జెకర్యా 5:1-11

  • 6వ దర్శనం: ఎగురుతున్న గ్రంథపుచుట్ట (1-4)

  • 7వ దర్శనం: ఈఫా పాత్ర (5-11)

    • పాత్ర లోపల దుష్టత్వం అనే స్త్రీ (8)

    • పాత్ర షీనారుకు తీసుకెళ్లబడడం (9-11)

5  మళ్లీ నేను తల ఎత్తి చూశాను, ఎగురుతున్న ఒక గ్రంథపుచుట్ట నాకు కనిపించింది.  అతను నన్ను, “నీకేం కనిపిస్తోంది?” అని అడిగాడు. అందుకు నేను, “ఎగురుతున్న గ్రంథపుచుట్ట ఒకటి కనిపిస్తోంది. అది 20 మూరల* పొడవు, 10 మూరల వెడల్పు ఉంది” అని చెప్పాను.  అప్పుడతను నాకు ఇలా చెప్పాడు: “ఇది భూమంతటి మీదికి వెళ్తున్న శాపం. ఎందుకంటే, దానికి ఒకవైపు రాసి ఉన్న ప్రకారం, దొంగిలించే వాళ్లందరికీ+ శిక్ష పడలేదు; దానికి ఇంకోవైపు రాసి ఉన్న ప్రకారం, అబద్ధ ప్రమాణం చేసే వాళ్లందరికీ+ శిక్ష పడలేదు.  ‘నేనే దాన్ని పంపించాను, అది దొంగ ఇంట్లోకి, నా పేరున అబద్ధ ప్రమాణం చేసేవాడి ఇంట్లోకి ప్రవేశించి, అందులోనే ఉండి ఆ ఇంటిని, దాని కలపను, దాని రాళ్లను నాశనం చేస్తుంది’ అని సైన్యాలకు అధిపతైన యెహోవా ప్రకటిస్తున్నాడు.”  తర్వాత నాతో మాట్లాడుతున్న దేవదూత ముందుకొచ్చి, “దయచేసి నీ తల ఎత్తి, బయటికి వెళ్తున్నది ఏమిటో చూడు” అని నాతో అన్నాడు.  నేను, “అదేమిటి?” అని అడిగాను. అందుకతను, “బయటికి వెళ్తున్నది ఈఫా పాత్ర”* అన్నాడు. తర్వాత అతను, “ఇది భూమంతటా ఉన్న చెడ్డ ప్రజల రూపం” అని చెప్పాడు.  ఆ తర్వాత నేను, దాని గుండ్రటి సీసపు మూత తీయబడడం, ఆ పాత్రలో ఒక స్త్రీ కూర్చొని ఉండడం చూశాను.  అప్పుడతను, “ఇది దుష్టత్వం” అని అన్నాడు. తర్వాత అతను ఆ స్త్రీని మళ్లీ ఆ ఈఫా పాత్రలోకి నెట్టేసి, దానిమీద సీసపు మూత పెట్టాడు.  తర్వాత నేను తల ఎత్తి చూసినప్పుడు, ఇద్దరు స్త్రీలు ముందుకు రావడం కనిపించింది, వాళ్లు గాలిలో ఎగురుతున్నారు. వాళ్లకు సంకుబుడి కొంగ రెక్కల్లాంటి రెక్కలు ఉన్నాయి. వాళ్లు ఆ పాత్రను భూమ్యాకాశాల మధ్యకు ఎత్తారు. 10  అప్పుడు నేను, “వాళ్లు ఈఫా పాత్రను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?” అని నాతో మాట్లాడుతున్న దేవదూతను అడిగాను. 11  అందుకతను ఇలా చెప్పాడు: “ఆమె కోసం ఒక ఇల్లును కట్టడానికి షీనారు దేశానికి*+ తీసుకెళ్తున్నారు; అది కట్టడం పూర్తయినప్పుడు ఆమెను అక్కడ తగిన చోట పెడతారు.”

అధస్సూచీలు

అప్పట్లో ఒక మూర 44.5 సెంటీమీటర్లతో (17.5 అంగుళాలతో) సమానం. అనుబంధం B14 చూడండి.
అక్ష., “ఈఫా.” ఇక్కడ ఒక ఈఫాను కొలిచే పాత్రను లేదా బుట్టను సూచిస్తోంది. అప్పట్లో ఒక ఈఫా 22 లీటర్లతో (13 కిలోలతో) సమానం. అనుబంధం B14 చూడండి.
అంటే, బాబిలోనియా.