కీర్తనలు 119:1-176
-
దేవుని అమూల్య వాక్యం పట్ల కృతజ్ఞత
-
‘యౌవనులు తమ మార్గాన్ని ఎలా పవిత్రంగా ఉంచుకోగలరు?’ (9)
-
“నీ జ్ఞాపికలంటే నాకు చాలా ఇష్టం” (24)
-
“నీ ధర్మశాస్త్రాన్ని నేను ఎంతో ప్రేమిస్తున్నాను!” (97)
-
“నా బోధకులందరి కన్నా నాకు ఎక్కువ అవగాహన ఉంది” (99)
-
“నీ వాక్యం నా పాదానికి దీపం” (105)
-
“నీ వాక్య సారం సత్యం” (160)
-
దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవాళ్లకు శాంతి (165)
-
א [ఆలెఫ్]
119 ఏ నిందా లేకుండా జీవిస్తూ,*యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకునే వాళ్లు ధన్యులు.*+
2 ఆయన జ్ఞాపికల్ని పాటించేవాళ్లు,+నిండు హృదయంతో ఆయన్ని వెతికేవాళ్లు ధన్యులు.+
3 వాళ్లు అలవాటుగా ఎలాంటి చెడ్డపనులు చేయరు;వాళ్లు ఆయన మార్గాల్లో నడుస్తారు.+
4 నీ ఆదేశాల్ని జాగ్రత్తగా పాటించాలనినువ్వు ఆజ్ఞాపించావు.+
5 నీ నియమాల్ని పాటించేలానేను ఎప్పుడూ స్థిరంగా ఉంటే*+ ఎంత బావుంటుంది!
6 అలా ఉంటే, నీ ఆజ్ఞలన్నిటినీ పరిశీలిస్తున్నప్పుడునేను సిగ్గుపడను.+
7 నీతిగల నీ తీర్పుల్ని నేర్చుకున్నప్పుడునేను నిజాయితీగల హృదయంతో నిన్ను స్తుతిస్తాను.
8 నేను నీ నియమాల్ని పాటిస్తాను.
నన్నెప్పుడూ పూర్తిగా విడిచిపెట్టకు.
ב [బేత్]
9 యౌవనులు తమ మార్గాన్ని పవిత్రంగా ఎలా ఉంచుకోగలరు?
నీ వాక్యం ప్రకారం తమను తాము కాపాడుకుంటూ ఉండడం వల్లే కదా.+
10 నా నిండు హృదయంతో నేను నిన్ను వెతుకుతున్నాను.
నీ ఆజ్ఞల నుండి నన్ను పక్కకు వెళ్లనివ్వకు.+
11 నేను నీకు వ్యతిరేకంగా పాపం చేయకుండా ఉండేలా+నీ మాటల్ని నా హృదయంలో భద్రం చేసుకున్నాను.+
12 యెహోవా, నువ్వు స్తుతించబడాలి;నీ నియమాల్ని నాకు బోధించు.
13 నువ్వు ప్రకటించిన తీర్పులన్నిటినీనేను నా పెదాలతో చాటిచెప్తాను.
14 విలువైన వాటన్నిటికన్నా+నీ జ్ఞాపికల్ని బట్టి నేను ఎక్కువగా సంతోషిస్తాను.+
15 నీ ఆదేశాల్ని నేను ధ్యానిస్తాను,*+నీ మార్గాల మీద నా దృష్టి నిలుపుతాను.+
16 నీ శాసనాలంటే నాకెంతో ఇష్టం.
నీ వాక్యాన్ని నేను మర్చిపోను.+
ג [గీమెల్]
17 నేను బ్రతికుండి నీ వాక్యాన్ని పాటించేలా+నీ సేవకుడితో దయగా ప్రవర్తించు.
18 నీ ధర్మశాస్త్రంలోని అద్భుతమైన విషయాల్నినేను స్పష్టంగా చూడగలిగేలా నా కళ్లు తెరువు.
19 నేను దేశంలో కేవలం పరదేశిగా ఉన్నాను.+
నీ ఆజ్ఞల్ని నా నుండి దాచకు.
20 నీ తీర్పుల పట్ల నాకున్న బలమైన కోరికఎల్లప్పుడూ నన్ను దహించేస్తోంది.
21 అహంకారుల్ని, నీ ఆజ్ఞల నుండి పక్కకుమళ్లే శాపగ్రస్తుల్నినువ్వు గద్దిస్తావు.+
22 ఎగతాళిని, అవమానాన్ని నా మీద నుండి తీసేయి,*ఎందుకంటే నీ జ్ఞాపికల్ని నేను పాటించాను.
23 అధిపతులు ఒక చోట కూర్చొని, నాకు వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా,నీ సేవకుడు నీ నియమాల్నే ధ్యానిస్తాడు.*
24 నీ జ్ఞాపికలంటే నాకు చాలా ఇష్టం;+
అవే నా సలహాదారులు.+
ד [దాలెత్]
25 నేను మట్టిలో పడి ఉన్నాను.+
నీ మాట ప్రకారం నన్ను సజీవంగా ఉంచు.+
26 నా మార్గాల గురించి నేను నీకు చెప్పాను, నువ్వు నాకు జవాబిచ్చావు;నీ నియమాలు నాకు బోధించు.+
27 నీ ఆదేశాల అర్థాన్ని* గ్రహించేలా నాకు సహాయం చేయి.అప్పుడు నీ అద్భుతమైన పనుల్ని నేను ధ్యానిస్తాను.*+
28 దుఃఖం వల్ల నాకు నిద్రలేదు.
నీ మాట ప్రకారం నన్ను బలపర్చు.
29 మోసపు మార్గాన్ని నాకు దూరంగా ఉంచు,+నీ ధర్మశాస్త్రాన్ని బోధించి నా మీద దయ చూపించు.
30 నేను నమ్మకంగా నడుచుకోవాలని తీర్మానించుకున్నాను.+
నీ తీర్పులు సరైనవని నేను గుర్తిస్తున్నాను.
31 నీ జ్ఞాపికల్ని+ నేను అంటిపెట్టుకున్నాను.
యెహోవా, నన్ను సిగ్గుపడనివ్వకు.*+
32 నీ ఆజ్ఞల మార్గంలో నేను ఆత్రుతతో పరుగెత్తుతాను,ఎందుకంటే నువ్వు నా అవగాహనను పెంచుతున్నావు.*
ה [హే]
33 యెహోవా, నీ నియమాల మార్గాన్ని నాకు బోధించు,+అప్పుడు చివరివరకు నేను దానిలో నడుస్తాను.+
34 నీ ధర్మశాస్త్రాన్ని పాటించేలా,నా నిండు హృదయంతో దాన్ని అనుసరించేలానాకు అవగాహన దయచేయి.
35 నీ ఆజ్ఞల మార్గంలో నన్ను నడిపించు,*+అందులో నాకు ఎంతో సంతోషం ఉంది.
36 స్వార్థ లాభం వైపు కాకుండా+నీ జ్ఞాపికల వైపు నా హృదయాన్ని తిప్పు.
37 వ్యర్థమైనవాటిని చూడకుండా నా కళ్లను పక్కకు తిప్పు;+నీ మార్గంలో నన్ను సజీవంగా ఉంచు.
38 ప్రజలు నీకు భయపడేలానీ సేవకుడికి నువ్వు చేసిన* వాగ్దానాన్ని* నెరవేర్చు.
39 నన్ను భయపెడుతున్న అవమానాన్ని తీసేయి,ఎందుకంటే నీ తీర్పులు మంచివి.+
40 నీ ఆదేశాల కోసం నేను ఎంతగా తపిస్తున్నానో చూడు.
నీ నీతిని బట్టి నన్ను సజీవంగా ఉంచు.
ו [వావ్]
41 యెహోవా, నీ విశ్వసనీయ ప్రేమను,నీ వాగ్దానం* ప్రకారం నువ్వు కలగజేసే రక్షణను నన్ను చూడనివ్వు;+
42 అప్పుడు, నన్ను నిందించేవాళ్లకు నేను జవాబిస్తాను,నీ మాట మీదే నేను నమ్మకం పెట్టుకున్నాను.
43 సత్యమైన మాటల్ని నా నోటి నుండి పూర్తిగా తీసేయకు,నీ తీర్పు మీదే నేను ఆశపెట్టుకున్నాను.*
44 ఎల్లప్పుడూ, యుగయుగాలూనీ ధర్మశాస్త్రాన్ని నేను పాటిస్తాను.+
45 నేను నీ ఆదేశాల కోసం వెతుకుతున్నాను కాబట్టిసురక్షితమైన* స్థలంలో తిరుగుతాను.+
46 నీ జ్ఞాపికల గురించి రాజుల ముందు మాట్లాడతాను,నేను సిగ్గుపడను.+
47 నీ ఆజ్ఞలు నాకు ప్రియం,అవంటే నాకు ఎంతో ఇష్టం.+
48 నేను ప్రేమించే నీ ఆజ్ఞల వైపు నా చేతులు ఎత్తుతాను,+నీ నియమాలు ధ్యానిస్తాను.*+
ז [జాయిన్]
49 నీ సేవకునికి నువ్వు ఇచ్చిన మాట* గుర్తుచేసుకో,దానితోనే నువ్వు నాలో ఆశ నింపుతున్నావు.*
50 కష్టాల్లో అదే నాకు ఓదార్పు,+నీ మాటే నన్ను సజీవంగా ఉంచింది.
51 అహంకారులు నన్ను చాలా ఎగతాళి చేస్తున్నారు,కానీ నీ ధర్మశాస్త్రం నుండి నేను పక్కకు మళ్లడం లేదు.+
52 యెహోవా, పూర్వకాలం నుండి ఉన్న నీ తీర్పుల్ని నేను గుర్తుచేసుకుంటున్నాను,+వాటివల్ల ఓదార్పు పొందుతున్నాను.+
53 నీ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టే దుష్టుల వల్లనా కోపం మండిపోతోంది.+
54 నేను ఎక్కడ నివసించినా,*నీ నియమాలే నాకు పాటలు.
55 యెహోవా, నేను నీ ధర్మశాస్త్రాన్ని పాటించేలారాత్రిపూట నీ పేరును గుర్తుచేసుకుంటున్నాను.+
56 అది నాకు అలవాటు,ఎందుకంటే నేను నీ ఆదేశాల్ని పాటిస్తూ వచ్చాను.
ח [హేత్]
57 యెహోవాయే నా భాగం;+నీ మాటల్ని పాటిస్తానని నేను మాటిచ్చాను.+
58 నా నిండు హృదయంతో నేను నిన్ను వేడుకుంటున్నాను;+నీ వాగ్దానం* ప్రకారం నా మీద దయ చూపించు.+
59 నా పాదాల్ని మళ్లీ నీ జ్ఞాపికల వైపు మళ్లించడానికినా మార్గాల్ని నేను పరిశీలించుకున్నాను.+
60 నీ ఆజ్ఞలు పాటించడానికినేను త్వరపడుతున్నాను, ఆలస్యం చేయను.+
61 దుష్టుల తాళ్లు నన్ను చుట్టుముడుతున్నాయి,అయినా నీ ధర్మశాస్త్రాన్ని నేను మర్చిపోవడం లేదు.+
62 నీ నీతియుక్త తీర్పుల్ని బట్టినీకు కృతజ్ఞతలు చెప్పాలని మధ్యరాత్రి నిద్రలేస్తున్నాను.+
63 నీకు భయపడే వాళ్లందరికీ,నీ ఆదేశాలు పాటించేవాళ్లకు నేను స్నేహితుణ్ణి.+
64 యెహోవా, నీ విశ్వసనీయ ప్రేమతో భూమి నిండివుంది;+నీ నియమాలు నాకు బోధించు.
ט [తేత్]
65 యెహోవా, నీ మాట ప్రకారంనీ సేవకునికి మేలు చేశావు.
66 నీ ఆజ్ఞల మీదే నేను నమ్మకం పెట్టుకున్నాను,కాబట్టి మంచి వివేచనను, జ్ఞానాన్ని నాకు బోధించు.+
67 కష్టాలుపడక ముందు నేను దారితప్పేవాణ్ణి,*కానీ ఇప్పుడు నేను నీ మాటల్ని పాటిస్తున్నాను.+
68 నువ్వు మంచివాడివి,+ నీ పనులు మంచివి.
నీ నియమాలు నాకు బోధించు.+
69 అహంకారులు నా గురించి ఎన్నో అబద్ధాలు చెప్తున్నారు,కానీ నేను నిండు హృదయంతో నీ ఆదేశాల్ని పాటిస్తున్నాను.
70 వాళ్ల హృదయం మొద్దుబారిపోయింది,*+కానీ నాకు నీ ధర్మశాస్త్రం అంటే ఎంతో ఇష్టం.+
71 నీ నియమాలు నేర్చుకునేలానేను కష్టాలు పడడం మంచిదైంది.+
72 వేలాది వెండిబంగారు రూకల కన్నా,+నువ్వు ప్రకటించిన ధర్మశాస్త్రం నాకు మంచిది.+
י [యోద్]
73 నీ చేతులు నన్ను చేశాయి, నన్ను మలిచాయి.
నీ ఆజ్ఞల్ని నేర్చుకునేలానాకు అవగాహన ఇవ్వు.+
74 నీకు భయపడేవాళ్లు నన్ను చూసి సంతోషిస్తారు,నీ మాట మీదే నేను ఆశపెట్టుకున్నాను.*+
75 యెహోవా, నీ తీర్పులు నీతియుక్తమైనవని,+నీ నమ్మకత్వాన్ని బట్టే నన్ను కష్టాలపాలు చేశావని నాకు తెలుసు.+
76 నీ సేవకునికి నువ్వు చేసిన వాగ్దానం* ప్రకారందయచేసి నీ విశ్వసనీయ ప్రేమతో+ నన్ను ఓదార్చు.
77 నేను జీవిస్తూ ఉండేలా నా మీద కరుణ చూపించు,+నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియం.+
78 అహంకారులు అవమానాలపాలు అవ్వాలి,కారణం లేకుండా* వాళ్లు నన్ను బాధపెట్టారు.
అయితే నేను నీ ఆదేశాల్ని ధ్యానిస్తాను.*+
79 నీకు భయపడేవాళ్లు,నీ జ్ఞాపికలు తెలిసినవాళ్లు నా దగ్గరికి తిరిగిరావాలి.
80 నీ నియమాల్ని పాటించే విషయంలో నా హృదయం నిర్దోషంగా* ఉండాలి,+అప్పుడు నేను సిగ్గుపడే పరిస్థితి రాదు.+
כ [కఫ్]
81 నువ్విచ్చే రక్షణ కోసం నేను తపిస్తున్నాను,+నీ మాట మీదే నేను ఆశపెట్టుకున్నాను.*
82 నా కళ్లు నీ మాట కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి,+“నన్నెప్పుడు ఓదారుస్తావు?” అని నేను అడుగుతున్నాను.+
83 నేను పొగకు ఆరబెట్టిన తోలుసంచిలా ఉన్నాను,అయినా నీ నియమాల్ని మర్చిపోవడం లేదు.+
84 నీ సేవకుడు ఎంతకాలం ఎదురుచూడాలి?
నన్ను హింసిస్తున్న వాళ్లకు నువ్వెప్పుడు తీర్పు తీరుస్తావు?+
85 నీ ధర్మశాస్త్రాన్ని ఎదిరించే అహంకారులునా కోసం గోతులు తవ్వుతున్నారు.
86 నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి,
మనుషులు ఏ కారణం లేకుండా నన్ను హింసిస్తున్నారు; నాకు సహాయం చేయి!+
87 వాళ్లు నన్ను దాదాపు భూమ్మీద నుండి తుడిచిపెట్టేశారు,కానీ నేను నీ ఆదేశాల్ని విడిచిపెట్టలేదు.
88 నువ్వు ఇచ్చిన జ్ఞాపికల్ని నేను పాటించేలానీ విశ్వసనీయ ప్రేమను బట్టి నన్ను సజీవంగా ఉంచు.
ל [లామెద్]
89 యెహోవా, నీ మాట ఎప్పటికీఆకాశంలో నిలిచివుంటుంది.+
90 నీ నమ్మకత్వం తరతరాలు ఉంటుంది.+
నువ్వు భూమిని స్థిరంగా స్థాపించావు, కాబట్టి అది ఇప్పటికీ నిలిచివుంది.+
91 నీ తీర్పుల వల్ల అవి* నేటికీ నిలిచివున్నాయి,ఎందుకంటే అవన్నీ నీ సేవకులు.
92 నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించి ఉండకపోతేనేను కష్టాల్లో నశించిపోయేవాణ్ణే.+
93 నీ ఆదేశాల్ని నేను ఎప్పటికీ మర్చిపోను,
వాటితోనే నువ్వు నన్ను సజీవంగా ఉంచావు.+
94 నేను నీ వాణ్ణి; నన్ను రక్షించు,+ఎందుకంటే నీ ఆదేశాల కోసం నేను వెతికాను.+
95 దుష్టులు నన్ను నాశనం చేయాలని కాచుకొని ఉన్నారు,కానీ నేను నీ జ్ఞాపికల మీదే శ్రద్ధ పెడుతున్నాను.
96 సకల పరిపూర్ణతకు పరిమితి ఉందని నేను గమనించాను,కానీ నీ ఆజ్ఞకు పరిమితి లేదు.*
מ [మేమ్]
97 నీ ధర్మశాస్త్రాన్ని నేను ఎంతో ప్రేమిస్తున్నాను!+
రోజంతా దాన్ని ధ్యానిస్తున్నాను.*+
98 నీ ఆజ్ఞ ఎప్పుడూ నాతోనే ఉంది,అది నా శత్రువుల కన్నా నాకు ఎక్కువ తెలివిని ఇస్తుంది.+
99 నీ జ్ఞాపికల్ని నేను ధ్యానిస్తున్నాను,*అందుకే నా బోధకులందరి కన్నా నాకు ఎక్కువ అవగాహన* ఉంది,+
100 నీ ఆదేశాల్ని నేను పాటిస్తున్నాను,కాబట్టి వృద్ధుల కన్నా ఎక్కువ అవగాహనతో ప్రవర్తిస్తున్నాను.
101 నీ మాటల్ని పాటించాలని
నేను ఎలాంటి చెడ్డ మార్గంలో నడవడం లేదు.+
102 నీ తీర్పుల నుండి నేను పక్కకు మళ్లడం లేదు,ఎందుకంటే నువ్వే నాకు ఉపదేశమిచ్చావు.
103 నీ మాటలు నా నాలుకకుతేనె కన్నా మధురంగా ఉన్నాయి!+
104 నీ ఆదేశాల వల్ల నేను అవగాహనతో ప్రవర్తిస్తున్నాను.+
అందుకే ప్రతీ తప్పుడు మార్గం నాకు అసహ్యం.+
נ [నూన్]
105 నీ వాక్యం* నా పాదానికి దీపం,నా త్రోవకు వెలుగు.+
106 నీతిగల నీ తీర్పుల్ని పాటిస్తాననినేను ఒట్టేసి ప్రమాణం చేశాను, దానికి కట్టుబడి ఉంటాను.
107 నేను ఎన్నో కష్టాలుపడ్డాను.+
యెహోవా, నీ మాట ప్రకారం నన్ను సజీవంగా ఉంచు.+
108 యెహోవా, దయచేసి నా నోటి స్వేచ్ఛార్పణల్ని బట్టి సంతోషించు,+నీ తీర్పుల్ని నాకు బోధించు.+
109 నా జీవితం ఎప్పుడూ ప్రమాదంలో ఉంది,*అయినా నేను నీ ధర్మశాస్త్రాన్ని మర్చిపోలేదు.
110 దుష్టులు నా కోసం వల పన్నారు,అయినా నేను నీ ఆదేశాల నుండి పక్కకు మళ్లలేదు.
111 నీ జ్ఞాపికల్ని నేను శాశ్వతమైన ఆస్తిగా* ఎంచుతున్నాను,అవే నా హృదయానికి సంతోషం.+
112 అన్ని సమయాల్లో, చివరివరకూనీ నియమాలకు లోబడాలని నేను నా హృదయంలో తీర్మానించుకున్నాను.
ס [సామెఖ్]
113 అర్ధ* హృదయంగల వాళ్లంటే నాకు అసహ్యం,+కానీ నీ ధర్మశాస్త్రమంటే చాలా ఇష్టం.+
114 నువ్వే నా ఆశ్రయం, నా డాలు;+నీ మాట మీదే నేను ఆశపెట్టుకున్నాను.*+
115 నేను నా దేవుని ఆజ్ఞల్ని పాటించగలిగేలాదుష్టులారా, నాకు దూరంగా ఉండండి.+
116 నేను జీవిస్తూ ఉండేలానీ వాగ్దానం* ప్రకారం నన్ను ఆదుకో;+
నేను నీ మీద ఆశపెట్టుకున్నాను, నన్ను సిగ్గుపడనివ్వకు.*+
117 నేను రక్షించబడేలా నాకు సహాయం చేయి;+అప్పుడు నేను నీ నియమాల మీద ఎల్లప్పుడూ మనసు నిలపగలుగుతాను.+
118 నీ నియమాల నుండి పక్కకుమళ్లే వాళ్లందర్నీ నువ్వు తిరస్కరిస్తావు,+ఎందుకంటే వాళ్లు అబద్ధాలకోరులు, మోసగాళ్లు.
119 నువ్వు భూమ్మీదున్న దుష్టులందర్నీ పనికిరాని చెత్తలా పారేస్తావు.+
అందుకే నీ జ్ఞాపికలంటే నాకు చాలా ఇష్టం.
120 నీ మీదున్న భయం వల్ల నా శరీరం వణుకుతుంది;నీ తీర్పులకు నేను భయపడుతున్నాను.
ע [అయిన్]
121 నేను నీతిన్యాయాలు జరిగించాను.
నన్ను బాధించేవాళ్లకు నన్ను విడిచిపెట్టకు!
122 నీ సేవకునికి సహాయం చేస్తానని హామీ ఇవ్వు;అహంకారులు నన్ను బాధించనివ్వకు.
123 నీ రక్షణ కోసం, నీతిగల నీ వాగ్దానం* కోసంఎదురుచూసీ చూసీ+ నా కళ్లు క్షీణించిపోయాయి.+
124 నీ సేవకుని మీద నీ విశ్వసనీయ ప్రేమ చూపించు,+నీ నియమాలు నాకు బోధించు.+
125 నేను నీ సేవకుణ్ణి; నీ జ్ఞాపికల్ని తెలుసుకునేలానాకు అవగాహన ఇవ్వు.+
126 యెహోవా చర్య తీసుకునే సమయం వచ్చేసింది,+ఎందుకంటే వాళ్లు నీ ధర్మశాస్త్రాన్ని మీరారు.
127 అందుకే బంగారం కన్నా, మేలిమి* బంగారం కన్నానీ ఆజ్ఞలంటే నాకు ఎక్కువ ఇష్టం.+
128 కాబట్టి నీ ప్రతీ ఉపదేశాన్ని* నేను సరైనదని ఎంచుతాను;+ప్రతీ తప్పుడు మార్గం నాకు అసహ్యం.+
פ [పే]
129 నీ జ్ఞాపికలు అద్భుతమైనవి.
అందుకే నేను* వాటిని పాటిస్తాను.
130 నీ మాటలు వెల్లడైనప్పుడు వెలుగు వస్తుంది,+అవి అనుభవంలేని వాళ్లకు అవగాహన ఇస్తాయి.+
131 నీ ఆజ్ఞల కోసం తపిస్తూనేను పెద్దగా నోరు తెరిచి రొప్పుతున్నాను.+
132 నీ పేరును ప్రేమించేవాళ్ల విషయంలో నీ తీర్పును అనుసరిస్తూ+నువ్వు నా వైపు తిరుగు, నా మీద దయ చూపించు.+
133 నీ మాటతో నా అడుగుల్ని సురక్షితంగా నడిపించు;*చెడును నా మీద పైచేయి సాధించనివ్వకు.+
134 బాధించేవాళ్ల నుండి నన్ను కాపాడు,*అప్పుడు నేను నీ ఆదేశాల్ని పాటిస్తాను.
135 నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయి,+నీ నియమాలు నాకు బోధించు.
136 ప్రజలు నీ ధర్మశాస్త్రాన్ని పాటించనందువల్లనా కళ్లలో నుండి కన్నీళ్లు వరదలా పారుతున్నాయి.+
צ [సాదె]
137 యెహోవా, నువ్వు నీతిమంతుడివి,+నీ తీర్పులు న్యాయమైనవి.+
138 నీ జ్ఞాపికలు నీతిగలవి,అవి పూర్తిగా నమ్మదగినవి.
139 నా ఆసక్తి నన్ను దహించేస్తోంది,+ఎందుకంటే నా శత్రువులు నీ మాటల్ని మర్చిపోయారు.
140 నీ మాటలు చాలా స్వచ్ఛమైనవి,+నీ సేవకుడు వాటిని ప్రేమిస్తున్నాడు.+
141 నేను అల్పుణ్ణి, నన్ను నీచంగా చూస్తున్నారు;+అయినా నేను నీ ఆదేశాల్ని మర్చిపోలేదు.
142 నీ నీతి ఎప్పటికీ ఉంటుంది,+నీ ధర్మశాస్త్రం సత్యం.+
143 కష్టాలు, ఇబ్బందులు వచ్చినానేను నీ ఆజ్ఞల్ని ప్రేమిస్తూనే ఉంటాను.
144 నీ జ్ఞాపికలు ఎప్పటికీ నీతిగలవే.
నేను జీవిస్తూ ఉండేలా నాకు అవగాహన ఇవ్వు.+
ק [ఖొఫ్]
145 నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. యెహోవా, నాకు జవాబివ్వు.
నీ నియమాల్ని నేను పాటిస్తాను.
146 నేను నీకు మొరపెడుతున్నాను; నన్ను రక్షించు!
నీ జ్ఞాపికల్ని నేను పాటిస్తాను.
147 సహాయం కోసం మొరపెట్టడానికి నేను వేకువ* కన్నా ముందే నిద్రలేచాను,+నీ మాటల మీదే ఆశపెట్టుకున్నాను.*
148 నీ మాటల్ని ధ్యానించగలిగేలా*రాత్రి జాముల కన్నా ముందే నా కళ్లు తెరుచుకుంటాయి.+
149 నీ విశ్వసనీయ ప్రేమను బట్టి నా స్వరం ఆలకించు.+
యెహోవా, నీ న్యాయాన్ని బట్టి నన్ను సజీవంగా ఉంచు.
150 అవమానకరమైన* ప్రవర్తనకు పాల్పడేవాళ్లు దగ్గరికి వస్తున్నారు;నీ ధర్మశాస్త్రానికి వాళ్లు చాలా దూరంలో ఉన్నారు.
151 యెహోవా, నువ్వు నాకు దగ్గరగా ఉన్నావు,+
నీ ఆజ్ఞలన్నీ సత్యం.+
152 ఎల్లకాలం ఉండేలా నువ్వు స్థాపించిన నీ జ్ఞాపికల్నిచాలాకాలం క్రితమే నేను నేర్చుకున్నాను.+
ר [రేష్]
153 నా కష్టాలు చూసి నన్ను రక్షించు,నీ ధర్మశాస్త్రాన్ని నేను మర్చిపోలేదు.
154 నా తరఫున వాదించి నన్ను రక్షించు;+నీ వాగ్దానం* ప్రకారం నన్ను సజీవంగా ఉంచు.
155 దుష్టులకు రక్షణ చాలా దూరంలో ఉంటుంది,ఎందుకంటే వాళ్లు నీ నియమాల్ని వెతకలేదు.+
156 యెహోవా, నీ కరుణ గొప్పది.+
నీ న్యాయం ప్రకారం నన్ను సజీవంగా ఉంచు.
157 నన్ను హింసించేవాళ్లు, నా శత్రువులు చాలామంది ఉన్నారు;+అయితే నేను నీ జ్ఞాపికల నుండి పక్కకు మళ్లలేదు.
158 నమ్మకద్రోహులు అంటే నాకు అసహ్యం,వాళ్లు నీ మాటల్ని పాటించరు.+
159 నీ ఆదేశాల్ని నేను ఎంతగా ప్రేమిస్తున్నానో చూడు!
యెహోవా, నీ విశ్వసనీయ ప్రేమను బట్టి నన్ను సజీవంగా ఉంచు.+
160 నీ వాక్య సారం* సత్యం,+నీతిగల నీ తీర్పులన్నీ ఎప్పటికీ నిలిచివుంటాయి.
ש [సీన్] లేదా [షీన్]
161 ఏ కారణం లేకుండానే అధిపతులు నన్ను హింసిస్తున్నారు,+అయితే నీ మాటలంటే నాకెంతో గౌరవం.+
162 విస్తారమైన దోపుడుసొమ్ము దొరికినవాడిలానేను నీ మాటల్ని బట్టి సంతోషిస్తున్నాను.+
163 అబద్ధం అంటే నాకు ద్వేషం, చాలా అసహ్యం.+నీ ధర్మశాస్త్రం అంటే నాకు చాలా ఇష్టం.+
164 నీతిగల నీ తీర్పుల్ని బట్టిరోజుకు ఏడుసార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను.
165 నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవాళ్లకు అపారమైన శాంతి ఉంటుంది;+వాళ్లను ఏదీ తడబడేలా చేయలేదు.
166 యెహోవా, నీ రక్షణ కార్యాల కోసం నేను ఆశగా ఎదురుచూస్తున్నాను,నీ ఆజ్ఞల్ని అనుసరిస్తున్నాను.
167 నీ జ్ఞాపికల్ని పాటిస్తున్నాను,వాటిని ఎంతో ప్రేమిస్తున్నాను.+
168 నేను నీ ఆదేశాల్ని, జ్ఞాపికల్ని అనుసరిస్తున్నాను,నేను చేసేవన్నీ నీకు తెలుసు.+
ת [తౌ]
169 యెహోవా, నా మొర నీ దగ్గరికి చేరాలి.+
నీ మాట ద్వారా నాకు అవగాహన దయచేయి.+
170 అనుగ్రహం కోసం నేను పెట్టే మొర నీ సన్నిధికి చేరాలి.
నువ్వు వాగ్దానం చేసినట్టే* నన్ను రక్షించు.
171 నా పెదాల నుండి స్తుతులు పొంగిపొర్లాలి,+ఎందుకంటే నువ్వు నీ నియమాల్ని నాకు బోధిస్తున్నావు.
172 నా నాలుక నీ మాటల గురించి పాడాలి,+నీ ఆజ్ఞలన్నీ నీతిగలవి.
173 నీ చెయ్యి నాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి,+ఎందుకంటే నీ ఆదేశాలు పాటించాలని నేను కోరుకున్నాను.+
174 యెహోవా, నీ రక్షణ కోసం నేను తపిస్తున్నాను,నీ ధర్మశాస్త్రం అంటే నాకు చాలా ఇష్టం.+
175 నేను నిన్ను స్తుతించేలా నన్ను సజీవంగా ఉంచు;+నీ తీర్పులు నాకు సహాయం చేయాలి.
176 నేను తప్పిపోయిన గొర్రెలా దారితప్పి తిరిగాను.+ నీ సేవకుడి కోసం వెతుకు,ఎందుకంటే నేను నీ ఆజ్ఞల్ని మర్చిపోలేదు.+
అధస్సూచీలు
^ లేదా “యథార్థంగా ఉంటూ.”
^ లేదా “సంతోషంగా ఉంటారు.”
^ అక్ష., “నా మార్గాలు గట్టిగా స్థిరపర్చబడివుంటే.”
^ లేదా “పరిశీలిస్తాను.”
^ అక్ష., “దొర్లించు.”
^ లేదా “పరిశీలిస్తాడు.”
^ అక్ష., “మార్గాన్ని.”
^ లేదా “పరిశీలిస్తాను.”
^ లేదా “అవమానాలపాలు కానివ్వకు.”
^ లేదా “నా హృదయాన్ని ధైర్యంగా ఉండేలా చేస్తావు” అయ్యుంటుంది.
^ లేదా “నిర్దేశించు.”
^ లేదా “నీకు భయపడేవాళ్లకు నువ్వు చేసిన” అయ్యుంటుంది.
^ లేదా “ఇచ్చిన మాటను.”
^ లేదా “మాట.”
^ లేదా “కోసం నేను ఎదురుచూస్తున్నాను.”
^ లేదా “విశాలమైన.”
^ లేదా “పరిశీలిస్తాను.”
^ లేదా “చేసిన వాగ్దానం.”
^ లేదా “నన్ను ఎదురుచూసేలా చేశావు.”
^ లేదా “నేను పరదేశిగా నివసిస్తున్న ఇంట్లో.”
^ లేదా “మాట.”
^ లేదా “పొరపాటున పాపాలు చేస్తూ వచ్చాను.”
^ అక్ష., “స్పర్శ కోల్పోయింది, కొవ్వులా.”
^ లేదా “కోసం నేను ఎదురుచూస్తున్నాను.”
^ లేదా “ఇచ్చిన మాట.”
^ లేదా “అబద్ధాలతో” అయ్యుంటుంది.
^ లేదా “పరిశీలిస్తాను.”
^ లేదా “నింద లేకుండా.”
^ లేదా “కోసం నేను ఎదురుచూస్తున్నాను.”
^ అంటే, ఆయన సృష్టికార్యాలన్నీ.
^ అక్ష., “చాలా విశాలమైనది.”
^ లేదా “పరిశీలిస్తున్నాను.”
^ లేదా “పరిశీలిస్తున్నాను.”
^ లేదా “లోతైన అవగాహన.”
^ లేదా “మాట.”
^ లేదా “నా ప్రాణం ఎప్పుడూ నా అరచేతిలో ఉంది.”
^ లేదా “శాశ్వతమైన వారసత్వ ఆస్తిగా.”
^ లేదా “విభాగిత.”
^ లేదా “కోసం నేను ఎదురుచూస్తున్నాను.”
^ లేదా “మాట.”
^ లేదా “అవమానాలపాలు కానివ్వకు.”
^ లేదా “మాట.”
^ లేదా “శుద్ధి చేయబడిన.”
^ లేదా “ఆదేశాన్ని.”
^ లేదా “నా ప్రాణం.”
^ లేదా “తడబడకుండా చేయి.”
^ అక్ష., “విడిపించు.”
^ లేదా “వేకువ సంధ్య వెలుగు.”
^ లేదా “కోసం నేను ఎదురుచూస్తున్నాను.”
^ లేదా “పరిశీలించగలిగేలా.”
^ లేదా “అసభ్య.”
^ లేదా “మాట.”
^ లేదా “సారాంశం.”
^ లేదా “మాటిచ్చినట్టే.”