కీర్తనలు 106:1-48
106 యెహోవాను* స్తుతించండి!*
యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన మంచివాడు;+ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.+
2 యెహోవా శక్తివంతమైన పనుల్ని ఎవరు పూర్తిగా ప్రకటించగలరు?స్తుతిపాత్రమైన ఆయన కార్యాలన్నిటినీ ఎవరు చాటించగలరు?+
3 న్యాయంగా ప్రవర్తించేవాళ్లు,ఎప్పుడూ సరైనది చేసేవాళ్లు ధన్యులు.*+
4 యెహోవా, నీ ప్రజల మీద దయ చూపించేటప్పుడు నన్ను గుర్తుచేసుకో.+
నీ రక్షణ కార్యాలతో నన్ను ఆదుకో.
5 అప్పుడు, నువ్వు ఎంచుకున్నవాళ్ల+ పట్ల నువ్వు చూపించే మంచితనాన్ని నేను ఆస్వాదిస్తాను,నీ ప్రజలతో పాటు సంతోషిస్తాను,నీ స్వాస్థ్యంతో పాటు గర్వంగా నిన్ను స్తుతిస్తాను.*
6 మా పూర్వీకుల్లాగే మేము పాపం చేశాం;+మేము తప్పు చేశాం; చాలా చెడ్డగా ప్రవర్తించాం.+
7 మా పూర్వీకులు నీ అద్భుతమైన పనుల పట్ల కృతజ్ఞత చూపించలేదు.*
నీ అపారమైన విశ్వసనీయ ప్రేమను గుర్తుచేసుకోలేదు,సముద్రం దగ్గర, ఎర్రసముద్రం దగ్గర వాళ్లు తిరుగుబాటు చేశారు.
8 అయితే ఆయన తన గొప్ప శక్తిని చూపించడానికి,+తన పేరు కోసం వాళ్లను రక్షించాడు.+
9 ఆయన ఎర్రసముద్రాన్ని గద్దించినప్పుడు అది ఎండిపోయింది;ఎడారి గుండా నడిపించినట్టు ఆయన దాని లోతైన స్థలాల గుండా వాళ్లను నడిపించాడు.
10 వాళ్ల శత్రువు చేతిలో నుండి ఆయన వాళ్లను రక్షించాడు,విరోధి చేతిలో నుండి వాళ్లను విడిపించాడు.+
11 నీళ్లు వాళ్ల శత్రువుల్ని ముంచేశాయి;వాళ్లలో ఒక్కరు కూడా బ్రతికి బయటపడలేదు.*+
12 అప్పుడు వాళ్లు ఆయన వాగ్దానం మీద విశ్వాసముంచారు;+ఆయనకు స్తుతులు పాడడం మొదలుపెట్టారు.+
13 కానీ వాళ్లు ఆయన చేసినవాటిని త్వరగా మర్చిపోయారు;+ఆయన సలహా కోసం వేచి చూడలేదు.
14 ఎడారిలో వాళ్లు తమ స్వార్థ కోరికలకు లొంగిపోయారు;+ఎడారి ప్రదేశంలో దేవుణ్ణి పరీక్షించారు.+
15 వాళ్లు అడిగింది ఆయన వాళ్లకు ఇచ్చాడు,కానీ తర్వాత వ్యాధితో శిక్షించి వాళ్లను నాశనం చేశాడు.+
16 వాళ్లు పాలెంలో మోషే మీద,యెహోవా పవిత్ర సేవకుడైన+ అహరోను మీద అసూయపడ్డారు.+
17 అప్పుడు భూమి నోరు తెరిచి దాతానును మింగేసింది,అబీరాము గుంపును కప్పేసింది.+
18 వాళ్ల గుంపులో అగ్ని రగులుకుంది;అగ్నిజ్వాల దుష్టుల్ని దహించేసింది.+
19 హోరేబులో వాళ్లు దూడను చేసుకున్నారు,పోత* విగ్రహానికి వంగి నమస్కారం చేశారు.+
20 వాళ్లు నా మహిమనుగడ్డి మేసే ఎద్దు రూపానికి మార్చారు.+
21 తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు;ఐగుప్తులో గొప్ప కార్యాలు,+
22 హాము దేశంలో అద్భుతమైన పనులు,+ఎర్రసముద్రం దగ్గర సంభ్రమాశ్చర్యాలు పుట్టించే పనులు+ చేసిన దేవుణ్ణి మర్చిపోయారు.
23 ఆయన వాళ్లను సమూలంగా నాశనం చేయమని ఆజ్ఞాపించేవాడే,కానీ ఆయన ఎంచుకున్న మోషే ఆయన్ని వేడుకున్నాడు,నాశనం చేసే ఆయన కోపాన్ని పక్కకు మళ్లించాడు.+
24 వాళ్లు మనోహరమైన దేశాన్ని నీచంగా చూశారు;+ఆయన వాగ్దానం మీద వాళ్లకు విశ్వాసం లేదు.
25 వాళ్లు తమ డేరాల్లో గొణుక్కుంటూ ఉన్నారు;+యెహోవా స్వరాన్ని వినిపించుకోలేదు.+
26 కాబట్టి ఆయన తన చెయ్యి ఎత్తి వాళ్ల గురించి ఒట్టేశాడు;వాళ్లు ఎడారిలో చనిపోయేలా చేస్తానని,+
27 వాళ్ల వంశస్థులు దేశాల మధ్య చనిపోయేలా చేస్తానని,వాళ్లను దేశదేశాలకు చెదరగొడతానని అన్నాడు.+
28 తర్వాత వాళ్లు పెయోరులో ఉన్న బయలును పూజించడం మొదలుపెట్టారు,*+చనిపోయినవాళ్లకు అర్పించిన బలుల్ని* తిన్నారు.
29 తమ పనులతో ఆయనకు కోపం తెప్పించారు,+దాంతో వాళ్ల మధ్య తెగులు మొదలైంది.+
30 అయితే ఫీనెహాసు లేచి, చర్య తీసుకున్నప్పుడుతెగులు ఆగిపోయింది.+
31 అతను చేసిన పని తరతరాలపాటు ఎప్పటికీఅతనికి నీతిగా ఎంచబడింది.*+
32 మెరీబా* నీళ్ల దగ్గర వాళ్లు ఆయనకు కోపం తెప్పించారు,దానివల్ల మోషేకు నష్టం జరిగింది.+
33 వాళ్లు అతని ప్రాణాన్ని విసిగించడంతోఅతను తన పెదాలతో కఠినంగా మాట్లాడాడు.+
34 యెహోవా తమకు ముందే ఆజ్ఞాపించినట్టు+వాళ్లు ఇతర జనాల్ని సమూలంగా నాశనం చేయలేదు.+
35 బదులుగా దేశాల ప్రజలతో కలిసిపోయి+వాళ్ల పద్ధతులు అనుసరించారు.*+
36 వాళ్ల విగ్రహాల్ని సేవించడం మొదలుపెట్టారు,+అవి వాళ్లకు ఉరిగా తయారయ్యాయి.+
37 వాళ్లు తమ కుమారుల్ని, కూతుళ్లనుచెడ్డదూతలకు* బలిగా అర్పించేవాళ్లు.+
38 వాళ్లు అమాయకుల రక్తాన్ని,తమ సొంత కుమారుల, కూతుళ్ల రక్తాన్ని చిందిస్తూ వచ్చారు;+వాళ్లను కనాను విగ్రహాలకు బలి అర్పించారు.+రక్తపాతం వల్ల దేశం కలుషితమైపోయింది.
39 వాళ్లు తమ పనుల వల్ల అపవిత్రులయ్యారు;తమ క్రియలతో ఆయనకు నమ్మకద్రోహం చేశారు.*+
40 కాబట్టి యెహోవా కోపం తన ప్రజల మీద రగులుకుంది,ఆయనకు తన స్వాస్థ్యం మీద అసహ్యం వేసింది.
41 దాంతో ఆయన, వాళ్లను ద్వేషించే ప్రజలు వాళ్లను పరిపాలించేలా+పదేపదే వాళ్లను వేరే దేశాలకు అప్పగించాడు.+
42 వాళ్ల శత్రువులు వాళ్లను కష్టాలు పెట్టారు,వాళ్లు తమ శత్రువులకు దాసోహమయ్యారు.
43 చాలాసార్లు ఆయన వాళ్లను విడిపించాడు,+కానీ వాళ్లు ఎదురుతిరిగేవాళ్లు, మాట వినేవాళ్లు కాదు,+దాంతో వాళ్లు తమ తప్పుల కారణంగా అవమానించబడేవాళ్లు.+
44 అయితే ఆయన వాళ్ల కష్టాల్ని చూసేవాడు,+వాళ్ల మొర ఆలకించేవాడు.+
45 వాళ్ల కోసం ఆయన తన ఒప్పందాన్ని గుర్తుచేసుకునేవాడు,తన గొప్ప* విశ్వసనీయ ప్రేమను బట్టి జాలిపడేవాడు.*+
46 వాళ్లు ఎవరి దగ్గర బందీలుగా ఉన్నారోఆ ప్రజలందరికీ వాళ్ల మీద జాలి పుట్టించేవాడు.+
47 యెహోవా, మా దేవా, మమ్మల్ని కాపాడు,+దేశాల్లో నుండి మమ్మల్ని సమకూర్చు;+అప్పుడు మేము నీ పవిత్రమైన పేరుకు కృతజ్ఞతలు చెల్లిస్తాం,నిన్ను సంతోషంగా స్తుతిస్తాం.*+
48 ఇశ్రాయేలు దేవుడైన యెహోవాశాశ్వతకాలం* స్తుతించబడాలి.+
ప్రజలంతా “ఆమేన్!”* అనాలి.
యెహోవాను* స్తుతించండి!*
అధస్సూచీలు
^ లేదా “హల్లెలూయా!”
^ అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
^ లేదా “సంతోషంగా ఉంటారు.”
^ లేదా “నీ గురించి గొప్పలు చెప్పుకుంటాను.”
^ లేదా “అర్థాన్ని గ్రహించలేదు.”
^ లేదా “మిగల్లేదు.”
^ లేదా “లోహపు.”
^ అంటే, చనిపోయినవాళ్లకు గానీ ప్రాణంలేని విగ్రహాలకు గానీ అర్పించిన బలుల్ని.
^ లేదా “హత్తుకున్నారు.”
^ లేదా “లెక్కించబడింది.”
^ “గొడవపడడం” అని అర్థం.
^ లేదా “నేర్చుకున్నారు.”
^ లేదా “ఆధ్యాత్మిక వ్యభిచారం చేశారు.”
^ లేదా “విచారపడేవాడు.”
^ లేదా “అపారమైన.”
^ లేదా “నీ స్తుతిని బట్టి సంతోషిస్తాం.”
^ లేదా “శాశ్వతకాలం నుండి శాశ్వతకాలం వరకు.”
^ లేదా “అలాగే జరగాలి!”
^ అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
^ లేదా “హల్లెలూయా!”