ద్వితీయోపదేశకాండం 12:1-32
12 “మీరు స్వాధీనం చేసుకోవడానికి మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీకు ఇవ్వబోతున్న దేశంలో మీరు బ్రతికి ఉన్నంతకాలం, మీరు జాగ్రత్తగా పాటించాల్సిన నియమాలు, న్యాయనిర్ణయాలు ఇవే.
2 మీరు ఓడించి స్వాధీనం చేసుకోబోయే జనాలు తమ దేవుళ్లను పూజించిన చోట్లన్నిటినీ మీరు పూర్తిగా నాశనం చేయాలి. అవి ఎత్తైన కొండల మీదున్నా, పర్వతాల మీదున్నా, పచ్చని చెట్టు కిందున్నా వాటిని మీరు నాశనం చేయాలి.
3 మీరు వాళ్ల బలిపీఠాల్ని కూలగొట్టాలి, వాళ్ల పూజా స్తంభాల్ని ధ్వంసం చేయాలి,+ వాళ్ల పూజా కర్రల్ని* అగ్నిలో కాల్చేయాలి, వాళ్ల దేవుళ్ల చెక్కుడు విగ్రహాల్ని ముక్కలుముక్కలు చేయాలి,+ ఆ చోటు నుండి వాటి పేర్లను పూర్తిగా తుడిచిపెట్టేయాలి.+
4 “మీరు మీ దేవుడైన యెహోవాను వాళ్ల పద్ధతిలో ఆరాధించకూడదు.+
5 బదులుగా, మీ దేవుడైన యెహోవా మీ గోత్రాలన్నిటి మధ్య తన పేరును, తన నివాస స్థలాన్ని ఎక్కడ స్థాపించాలనుకుంటే అక్కడికి వెళ్లి మీరు ఆయన్ని ఆరాధించాలి.+
6 మీరు మీ దహనబలుల్ని, బలుల్ని, పదోవంతుల్ని,* మీ కానుకల్ని,+ మీ మొక్కుబడి అర్పణల్ని, మీ స్వేచ్ఛార్పణల్ని,+ మీ పశువుల్లో-మందల్లో మొదటి సంతానాన్ని+ కూడా అక్కడికే తీసుకురావాలి.
7 మీరు, మీ ఇంటివాళ్లు అక్కడ మీ దేవుడైన యెహోవా ముందు భోజనం చేయాలి,+ మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని దీవించాడు కాబట్టి మీరు మీ పనులన్నిట్లో సంతోషించాలి.+
8 “మనం నేడు ఇక్కడ చేస్తున్నట్టు చేయకూడదు. మనలో ప్రతీ ఒక్కరు తమ దృష్టికి ఏది సరైనదనిపిస్తే అది చేస్తున్నారు,
9 ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న ఆ విశ్రాంతి స్థలంలో,+ స్వాస్థ్యంలో మీరింకా అడుగుపెట్టలేదు.
10 మీరు యొర్దాను నది దాటి, స్వాధీనం చేసుకోవడానికి మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో నివసించేటప్పుడు, ఆయన ఖచ్చితంగా మీ చుట్టూ ఉన్న శత్రువులందరి నుండి మీకు విశ్రాంతిని దయచేస్తాడు, మీరు సురక్షితంగా నివసిస్తారు.+
11 నేను ఆజ్ఞాపిస్తున్న వాటన్నిటినీ, అంటే మీ దహనబలుల్ని, బలుల్ని, పదోవంతుల్ని, మీ కానుకల్ని, మీరు యెహోవాకు ఇస్తానని మొక్కుబడి చేసుకున్న ప్రతీ అర్పణను మీరు మీ దేవుడైన యెహోవా తన పేరును మహిమపర్చడానికి ఎంచుకునే చోటుకు తీసుకొస్తారు.+
12 మీరు, మీ కుమారులు, మీ కూతుళ్లు, మీ దాసులు, మీ దాసురాళ్లు మీ దేవుడైన యెహోవా ముందు సంతోషిస్తారు.+ అంతేకాదు, మీతోపాటు భాగం గానీ స్వాస్థ్యం గానీ ఇవ్వబడని, మీ నగరాల్లో నివసించే లేవీయులు కూడా సంతోషిస్తారు.+
13 మీకు నచ్చిన వేరే ఏ చోటా మీ దహనబలులు అర్పించకుండా జాగ్రత్తపడండి.+
14 యెహోవా మీ గోత్రాలకు చెందిన ప్రదేశాల్లో ఎక్కడైతే ఒక చోటును ఎంచుకుంటాడో అక్కడ మాత్రమే మీరు మీ దహనబలుల్ని అర్పించాలి, నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ప్రతీదాన్ని అక్కడే చేయాలి.+
15 “మీ నగరాలన్నిట్లో, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని దీవించిన ప్రకారం మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు జంతువును వధించి, దాని మాంసం తినొచ్చు. అపవిత్రుడైనా, పవిత్రుడైనా దాన్ని తినొచ్చు; కొండజింకను, జింకను తిన్నట్టు దాన్ని తినొచ్చు.
16 అయితే రక్తాన్ని మీరు తినకూడదు;+ దాన్ని నీళ్లలా నేలమీద పారబోయాలి.+
17 నీ ధాన్యంలో, కొత్త ద్రాక్షారసంలో, నూనెలో పదోవంతుల్ని గానీ, నీ పశువుల్లో-మందల్లో మొదటి సంతానాన్ని గానీ, నువ్వు మొక్కుబడి చేసుకున్న ఏ అర్పణను గానీ, నీ స్వేచ్ఛార్పణల్ని గానీ, నీ కానుకల్ని గానీ నీ నగరాల లోపల తినడానికి నీకు అనుమతి లేదు.+
18 వీటిని నువ్వు, నీ కుమారులు, నీ కూతుళ్లు, నీ దాసులు, నీ దాసురాళ్లు, నీ నగరాల్లో ఉంటున్న లేవీయులు నీ దేవుడైన యెహోవా ముందు, నీ దేవుడైన యెహోవా ఎంచుకున్న చోట తినాలి;+ నీ పనులన్నిట్లో నువ్వు నీ దేవుడైన యెహోవా ముందు సంతోషించాలి.
19 నువ్వు నీ దేశంలో బ్రతికున్నంత కాలం లేవీయుల్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తపడు.+
20 “నీ దేవుడైన యెహోవా నీకు వాగ్దానం చేసినట్టే+ ఆయన నీ సరిహద్దుల్ని విస్తరింపజేసినప్పుడు,+ నీకు మాంసం తినాలనిపించి, ‘నాకు మాంసం తినాలనుంది’ అని నువ్వు అంటే, నీకు తినాలని అనిపించినప్పుడల్లా నువ్వు మాంసం తినొచ్చు.+
21 ఒకవేళ, నీ దేవుడైన యెహోవా తన పేరును మహిమపర్చడానికి ఎంచుకునే చోటు+ నీకు చాలా దూరంగా ఉంటే, నేను నీకు ఆజ్ఞాపించినట్టే, యెహోవా నీకు ఇచ్చిన పశువుల్లో నుండి గానీ మందల్లో నుండి గానీ కొన్నిటిని వధించి, నీ నగరాల లోపల దాన్ని తినాలి. నీకు తినాలని అనిపించినప్పుడల్లా నువ్వు అలా తినొచ్చు.
22 నువ్వు కొండజింకను, జింకను తిన్నట్టు దాన్ని తినొచ్చు; అపవిత్రుడైనా, పవిత్రుడైనా దాన్ని తినొచ్చు.
23 కాకపోతే ఒక్కటి, రక్తాన్ని మాత్రం తినకూడదని దృఢంగా నిశ్చయించుకో.+ ఎందుకంటే రక్తమే దాని ప్రాణం,+ నువ్వు మాంసంతో పాటు దాని ప్రాణాన్ని తినకూడదు.
24 నువ్వు దాన్ని తినకూడదు. నువ్వు దాన్ని నీళ్లలా నేలమీద పారబోయాలి.+
25 నువ్వు దాన్ని తినకూడదు; అప్పుడు నీకు, నీ తర్వాత నీ పిల్లలకు మంచి జరుగుతుంది; ఎందుకంటే నువ్వు యెహోవా దృష్టిలో సరైనది చేస్తున్నావు.
26 నువ్వు యెహోవా ఎంచుకునే చోటికి వెళ్తున్నప్పుడు కేవలం నీ పవిత్రమైన కానుకల్ని, నీ మొక్కుబడి అర్పణల్ని మాత్రమే తీసుకెళ్లాలి.
27 అక్కడ నీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద నీ దహనబలుల్ని అంటే వాటి మాంసాన్ని, రక్తాన్ని అర్పించాలి;+ నీ బలుల రక్తం నీ దేవుడైన యెహోవా బలిపీఠం పక్కన పోయబడాలి,+ అయితే వాటి మాంసాన్ని నువ్వు తినొచ్చు.
28 “నేను నీకు ఆజ్ఞాపిస్తున్న ఈ మాటలన్నిటికీ లోబడేలా జాగ్రత్తపడు. అప్పుడు నీకు, నీ తర్వాత నీ కుమారులకు మంచి జరుగుతుంది, ఎందుకంటే నువ్వు నీ దేవుడైన యెహోవా దృష్టిలో మంచిది, సరైనది చేస్తున్నావు.
29 “నువ్వు స్వాధీనం చేసుకోబోయే జనాల్ని నీ దేవుడైన యెహోవా సమూలంగా నాశనం చేశాక,+ నువ్వు వాళ్ల దేశంలో నివసిస్తున్నప్పుడు,
30 వాళ్లు నీ ముందు నుండి సమూలంగా నాశనం చేయబడిన తర్వాత నువ్వు ఉరిలో చిక్కుకోకుండా జాగ్రత్తపడు. ‘ఈ జనాలు తమ దేవుళ్లను ఎలా పూజించేవాళ్లో చెప్పండి, నేనూ అలాగే చేస్తాను’+ అంటూ నువ్వు వాళ్ల దేవుళ్ల గురించి అడగకూడదు.
31 నువ్వు నీ దేవుడైన యెహోవాను అలా ఆరాధించకూడదు. ఎందుకంటే వాళ్లు తమ దేవుళ్ల కోసం, యెహోవా ద్వేషించే ప్రతీ అసహ్యమైన పనిని చేస్తారు; ఆఖరికి తమ దేవుళ్లకు అర్పించడం కోసం తమ కుమారుల్ని, కూతుళ్లను అగ్నిలో వేసి కాల్చేస్తారు.+
32 నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ప్రతీ మాట ప్రకారం నడుచుకునేలా మీరు జాగ్రత్తపడాలి.+ మీరు దానికి ఏమీ కలపకూడదు, దాన్నుండి ఏమీ తీసేయకూడదు.+