సమానం. అనుబంధం B14 చూడండి.
లేదా “ఈ పని చేసేవాళ్ల కోసం నేను రాజు ఖజానాకు 10,000 వెండి తలాంతులు ఇస్తాను” అయ్యుంటుంది.
పదకోశం చూడండి.
లేదా “సూస.”
లేదా “రాజభవనంలో; దుర్గంలో.”
లేదా “సూస.”