కీర్తనలు 104:1-35

  • సృష్టిలోని అద్భుతాల్ని బట్టి దేవుణ్ణి స్తుతించడం

    • భూమి ఎప్పటికీ ఉంటుంది (5)

    • మనిషి కోసం ద్రాక్షారసం, ఆహారం (15)

    • “నీ పనులు అసంఖ్యాకం!” (24)

    • ‘ఊపిరి తీసేసినప్పుడు అవి చనిపోతాయి’ (29)

104  నా ప్రాణమా, యెహోవాను స్తుతించు.+ యెహోవా, నా దేవా, నువ్వు ఎంతో గొప్పవాడివి.+ నువ్వు ఘనతను, వైభవాన్ని ధరించావు.+   వెలుగును వస్త్రంలా చుట్టుకున్నావు;+డేరా తెరను పరచినట్టు నువ్వు ఆకాశాన్ని పరుస్తావు.+   పైనున్న జలాల్లో* ఆయన తన ఇంటి పైగదుల దూలాలు వేస్తాడు,+మేఘాల్ని తన రథంగా చేసుకొని+గాలి రెక్కల మీద ప్రయాణిస్తాడు.+   ఆయన తన దూతల్ని వాయువులుగా,*తన పరిచారకుల్ని దహించే అగ్నిగా చేస్తాడు.+   ఆయన భూమిని దాని పునాదుల మీద స్థిరపర్చాడు;+అది దాని చోటు నుండి ఎప్పటికీ కదిలించబడదు.*+   నువ్వు అగాధ జలాల్ని దానికి వస్త్రంలా కప్పావు.+ నీళ్లు పర్వతాల పైన నిలిచాయి.   నువ్వు గద్దించినప్పుడు అవి పారిపోయాయి;+నీ ఉరుము శబ్దానికి అవి కంగారుకంగారుగా పారిపోయాయి.   పర్వతాలు ఎత్తు అయ్యాయి,+ లోయలు కిందికి దిగాయి,నువ్వు వాటికోసం నిర్ణయించిన చోటుకు అవి వెళ్లాయి.   అవి మళ్లీ ఎప్పుడూ భూమిని ముంచేయకుండా,అవి దాటకూడని ఒక హద్దును వాటికి నియమించావు.+ 10  ఆయన లోయల్లోకి* ఊటల్ని పంపిస్తాడు;అవి పర్వతాల మధ్య ప్రవహిస్తాయి. 11  అడవి జంతువులన్నిటికీ అక్కడ నీళ్లు దొరుకుతాయి;అడవి గాడిదలు తమ దాహం తీర్చుకుంటాయి. 12  వాటికి పైన ఆకాశపక్షులు నివసిస్తాయి;గుబురుగా ఉన్న కొమ్మల్లో నుండి అవి పాటలు పాడతాయి. 13  ఆయన తన పైగదుల్లో నుండి పర్వతాలకు నీళ్లు పెడుతున్నాడు.+ నువ్వు చేసినవాటి వల్ల భూమి తృప్తి పొందుతుంది.+ 14  ఆయన పశువుల కోసం గడ్డిని,మనుషుల కోసం మొక్కల్ని మొలిపిస్తున్నాడు;+అలా ఆయన నేల నుండి ఆహారం, 15  మనిషి హృదయాన్ని సంతోషపెట్టే ద్రాక్షారసం,+వాళ్ల ముఖాలకు మెరుపునిచ్చే తైలం,మనిషి హృదయాన్ని బలపర్చే ఆహారం వచ్చేలా చేస్తున్నాడు.+ 16  యెహోవా చెట్లు, ఆయన నాటిన లెబానోను దేవదారు చెట్లుతృప్తి పొందుతున్నాయి. 17  అక్కడ పక్షులు తమ గూళ్లు కట్టుకుంటాయి. సంకుబుడి కొంగ+ సరళవృక్షాల్లో* నివసిస్తుంది. 18  కొండమేకలు ఎత్తైన పర్వతాల్లో నివసిస్తాయి;+పొట్టి కుందేళ్లు* బండ సందుల్లో ఆశ్రయం పొందుతాయి.+ 19  ఆయా సమయాల్ని సూచించడానికి ఆయన చంద్రుణ్ణి చేశాడు;సూర్యుడికి తాను ఎప్పుడు అస్తమించాలో తెలుసు.+ 20  నువ్వు చీకటి రప్పించినప్పుడు రాత్రి అవుతుంది,+అప్పుడు అడవి జంతువులు అంతటా సంచరిస్తాయి. 21  కొదమ సింహాలు తమ ఆహారం కోసం గర్జిస్తాయి,+దేవుడిచ్చే ఆహారం కోసం అవి వెతుకుతాయి.+ 22  సూర్యుడు ఉదయించినప్పుడు,అవి తిరిగెళ్లి తమ గుహల్లో పడుకుంటాయి. 23  అప్పుడు మనుషులు తమ పనులకు వెళ్తారు,సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తారు. 24  యెహోవా, నీ పనులు అసంఖ్యాకం!+ తెలివితో నువ్వు వాటన్నిటినీ చేశావు.+ నువ్వు చేసినవాటితో భూమి నిండిపోయింది. 25  అదిగో, ఎంతో పెద్దగా, విశాలంగా ఉన్న సముద్రం!అందులో లెక్కలేనన్ని చిన్నా పెద్దా ప్రాణులు తిరుగుతున్నాయి.+ 26  దాని మీద ఓడలు ప్రయాణం చేస్తాయి,సముద్రంలో ఆడుకోవడానికి నువ్వు చేసిన లివ్యాతన్‌*+ అందులో తిరుగుతుంది. 27  నువ్వు సమయానికి ఆహారం ఇస్తావనిఅవన్నీ నీ కోసం వేచి చూస్తున్నాయి.+ 28  నువ్వు ఇచ్చినదాన్ని అవి తింటాయి.+ నువ్వు నీ గుప్పిలి విప్పినప్పుడు, అవి మంచివాటితో తృప్తి పొందుతాయి.+ 29  నువ్వు నీ ముఖాన్ని దాచుకున్నప్పుడు, అవి కలత చెందుతాయి. నువ్వు వాటి ఊపిరి* తీసేసినప్పుడు, అవి చనిపోయి తిరిగి మట్టికి చేరతాయి.+ 30  నువ్వు నీ ఊపిరిని* పంపినప్పుడు అవి పుడతాయి,+అలా నువ్వు భూమిని కొత్తదనంతో నింపుతున్నావు. 31  యెహోవా మహిమ ఎప్పటికీ నిలిచివుంటుంది. యెహోవా తన పనుల్ని బట్టి సంతోషిస్తాడు.+ 32  ఆయన భూమి వైపు చూస్తే అది వణుకుతుంది;ఆయన పర్వతాల్ని ముట్టుకుంటే అవి పొగలు గక్కుతాయి.+ 33  నా జీవితమంతా నేను యెహోవాకు పాటలు పాడతాను;+నేను బ్రతికున్నంతకాలం నా దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడతాను.*+ 34  నా ఆలోచనలు ఆయనకు నచ్చేలా ఉండాలి.* నేను యెహోవాను బట్టి సంతోషిస్తాను. 35  పాపులు భూమ్మీద నుండి కనుమరుగౌతారు,దుష్టులు ఇక మీదట ఉండరు.+ నా ప్రాణమా, యెహోవాను స్తుతించు. యెహోవాను* స్తుతించండి!*

అధస్సూచీలు

అక్ష., “ఆ జలాల్లో.”
లేదా “పరలోక ప్రాణులుగా.” పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
లేదా “ఊగిసలాడదు.”
లేదా “వాగుల్లోకి.”
అంటే, జూనిపర్‌ చెట్లు.
అంటే, రాక్‌ బ్యాడ్జర్‌లు.
పదకోశం చూడండి.
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
లేదా “సంగీతం వాయిస్తాను.”
లేదా “ఆయన గురించి నేను చేసే ధ్యానం ఆహ్లాదకరంగా ఉండాలి” అయ్యుంటుంది.
అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
లేదా “హల్లెలూయా!”