జెకర్యా 6:1-15
6 తర్వాత నేను మళ్లీ తల ఎత్తి చూశాను, అప్పుడు రెండు పర్వతాల మధ్య నుండి నాలుగు రథాలు రావడం కనిపించింది, ఆ పర్వతాలు రాగివి.
2 మొదటి రథానికి ఎర్రని గుర్రాలు, రెండో రథానికి నల్లని గుర్రాలు+ ఉన్నాయి.
3 మూడో రథానికి తెల్లని గుర్రాలు ఉన్నాయి; నాలుగో రథానికి మచ్చలు ఉన్న గుర్రాలు, పొడలు ఉన్న గుర్రాలు+ ఉన్నాయి.
4 అప్పుడు నేను, “నా ప్రభువా, ఇవి ఏమిటి?” అని నాతో మాట్లాడుతున్న దేవదూతను అడిగాను.
5 ఆ దేవదూత ఇలా చెప్పాడు: “ఇవి నాలుగు పరలోక సైన్యాలు.+ ఇవి సర్వలోక ప్రభువు సన్నిధిలో కనబడి, ఆ తర్వాత అక్కడి నుండి బయటికి వెళ్తున్నాయి.+
6 నల్లని గుర్రాలున్న రథం ఉత్తర దేశానికి వెళ్తోంది;+ తెల్లనివి సముద్రాన్ని దాటి వెళ్తున్నాయి; మచ్చలు ఉన్నవి దక్షిణ దేశానికి వెళ్తున్నాయి.
7 పొడలు ఉన్నవి భూమంతటా సంచరించాలని ఉత్సాహంగా ఉన్నాయి.” తర్వాత అతను, “వెళ్లండి, భూమంతటా సంచరించండి” అన్నాడు. అప్పుడవి భూమంతటా సంచరించడం మొదలుపెట్టాయి.
8 అప్పుడతను నన్ను పిలిచి, “చూడు, ఉత్తర దేశానికి వెళ్తున్నవి, ఉత్తర దేశం పట్ల యెహోవాకున్న కోపాన్ని తగ్గించాయి” అని చెప్పాడు.
9 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది:
10 “చెరలో ఉన్న ప్రజల దగ్గర నుండి హెల్దయి, టోబీయా, యెదాయా తెచ్చినవి తీసుకో; నువ్వు ఆ రోజు, బబులోను నుండి వచ్చిన ఈ ప్రజలతో కలిసి జెఫన్యా కుమారుడైన యోషీయా ఇంటికి వెళ్లాలి.
11 నువ్వు వెండిని, బంగారాన్ని తీసుకొని ఒక కిరీటం* చేసి దాన్ని యెహోజాదాకు కుమారుడూ, ప్రధానయాజకుడూ అయిన యెహోషువ+ తలమీద పెట్టి,
12 అతనికి ఇలా చెప్పు:“ ‘సైన్యాలకు అధిపతైన యెహోవా చెప్పేదేమిటంటే, “ఇదిగో, మొలక అనే పేరున్న వ్యక్తి ఇతనే.+ ఇతను తన సొంత స్థలం నుండి మొలకెత్తుతాడు, ఇతను యెహోవా ఆలయాన్ని కడతాడు.+
13 యెహోవా ఆలయాన్ని కట్టేది ఇతనే, రాజ్యాధికారాన్ని పొందేది ఇతనే. ఇతను తన సింహాసనంపై కూర్చుని పరిపాలిస్తాడు, అంతేకాదు సింహాసనం మీద ఉంటూనే యాజకుడిగా కూడా సేవచేస్తాడు,+ ఆ రెండు బాధ్యతల* మధ్య మంచి సమన్వయం ఉంటుంది.
14 ఆ కిరీటం* యెహోవా ఆలయంలో హేలెముకు, టోబీయాకు, యెదాయాకు,+ జెఫన్యా కుమారుడైన హేనుకు జ్ఞాపకార్థంగా* ఉంటుంది.
15 సుదూరాల్లో ఉన్నవాళ్లు వచ్చి, యెహోవా ఆలయాన్ని కట్టడంలో పాల్గొంటారు.” అప్పుడు, సైన్యాలకు అధిపతైన యెహోవాయే నన్ను పంపాడని మీరు తెలుసుకుంటారు. మీరు మీ దేవుడైన యెహోవా స్వరాన్ని వింటేనే అది జరుగుతుంది.’ ”