జెకర్యా 10:1-12

  • వర్షం కోసం అబద్ధ దేవతల్ని కాదు యెహోవాను వేడుకోండి (1, 2)

  • యెహోవా తన ప్రజల్ని ఐక్యం చేస్తాడు (3-12)

    • యూదా నుండి ప్రధానుడు (3, 4)

10  “కడవరి వాన* కోసం యెహోవాను వేడుకోండి. కారుమబ్బులు కమ్ముకునేలా చేసేది యెహోవాయే,ప్రజల కోసం వర్షాలు కురిపించేది ఆయనే,+ప్రతీ ఒక్కరి కోసం పొలాల్లో పంట పండేలా చేసేది ఆయనే.   గృహదేవతలు మోసపూరితంగా* మాట్లాడాయి;సోదె చెప్పేవాళ్లు బూటకపు దర్శనాలు చూశారు. వాళ్లు వ్యర్థమైన కలల గురించి మాట్లాడతారు,ఓదార్చడానికి వాళ్లు చేసే ప్రయత్నాలన్నీ వ్యర్థమే. అందుకే ప్రజలు గొర్రెల్లా అటూఇటూ తిరుగుతారు. కాపరి లేకపోవడం వల్ల బాధపడతారు.   కాపరుల మీద నా కోపం రగులుకుంటుంది,అణచివేసే నాయకుల్ని* నేను లెక్క అడుగుతాను;ఎందుకంటే, సైన్యాలకు అధిపతైన యెహోవా తన మంద అయిన యూదా ఇంటివాళ్ల మీద దృష్టి పెట్టాడు,+ఆయన వాళ్లను యుద్ధంలోని తన రాచగుర్రంలా చేశాడు.   అతని* నుండి ప్రధానుడు* వస్తాడు,అతని నుండి మద్దతిచ్చే పరిపాలకుడు* వస్తాడు,అతని నుండి యుద్ధపు విల్లు వస్తుంది;ప్రతీ పర్యవేక్షకుడు అతని నుండే వస్తాడు, వాళ్లంతా కలిసి బయల్దేరతారు.   వాళ్లు యోధుల్లా అవుతారు,యుద్ధంలో వీధుల బురద తొక్కుకుంటూ వెళ్తారు. వాళ్లు యుద్ధం చేస్తారు, ఎందుకంటే యెహోవా వాళ్లకు తోడున్నాడు;+గుర్రపురౌతులు అవమానం పాలౌతారు.+   నేను యూదా ఇంటివాళ్లను బలశాలుల్ని చేస్తాను,యోసేపు ఇంటివాళ్లను కాపాడతాను.+ వాళ్లను ఒకప్పటి స్థితికి తీసుకొస్తాను,ఎందుకంటే నేను వాళ్లమీద కరుణ చూపిస్తాను;+వాళ్లు, నేను అసలెన్నడూ వెళ్లగొట్టని ప్రజల్లా తయారౌతారు.+నేను వాళ్ల దేవుడైన యెహోవాను, నేను వాళ్ల ప్రార్థనలకు జవాబిస్తాను.   ఎఫ్రాయిము వాళ్లు బలమైన యోధుల్లా అవుతారు,ద్రాక్షారసం తాగినట్టు వాళ్ల హృదయం సంతోషిస్తుంది.+ వాళ్ల కుమారులు దీన్ని చూసి సంతోషిస్తారు;యెహోవాను బట్టి వాళ్ల హృదయాలు సంతోషిస్తాయి.+   ‘నేను ఈల వేసి వాళ్లందర్నీ ఒక్కచోటికి తెస్తాను;నేను వాళ్లను విడిపిస్తాను,+ వాళ్లు ఎక్కువమంది అవుతారు,వాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది.   నేను వాళ్లను ప్రజల మధ్య విత్తనాల్లా వెదజల్లినా,సుదూర దేశాల్లో వాళ్లు నన్ను గుర్తుచేసుకుంటారు;వాళ్లు, వాళ్ల కుమారులు బలం పుంజుకుని తిరిగొస్తారు. 10  నేను వాళ్లను ఐగుప్తు* దేశం నుండి వెనక్కి తీసుకొస్తాను,అష్షూరు నుండి పోగుచేస్తాను;+వాళ్లందరికీ సరిపడా స్థలం ఉండకపోవడం వల్ల+నేను వాళ్లను గిలాదు దేశానికి, లెబానోను దేశానికి తీసుకొస్తాను.+ 11  సముద్రం వాళ్ల దారిని అడ్డగించినప్పుడు,నేను దాని గుండా వెళ్లి దాని అలల్ని చెదరగొడతాను;+నైలు నది వాళ్లకు అడ్డు వచ్చినప్పుడు, నేను దాని నీళ్లన్నిటినీ ఆరిపోజేస్తాను. అష్షూరు పొగరు అణచివేయబడుతుంది,ఐగుప్తు రాజదండం తీసేయబడుతుంది.+ 12  యెహోవానైన నేనే వాళ్లను బలశాలుల్ని చేస్తాను,+వాళ్లు నా పేరును ఘనపర్చే విధంగా నడుచుకుంటారు’+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”

అధస్సూచీలు

కడవరి వానలు దాదాపు ఏప్రిల్‌ మధ్యలో మొదలయ్యేవి. అనుబంధం B15 చూడండి.
లేదా “దుష్టశక్తుల నుండి వచ్చిన మాటలు; అంతుచిక్కని మాటలు.”
అక్ష., “మేకపోతుల్ని.”
అంటే, యూదా.
అక్ష., “మూలలోని బురుజు.” ఈ పదం ప్రముఖునికి (ప్రధానుడికి) చిత్రీకరణగా ఉంది.
లేదా “మేకు.” ఈ పదం మద్దతిచ్చే వ్యక్తికి (పరిపాలకునికి) చిత్రీకరణగా ఉంది.
లేదా “ఈజిప్టు.”