ద్వితీయోపదేశకాండం 1:1-46

  • హోరేబు పర్వతం నుండి బయల్దేరడం (1-8)

  • ప్రధానుల్ని, న్యాయమూర్తుల్ని ​నియమించడం (9-18)

  • కాదేషు-బర్నేయ దగ్గర అవిధేయత (19-46)

    • వాగ్దాన దేశంలోకి వెళ్లడానికి ఇశ్రాయేలీయులు నిరాకరించడం (26-33)

    • కనాను మీదికి వెళ్లి ఓడిపోవడం (41-46)

1  యొర్దాను దగ్గర ఉన్న ఎడారిలో* మోషే ఇశ్రాయేలు ప్రజలందరితో ఈ మాటలు చెప్పాడు. ఆ ఎడారి సూఫుకు ఎదురుగా ఉన్న ఎడారి మైదానాల్లో, పారాను, తోపెలు, లాబాను, హజేరోతు, దీజాహాబు ప్రాంతాల మధ్య ఉంది.  శేయీరు కొండ మార్గంలో ప్రయాణిస్తే హోరేబు నుండి కాదేషు-బర్నేయకు వెళ్లడానికి 11 రోజులు పడుతుంది.  ఇశ్రాయేలీయులు* ఐగుప్తు* నుండి బయటికి వచ్చాక, 40వ సంవత్సరం+ 11వ నెల మొదటి రోజున మోషే ఈ మాటలు చెప్పాడు, యెహోవా ఇశ్రాయేలీయుల కోసం ఇచ్చిన నిర్దేశాలన్నిటినీ అతను వాళ్లకు తెలియజేశాడు.  హెష్బోనులో నివసిస్తున్న అమోరీయుల రాజైన సీహోనును,+ అష్తారోతులో నివసిస్తున్న బాషాను రాజైన ఓగును ఎద్రెయిలో ఓడించిన తర్వాత అతను ఈ మాటలు చెప్పాడు.  మోయాబు దేశంలోని యొర్దాను ప్రాంతంలో మోషే ఈ ధర్మశాస్త్రాన్ని వివరించడం మొదలుపెట్టాడు:+  “హోరేబు దగ్గర మన దేవుడైన యెహోవా మనకు ఇలా చెప్పాడు: ‘ఈ పర్వత ప్రాంతంలో మీరు ఇప్పటికే చాలాకాలం నివసించారు.  ఇప్పుడు మీరు తిరిగి అమోరీయుల+ కొండ ప్రాంతానికి, దాని చుట్టుపక్కల ప్రాంతాలైన అరాబాకు, పర్వత ప్రాంతానికి, షెఫేలాకు, నెగెబుకు, సముద్ర తీర ప్రాంతానికి వెళ్లండి. కనానీయుల దేశానికి వెళ్లండి. లెబానోను*+ వరకు, యూఫ్రటీసు మహానది వరకు+ వెళ్లండి.  ఇదిగో, ఆ దేశాన్ని మీ ముందు ఉంచాను. మీరు వెళ్లి, మీ పూర్వీకులైన అబ్రాహాముకు, ఇస్సాకుకు,+ యాకోబుకు,+ వాళ్ల తర్వాత వాళ్ల సంతానానికి* ఇస్తానని యెహోవా వాళ్లకు ప్రమాణం చేసిన దేశాన్ని స్వాధీనపర్చుకోండి.’+  “ఆ సమయంలో నేను మీతో ఇలా అన్నాను: ‘నేను ఒక్కణ్ణే మీ భారాన్ని మోయలేను.+ 10  మీ దేవుడైన యెహోవా మీ సంఖ్య పెరిగేలా చేశాడు, నేడు మీరు ఆకాశ నక్షత్రాలంత మంది అయ్యారు.+ 11  మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీ సంఖ్య ఇంకా వెయ్యి రెట్లు పెరిగేలా చేయాలి,+ ఆయన మీకు ప్రమాణం చేసినట్టే మిమ్మల్ని దీవించాలి.+ 12  నేను ఒక్కణ్ణే మీ భారాన్ని, మీ బరువును, మీ గొడవల్ని ఎలా భరించగలను?+ 13  మీ గోత్రాల్లో నుండి తెలివి, బుద్ధి, అనుభవం ఉన్న పురుషుల్ని ఎంచుకోండి, నేను వాళ్లను మీ మీద పెద్దలుగా నియమిస్తాను.’+ 14  అప్పుడు మీరు నాతో, ‘నువ్వు చెప్పినట్టు చేస్తే బాగుంటుంది’ అన్నారు. 15  కాబట్టి నేను తెలివి, అనుభవం ఉన్న మీ గోత్రపు పెద్దల్ని తీసుకొని, వెయ్యిమంది మీద, వందమంది మీద, యాభైమంది మీద, పదిమంది మీద ప్రధానులుగా నియమించాను; అలాగే మీ గోత్రాల్లో అధికారులుగా నియమించాను. 16  “ఆ సమయంలో నేను మీ న్యాయమూర్తులకు ఈ ఆదేశాలు ఇచ్చాను: ‘మీ సహోదరుల మధ్య తలెత్తిన ఒక వివాదం మీ ముందుకు వచ్చినప్పుడు, ఆ వివాదం ఇద్దరు ఇశ్రాయేలీయుల మధ్య వచ్చిందే కానివ్వండి, లేదా ఒక ఇశ్రాయేలీయుడికి, ఒక పరదేశికి మధ్య వచ్చిందే కానివ్వండి,+ మీరు న్యాయంగా తీర్పుతీర్చాలి.+ 17  తీర్పు తీరుస్తున్నప్పుడు మీరు పక్షపాతం చూపించకూడదు.+ గొప్పవాళ్ల వివాదాన్ని విన్నట్టే సామాన్యుల వివాదాన్ని కూడా వినాలి.+ మీరు మనుషులకు భయపడకూడదు,+ ఎందుకంటే తీర్పు దేవునిది;+ ఒకవేళ ఏదైనా వివాదాన్ని పరిష్కరించడం మీకు మరీ కష్టమైతే, దాన్ని నా దగ్గరికి తీసుకురావాలి. అప్పుడు నేను దాన్ని వింటాను.’+ 18  ఆ సమయంలో, మీరు చేయాల్సిన వాటన్నిటి గురించి నేను మీకు నిర్దేశాలు ఇచ్చాను. 19  “తర్వాత మనం మన దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్టే హోరేబు నుండి బయల్దేరి, అమోరీయుల కొండ ప్రాంతానికి+ వెళ్తున్నప్పుడు మీరు చూసిన భయంకరమైన మహా ఎడారి+ గుండా నడుచుకుంటూ, చివరికి కాదేషు-బర్నేయకు+ చేరుకున్నాం. 20  అప్పుడు నేను మీతో ఇలా అన్నాను: ‘యెహోవా మనకు ఇవ్వబోతున్న అమోరీయుల కొండ ప్రాంతానికి మీరు వచ్చారు. 21  ఇదిగో, మీ దేవుడైన యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చేశాడు. మీరు వెళ్లి మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీకు చెప్పినట్టే దాన్ని స్వాధీనపర్చుకోండి.+ భయపడకండి, బెదిరిపోకండి.’ 22  “అయితే మీరంతా నా దగ్గరికి వచ్చి ఇలా అన్నారు: ‘మనకు ముందుగా కొంతమంది మనుషుల్ని పంపుదాం. వాళ్లు వెళ్లి ఆ దేశాన్ని పరిశీలించి, మనం ఏ దారిలో వెళ్లాలో, మనకు ఎలాంటి నగరాలు ఎదురౌతాయో చెప్తారు.’+ 23  ఆ సలహా నాకు నచ్చి, మీ మధ్య ఒక్కో గోత్రం నుండి ఒక్కో వ్యక్తి చొప్పున 12 మందిని ఎంచుకున్నాను.+ 24  వాళ్లు బయల్దేరి కొండ ప్రాంతానికి వెళ్లి,+ ఎష్కోలు లోయకు* చేరుకొని, ఆ దేశాన్ని వేగు చూశారు. 25  వాళ్లు ఆ దేశంలోని కొన్ని పండ్లు మన దగ్గరికి మోసుకొచ్చారు, అలాగే ‘మన దేవుడైన యెహోవా మనకు ఇవ్వబోతున్న దేశం మంచిది’ అనే కబురు తెచ్చారు.+ 26  కానీ మీరు అక్కడికి వెళ్లడానికి నిరాకరించారు, మీ దేవుడైన యెహోవా ఆదేశానికి ఎదురుతిరిగారు.+ 27  మీరు మీ డేరాల్లో ఉండి ఇలా సణుక్కున్నారు: ‘యెహోవా మమ్మల్ని ద్వేషించాడు కాబట్టే అమోరీయుల చేతికి అప్పగించి సమూలంగా నాశనం చేయడానికి మమ్మల్ని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చాడు. 28  మనం వెళ్లే చోటు ఎలాంటిది? “ఆ ప్రజలు మనకన్నా పొడుగ్గా, బలంగా ఉన్నారు, వాళ్ల నగరాలు గొప్పవి, వాళ్ల ప్రాకారాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.+ అంతేకాదు మేము అక్కడ అనాకీయుల్ని చూశాం”+ అని అంటూ మన సహోదరులు మన గుండెలు నీరుగారిపోయేలా చేశారు.’+ 29  “కాబట్టి నేను మీతో ఇలా అన్నాను: ‘మీరు వాళ్లకు భయపడకండి, బెదిరిపోకండి.+ 30  మీ దేవుడైన యెహోవా మీకు ముందుగా వెళ్లి, మీ తరఫున పోరాడతాడు;+ ఆయన ఐగుప్తులో మీ కళ్లముందు చేసినట్టే చేస్తాడు.+ 31  ఈ చోటికి వచ్చేవరకు, మీరు వెళ్లిన ప్రతీచోట మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎలా మోశాడో మీరు ఎడారిలో చూశారు. ఒక వ్యక్తి తన కుమారుణ్ణి ఎత్తుకొని మోసినట్టు ఆయన మిమ్మల్ని మోశాడు.’ 32  ఇంత చేసినా, మీరు మీ దేవుడైన యెహోవా మీద విశ్వాసం ఉంచలేదు.+ 33  మీరు డేరాలు వేసుకొని నివసించేలా మీకోసం చోటు వెదకడానికి దారిలో ఆయన మీకు ముందుగా వెళ్తూ ఉన్నాడు. మీరు నడవాల్సిన దారిని మీకు చూపించడానికి ఆయన రాత్రిపూట అగ్నిలో, పగటిపూట మేఘంలో ప్రత్యక్షమయ్యాడు.+ 34  “ఆ సమయమంతట్లో మీరు అన్న మాటల్ని యెహోవా విని, కోపంతో ఇలా ప్రమాణం చేశాడు:+ 35  ‘ఈ దుష్ట తరంలోని వాళ్లలో ఒక్కరు కూడా నేను మీ పూర్వీకులకు ఇస్తానని ప్రమాణం చేసిన మంచి దేశాన్ని చూడరు.+ 36  కేవలం యెఫున్నె కుమారుడైన కాలేబు మాత్రమే దాన్ని చూస్తాడు, అతను తప్పకుండా దాన్ని చూస్తాడు, అతను నడిచిన దేశాన్ని నేను అతనికి, అతని కుమారులకు ఇస్తాను. ఎందుకంటే అతను నిండు హృదయంతో* యెహోవాను అనుసరించాడు.+ 37  (మీ వల్ల యెహోవా నా మీద కూడా కోపగించుకున్నాడు. ఆయన నాతో ఇలా అన్నాడు: “నువ్వు కూడా ఆ దేశంలోకి ప్రవేశించవు.+ 38  నీ సేవకుడూ, నూను కుమారుడూ అయిన యెహోషువ+ ఆ దేశంలోకి ప్రవేశిస్తాడు. అతన్ని బలపర్చు,*+ ఎందుకంటే ఆ దేశాన్ని స్వాధీనపర్చుకునేలా ఇశ్రాయేలీయుల్ని నడిపించబోయేది అతనే.”) 39  అంతేకాదు, దోపుడుసొమ్ము అవుతారని మీరు చెప్పిన మీ పిల్లలు,+ నేడు మంచిచెడ్డలు తెలియని మీ కుమారులు ఆ దేశంలో అడుగుపెడతారు, నేను దాన్ని వాళ్లకు సొత్తుగా ఇస్తాను.+ 40  కానీ మీరైతే, వెనక్కి తిరిగి ఎర్రసముద్ర మార్గంలో ఎడారిలోకి వెళ్లిపోండి.’+ 41  “అప్పుడు మీరు నాతో, ‘మేము యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాం. మేము ఇప్పుడు అక్కడికి వెళ్లి యెహోవా మాకు ఆజ్ఞాపించినట్టే పోరాడతాం!’ అన్నారు. అలా మీలో ప్రతీ ఒక్కరు యుద్ధ ఆయుధాలు ధరించారు, కొండమీదికి వెళ్లి వాళ్లను జయించడం చిన్న విషయం అనుకున్నారు.+ 42  కానీ యెహోవా నాతో ఇలా అన్నాడు: ‘ “మీరు ఆ కొండమీదికి వెళ్లి పోరాడకూడదు, ఎందుకంటే నేను మీకు తోడుగా ఉండను.+ ఒకవేళ వెళ్తే, మీరు మీ శత్రువుల చేతుల్లో ఓడిపోతారు” అని వాళ్లకు చెప్పు.’ 43  కాబట్టి నేను వచ్చి ఆ మాటను మీకు చెప్పాను, కానీ మీరు వినలేదు. మీరు యెహోవా ఆదేశాన్ని మీరి, అహంకారంతో ఆ కొండమీదికి వెళ్లడానికి ప్రయత్నించారు. 44  అప్పుడు, ఆ కొండ మీద నివసిస్తున్న అమోరీయులు మిమ్మల్ని ఎదుర్కోవడానికి వచ్చి, కందిరీగలు తరిమినట్టు మిమ్మల్ని తరిమి, శేయీరులో హోర్మా వరకు చెదరగొట్టారు. 45  కాబట్టి మీరు తిరిగొచ్చి యెహోవా ముందు ఏడ్వడం మొదలుపెట్టారు, కానీ యెహోవా మీ మొర వినలేదు, మిమ్మల్ని పట్టించుకోలేదు. 46  అందుకే మీరు అంతకాలం పాటు కాదేషులో నివసించారు.

అధస్సూచీలు

పదకోశం చూడండి.
అక్ష., “ఇశ్రాయేలు కుమారులు.”
లేదా “ఈజిప్టు.”
లెబానోను పర్వతశ్రేణి అని స్పష్టమౌతోంది.
అక్ష., “విత్తనానికి.”
లేదా “వాగుకు.”
అక్ష., “పూర్తిగా; సంపూర్ణంగా.”
లేదా “దేవుడు అతన్ని బలపర్చాడు” అయ్యుంటుంది.