జెకర్యా 11:1-17
11 “లెబానోనూ, నీ తలుపులు తెరువు,అప్పుడు అగ్ని వచ్చి నీ దేవదారు వృక్షాల్ని కాల్చేస్తుంది.
2 సరళవృక్షాల్లారా,* ఏడ్వండి.ఎందుకంటే, దేవదారు వృక్షాలు పడిపోయాయి;
మహా వృక్షాలు పడగొట్టబడ్డాయి!
బాషానులోని సింధూర వృక్షాల్లారా, ఏడ్వండి.
ఎందుకంటే, దట్టమైన అడవి నాశనం చేయబడింది!
3 కాపరుల ఏడ్పులు వినండి!ఎందుకంటే, వాళ్ల వైభవం పడిపోయింది.
కొదమ సింహాల గర్జన వినండి!ఎందుకంటే, యొర్దాను పొడవునా ఉన్న దట్టమైన పొదలు నాశనం చేయబడ్డాయి.
4 “నా దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘వధకు గురికాబోతున్న మందను కాయి,+
5 కొనేవాళ్లు వాటిని చంపినా,+ వాళ్లు అపరాధులుగా ఎంచబడట్లేదు. వాటిని అమ్మేవాళ్లు,+ “యెహోవా స్తుతించబడాలి, ఎందుకంటే నేను ధనవంతుణ్ణి అవుతాను” అంటారు. వాటి కాపరులకు వాటి మీద ఏమాత్రం కనికరం లేదు.’+
6 “ ‘దేశ నివాసుల మీద నేను ఇక ఏమాత్రం కనికరం చూపించను. నేను ప్రతీ మనిషిని తన పొరుగువాని చేతికి, తన రాజు చేతికి అప్పగిస్తాను; వాళ్లు దేశాన్ని అణచివేస్తారు, వాళ్ల చేతి నుండి నేను ప్రజల్ని కాపాడను’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”
7 మందలో బాధించబడిన ప్రజలారా, వధ కోసం ఉంచిన మిమ్మల్ని మీ మంచి కోసమే నేను కాయడం మొదలుపెట్టాను.+ కాబట్టి నేను రెండు కర్రలు తీసుకొని ఒకదానికి మనోహరం అని, ఇంకోదానికి ఐక్యత+ అని పేరు పెట్టి, మందను కాయడం మొదలుపెట్టాను.
8 నేను ఒక్క నెలలోనే ముగ్గురు కాపరుల్ని తీసేశాను. ఎందుకంటే వాళ్ల విషయంలో నా సహనం నశించింది, వాళ్లు కూడా నన్ను అసహ్యించుకున్నారు.
9 అప్పుడు నేను ఇలా అన్నాను: “నేను మిమ్మల్ని ఇలాగే కాస్తూ ఉండను. చనిపోతున్న వాళ్లను చనిపోనివ్వండి, నాశనమౌతున్న వాళ్లను నాశనం కానివ్వండి. మిగిలినవాళ్లనేమో ఒకరి మాంసం ఒకరు తిననివ్వండి.”
10 అప్పుడు నేను మనోహరం అనే నా కర్రను+ తీసుకుని, దాన్ని నరికి, ప్రజలందరితో నేను చేసిన నా ఒప్పందాన్ని రద్దు చేశాను.
11 కాబట్టి ఆ రోజు అది రద్దయింది, నన్ను చూస్తున్న ఆ మందలోని బాధించబడినవాళ్లకు ఆ సందేశం యెహోవా వాక్యం అని తెలుసు.
12 తర్వాత నేను, “మీకు మంచిదనిపిస్తే నా జీతం నాకివ్వండి, లేకపోతే ఇవ్వకండి” అని వాళ్లతో అన్నాను. అప్పుడు వాళ్లు నా జీతం నాకు ఇచ్చారు,* అది 30 వెండి రూకలు.+
13 తర్వాత యెహోవా నాతో, “వాళ్లు నాకు గొప్ప వెలే కట్టారు,+ దాన్ని మందిర ఖజానాలోకి విసిరేయి” అని చెప్పాడు. కాబట్టి నేను ఆ 30 వెండి రూకలు తీసుకుని, యెహోవా మందిర ఖజానాలోకి విసిరేశాను.+
14 తర్వాత నేను ఐక్యత అనే నా రెండో కర్రను+ నరికి యూదా, ఇశ్రాయేలుల మధ్య ఉన్న సహోదరత్వాన్ని తెంచేశాను.+
15 అప్పుడు యెహోవా నాకు ఇలా చెప్పాడు: “ఇప్పుడు, పనికిరాని ఒక కాపరి+ పనిముట్లను తీసుకో.
16 ఎందుకంటే, నేను దేశంలో ఒక కాపరిని రానిస్తున్నాను. అతను నశించిపోతున్న గొర్రెల్ని పట్టించుకోడు;+ అతను వాటి పిల్లల కోసం వెదకడు, గాయపడిన వాటిని బాగుచేయడు,+ ఆరోగ్యంగా ఉన్నవాటికి మేత పెట్టడు. బదులుగా, కొవ్వినవాటి మాంసాన్ని మింగేస్తాడు,+ గొర్రెల డెక్కల్ని* చీల్చేస్తాడు.+
17 మందను విడిచిపెడుతున్న+ పనికిరాని కాపరికి శ్రమ!+
ఒక ఖడ్గం వచ్చి అతని చేతిని, కుడి కంటిని కొడుతుంది.
అతని చెయ్యి పూర్తిగా ఎండిపోతుంది,అతని కుడి కన్ను పూర్తిగా గుడ్డిదవుతుంది.”*
అధస్సూచీలు
^ అంటే, జూనిపర్ చెట్లు.
^ అక్ష., “తూచి ఇచ్చారు.”
^ లేదా “గిట్టల్ని.”
^ అక్ష., “మందగిస్తుంది.”