కీర్తనలు 103:1-22
దావీదు కీర్తన.
103 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు;నాలో ఉన్న సమస్తమా, ఆయన పవిత్రమైన పేరును స్తుతించు.
2 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు;ఆయన చేసిన వాటన్నిటినీ ఎప్పటికీ మర్చిపోకు.+
3 ఆయన నా తప్పులన్నిటినీ క్షమిస్తాడు,+నా రోగాలన్నిటినీ బాగుచేస్తాడు;+
4 గోతిలో* నుండి ఆయన నా ప్రాణాన్ని కాపాడతాడు,+విశ్వసనీయ ప్రేమను, కరుణను నాకు కిరీటంలా పెడతాడు.
5 నేను గద్దలా నవ యవ్వనంగా ఉండేలా+నా జీవితమంతా మంచివాటితో నన్ను తృప్తిపరుస్తాడు.+
6 బాధించబడుతున్న వాళ్లందరి కోసం+యెహోవా నీతిన్యాయాలతో చర్య తీసుకుంటాడు.+
7 ఆయన మోషేకు తన మార్గాల్ని,+ఇశ్రాయేలీయులకు తన కార్యాల్ని తెలియజేశాడు.
8 యెహోవా కరుణ, కనికరం* గల దేవుడు,+ఆయన ఓర్పును,* అపారమైన విశ్వసనీయ ప్రేమను* చూపిస్తాడు.+
9 ఆయన ఎప్పుడూ తప్పులు వెతుకుతూ ఉండడు,+ఎల్లకాలం కోపం పెట్టుకోడు.+
10 ఆయన మన పాపాలకు తగ్గట్టు మనతో వ్యవహరించలేదు,+మన తప్పులకు తగినట్టు మనల్ని శిక్షించలేదు.+
11 ఆకాశం భూమి కన్నా ఎంత ఎత్తుగా ఉందో,తనకు భయపడేవాళ్ల పట్ల ఆయన విశ్వసనీయ ప్రేమ అంత గొప్పది.+
12 పడమటికి తూర్పు* ఎంత దూరంలో ఉంటుందో,ఆయన మన అపరాధాల్ని మనకు అంత దూరంలో ఉంచాడు.+
13 తండ్రి తన కుమారుల మీద కరుణ చూపించినట్టు,యెహోవా తనకు భయపడేవాళ్ల మీద కరుణ చూపించాడు.+
14 ఎందుకంటే, మనం ఎలా తయారుచేయబడ్డామో ఆయనకు బాగా తెలుసు,+మనం మట్టివాళ్లమని+ ఆయన గుర్తుచేసుకుంటాడు.
15 మనిషి ఆయుష్షు గడ్డి ఆయుష్షు లాంటిదే;+గడ్డిపువ్వు వికసించినట్టు అతను వికసిస్తాడు.+
16 కానీ గాలి వీచగానే అది లేకుండా పోతుంది,అది అసలు ఎప్పుడూ అక్కడ లేనట్టే ఉంటుంది.*
17 కానీ యెహోవాకు భయపడేవాళ్ల పట్లఆయన విశ్వసనీయ ప్రేమ శాశ్వతకాలం* ఉంటుంది,+ఆయన నీతి వాళ్ల పిల్లల పిల్లల కాలం వరకు ఉంటుంది.
18 ఆయన ఒప్పందానికి కట్టుబడి ఉండేవాళ్ల విషయంలో,+ఆయన ఆదేశాల్ని జాగ్రత్తగా పాటించేవాళ్ల విషయంలో అలా జరుగుతుంది.
19 పరలోకంలో యెహోవా తన సింహాసనాన్ని బలంగా స్థాపించాడు;+ఆయన రాజరికం అన్నిటిమీద ఉంది.+
20 ఆయన స్వరానికి లోబడుతూ, ఆయన మాటను నెరవేర్చే*+శక్తిమంతులైన దూతలారా,+ మీరంతా యెహోవాను స్తుతించండి.
21 ఆయన సర్వ సైన్యాల్లారా,+ఆయన ఇష్టాన్ని నెరవేర్చే ఆయన పరిచారకులారా,+ యెహోవాను స్తుతించండి.
22 ఆయన పరిపాలించే స్థలాలన్నిటిలో ఉన్నఆయన సమస్త కార్యాల్లారా, యెహోవాను స్తుతించండి.
నా ప్రాణమా, యెహోవాను స్తుతించు.
అధస్సూచీలు
^ లేదా “సమాధిలో.”
^ లేదా “దయ.”
^ లేదా “కోప్పడే విషయంలో నిదానిస్తాడు.”
^ లేదా “ప్రేమపూర్వక దయను.”
^ లేదా “సూర్యాస్తమయానికి సూర్యోదయం.”
^ అక్ష., “దాని చోటుకు ఇక అది తెలీదు.”
^ లేదా “శాశ్వతకాలం నుండి శాశ్వతకాలం వరకు.”
^ లేదా “ఆయన మాట స్వరం (శబ్దం) వింటున్న.”