జెకర్యా 2:1-13

  • 3వ దర్శనం: కొలనూలు పట్టుకున్న వ్యక్తి (1-13)

    • యెరూషలేము కొలవబడుతుంది (2)

    • యెహోవా “అగ్ని ప్రాకారంగా” ఉంటాడు (5)

    • దేవుని కనుగుడ్డును ముట్టుకున్నట్టే (8)

    • చాలా దేశాలు యెహోవా పక్షాన చేరుతాయి (11)

2  ఆ తర్వాత నేను తల ఎత్తి చూసినప్పుడు, చేతిలో కొలనూలు ఉన్న ఒకతను నాకు కనిపించాడు.  అప్పుడు నేను, “నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?” అని అడిగాను. అందుకతను, “యెరూషలేము వెడల్పు, పొడవు ఎంతో కొలవడానికి వెళ్తున్నాను” అన్నాడు.  నాతో మాట్లాడుతున్న దేవదూత అక్కడి నుండి వెళ్లిపోయాడు, అతన్ని కలవడానికి ఇంకొక దేవదూత వచ్చాడు.  ఆ దేవదూత అతనితో ఇలా అన్నాడు: “నువ్వు అక్కడికి పరుగెత్తుకొని వెళ్లి ఆ యువకునితో ఇలా చెప్పు: ‘ “యెరూషలేములోని మనుషుల సంఖ్య, పశువుల సంఖ్య+ చాలా ఎక్కువౌతుంది.+ దానివల్ల అది ప్రాకారాలు లేని పల్లెటూరిలా తయారౌతుంది.  నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను,+ నేను యెరూషలేమును నా మహిమతో నింపుతాను”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.’ ”  “రండి! రండి! ఉత్తర దేశం నుండి పారిపోయి రండి”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు. “ఎందుకంటే నేను మిమ్మల్ని నలుదిక్కులకు* చెదరగొట్టాను”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.  “సీయోనూ, రా! బబులోను కూతురితో నివసిస్తున్నదానా, పారిపోయి రా!+  తాను మహిమపర్చబడిన తర్వాత, మిమ్మల్ని కొల్లగొడుతున్న దేశాల దగ్గరికి+ నన్ను పంపిన సైన్యాలకు అధిపతైన యెహోవా ఏమంటున్నాడంటే, ‘ఎవరైనా మిమ్మల్ని ముట్టుకుంటే, వాళ్లు నా కనుగుడ్డును* ముట్టుకున్నట్టే.+  ఇప్పుడు నేను వాళ్ల మీదికి నా చెయ్యి ఎత్తుతాను, వాళ్ల బానిసలే వాళ్లను కొల్లగొడతారు.’+ అప్పుడు సైన్యాలకు అధిపతైన యెహోవాయే నన్ను పంపాడని మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. 10  “సీయోను కూతురా, సంతోషంతో కేకలు వేయి; ఎందుకంటే నేను వస్తున్నాను,+ నేను నీ మధ్య నివసిస్తాను”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు. 11  “ఆ రోజున, చాలా దేశాలు యెహోవా పక్షాన చేరుతాయి,+ ఆ దేశాల వాళ్లు నా ప్రజలౌతారు; నేను నీ మధ్య నివసిస్తాను.” అప్పుడు సైన్యాలకు అధిపతైన యెహోవాయే నన్ను నీ దగ్గరికి పంపాడని నువ్వు తెలుసుకుంటావు. 12  యెహోవా యూదాను పవిత్రనేలలో తన వాటాగా తీసుకుంటాడు, ఆయన మళ్లీ యెరూషలేమును ఎంచుకుంటాడు.+ 13  మనుషులారా, మీరంతా యెహోవా ముందు మౌనంగా ఉండండి. ఎందుకంటే ఆయన తన పవిత్ర నివాసం నుండి చర్య తీసుకుంటున్నాడు.

అధస్సూచీలు

అక్ష., “ఆకాశపు నాలుగు గాలుల వైపుకు.”
లేదా “కనుపాపను.”