కీర్తనలు 90:1-17

  • దేవుడు నిత్యుడు, మనిషి కొద్దికాలమే జీవిస్తాడు

    • వెయ్యి సంవత్సరాలు నిన్నలా (4)

    • మనిషి 70-80 ఏళ్లు బ్రతుకుతాడు (10)

    • “మా రోజులు లెక్కపెట్టడం మాకు నేర్పించు” (12)

సత్యదేవుని సేవకుడైన మోషే ప్రార్థన.+ 90  యెహోవా, తరతరాలుగా నువ్వే మా నివాస స్థలానివి.*+   పర్వతాలు పుట్టకముందు,భూమిని, పండే నేలను నువ్వు ఉనికిలోకి* తేకముందు,+యుగయుగాలు* నువ్వే దేవుడివి.+   నువ్వు మనుషుల్ని తిరిగి మట్టికి చేరేలా చేస్తున్నావు;“మనుషులారా, తిరిగిరండి” అని అంటున్నావు.+   నీ దృష్టికి వెయ్యి సంవత్సరాలు గడిచిపోయిన నిన్నటిలా,+రాత్రిపూట ఒక జాములా ఉన్నాయి.   నువ్వు వాళ్లను తుడిచిపెట్టేస్తావు;+ వాళ్లు కేవలం ఒక కలలా మాయమైపోతారు;ఉదయం వాళ్లు చిగురించే పచ్చగడ్డిలా ఉంటారు.+   పొద్దున అది వికసించి కొత్తగా చిగురిస్తుంది,కానీ సాయంత్రంకల్లా వాడిపోయి ఎండిపోతుంది.+   ఎందుకంటే, నీ కోపం మమ్మల్ని దహించేస్తోంది,+నీ ఆగ్రహం వల్ల మేము హడలిపోతున్నాం.   నువ్వు మా తప్పుల్ని నీ ఎదుట ఉంచుకున్నావు;*+మేము రహస్యంగా చేసిన పనులు నీ ముఖకాంతిలో వెల్లడౌతున్నాయి.+   నీ కోపం వల్ల మా రోజులు* తగ్గిపోతున్నాయి;మా సంవత్సరాలు నిట్టూర్పులా ముగిసిపోతున్నాయి. 10  మా ఆయుష్షు 70 సంవత్సరాలు,మరీ ఎక్కువ బలం ఉంటే 80 సంవత్సరాలు.+ కానీ అవి కష్టాలతో, కన్నీళ్లతో నిండివుంటాయి;అవి ఇట్టే గడిచిపోతాయి, మేము లేకుండాపోతాం.*+ 11  నీ కోపం తీవ్రతను ఎవరు అర్థంచేసుకోగలరు? నీ ఆగ్రహం నీకు చెందాల్సిన భక్తి అంత గొప్పది.+ 12  మేము తెలివిగల హృదయం సంపాదించుకునేలామా రోజులు లెక్కపెట్టడం మాకు నేర్పించు.+ 13  యెహోవా, తిరిగి రా! ఇంకా ఎంతకాలం ఇలా?+ నీ సేవకుల మీద జాలి చూపించు.+ 14  ఉదయం నీ విశ్వసనీయ ప్రేమతో మమ్మల్ని తృప్తిపర్చు,+అప్పుడు మా రోజులన్నిట్లో మేము సంతోషంతో కేకలు వేస్తూ ఉల్లసిస్తాం. 15  నువ్వు మమ్మల్ని కష్టాలపాలు చేసిన రోజులకు తగ్గట్టు,మేము విపత్తు అనుభవించిన సంవత్సరాలకు తగ్గట్టు+ మమ్మల్ని సంతోషపెట్టు.+ 16  నీ సేవకులు నీ కార్యాన్ని చూడాలి,వాళ్ల కుమారులు నీ వైభవాన్ని చూడాలి.+ 17  మా దేవుడైన యెహోవా చల్లనిచూపు మామీద ఉండాలి;మా చేతుల పనిని నువ్వు వర్ధిల్లజేయాలి.* అవును, మా చేతుల పనిని వర్ధిల్లజేయి.*+

అధస్సూచీలు

లేదా “మా ఆశ్రయానివి” అయ్యుంటుంది.
లేదా “పురిటినొప్పులతో కన్నట్టు ఉనికిలోకి.”
లేదా “శాశ్వతకాలం నుండి శాశ్వతకాలం వరకు.”
లేదా “మా తప్పులు నీకు తెలుసు.”
లేదా “జీవితం.”
లేదా “ఎగిరిపోతాం.”
లేదా “స్థిరపర్చాలి.”
లేదా “స్థిరపర్చు.”