జెకర్యా 8:1-23
8 సైన్యాలకు అధిపతైన యెహోవా వాక్యం మళ్లీ వచ్చి, ఇలా చెప్పింది:
2 “సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు, ‘నేను అత్యంత ఆసక్తితో సీయోను విషయంలో ఆసక్తి చూపిస్తాను,+ గొప్ప కోపోద్రేకంతో నేను ఆమె విషయంలో ఆసక్తి చూపిస్తాను.’ ”
3 “యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను సీయోనుకు తిరిగొచ్చి, యెరూషలేములో నివసిస్తాను.+ అప్పుడు యెరూషలేము నమ్మకమైన* నగరం అని పిలవబడుతుంది,+ సైన్యాలకు అధిపతైన యెహోవా పర్వతం పవిత్ర పర్వతం అని పిలవబడుతుంది.’ ”+
4 “సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘వృద్ధులు మళ్లీ యెరూషలేము వీధుల్లో ఆరుబయట కూర్చుంటారు, ప్రతీ ఒక్కరు తమ నిండు వృద్ధాప్యం వల్ల చేతికర్రలు పట్టుకొని కూర్చుంటారు.+
5 నగర వీధులు ఆటలాడే పిల్లలతో కళకళలాడతాయి.’ ”+
6 “సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఆ రోజుల్లో, ఈ ప్రజల్లో మిగిలినవాళ్లకు అది అసాధ్యమని అనిపించవచ్చేమో గానీ, నాకు కూడా అది అసాధ్యమని అనిపిస్తుందా?’ అని సైన్యాలకు అధిపతైన యెహోవా ప్రకటిస్తున్నాడు.”
7 “సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఇదిగో తూర్పు దేశాల నుండి, పడమటి దేశాల నుండి* నేను నా ప్రజల్ని కాపాడతాను.+
8 నేను వాళ్లను తీసుకొస్తాను, వాళ్లు యెరూషలేములో నివసిస్తారు;+ వాళ్లు నా ప్రజలౌతారు, నేను వాళ్లకు సత్యవంతుడైన,* నీతిమంతుడైన దేవుణ్ణి అవుతాను.’ ”+
9 “సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ధైర్యం తెచ్చుకోండి,+ మీరు ప్రవక్తల నోటి నుండి ఇప్పుడు వింటున్న ఇవే మాటలు,+ సైన్యాలకు అధిపతైన యెహోవా ఆలయం కట్టడానికి పునాది వేసిన రోజున కూడా చెప్పబడ్డాయి.
10 అంతకుముందు మనుషులు గానీ జంతువులు గానీ పనిచేసినా కూలి దొరికేది కాదు;+ శత్రువుల కారణంగా రాకపోకలు ప్రమాదకరంగా ఉండేవి, ఎందుకంటే నేను మనుషులందర్నీ ఒకరి మీదికి ఒకర్ని రేపాను.’
11 “ ‘కానీ ఇప్పుడు నేను ఈ ప్రజల్లో మిగిలినవాళ్లతో ఒకప్పటిలా వ్యవహరించను’ అని సైన్యాలకు అధిపతైన యెహోవా ప్రకటిస్తున్నాడు.
12 ‘శాంతి విత్తనాలు విత్తబడతాయి; ద్రాక్షచెట్లు ఫలిస్తాయి, భూమి దాని పంటనిస్తుంది,+ ఆకాశం మంచును కురిపిస్తుంది; ఈ ప్రజల్లో మిగిలినవాళ్లు వీటన్నిటిని స్వాస్థ్యంగా పొందేలా నేను చేస్తాను.+
13 యూదా ఇంటివాళ్లారా, ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, మీరు దేశాల మధ్య శపించబడినవాళ్లు అయ్యారు.+ అయితే నేను మిమ్మల్ని కాపాడతాను, మీరు ఒక దీవెనగా ఉంటారు.+ భయపడకండి! ధైర్యం తెచ్చుకోండి.’+
14 “సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘సైన్యాలకు అధిపతైన యెహోవా చెప్పేదేమిటంటే, “మీ పూర్వీకులు నాకు విపరీతమైన కోపం తెప్పించడం వల్ల మీ మీదికి విపత్తు తీసుకురావాలని నిశ్చయించుకున్నాను. ఆ విషయంలో నేను విచారపడలేదు,+
15 అదేవిధంగా ఈసారి యెరూషలేముకు, యూదా ఇంటివాళ్లకు మంచి చేయాలని నేను నిశ్చయించుకున్నాను.+ కాబట్టి భయపడకండి!” ’+
16 “ ‘మీరు ఈ పనులు చేయాలి: ఒకరితో ఒకరు నిజమే మాట్లాడాలి,+ మీ నగర ద్వారాల్లో సత్యానికి అనుగుణంగా, శాంతిని పెంపొందించే విధంగా తీర్పుతీర్చాలి.
17 ఎదుటివాణ్ణి నాశనం చేయాలని మీ హృదయాల్లో కుట్ర పన్నకండి,+ అబద్ధ ప్రమాణాలు చేయడం ఆపేయండి;+ ఎందుకంటే ఇవన్నీ నాకు అసహ్యం’+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”
18 సైన్యాలకు అధిపతైన యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి, ఇలా చెప్పింది:
19 “సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నాలుగో నెలలో,+ ఐదో నెలలో,+ ఏడో నెలలో,+ పదో నెలలో+ చేసే ఉపవాసాలు యూదా ఇంటివాళ్లకు ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగలుగా మారతాయి.+ కాబట్టి సత్యాన్ని, శాంతిని ప్రేమించండి.’
20 “సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఇప్పుడు ఆయా దేశాల ప్రజలు, ఎన్నో నగరాల్లోని నివాసులు ఇక్కడికి వస్తారు;
21 ఒక నగరంలోని నివాసులు, మరో నగరంలోని నివాసుల దగ్గరికి వెళ్లి, “త్వరగా వెళ్దాం పదండి! తన అనుగ్రహం చూపించమని యెహోవాను బ్రతిమాలడానికి, సైన్యాలకు అధిపతైన యెహోవాను వెదకడానికి వెళ్దాం పదండి. మేమూ వస్తున్నాం” అని అంటారు.+
22 ఎన్నో జనాలు, బలమైన దేశాలు యెహోవాను వెదకడానికి, అనుగ్రహం చూపించమని యెహోవాను బ్రతిమాలడానికి యెరూషలేముకు వస్తాయి.’+
23 “సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఆ రోజుల్లో, ఆయా దేశాలకు చెందిన అన్ని భాషల ప్రజల్లో నుండి పదేసిమంది+ ఒక యూదుని చెంగు పట్టుకుని, అవును ఒక యూదుని చెంగు గట్టిగా పట్టుకుని, “దేవుడు మీకు తోడుగా ఉన్నాడని మేము విన్నాం కాబట్టి మేము కూడా మీతో వస్తాం”+ అని అంటారు.’ ”+
అధస్సూచీలు
^ లేదా “సత్యమైన.”
^ లేదా “సూర్యుడు ఉదయించే దేశం నుండి, సూర్యుడు అస్తమించే దేశం నుండి.”
^ లేదా “నమ్మకమైన.”