ఎస్తేరు 9:1-32

  • యూదుల విజయం (1-19)

  • పూరీము పండుగను స్థాపించడం (20-32)

9  అదారు* అనే 12వ నెల, 13వ రోజున+ అంటే రాజాజ్ఞను, శాసనాన్ని అమలుచేసే రోజున,+ యూదుల శత్రువులు యూదుల మీద పైచేయి సాధించాలని అనుకున్నారు కానీ పరిస్థితి తారుమారైంది. ఆ రోజు యూదులు తమను ద్వేషించిన వాళ్లను ఓడించారు.+  అహష్వేరోషు రాజు సంస్థానాలన్నిట్లో+ ఉన్న యూదులు తమకు హాని చేయాలని చూస్తున్న వాళ్లమీద దాడిచేయడానికి తమతమ నగరాల్లో సమకూడారు. ఒక్కరు కూడా వాళ్లకు ఎదురు నిలవలేకపోయారు. ఎందుకంటే, జనాలన్నిటికీ యూదులంటే చాలా భయం పట్టుకుంది.+  సంస్థానాధిపతులు, ప్రాంత పాలకులు,*+ అధిపతులు, రాజుకు సంబంధించిన పనుల్ని చూసుకునేవాళ్లు అందరూ యూదులకు మద్దతిచ్చారు. ఎందుకంటే వాళ్లు మొర్దెకైకి భయపడ్డారు.  రాజగృహంలో* మొర్దెకై చాలా పెద్ద అధికారి అయ్యాడు.+ సంస్థానాలన్నిట్లో అతని కీర్తి వ్యాపిస్తూ ఉంది, ఎందుకంటే మొర్దెకై అధికారం అంతకంతకూ పెరుగుతూ ఉంది.  యూదులు తమ శత్రువులందర్నీ కత్తితో చంపి, సమూలంగా నాశనం చేశారు; వాళ్లు తమను ద్వేషించిన వాళ్లందరికీ తమకు నచ్చినట్టు చేశారు.+  షూషను*+ కోటలో* యూదులు 500 మంది పురుషుల్ని చంపి, నాశనం చేశారు.  అలాగే యూదులు వీళ్లను కూడా చంపారు: పర్షందాతా, దల్పోను, అస్పాతా,  పోరాతా, అదల్యా, అరీదాతా,  పర్మష్తా, అరీసై, అరీదై, వైజాతా. 10  ఈ పదిమంది హమ్మెదాతా కుమారుడూ యూదుల శత్రువూ అయిన హామాను+ కుమారులు. యూదులు వాళ్లను చంపారు కానీ వాళ్ల ఆస్తుల్ని దోచుకోలేదు.+ 11  ఆ రోజు షూషను* కోటలో* చంపబడినవాళ్ల సంఖ్యను రాజుకు తెలియజేశారు. 12  రాజు ఎస్తేరు రాణితో ఇలా అన్నాడు: “షూషను* కోటలో* యూదులు 500 మంది పురుషుల్ని, హామాను పదిమంది కుమారుల్ని చంపేశారు. మరి రాజు మిగతా సంస్థానాల సంగతేంటి, అక్కడ వాళ్లేం చేశారు?+ ఎస్తేరు రాణీ, ఇప్పుడు నీ విన్నపం ఏంటి? అలా జరిగేలా చేస్తాను. నీ మనవి ఇంకేమైనా ఉందా? నువ్వు కోరినట్టే చేస్తాను.” 13  అప్పుడు ఎస్తేరు ఇలా అంది: “రాజుకు ఇష్టమైతే,+ షూషనులో* ఉన్న యూదులు రేపు కూడా ఇవాళ్టి చట్టం ప్రకారమే చేసేలా అనుమతి ఇవ్వాలి;+ హామాను పదిమంది కుమారుల్ని కొయ్యకు వేలాడదీయించాలి.”+ 14  దాంతో రాజు అలా జరిగేలా ఆదేశాలు ఇచ్చాడు. షూషనులో* ఒక చట్టం జారీ అయింది, హామాను పదిమంది కుమారుల్ని కొయ్యకు వేలాడదీశారు. 15  షూషనులో* ఉన్న యూదులు అదారు నెల 14వ తేదీన+ కూడా సమకూడి, షూషనులో* 300 మంది పురుషుల్ని చంపారు, కానీ వాళ్ల ఆస్తుల్ని దోచుకోలేదు. 16  రాజు మిగతా సంస్థానాల్లోని యూదులు కూడా సమకూడి తమ ప్రాణాల్ని కాపాడుకున్నారు.+ వాళ్లు తమ శత్రువుల్ని మట్టుబెట్టారు,+ తమను ద్వేషించిన వాళ్లలో 75,000 మందిని చంపేశారు; కానీ వాళ్ల ఆస్తుల్ని దోచుకోలేదు. 17  అదంతా అదారు నెల 13వ తేదీన జరిగింది, 14వ తేదీన వాళ్లు విశ్రాంతి తీసుకున్నారు; ఆ రోజు వాళ్లు విందులు చేసుకుంటూ, సంతోషంగా గడిపారు. 18  షూషనులోని* యూదులు 13వ తేదీన,+ 14వ తేదీన+ సమకూడి, 15వ తేదీన విశ్రాంతి తీసుకున్నారు; ఆ రోజు వాళ్లు విందులు చేసుకుంటూ, సంతోషంగా గడిపారు. 19  అయితే, మిగతా పట్టణాల్లో నివసిస్తున్న యూదులు అదారు నెల 14వ తేదీన విందులు ఆరగిస్తూ, సంతోషిస్తూ, వేడుకలు చేసుకున్నారు,+ ఒకరికొకరు ఆహారం పంపుకున్నారు.+ 20  మొర్దెకై+ ఈ సంఘటనల్ని నమోదు చేసి, అహష్వేరోషు రాజు సంస్థానాలన్నిట్లో ఉన్న యూదులందరికీ అంటే దగ్గర్లో ఉన్నవాళ్లకు, దూరంలో ఉన్నవాళ్లకు అధికారిక ఉత్తరాలు పంపాడు. 21  ప్రతీ సంవత్సరం అదారు నెల 14వ తేదీని, అలాగే 15వ తేదీని పండుగలా ఆచరించాలని ఆదేశించాడు. 22  ఎందుకంటే, ఆ తేదీల్లో యూదులు తమ శత్రువుల నుండి విశ్రాంతి పొందారు; ఆ నెల, వాళ్ల దుఃఖం సంతోషంగా, వాళ్ల వేదనంతా+ వేడుక రోజుగా మారింది. వాళ్లు ఆ రోజుల్లో విందులు ఆరగిస్తూ, సంతోషిస్తూ, ఒకరికొకరు ఆహారం పంపుకుంటూ, పేదవాళ్లకు కానుకలిస్తూ పండుగలా జరుపుకోవాలి. 23  యూదులు తాము ప్రారంభించిన వేడుకను కొనసాగించడానికి, ఉత్తరంలో మొర్దెకై తమకు ఆదేశించినట్టు చేయడానికి అంగీకరించారు. 24  ఎందుకంటే, అగాగీయుడైన+ హమ్మెదాతా కుమారుడూ యూదుల శత్రువూ అయిన హామాను+ యూదుల్ని నాశనం చేయాలని వాళ్లమీద కుట్రపన్నాడు;+ అతను యూదుల్ని భయాందోళనలకు గురిచేయడానికి, వాళ్లను నాశనం చేయడానికి పూరు వేశాడు.+ పూరు అంటే చీటి. 25  అయితే ఎస్తేరు తన ముందుకు వచ్చినప్పుడు రాజు, “యూదుల మీద అతను పన్నిన కుట్ర+ అతని తలమీదికే రావాలి” అని ఉత్తరాల ద్వారా ఆదేశాలిచ్చాడు;+ వాళ్లు అతన్ని, అతని కుమారుల్ని కొయ్యకు వేలాడదీశారు.+ 26  అందుకే పూరు* అనే పేరును బట్టి+ వాళ్లు ఆ రోజుల్ని పూరీము అని పిలిచారు. ఆ ఉత్తరంలో రాసిన వాటన్నిటిని బట్టి, ఆ విషయానికి సంబంధించి వాళ్లు చూసినదాన్ని బట్టి, వాళ్ల మీదికి వచ్చినదాన్ని బట్టి 27  యూదులు తాము, తమ తర్వాతి తరాలవాళ్లు, తమతో కలిసే వాళ్లందరు+ ఈ రెండు రోజుల్ని తప్పకుండా వేడుకగా జరుపుకుంటామని, ఉత్తరంలో చెప్పినట్టే ప్రతీ సంవత్సరం ఆ సమయంలో ఆ రెండు రోజుల్ని ఆచరిస్తామని తీర్మానించుకున్నారు. 28  తరతరాలపాటు ప్రతీ కుటుంబం, ప్రతీ సంస్థానం, ప్రతీ నగరం ఈ రెండు రోజుల్ని గుర్తు చేసుకోవాలి, ఆచరించాలి; యూదులు ఈ పూరీము రోజుల్ని ఆచరించడం మానకూడదు, వాళ్ల తర్వాతి తరాలవాళ్లు వాటిని గుర్తు చేసుకోవడం మర్చిపోకూడదు. 29  తర్వాత అబీహాయిలు కూతురైన ఎస్తేరు రాణి, యూదుడైన మొర్దెకై పూరీము ఆచరణను ఖరారు చేస్తూ పూర్తి అధికారంతో రెండో ఉత్తరం రాశారు. 30  అతను అహష్వేరోషు రాజు సామ్రాజ్యంలోని 127 సంస్థానాల్లో+ ఉన్న యూదులందరికీ స్నేహపూర్వకమైన, నమ్మదగిన మాటలతో అధికారిక ఉత్తరాలు పంపాడు.+ 31  యూదుడైన మొర్దెకై, అలాగే ఎస్తేరు రాణి ఆదేశించినట్టే,+ తామూ తమ తర్వాతి తరాలవాళ్లూ పాటించాలని తీర్మానించుకున్నట్టే+ ఉపవాసం ఉంటూ,+ ప్రార్థనలు చేస్తూ+ పూరీము రోజుల్ని వాటి తేదీల్లో ఆచరించాలనే విషయాన్ని ఆ ఉత్తరాల ద్వారా ఖరారు చేశాడు. 32  ఎస్తేరు ఇచ్చిన ఆజ్ఞ పూరీము+ గురించిన ఈ విషయాల్ని ఖరారు చేసింది, ఇదంతా ఒక గ్రంథంలో రాయబడింది.

అధస్సూచీలు

అనుబంధం B15 చూడండి.
పదకోశం చూడండి.
లేదా “రాజభవనంలో.”
లేదా “సూస.”
లేదా “రాజభవనంలో; దుర్గంలో.”
లేదా “సూస.”
లేదా “రాజభవనంలో; దుర్గంలో.”
లేదా “సూస.”
లేదా “రాజభవనంలో; దుర్గంలో.”
లేదా “సూసలో.”
లేదా “సూసలో.”
లేదా “సూసలో.”
లేదా “సూసలో.”
లేదా “సూసలోని.”
“పూరు,” అంటే “చీటి” అని అర్థం. “పూరీము” అనే బహువచన రూపం, యూదులు తమ పవిత్ర క్యాలెండరులోని 12వ నెలలో జరుపుకునే పండుగను సూచిస్తుంది. అనుబంధం B15 చూడండి.