జెకర్యా 12:1-14
12 ఒక సందేశం.
ఆకాశాన్ని పరిచిన,+భూమికి పునాది వేసిన,+మనిషికి ఊపిరిని* ఇచ్చిన యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు:“ఇశ్రాయేలు గురించిన యెహోవా వాక్యం ఇదే.
2 “ఇదిగో నేను యెరూషలేమును ఒక గిన్నెలా చేస్తున్నాను, అది చుట్టుపక్కలున్న ప్రజల్ని మత్తెక్కి తూలేలా చేస్తుంది; అంతేకాదు యూదా, యెరూషలేములు ముట్టడి వేయబడతాయి.+
3 ఆ రోజున, నేను యెరూషలేమును దేశాల ప్రజలందరికీ బరువైన* రాయిలా చేస్తాను. దాన్ని ఎత్తేవాళ్లందరూ తప్పకుండా తీవ్రంగా గాయపడతారు;+ భూమ్మీదున్న దేశాలన్నీ దానికి వ్యతిరేకంగా పోగుచేయబడతాయి.”+
4 యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు, “ఆ రోజున, నేను ప్రతీ గుర్రాన్ని బెదరగొడతాను, వాటి రౌతుల్ని పిచ్చివాళ్లను చేస్తాను. నేను నా దృష్టిని యూదా ఇంటివాళ్లమీద ఉంచుతాను, కానీ దేశాల గుర్రాలన్నిటినీ గుడ్డితనంతో మొత్తుతాను.
5 యూదాలోని షేక్‌లు* తమ హృదయాల్లో ఇలా అనుకుంటారు: ‘యెరూషలేము నివాసులే మా బలం. ఎందుకంటే, సైన్యాలకు అధిపతైన యెహోవా వాళ్ల దేవుడు.’+
6 ఆ రోజున, యూదా షేక్‌లను అడవిలోని కార్చిచ్చులా, కోత కోసిన పనల మధ్య కాగడాలా చేస్తాను,+ వాళ్లు తమ కుడివైపు, ఎడమవైపు చుట్టుపక్కల ఉన్న ప్రజలందర్నీ కాల్చేస్తారు;+ యెరూషలేము నివాసులు మళ్లీ తమ సొంత నగరమైన యెరూషలేములో నివసిస్తారు.+
7 “దావీదు ఇంటివాళ్ల వైభవం,* యెరూషలేము నివాసుల వైభవం* యూదాను మించిపోకుండా ఉండేలా, యెహోవా ముందుగా యూదా డేరాల్ని కాపాడతాడు.
8 ఆ రోజున, యెరూషలేము నివాసుల చుట్టూ యెహోవా కవచంలా ఉంటాడు;+ ఆ రోజున, వాళ్ల మధ్య అత్యంత బలహీనమైన* వ్యక్తి దావీదులా ఉంటాడు; దావీదు ఇంటివాళ్లు ప్రజల్ని నడిపిస్తున్న యెహోవా దూతలా ఉంటారు.+
9 ఆ రోజున, యెరూషలేము మీదికి వచ్చే దేశాలన్నిటినీ నేను ఖచ్చితంగా తుడిచిపెట్టేస్తాను.+
10 “నేను దావీదు ఇంటివాళ్ల మీద, యెరూషలేము నివాసుల మీద నా పవిత్రశక్తిని కుమ్మరిస్తాను, దానివల్ల వాళ్లు నా అనుగ్రహం పొందుతారు, తమ ప్రార్థనలకు జవాబులు పొందుతారు; వాళ్లు తాము పొడిచిన వ్యక్తి వైపు చూస్తారు,+ తమ ఒక్కగానొక్క కుమారుడు చనిపోతే ఏడ్చినట్టు ఆయన కోసం ఏడుస్తారు; పెద్ద కుమారుడు చనిపోతే దుఃఖించినట్టు ఆయన కోసం తీవ్రంగా దుఃఖిస్తారు.
11 ఆ రోజున, యెరూషలేము రోదన ఎంత ఎక్కువగా ఉంటుందంటే మెగిద్దో మైదానంలోని+ హదద్రిమ్మోను దగ్గరి రోదనలా ఉంటుంది.
12 దేశమంతా ఏడుస్తుంది, ప్రజలు గుంపుల వారీగా ఏడుస్తారు. దావీదు వంశస్థులు, వాళ్ల స్త్రీలు; నాతాను వంశస్థులు,+ వాళ్ల స్త్రీలు;
13 లేవి వంశస్థులు,+ వాళ్ల స్త్రీలు; షిమీయుల వంశస్థులు,+ వాళ్ల స్త్రీలు;
14 మిగిలిన వంశాల వాళ్లందరూ, వాళ్ల స్త్రీలు గుంపుల వారీగా ఏడుస్తారు.
అధస్సూచీలు
^ పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.
^ లేదా “భారమైన.”
^ షేక్ అంటే గోత్రపు పెద్ద.
^ లేదా “అందం.”
^ లేదా “అందం.”
^ లేదా “తడబడే.”