కీర్తనలు 89:1-52
మాస్కిల్.* ఎజ్రాహీయుడైన ఏతాను+ కీర్తన.
89 యెహోవా విశ్వసనీయ ప్రేమతో చేసిన మేలుల్ని నేను ఎప్పటికీ కీర్తిస్తాను.
నీ నమ్మకత్వాన్ని అన్ని తరాలకు తెలియజేస్తాను.
2 ఎందుకంటే నేనిలా అన్నాను: “విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ నిలుస్తుంది,+నువ్వు నీ నమ్మకత్వాన్ని ఆకాశంలో బలంగా స్థాపించావు.”
3 నువ్విలా అన్నావు: “నేను ఎంచుకున్న వ్యక్తితో ఒక ఒప్పందం చేశాను;+నా సేవకుడైన దావీదుకు ఇలా ప్రమాణం చేశాను:+
4 ‘నేను నీ సంతానాన్ని*+ శాశ్వతంగా స్థిరపరుస్తాను,నీ సింహాసనం తరతరాలు నిలిచివుండేలా చేస్తాను.’ ”+ (సెలా)
5 యెహోవా, ఆకాశం నీ ఆశ్చర్యకార్యాల్ని స్తుతిస్తుంది,అవును, పవిత్రుల సమాజం నీ నమ్మకత్వాన్ని స్తుతిస్తుంది.
6 ఆకాశంలో యెహోవాకు సాటి ఎవరు?+
దేవుని కుమారుల్లో+ యెహోవా లాంటివాళ్లు ఎవరు?
7 పవిత్రుల సభలో* దేవుణ్ణి చూస్తే సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి;+తన చుట్టూ ఉన్న వాళ్లందరికీ ఆయన మహిమాన్వితుడు, భీకరుడు.+
8 యెహోవా, సైన్యాల దేవా,యెహోవా,* నీలాంటి శక్తిమంతుడు ఎవరు?+
నీ నమ్మకత్వం నీ చుట్టూ ఉంది.+
9 పోటెత్తే సముద్రాన్ని నువ్వు అదుపు చేస్తావు;+దాని అలలు ఎగసినప్పుడు నువ్వు వాటిని అణచివేస్తావు.+
10 నువ్వు రాహాబును*+ పూర్తిగా ఓడించి, చంపేశావు.+
నీ బలమైన బాహువుతో నీ శత్రువుల్ని చెదరగొట్టావు.+
11 ఆకాశం నీదే, భూమి నీదే;+పండే భూమిని, దానిలోని ప్రతీదాన్ని+ నువ్వే చేశావు.
12 ఉత్తర, దక్షిణ దిక్కుల్ని నువ్వే సృష్టించావు;తాబోరు,+ హెర్మోను పర్వతాలు+ ఆనందంతో నీ పేరును స్తుతిస్తున్నాయి.
13 నీ బాహువు శక్తివంతమైనది;+నీ చెయ్యి బలమైనది;+నీ కుడిచెయ్యి హెచ్చించబడింది.+
14 నీతిన్యాయాలు నీ సింహాసనానికి పునాదులు;+విశ్వసనీయ ప్రేమ, నమ్మకత్వం నీ ముందు నిలబడివున్నాయి.+
15 సంతోష స్వరంతో నిన్ను స్తుతించే ప్రజలు ధన్యులు.*+
యెహోవా, నీ ముఖకాంతిలో వాళ్లు నడుస్తారు.
16 నీ పేరును బట్టి వాళ్లు రోజంతా ఆనందిస్తారు,నీ నీతి వల్ల హెచ్చించబడతారు.
17 నువ్వే వాళ్ల మహిమవు, బలానివి,+నీ ఆమోదం వల్లే మా బలం* హెచ్చించబడుతోంది.+
18 ఎందుకంటే, మా డాలు యెహోవాకు చెందినది,మా రాజు ఇశ్రాయేలు పవిత్ర దేవునికి చెందినవాడు.+
19 అప్పుడు నువ్వు ఒక దర్శనంలో నీ విశ్వసనీయులతో ఇలా అన్నావు:
“నేను ఒక శక్తిమంతునికి బలాన్ని ఇచ్చాను;+ప్రజల్లో నుండి ఎంచుకున్న ఒక వ్యక్తిని హెచ్చించాను.+
20 నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను;+నా పవిత్ర తైలంతో అతన్ని అభిషేకించాను.+
21 నా చెయ్యి అతనికి అండగా ఉంటుంది,+నా బాహువు అతన్ని బలపరుస్తుంది.
22 ఏ శత్రువూ అతని నుండి కప్పం వసూలు చేయడు,ఏ దుష్టుడూ అతన్ని అణచివేయడు.+
23 అతని శత్రువుల్ని అతని ముందు నలగ్గొట్టి ముక్కలుముక్కలు చేస్తాను,+అతన్ని ద్వేషించేవాళ్లను చంపేస్తాను.+
24 నా నమ్మకత్వం, విశ్వసనీయ ప్రేమ అతనికి తోడుగా ఉన్నాయి,+నా పేరును బట్టి అతని బలం* హెచ్చించబడుతుంది.
25 నేను సముద్రం మీద అతని చేతిని,*నదుల మీద అతని కుడిచేతిని ఉంచుతాను.+
26 అతను, ‘నువ్వే నా తండ్రివి,నా దేవుడివి, నన్ను రక్షించే ఆశ్రయదుర్గానివి’*+ అంటూ నాకు ప్రార్థిస్తాడు.
27 నేను అతన్ని పెద్ద కుమారునిగా,+భూరాజులందరిలో అత్యున్నతునిగా చేస్తాను.+
28 నేను నిరంతరం అతని మీద నా విశ్వసనీయ ప్రేమ చూపిస్తాను,+నేను అతనితో చేసిన ఒప్పందం ఎప్పటికీ రద్దు కాదు.+
29 నేను అతని సంతానాన్ని* శాశ్వతంగా స్థిరపరుస్తాను,అతని సింహాసనం ఆకాశంలా ఎప్పటికీ ఉండేలా చేస్తాను.+
30 ఒకవేళ అతని కుమారులు నా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి,నా ఆదేశాల* ప్రకారం నడుచుకోకపోతే,
31 నా శాసనాలు మీరి,నా ఆజ్ఞలు పాటించకపోతే,
32 దండంతో వాళ్ల అవిధేయతను,*కొరడాతో వాళ్ల తప్పును శిక్షిస్తాను.+
33 కానీ అతని మీద నాకున్న విశ్వసనీయ ప్రేమను ఎప్పటికీ విడిచిపెట్టను,+ఇచ్చిన మాట తప్పను.*
34 నా ఒప్పందాన్ని మీరను,+నా పెదాలు పలికిన మాటను మార్చను.+
35 నా పవిత్రత తోడని నేను దావీదుతో ఒక్కసారి ప్రమాణం చేశాను;నేను అతనితో అబద్ధమాడను.+
36 అతని సంతానం* శాశ్వతంగా నిలిచివుంటుంది;+అతని సింహాసనం సూర్యునిలా ఎప్పటికీ నా ముందు నిలిచివుంటుంది.+
37 ఆకాశంలో నమ్మకమైన సాక్షిగా ఉన్న చంద్రునిలా,అతని సింహాసనం శాశ్వతంగా స్థిరపర్చబడుతుంది.” (సెలా)
38 కానీ నువ్వే అతన్ని విడిచిపెట్టావు, అతన్ని తిరస్కరించావు;+నీ అభిషిక్తుని మీద చాలా కోపగించుకున్నావు.
39 నువ్వు నీ సేవకునితో చేసిన ఒప్పందాన్ని అసహ్యించుకున్నావు;అతని కిరీటాన్ని నేల మీద పారేసి దాన్ని అపవిత్రపర్చావు.
40 అతని రాతి గోడలన్నిటినీ* కూలగొట్టావు;అతని ప్రాకారాల్ని శిథిలాలుగా మార్చావు.
41 దారినపోయే వాళ్లందరూ అతన్ని దోచుకున్నారు;అతని పొరుగువాళ్లు అతన్ని నిందిస్తున్నారు.+
42 నువ్వు అతని విరోధులకు విజయాన్ని ఇచ్చావు;*+అతని శత్రువులందరూ సంతోషించేలా చేశావు.
43 నువ్వు అతని ఖడ్గానికి విరోధివయ్యావు,అతను యుద్ధంలో గెలవకుండా చేశావు.
44 అతని వైభవాన్ని ముగింపుకు తెచ్చావు,అతని సింహాసనాన్ని నేలమీద పడేశావు.
45 అతని యౌవన రోజుల్ని తగ్గించావు;అవమానాన్ని అతనికి బట్టల్లా ధరింపజేశావు. (సెలా)
46 యెహోవా, ఎంతకాలం ఇలా కనబడకుండా ఉంటావు? ఎప్పటికీనా?+
నీ కోపం అగ్నిలా మండుతూనే ఉంటుందా?
47 నా జీవితం ఎంత చిన్నదో గుర్తుచేసుకో!+
నువ్వు ఏ సంకల్పం లేకుండా మనుషుల్ని సృష్టించావా?
48 మరణాన్ని చూడకుండా ఎప్పుడూ బ్రతికుండే మనిషి ఎవరైనా ఉన్నారా?+
సమాధి* శక్తి* నుండి అతను తన ప్రాణాన్ని కాపాడుకోగలడా? (సెలా)
49 యెహోవా, నువ్వు ఒకప్పుడు విశ్వసనీయ ప్రేమతో చేసిన పనులు ఎక్కడ?నీ నమ్మకత్వం తోడని దావీదుకు ప్రమాణం చేసిన పనులు ఎక్కడ?+
50 యెహోవా, నీ సేవకుల మీద పడ్డ నిందల్ని గుర్తుచేసుకో;దేశదేశాల ప్రజలందరి నిందల్ని నేనెలా మోయాల్సి వస్తోందో గుర్తుచేసుకో;
51 యెహోవా, నీ శత్రువులు ఎలా అవమానించారో,నీ అభిషిక్తుడు వేసిన ప్రతీ అడుగును వాళ్లెలా అవమానించారో గుర్తుచేసుకో.
52 యెహోవా సదాకాలం స్తుతించబడాలి. ఆమేన్, ఆమేన్.+
అధస్సూచీలు
^ అక్ష., “విత్తనాన్ని.”
^ లేదా “సమాజంలో.”
^ అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
^ ఐగుప్తును లేదా దాని ఫరోను సూచిస్తుండవచ్చు.
^ లేదా “సంతోషంగా ఉంటారు.”
^ అక్ష., “కొమ్ము.”
^ అక్ష., “కొమ్ము.”
^ లేదా “అధికారాన్ని.”
^ అక్ష., “బండరాయివి.”
^ అక్ష., “విత్తనాన్ని.”
^ లేదా “న్యాయనిర్ణయాల.”
^ లేదా “తిరుగుబాటును.”
^ అక్ష., “నా నమ్మకత్వాన్ని వమ్ముచేయను.”
^ అక్ష., “విత్తనం.”
^ లేదా “రాతి ఆశ్రయాలన్నిటినీ.”
^ అక్ష., “విరోధుల కుడిచేతిని పైకెత్తావు.”
^ లేదా “చేతి.”