ద్వితీయోపదేశకాండం 20:1-20

  • యుద్ధ నియమాలు (1-20)

    • సైనిక సేవ నుండి మినహాయింపు (5-9)

20  “నువ్వు నీ శత్రువుల మీదికి యుద్ధానికి వెళ్లినప్పుడు, వాళ్లకు నీకన్నా ఎక్కువ గుర్రాలు, రథాలు, సైనిక దళాలు ఉండడం చూసి, వాళ్లకు భయపడకు. ఎందుకంటే ఐగుప్తు దేశం నుండి నిన్ను బయటికి తీసుకొచ్చిన నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు.+  మీరు యుద్ధానికి వెళ్లేముందు, యాజకుడు ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్లతో మాట్లాడాలి.+  అతను వాళ్లతో ఇలా అనాలి: ‘ఇశ్రాయేలీయులారా, వినండి. మీరు మీ శత్రువులతో యుద్ధం చేయబోతున్నారు. మీ హృదయంలో పిరికితనానికి చోటివ్వకండి. మీరు వాళ్లను చూసి భయపడకండి, బెదిరిపోకండి, వణికిపోకండి.  ఎందుకంటే, మీ తరఫున మీ శత్రువులతో పోరాడి మిమ్మల్ని కాపాడడానికి మీ దేవుడైన యెహోవా మీతో కలిసి నడుస్తున్నాడు.’+  “అధికారులు కూడా ప్రజలతో ఇలా చెప్పాలి: ‘కొత్త ఇల్లు కట్టుకొని, గృహప్రవేశం చేయని వ్యక్తి ఎవరైనా ఉంటే, అతను తన ఇంటికి తిరిగెళ్లిపోవాలి. లేదంటే, అతను యుద్ధంలో చనిపోవచ్చు, అప్పుడు వేరే వ్యక్తి గృహప్రవేశం చేస్తాడు.  ద్రాక్షతోట నాటి, దాని పండ్లను తినని వ్యక్తి ఎవరైనా ఉంటే, అతను తన ఇంటికి తిరిగెళ్లిపోవాలి. లేదంటే, అతను యుద్ధంలో చనిపోవచ్చు, అప్పుడు వేరే వ్యక్తి వాటిని తింటాడు.  ఒక స్త్రీతో పెళ్లి నిశ్చయమైన వ్యక్తి ఎవరైనా ఉంటే, అతను తన ఇంటికి తిరిగెళ్లిపోవాలి.+ లేదంటే, అతను యుద్ధంలో చనిపోవచ్చు, అప్పుడు వేరే వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకుంటాడు.’  అంతేకాదు అధికారులు ప్రజలతో ఈ మాట కూడా చెప్పాలి: ‘భయస్థుడు, పిరికివాడు ఎవరైనా ఉంటే,+ అతను తన ఇంటికి తిరిగెళ్లిపోవాలి. లేదంటే అతను తనలాగే తన సహోదరులు కూడా ధైర్యం కోల్పోయేలా చేస్తాడు.’*+  అధికారులు ప్రజలతో మాట్లాడడం అయిపోయిన తర్వాత వాళ్లు, ప్రజల్ని నడిపించడానికి సైన్యాధికారుల్ని నియమించాలి. 10  “నువ్వు ఏదైనా నగరం మీదికి యుద్ధానికి వెళ్తుంటే, ముందు శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి రాయబారం పంపాలి.+ 11  అవతలి వాళ్లు దానికి సమ్మతించి, నీకోసం వాళ్ల నగర ద్వారాల్ని తెరిస్తే, అందులోని ప్రజలందరూ నీకు బానిసలై నీకు సేవ చేస్తారు.+ 12  కానీ వాళ్లు నీతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి అంగీకరించకుండా నీతో యుద్ధానికి దిగితే, నువ్వు ఆ నగరాన్ని ముట్టడి వేయాలి. 13  నీ దేవుడైన యెహోవా ఖచ్చితంగా దాన్ని నీ చేతికి అప్పగిస్తాడు, నువ్వు ఆ నగరంలోని ప్రతీ పురుషుణ్ణి ఖడ్గంతో చంపేయాలి. 14  అయితే నువ్వు స్త్రీలను, పిల్లల్ని, పశువుల్ని, ఆ నగరంలో ఉన్న ప్రతీదాన్ని, దాని దోపుడుసొమ్ము అంతటినీ నీకోసం కొల్లగొట్టవచ్చు;+ నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన నీ శత్రువుల దోపుడుసొమ్మును నువ్వు తింటావు.+ 15  “నీకు చాలా దూరాన ఉన్న నగరాలన్నిటికీ, అంటే నీకు దగ్గర్లో ఉన్న ఈ జనాలకు చెందని నగరాలన్నిటికీ నువ్వు అలాగే చేస్తావు. 16  కానీ నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇస్తున్న ఈ దేశంలోని జనాల నగరాల్లో ఏ మనిషినీ* నువ్వు బ్రతకనివ్వకూడదు.+ 17  బదులుగా, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్టే నువ్వు వాళ్లను అంటే హిత్తీయుల్ని, అమోరీయుల్ని, కనానీయుల్ని, పెరిజ్జీయుల్ని, హివ్వీయుల్ని, యెబూసీయుల్ని పూర్తిగా నాశనం చేయాలి;+ 18  లేదంటే, వాళ్లు తమ దేవుళ్ల కోసం చేసిన అసహ్యకరమైన ఆచారాలన్నిటినీ మీకు నేర్పించి, మీ దేవుడైన యెహోవాకు విరోధంగా మీతో పాపం చేయిస్తారు.+ 19  “నువ్వు ఒక నగరాన్ని చెరపట్టడానికి దాన్ని ముట్టడి వేసి, చాలా రోజులుగా దానితో పోరాడుతూ ఉంటే, గొడ్డలితో దాని చెట్లను నాశనం చేయకూడదు. నువ్వు వాటి పండ్లను తినొచ్చు, కానీ వాటిని నరికేయకూడదు.+ ఒక మనిషిని ముట్టడి వేసినట్టు పొలంలోని చెట్టును ముట్టడి వేస్తావా? 20  ఆహారానికి పనికిరాదని తెలిసిన చెట్టును మాత్రమే నువ్వు నాశనం చేయవచ్చు. నువ్వు వాటిని నరికి, నీతో యుద్ధం చేస్తున్న నగరాన్ని పడగొట్టేంతవరకు వాటితో ముట్టడిదిబ్బ కట్టవచ్చు.

అధస్సూచీలు

లేదా “తన గుండెలాగే, తన సహోదరుల గుండెలు కూడా నీరుగారిపోయేలా చేస్తాడు.”
లేదా “ఊపిరి తీసుకుంటున్న దేన్నీ.”