దానియేలు 9:1-27

  • పాపాల్ని ఒప్పుకుంటూ దానియేలు ప్రార్థన (1-19)

    • 70 సంవత్సరాలు శిథిలాలుగా ఉంటుంది (2)

  • గబ్రియేలు దానియేలు దగ్గరికి రావడం (20-23)

  • 70 వారాల ప్రవచనం (24-27)

    • 69 వారాల తర్వాత మెస్సీయ వస్తాడు (25)

    • మెస్సీయ చంపబడతాడు (26)

    • నగరం, పవిత్ర స్థలం నాశనమౌతాయి (26)

9  అది అహష్వేరోషు కుమారుడూ మాదీయుడూ అయిన దర్యావేషు+ పరిపాలనలోని మొదటి సంవత్సరం, అతను కల్దీయుల రాజ్యం మీద రాజుగా చేయబడ్డాడు.+  అతని పరిపాలనలోని మొదటి సంవత్సరంలో, దానియేలు అనే నేను యెహోవా యిర్మీయా ప్రవక్తకు చెప్పిన మాట ప్రకారం యెరూషలేము 70 సంవత్సరాల పాటు+ శిథిలాలుగా ఉంటుందని గ్రంథాల* ద్వారా అర్థం చేసుకున్నాను.+  కాబట్టి నేను నా ముఖాన్ని సత్యదేవుడైన యెహోవా వైపు తిప్పి, ఉపవాసం+ ఉండి, గోనెపట్ట కట్టుకుని, నా మీద బూడిద చల్లుకుని, ప్రార్థనలో ఆయన్ని వేడుకుంటూ ఉన్నాను.  నేను నా దేవుడైన యెహోవాకు ప్రార్థించి, మా పాపాలు ఒప్పుకుని ఇలా అన్నాను: “సత్యదేవుడివైన యెహోవా, సంభ్రమాశ్చర్యాలు పుట్టించే గొప్ప దేవా, నిన్ను ప్రేమించి, నీ ఆజ్ఞల్ని పాటించేవాళ్ల విషయంలో+ నీ ఒప్పందాన్ని* నిలబెట్టుకుంటూ, వాళ్లమీద విశ్వసనీయ ప్రేమ చూపించే దేవా,+  మేము పాపం చేశాం, తప్పు చేశాం, చెడుగా ప్రవర్తించాం, తిరుగుబాటు చేశాం;+ నీ ఆజ్ఞల నుండి, తీర్పుల నుండి పక్కకి మళ్లాం.  నీ సేవకులైన ప్రవక్తలు మా రాజులతో, అధిపతులతో, పూర్వీకులతో, దేశ ప్రజలందరితో నీ పేరున మాట్లాడిన మాటల్ని మేము వినలేదు.+  యెహోవా, నువ్వు నీతిమంతుడివి; కానీ ఈ రోజు ఉన్నట్టుగా మేము అవమానం కొనితెచ్చుకున్నాం; యూదావాళ్లు, యెరూషలేము నివాసులు, ఇశ్రాయేలు ప్రజలందరూ అవమానం కొనితెచ్చుకున్నారు. వాళ్లు నీకు నమ్మకద్రోహం చేశారు కాబట్టి నువ్వు వాళ్లను దగ్గర్లో, దూరంలో ఉన్న అన్ని దేశాలకు చెదరగొట్టావు.+  “యెహోవా, మేము నీకు వ్యతిరేకంగా పాపం చేశాం కాబట్టి మా మీదికి, మా రాజుల మీదికి, మా అధిపతుల మీదికి, మా పూర్వీకుల మీదికి అవమానం కొనితెచ్చుకున్నాం.  మా దేవా, యెహోవా, నువ్వు క్షమించే దేవుడివి, కరుణగల వాడివి;+ కానీ మేము నీ మీద తిరుగుబాటు చేశాం.+ 10  నీ సేవకులైన ప్రవక్తల ద్వారా నువ్వు మా ముందు ఉంచిన నీ నియమాల్ని మేము పాటించలేదు, అలా మేము మా దేవుడైన యెహోవా స్వరానికి లోబడలేదు.+ 11  ఇశ్రాయేలీయులందరూ నీ ధర్మశాస్త్రాన్ని మీరారు, నీ మాటకు లోబడకుండా పక్కకు మళ్లారు; మేము నీకు వ్యతిరేకంగా పాపం చేశాం కాబట్టి, సత్యదేవుని సేవకుడైన మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన శాపాన్ని నువ్వు మా మీద కుమ్మరించావు.+ 12  నువ్వు మా మీదికి గొప్ప విపత్తును తీసుకొచ్చి మాకు, మమ్మల్ని పరిపాలించిన మా పరిపాలకులకు* వ్యతిరేకంగా నువ్వు చెప్పిన మాటల్ని నెరవేర్చావు;+ యెరూషలేము మీదికి వచ్చినంత గొప్ప విపత్తు ఆకాశమంతటి కింద ముందెప్పుడూ రాలేదు.+ 13  మోషే ధర్మశాస్త్రంలో రాయబడినట్టే ఈ విపత్తు అంతా మా మీదికి వచ్చింది;+ అయినా మేము మా దేవుడైన యెహోవా అనుగ్రహం కోసం వేడుకోలేదు, మా తప్పుల నుండి పక్కకు మళ్లలేదు,+ నువ్వు సత్యవంతుడివని* అర్థం చేసుకోలేదు.* 14  “అందుకే యెహోవా, నువ్వు గమనిస్తూ, చివరికి మా మీదికి విపత్తు తీసుకొచ్చావు, ఎందుకంటే యెహోవా మా దేవా, నువ్వు చేసిన పనులన్నిట్లో నువ్వు నీతిమంతుడివి; అయినా మేము నీ మాటకు లోబడలేదు.+ 15  “మా దేవా, యెహోవా, బలమైన చేతితో నీ ప్రజల్ని ఐగుప్తు* దేశం నుండి బయటికి తీసుకొచ్చి,+ ఈ రోజు వరకు నీ కోసం ఒక పేరు సంపాదించుకున్న దేవా,+ మేము పాపం చేసి చెడుగా ప్రవర్తించాం. 16  యెహోవా, నీ నీతికార్యాలన్నిటిని బట్టి+ నీ నగరమైన యెరూషలేము మీద నుండి, నీ పవిత్ర పర్వతం మీద నుండి దయచేసి నీ కోపం, నీ ఆగ్రహం తొలగిపోనివ్వు; ఎందుకంటే, మా పాపాల కారణంగా, మా పూర్వీకుల తప్పుల కారణంగా యెరూషలేముకు, అలాగే నీ ప్రజలకు మా చుట్టూ ఉన్నవాళ్లందరిలో అవమానం ఎదురౌతూ ఉంది. 17  మా దేవా, నీ సేవకుడు చేసే ప్రార్థనను, విన్నపాల్ని విను; యెహోవా, నీకే మహిమ కలిగేలా, శిథిలమైపోయిన నీ పవిత్రమైన స్థలం మీద నీ ముఖకాంతి ప్రకాశించనివ్వు. 18  నా దేవా, శ్రద్ధగా ఆలకించు! కళ్లు తెరిచి మా శ్రమల్ని, నీ పేరు పెట్టబడిన నీ నగరాన్ని చూడు; మా నీతికార్యాల్ని బట్టి కాదుగానీ నీ గొప్ప కరుణను బట్టే నిన్ను బ్రతిమాలుతున్నాం. 19  యెహోవా, విను. యెహోవా, మమ్మల్ని క్షమించు. యెహోవా, మా మొర విని మమ్మల్ని రక్షించు! నా దేవా, నీకే మహిమ కలిగేలా ఆలస్యం చేయకు, ఎందుకంటే నీ నగరానికి, నీ ప్రజలకు నీ పేరే పెట్టబడింది.” 20  నేను ఇంకా ప్రార్థిస్తూ, నా పాపాల్ని, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల పాపాల్ని ఒప్పుకుంటూ, నా దేవుని పవిత్ర పర్వతం+ గురించి నా దేవుడైన యెహోవా ముందు అనుగ్రహం కోసం వేడుకుంటుండగా, 21  అవును, నేను ఇంకా ప్రార్థిస్తూ ఉండగా, అంతకుముందు దర్శనంలో చూసిన+ గబ్రియేలు+ అనే మనిషి దాదాపు సాయంకాల అర్పణ సమయంలో, నేను బాగా అలసిపోయి ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చాడు. 22  అతను నాకు లోతైన అవగాహన ఇచ్చాడు, అతను ఇలా అన్నాడు: “దానియేలూ, నేను ఇప్పుడు నీకు వివేచనను, అవగాహనను ఇవ్వడానికి వచ్చాను. 23  నువ్వు ఎంతో అమూల్యమైనవాడివి,* అందుకే నువ్వు వేడుకోవడం మొదలుపెట్టినప్పుడు నాకు ఒక సందేశం అందింది, దాన్ని నీకు చెప్పడానికి వచ్చాను. కాబట్టి నేను చెప్పే విషయం గురించి ఆలోచించి, దర్శనాన్ని అర్థం చేసుకో. 24  “అపరాధాన్ని తీసేయడానికి, పాపాన్ని అంతం చేయడానికి,+ దోషాన్ని ప్రాయశ్చిత్తం చేయడానికి,+ శాశ్వతమైన నీతిని తీసుకురావడానికి,+ దర్శనాన్నీ ప్రవచనాన్నీ* ముద్రించడానికి,+ అత్యంత పవిత్రమైన దాన్ని* అభిషేకించడానికి నీ ప్రజల కోసం, నీ పవిత్ర నగరం కోసం దేవుడు 70 వారాలు* నిర్ణయించాడు. 25  యెరూషలేమును పునరుద్ధరించి, దాన్ని మళ్లీ కట్టమనే ఆజ్ఞ జారీ అయిన సమయం నుండి+ నాయకుడైన+ మెస్సీయ*+ వచ్చేవరకు 7 వారాలు, అలాగే 62 వారాలు పడుతుందని+ తెలుసుకో, అర్థం చేసుకో. అది నగర వీధితో, కందకంతో పాటు పునరుద్ధరించబడుతుంది, మళ్లీ కట్టబడుతుంది; అయితే ఆ పని కష్టకాలంలో జరుగుతుంది. 26  “ఆ 62 వారాల తర్వాత, తనకంటూ ఏమీ లేకుండా+ మెస్సీయ చంపబడతాడు.*+ “నగరాన్ని, పవిత్ర స్థలాన్ని రాబోయే సైన్యాలు నాశనం చేస్తాయి.+ వరదతో దాని అంతం వస్తుంది. అంతం వరకు యుద్ధం జరుగుతుంది; నాశనం జరగాలని దేవుడు నిర్ణయించాడు.+ 27  “ఆయన ఒక వారం పాటు చాలామంది కోసం ఒప్పందాన్ని అమలులో ఉంచుతాడు; అర్ధ వారమప్పుడు, ఆయన బలుల్ని, అర్పణల్ని ఆగిపోయేలా చేస్తాడు.+ “నాశనం చేసేవాడు అసహ్యమైనవాటి రెక్క మీద వస్తాడు;+ నాశనమయ్యే వరకు, దేవుడు నిర్ణయించింది శిథిలాలుగా ఉన్నదాని మీద కుమ్మరించబడుతుంది.”

అధస్సూచీలు

అంటే, పవిత్ర గ్రంథాలు.
లేదా “నిబంధనను.”
అక్ష., “మాకు న్యాయం తీర్చిన మా న్యాయమూర్తులకు.”
లేదా “నీ సత్యాన్ని; నమ్మకత్వాన్ని.”
లేదా “నీ సత్యం విషయంలో లోతైన అవగాహన సంపాదించుకోలేదు.”
లేదా “ఈజిప్టు.”
లేదా “ఎంతో ప్రియమైనవాడివి; చాలా విలువైనవాడివి.”
అంటే, సంవత్సరాల వారాలు.
లేదా “అతి పవిత్ర స్థలాన్ని.”
అక్ష., “ప్రవక్తనూ.”
లేదా “అభిషిక్తుడు.”
లేదా “కొట్టేయబడతాడు.”