గలతీయులు 6:1-18
6 సహోదరులారా, ఒక వ్యక్తి తెలియక తప్పటడుగు వేసినా సరే, పరిణతిగల* మీరు సౌమ్యంగా+ అతన్ని సరైన దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నించండి. అయితే, మీరు కూడా ప్రలోభానికి గురయ్యే ప్రమాదముందని+ గుర్తుంచుకొని మీ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి.+
2 ఒకరి భారం ఒకరు మోసుకుంటూ,+ అలా క్రీస్తు నియమాన్ని పాటించండి.+
3 ఒక వ్యక్తి ఏమీ కాకపోయినా తాను గొప్పవాణ్ణని అనుకుంటే,+ అతను తనను తాను మోసం చేసుకుంటున్నాడు.
4 అయితే ప్రతీ వ్యక్తి తాను చేసే పనుల్ని పరిశీలించుకోవాలి,+ అంతేగానీ వేరేవాళ్లతో పోల్చుకోకూడదు.+ అప్పుడు, తాను చేసే పనుల వల్లే అతనికి సంతోషం కలుగుతుంది.
5 ఎందుకంటే, ప్రతీ వ్యక్తి తన బరువు* తానే మోసుకోవాలి.+
6 అంతేకాదు, దేవుని వాక్యాన్ని నేర్చుకునేవాళ్లు,* తమకు దాన్ని నేర్పేవాళ్లతో* మంచి వాటన్నిటినీ పంచుకోవాలి.+
7 మోసపోకండి, దేవుణ్ణి వెక్కిరించలేం. ఎందుకంటే మనిషి ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు;+
8 శరీర కోరికల ప్రకారం విత్తే వ్యక్తి, తన శరీరం నుండి నాశనం* అనే పంట కోస్తాడు. పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం విత్తే వ్యక్తి, పవిత్రశక్తి వల్ల శాశ్వత జీవితం అనే పంట కోస్తాడు.+
9 కాబట్టి మనం మానకుండా మంచిపనులు చేద్దాం; ఎందుకంటే, మనం అలసిపోకుండా ఉంటే* సరైన సమయంలో పంట కోస్తాం.+
10 అందుకే మనకు అవకాశం* ఉన్నంతవరకు అందరికీ మంచి చేద్దాం, ముఖ్యంగా తోటి విశ్వాసులకు.
11 నేను నా స్వహస్తాలతో ఎంత పెద్దపెద్ద అక్షరాలతో ఈ ఉత్తరం రాశానో చూడండి.
12 మనుషుల్ని మెప్పించాలని* అనుకునేవాళ్లే మిమ్మల్ని సున్నతి చేయించుకోమని బలవంతపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. క్రీస్తు హింసాకొయ్య* గురించి ఎదురయ్యే హింసల్ని తప్పించుకోవడానికే వాళ్లు అలా చేస్తున్నారు.
13 నిజానికి సున్నతి చేయించుకుంటున్నవాళ్లు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించరు,+ అయితే సున్నతి చేయించుకునేలా మిమ్మల్ని ఒప్పించామని గొప్పలు చెప్పుకోవడానికే వాళ్లు మిమ్మల్ని సున్నతి చేయించుకోమంటారు.
14 నేను మాత్రం, మన ప్రభువైన యేసుక్రీస్తు హింసాకొయ్య* విషయంలో తప్ప ఇంకే విషయంలోనూ గొప్పలు చెప్పుకోను.+ ఆయన వల్ల నా దృష్టిలో లోకం, లోకం దృష్టిలో నేను చనిపోయాం.*
15 ఎందుకంటే సున్నతి చేయించుకోవడంలో గానీ చేయించుకోకపోవడంలో గానీ ఏమీలేదు;+ కానీ కొత్త సృష్టి అయ్యామా లేదా అన్నదే ముఖ్యం.+
16 ఈ నియమం* ప్రకారం జీవించేవాళ్ల విషయానికొస్తే, వాళ్లమీద అంటే దేవుని ఇశ్రాయేలు+ మీద శాంతి, కరుణ ఉండాలి.
17 ఇకమీదట ఎవరూ నన్ను ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే నేను యేసు దాసుణ్ణని చూపించే ముద్రలు నా ఒంటి మీద ఉన్నాయి.+
18 సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు అపారదయ మీరు చూపించే స్ఫూర్తికి తోడుండాలి. ఆమేన్.
అధస్సూచీలు
^ లేదా “ఆధ్యాత్మిక అర్హతలు గల.”
^ లేదా “బాధ్యత అనే బరువు.”
^ లేదా “ఉపదేశం పొందేవాళ్లు.”
^ లేదా “ఉపదేశించేవాళ్లతో.”
^ లేదా “కుళ్లు; క్షయం.”
^ లేదా “మానకుండా చేస్తే.”
^ అక్ష., “నియమిత సమయం.”
^ లేదా “పైకి మంచివాళ్లలా కనిపించాలని.”
^ లేదా “కొయ్య శిక్షకు గురయ్యాం.”
^ లేదా “ప్రవర్తనా నియమం.”