జెకర్యా 4:1-14
4 అంతకుముందు నాతో మాట్లాడిన దేవదూత తిరిగొచ్చి, నిద్రపోతున్న వ్యక్తిని లేపినట్టు నన్ను లేపి,
2 “నీకేం కనిపిస్తోంది?” అని అడిగాడు.
దానికి నేను ఇలా చెప్పాను: “ఇదిగో, పూర్తిగా బంగారంతో చేసిన ఒక దీపస్తంభం+ నాకు కనిపిస్తోంది, దానిపైన ఒక గిన్నె ఉంది. దానిమీద ఏడు దీపాలు ఉన్నాయి,+ అవును ఏడు దీపాలు ఉన్నాయి. దీపస్తంభం మీదున్న ఆ దీపాలకు ఏడు గొట్టాలు ఉన్నాయి.
3 దాని పక్కన రెండు ఒలీవ చెట్లు ఉన్నాయి.+ అవి ఆ గిన్నెకు కుడివైపు ఒకటి, ఎడమవైపు ఒకటి ఉన్నాయి.”
4 అప్పుడు నేను, “నా ప్రభువా, ఇవి దేన్ని సూచిస్తున్నాయి?” అని నాతో మాట్లాడుతున్న దేవదూతను అడిగాను.
5 అందుకు నాతో మాట్లాడుతున్న ఆ దేవదూత “ఇవి దేన్ని సూచిస్తున్నాయో నీకు తెలీదా?” అని అడిగాడు.
దానికి నేను, “నా ప్రభువా, తెలీదు” అన్నాను.
6 అప్పుడతను నాతో ఇలా అన్నాడు: “జెరుబ్బాబెలుకు యెహోవా చెప్పేదేమిటంటే, ‘ “సైన్యాల వల్లో, మనుషుల శక్తి వల్లో కాదుగానీ+ నా పవిత్రశక్తి వల్లే ఇదంతా జరుగుతుంది”+ అని సైన్యాలకు అధిపతైన యెహోవా అంటున్నాడు.
7 గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు+ ముందు నువ్వు ఎంతటిదానివి? నువ్వు చదును చేయబడతావు.*+ అతను పైరాయిని తీసుకొస్తున్నప్పుడు, ప్రజలు “ఎంత అద్భుతం! ఎంత అద్భుతం!” అని కేకలు వేస్తారు.’ ”
8 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది:
9 “జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరానికి పునాది వేశాయి,+ అతని చేతులే దాన్ని పూర్తి చేస్తాయి.+ అప్పుడు సైన్యాలకు అధిపతైన యెహోవాయే నన్ను మీ దగ్గరికి పంపించాడని మీరు తెలుసుకుంటారు.
10 పనులు చిన్నగా మొదలైన రోజును చిన్నచూపు చూడకండి.+ ఎందుకంటే ప్రజలు సంతోషిస్తారు, జెరుబ్బాబెలు చేతిలో లంబసూత్రం* చూస్తారు. ఆ ఏడు కళ్లు, భూమంతటా సంచరిస్తున్న యెహోవా కళ్లు.”+
11 అప్పుడు నేను, “దీపస్తంభానికి కుడివైపు, ఎడమవైపు ఉన్న ఈ రెండు ఒలీవచెట్లు దేన్ని సూచిస్తున్నాయి?” అని అతన్ని అడిగాను.+
12 రెండోసారి నేను అతన్ని, “రెండు బంగారు గొట్టాల ద్వారా బంగారు ద్రవాన్ని పోస్తున్న ఆ రెండు ఒలీవ చెట్ల కొమ్మలు దేన్ని సూచిస్తున్నాయి?” అని అడిగాను.
13 అందుకతను, “ఇవి దేన్ని సూచిస్తున్నాయో నీకు తెలీదా?” అని నన్ను అడిగాడు.
దానికి నేను, “నా ప్రభువా, తెలీదు” అన్నాను.
14 అప్పుడతను “ఇవి, సర్వలోక ప్రభువు పక్కన నిల్చున్న ఇద్దరు అభిషిక్తుల్ని సూచిస్తున్నాయి” అని చెప్పాడు.+