ఎస్తేరు 8:1-17

  • మొర్దెకైకి పదోన్నతి (1, 2)

  • ఎస్తేరు రాజును వేడుకోవడం (3-6)

  • రాజు ఇంకో ఆజ్ఞ (7-14)

  • యూదులకు ఉపశమనం, ఆనందం (15-17)

8  ఆ రోజు, అహష్వేరోషు రాజు యూదుల శత్రువైన హామాను+ ఇంటిని+ ఎస్తేరు రాణికి ఇచ్చేశాడు; అలాగే మొర్దెకై రాజు ముందుకు వచ్చాడు, ఎందుకంటే మొర్దెకై తనకు ఏమౌతాడో+ ఎస్తేరు చెప్పింది.  అప్పుడు రాజు హామాను నుండి తీసేసుకున్న తన ముద్ర-ఉంగరం తీసి+ మొర్దెకైకి ఇచ్చాడు. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటిమీద అధికారిగా నియమించింది.+  అంతేకాదు, ఎస్తేరు మళ్లీ రాజుతో మాట్లాడింది. ఆమె అతని పాదాల మీద పడి ఏడుస్తూ అగాగీయుడైన హామాను యూదులకు హాని చేయడానికి పన్నిన కుట్రను అడ్డుకోమని ప్రాధేయపడింది.+  రాజు ఎస్తేరు వైపు బంగారు దండాన్ని చాపాడు,+ అప్పుడు ఎస్తేరు లేచి రాజు ముందు నిలబడి  ఇలా అంది: “రాజుకు నచ్చితే, రాజు అనుగ్రహం నా మీద ఉంటే, రాజుకు సరైనదనిపిస్తే, రాజుకు నా మీద ఇష్టం ఉంటే, రాజు సంస్థానాలన్నిట్లో ఉన్న యూదుల్ని నాశనం చేయడానికి అగాగీయుడైన+ హమ్మెదాతా కుమారుడు హామాను కుట్రపన్ని రాయించిన తాకీదుల్ని రద్దు చేసేలా ఒక శాసనాన్ని రాయించాలి.+  నా ప్రజల మీదికి విపత్తు రావడం చూసి నేనెలా తట్టుకోగలను? నా బంధువులు నశించిపోవడం చూసి నేనెలా తట్టుకోగలను?”  అప్పుడు అహష్వేరోషు రాజు ఎస్తేరు రాణితో, యూదుడైన మొర్దెకైతో ఇలా అన్నాడు: “ఇదిగో! హామాను యూదుల మీద దాడి చేయడానికి కుట్ర పన్నినందుకు నేను అతని ఇంటిని ఎస్తేరుకు ఇచ్చాను,+ అతన్ని కొయ్యకు వేలాడదీయించాను.+  ఇప్పుడు మీరు యూదులకు మంచి జరిగేలా ఏమి రాస్తే బాగుంటుందో అది రాజు పేరున రాసి, రాజు ముద్ర-ఉంగరంతో దానికి ముద్ర వేయండి. ఎందుకంటే రాజు పేరున రాసి, రాజు ముద్ర-ఉంగరంతో ముద్ర వేసిన శాసనాన్ని రద్దు చేయడం సాధ్యం కాదు.”+  కాబట్టి సీవాను* అనే మూడో నెల, 23వ రోజున రాజు కార్యదర్శుల్ని పిలిపించారు. మొర్దెకై యూదులకు, ప్రాంత పాలకులకు,*+ అధిపతులకు, భారతదేశం నుండి ఇతియోపియా వరకున్న 127 సంస్థానాల్లోని సంస్థానాధిపతులకు+ ఆజ్ఞాపించినదంతా వాళ్లు రాశారు; వాళ్లు ప్రతీ సంస్థానానికి దాని సొంత లిపిలో, ప్రతీ జనానికి వాళ్ల మాతృభాషలో, యూదులకు వాళ్ల సొంత లిపిలో, భాషలో రాశారు. 10  అతను ఆ తాకీదుల్ని అహష్వేరోషు రాజు పేరున రాయించి, రాజు ముద్ర-ఉంగరంతో ముద్ర వేసి,+ వాటిని వార్తాహరులకు ఇచ్చాడు; వాళ్లు ఉత్తరాలు చేరవేయడానికి వాడే, వేగంగా పరుగెత్తే రాచగుర్రాల మీద వెళ్లారు. 11  ఆయా నగరాలన్నిట్లో ఉన్న యూదులు సమకూడి తమ ప్రాణాల్ని కాపాడుకునేందుకు, తమ మీద దాడిచేసే అవకాశం ఉన్న ఎలాంటి బలగాలనైనా చంపి, సమూలంగా నాశనం చేసి, వాళ్ల ఆస్తుల్ని కొల్లగొట్టేందుకు రాజు ఇచ్చిన అనుమతి ఆ తాకీదుల్లో ఉంది. ఆ బలగాలు ఏ జనానికి చెందినవైనా, ఏ సంస్థానానికి చెందినవైనా, స్త్రీలైనా, పిల్లలైనా యూదులు వాళ్లను నాశనం చేయవచ్చు.+ 12  అహష్వేరోషు రాజు పరిపాలనలోని సంస్థానాలన్నిట్లో ఒకేరోజున, అంటే అదారు* అనే 12వ నెల, 13వ తేదీన ఇదంతా జరగాలి.+ 13  సంస్థానాలన్నిట్లో ఆ తాకీదు ప్రతిని* ఒక చట్టంగా జారీ చేయాలి. ఆ రోజు యూదులు తమ శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి+ సిద్ధంగా ఉండేలా దాన్ని అన్ని జనాలకు చాటింపు వేయించాలి. 14  ఉత్తరాలు చేరవేయడానికి ఉపయోగించే రాచగుర్రాల మీద వెళ్లే వార్తాహరులు రాజాజ్ఞ మేరకు త్వరత్వరగా, వేగంగా వెళ్లారు. షూషను*+ కోటలో* కూడా ఆ చట్టం జారీ అయింది. 15  అప్పుడు మొర్దెకై రాజు సన్నిధి నుండి వెళ్లిపోయాడు. ఆ సమయంలో అతను నీలం, తెలుపు రంగులుగల రాజవస్త్రాన్ని, మహిమాన్విత బంగారు కిరీటాన్ని, ఊదారంగు ఉన్నితో చేసిన శ్రేష్ఠమైన పైవస్త్రాన్ని ధరించి ఉన్నాడు.+ షూషను* నగరం ఆనందంతో కేకలు వేసింది. 16  యూదులకు ఉపశమనం దొరికింది, వాళ్లు ఆనందించారు, ఉల్లసించారు, ప్రజల గౌరవం పొందారు. 17  రాజు శాసనం, చట్టం చేరుకున్న సంస్థానాలన్నిట్లో, నగరాలన్నిట్లో యూదులు విందులు-వేడుకలు జరుపుకుంటూ ఆనందిస్తూ, ఉల్లసిస్తూ ఉన్నారు. దేశంలోని చాలా జనాల ప్రజలు యూదులుగా మారారు,+ ఎందుకంటే వాళ్లందరికీ యూదులంటే చాలా భయం పట్టుకుంది.

అధస్సూచీలు

పదకోశం చూడండి.
అనుబంధం B15 చూడండి.
అనుబంధం B15 చూడండి.
లేదా “తాకీదులోని మాటల్ని.”
లేదా “సూస.”
లేదా “రాజభవనంలో; దుర్గంలో.”
లేదా “సూస.”