దానియేలు 8:1-27

  • పొట్టేలు, మేకపోతు దర్శనం (1-14)

    • చిన్న కొమ్ము హెచ్చించుకోవడం (9-12)

    • 2,300 సాయంకాలాలు, పగళ్లు (14)

  • గబ్రియేలు దర్శన భావాన్ని చెప్పడం (15-27)

    • పొట్టేలు, మేకపోతు ఎవర్ని సూచిస్తు​న్నాయో వివరించడం (20, 21)

    • భీకరంగా కనిపించే రాజు లేస్తాడు (23-25)

8  బెల్షస్సరు రాజు+ పరిపాలన మూడో సంవత్సరంలో, దానియేలు అనే నేను ఇంకో దర్శనం చూశాను.  దర్శనం చూస్తున్నప్పుడు, నేను ఏలాము+ సంస్థానంలోని షూషను*+ కోటలో* ఉన్నాను; ఆ దర్శనంలో నేను ఊలయి కాలువ పక్కన ఉండడం చూశాను.  నేను తలెత్తి చూసినప్పుడు, ఇదిగో! ఒక పొట్టేలు+ ఆ కాలువ ఎదుట నిలబడివుంది, దానికి రెండు కొమ్ములు ఉన్నాయి.+ ఆ రెండు కొమ్ములు పొడుగ్గా ఉన్నాయి కానీ ఒక కొమ్ము మరో కొమ్ము కన్నా పొడుగ్గా ఉంది, పొడవైన కొమ్ము ఆ తర్వాత వచ్చింది.+  ఆ పొట్టేలు పడమటి వైపుకు, ఉత్తరం వైపుకు, దక్షిణం వైపుకు పొడుస్తూ ఉండడం నేను చూశాను; దాని ముందు ఏ క్రూరమృగం కూడా నిలబడలేకపోయింది, దాని నుండి వాటిని రక్షించేవాళ్లెవ్వరూ లేరు.+ అది తనకు ఇష్టమొచ్చినట్టు చేస్తూ, తనను తాను హెచ్చించుకుంది.  నేను చూస్తుండగా, ఇదిగో! ఒక మేకపోతు+ పడమటి వైపు* నుండి వస్తూ ఉంది, అది నేల మీద కాలు మోపకుండా భూమంతా ప్రయాణిస్తూ ఉంది. ఆ మేకపోతు కళ్ల మధ్య స్పష్టంగా కనిపించే ఒక కొమ్ము ఉంది.+  అది రెండు కొమ్ములుగల పొట్టేలు వైపు, అంటే కాలువ ఎదుట నిలబడివున్నట్టు నేను చూసిన పొట్టేలు వైపు వస్తూ ఉంది. అది విపరీతమైన కోపంతో దానివైపుకు పరుగెత్తుతూ ఉంది.  మేకపోతు పొట్టేలు దగ్గరికి రావడం నేను చూశాను, అది చాలా కోపంతో పొట్టేలు మీద దాడిచేసి దాని రెండు కొమ్ముల్ని విరగ్గొట్టింది; పొట్టేలు దాన్ని ఎదిరించలేకపోయింది. ఆ మేకపోతు పొట్టేలును నేలమీద పడేసి తొక్కేసింది, దాని నుండి పొట్టేలును రక్షించేవాళ్లెవ్వరూ లేరు.  అప్పుడు ఆ మేకపోతు తనను తాను చాలా ఎక్కువగా హెచ్చించుకుంది, అయితే దానికి ఎక్కువ బలం రాగానే దాని గొప్ప కొమ్ము విరిగిపోయింది; దాని స్థానంలో నాలుగు పెద్ద కొమ్ములు నాలుగు దిక్కులకు* పెరిగాయి.+  ఆ కొమ్ముల్లో ఒకదాని నుండి ఒక చిన్న కొమ్ము వచ్చింది; అది దక్షిణం వైపు, తూర్పు వైపు,* సుందరమైన దేశం*+ వైపు చాలా ఎక్కువగా పెరిగింది. 10  ఎంతగా పెరిగిందంటే, అది ఆకాశ సైన్యం వరకు చేరుకుంది; అది ఆ సైన్యంలో కొన్నిటిని, నక్షత్రాల్లో కొన్నిటిని భూమ్మీద పడిపోయేలా చేసి, వాటిని తొక్కేసింది. 11  అది చివరికి సైన్యాధిపతికి వ్యతిరేకంగా తనను తాను హెచ్చించుకుంది; ఆయన దగ్గర నుండి రోజువారీ బలులు తీసేయబడ్డాయి, అలాగే ఆయన స్థిరపర్చిన పవిత్రమైన స్థలం పడగొట్టబడింది.+ 12  అపరాధం కారణంగా సైన్యం అలాగే రోజువారీ బలులు ఆ కొమ్ముకు అప్పగించబడ్డాయి. ఆ కొమ్ము సత్యాన్ని భూమ్మీదికి పడేస్తూ ఉంది, అది తనకు ఇష్టమొచ్చినట్టు చేస్తూ విజయం సాధించింది. 13  తర్వాత ఒక పవిత్రుడు మాట్లాడడం నేను విన్నాను, అతన్ని మరో పవిత్రుడు ఇలా అడిగాడు: “రోజువారీ బలులకు, నాశనం కలిగించే అపరాధానికి సంబంధించిన ఆ దర్శనం ఎంతకాలం పాటు కొనసాగుతుంది?+ పవిత్ర స్థలం, సైన్యం రెండూ ఎంతకాలం తొక్కబడతాయి?” 14  దానికి అతను నాతో ఇలా చెప్పాడు: “2,300 సాయంకాలాలు, పగళ్ల పాటు; ఆ తర్వాత పవిత్ర స్థలం ఖచ్చితంగా మళ్లీ సరైన స్థితికి వస్తుంది.” 15  దానియేలు అనే నేను ఆ దర్శనం చూస్తూ, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా, మనిషిలా ఉన్న ఒకతను ఉన్నట్టుండి నా ముందు నిలబడ్డాడు. 16  అప్పుడు ఊలయి+ మధ్యలో నేను ఒక మనిషి స్వరాన్ని విన్నాను; అతను గట్టిగా ఇలా అన్నాడు: “గబ్రియేలూ,+ అతను చూసిన వాటి అర్థం ఏంటో అతనికి వివరించు.”+ 17  కాబట్టి అతను నేను నిలబడివున్న చోటికి వచ్చాడు; అతను వచ్చినప్పుడు నేను చాలా భయపడి, సాష్టాంగపడ్డాను. అతను నాతో, “మానవ కుమారుడా, ఈ దర్శనం అంత్యకాలంలో నెరవేరుతుందని అర్థం చేసుకో” అన్నాడు.+ 18  అయితే అతను మాట్లాడుతుండగా, నేను నేలమీద ముఖం పెట్టి గాఢనిద్రలోకి వెళ్లిపోయాను. అతను నన్ను ముట్టుకుని, ఆ స్థలంలోనే నన్ను నిలబెట్టాడు.+ 19  తర్వాత అతను ఇలా అన్నాడు: “దేవుని ఉగ్రత కాలంలోని చివరి భాగంలో ఏం జరుగుతుందో నీకు తెలియజేస్తున్నాను, ఎందుకంటే అది నియమిత అంత్యకాలంలో జరుగుతుంది.+ 20  “నువ్వు చూసిన రెండు కొమ్ములుగల ఆ పొట్టేలు మాదీయ, పారసీక* రాజుల్ని సూచిస్తుంది.+ 21  బొచ్చుగల ఆ మేకపోతు గ్రీసు రాజును సూచిస్తుంది;+ దాని కళ్ల మధ్య ఉన్న గొప్ప కొమ్ము గ్రీసు మొదటి రాజును సూచిస్తుంది.+ 22  ఆ కొమ్ము విరిగిపోయి, దాని స్థానంలో నాలుగు కొమ్ములు వచ్చాయి కదా;+ అదేవిధంగా అతని దేశంలో నుండి నాలుగు రాజ్యాలు లేస్తాయి, అయితే అతనికి ఉన్నలాంటి శక్తి వాటికి ఉండదు. 23  “వాళ్ల రాజ్యం చివరి రోజుల్లో, వాళ్ల అపరాధాలు సంపూర్తి అయినప్పుడు* భీకరంగా కనిపించే ఒక రాజు లేస్తాడు, అతను చిక్కు ప్రశ్నల్ని అర్థం చేసుకోగలడు.* 24  అతను ఎంతో శక్తిమంతుడు అవుతాడు, కానీ తన సొంత శక్తితో కాదు. అతను ఘోరంగా* నాశనం కలగజేస్తాడు, అతను తాను చేసే దానిలో ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. అతను బలంగలవాళ్లను, అలాగే పవిత్ర ప్రజల్ని నాశనం చేస్తాడు.+ 25  అతను చాలామందిని మోసం చేయడంలో తప్పకుండా విజయం సాధిస్తాడు; అతను తన హృదయంలో తనను తాను హెచ్చించుకుంటాడు; సురక్షితంగా ఉన్న సమయంలో* అతను చాలామందిని నాశనం చేస్తాడు. చివరికి అతను అధిపతుల అధిపతికి వ్యతిరేకంగా నిలబడతాడు, కానీ మనిషి ప్రమేయం* లేకుండానే అతను విరగ్గొట్టబడతాడు. 26  “సాయంకాలాల గురించి, పగళ్ల గురించి దర్శనంలో చెప్పబడిన మాటలు సత్యం; కానీ నువ్వు ఆ దర్శనాన్ని రహస్యంగా ఉంచాలి, ఎందుకంటే అది సుదూర భవిష్యత్తుకు సంబంధించినది.”+ 27  దానియేలునైన నేను బాగా అలసిపోయాను, చాలా రోజులపాటు అనారోగ్యంగా ఉన్నాను.+ తర్వాత నేను లేచి రాజు సేవలో కొనసాగాను;+ అయితే నేను చూసిన దాన్నిబట్టి చాలా ఆశ్చర్యపోయాను, ఆ దర్శనాన్ని అర్థం చేసుకునే వాళ్లెవ్వరూ లేరు.+

అధస్సూచీలు

లేదా “సూస.”
లేదా “రాజభవనంలో; దుర్గంలో.”
లేదా “సూర్యాస్తమయం వైపు.”
అక్ష., “ఆకాశపు నాలుగు గాలుల వైపుకు.”
లేదా “సూర్యోదయం వైపు.”
లేదా “ఆభరణం.”
లేదా “పర్షియా.”
లేదా “హద్దుకు చేరుకున్నప్పుడు.”
లేదా “పన్నాగాలు పన్నడంలో నైపుణ్యం గలవాడు.”
లేదా “అసాధారణ రీతిలో.”
లేదా “హెచ్చరిక చేయకుండా” అయ్యుంటుంది.
అక్ష., “చెయ్యి.”