ద్వితీయోపదేశకాండం 23:1-25
23 “వృషణాలు చితగ్గొట్టబడినవాడు గానీ, పురుషాంగం కోసేయబడినవాడు గానీ యెహోవా సమాజంలోకి రాకూడదు.+
2 “అక్రమ సంబంధం వల్ల పుట్టినవాడెవ్వడూ యెహోవా సమాజంలోకి రాకూడదు.+ పదోతరం వరకు కూడా, అతని వంశస్థులెవ్వరూ యెహోవా సమాజంలోకి రాకూడదు.
3 “ఏ అమ్మోనీయుడూ, మోయాబీయుడూ యెహోవా సమాజంలోకి రాకూడదు.+ పదోతరం వరకు కూడా, వాళ్ల వంశస్థులెవ్వరూ ఎన్నడూ యెహోవా సమాజంలోకి రాకూడదు;
4 ఎందుకంటే మీరు ఐగుప్తు నుండి బయటికి వస్తున్నప్పుడు వాళ్లు మీకు ఆహారాన్ని, నీళ్లను ఇచ్చి సహాయం చేయలేదు;+ అలాగే మిమ్మల్ని శపించడానికి, మెసొపొతమియలోని పెతోరు నుండి బెయోరు కుమారుడైన బిలామును డబ్బులిచ్చి పిలిపించారు.+
5 కానీ నీ దేవుడైన యెహోవా బిలాము మాట వినడానికి ఒప్పుకోలేదు.+ బదులుగా, నీ దేవుడైన యెహోవా ఆ శాపాన్ని నీకోసం దీవెనగా మార్చాడు,+ ఎందుకంటే నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించాడు.+
6 నువ్వు బ్రతికి ఉన్నన్ని రోజులు ఎన్నడూ వాళ్ల సంక్షేమం కోసం గానీ, వాళ్ల శ్రేయస్సు కోసం గానీ పాటుపడకూడదు.+
7 “నువ్వు ఎదోమీయుణ్ణి ద్వేషించకూడదు, ఎందుకంటే అతను నీ సహోదరుడు.+
“నువ్వు ఐగుప్తీయుణ్ణి ద్వేషించకూడదు, ఎందుకంటే నువ్వు వాళ్ల దేశంలో పరదేశిగా ఉండేవాడివి.+
8 వాళ్లకు పుట్టిన పిల్లల్లో మూడోతరం వాళ్లు యెహోవా సమాజంలోకి రావచ్చు.
9 “నువ్వు నీ శత్రువుతో యుద్ధానికి వెళ్లినప్పుడు, నిన్ను నువ్వు అపవిత్రపర్చుకోకుండా జాగ్రత్తపడు.+
10 ఒకవేళ ఒక పురుషుడు రాత్రిపూట వీర్యస్ఖలనం అవ్వడం వల్ల అపవిత్రుడైతే, అతను పాలెం బయటికి వెళ్లాలి, మళ్లీ పాలెంలోకి తిరిగి రాకూడదు.
11 సాయంత్రమైనప్పుడు అతను నీళ్లతో స్నానం చేసి, సూర్యాస్తమయం సమయంలో పాలెంలోకి రావచ్చు.+
12 పాలెం బయట నీకు ఒక చోటు* ఉండాలి, నువ్వు అక్కడికే వెళ్లాలి.
13 నీ సామాన్లలో గసిక కూడా ఉండాలి. నువ్వు మలవిసర్జన కోసం బయటికి వెళ్లినప్పుడు, ఆ గసికతో చిన్న గుంట చేసి, తర్వాత నీ మలాన్ని కప్పేయాలి.
14 ఎందుకంటే, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించడానికి, నీ శత్రువుల్ని నీ చేతికి అప్పగించడానికి నీ పాలెంలో తిరుగుతున్నాడు;+ నీ పాలెం పవిత్రంగా ఉండాలి.+ లేదంటే నీ మధ్య అశుద్ధమైనది ఏదైనా ఆయనకు కనిపించి, ఆయన మిమ్మల్ని విడిచిపెట్టిపోయే అవకాశం ఉంది.
15 “ఒక దాసుడు తన యజమాని దగ్గర నుండి పారిపోయి నీ దగ్గరికి వస్తే నువ్వు అతన్ని తిరిగి ఆ యజమానికి అప్పగించకూడదు.
16 నీ నగరాల్లో అతను ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ, అతనికి నచ్చిన చోట అతను ఉండవచ్చు. నువ్వు అతన్ని బాధించకూడదు.+
17 “ఇశ్రాయేలు కూతుళ్లలో గానీ,+ కుమారుల్లో గానీ+ ఎవ్వరూ ఆలయ వేశ్యలు కాకూడదు.
18 ఆడవేశ్య గానీ, మగవేశ్య* గానీ మొక్కుబడి తీర్చుకోవడానికి తమ పడుపుసొమ్మును నీ దేవుడైన యెహోవా మందిరానికి తీసుకురాకూడదు. ఎందుకంటే వాళ్లిద్దరూ నీ దేవుడైన యెహోవాకు అసహ్యులు.
19 “డబ్బు మీద గానీ, ఆహారం మీద గానీ, వడ్డీ వసూలు చేసే అవకాశం ఉన్న దేనిమీద గానీ నువ్వు నీ సహోదరుని దగ్గర వడ్డీ తీసుకోకూడదు.+
20 నువ్వు ఒక పరదేశి దగ్గర వడ్డీ తీసుకోవచ్చు కానీ నీ సహోదరుని దగ్గర వడ్డీ తీసుకోకూడదు.+ అప్పుడే, నువ్వు స్వాధీనం చేసుకోబోయే దేశంలో నువ్వు చేసే ప్రతీ పనిలో నీ దేవుడైన యెహోవా నిన్ను దీవిస్తాడు.+
21 “నువ్వు నీ దేవుడైన యెహోవాకు మొక్కుబడి చేసుకుంటే,+ దాన్ని చెల్లించే విషయంలో ఆలస్యం చేయకు.+ ఎందుకంటే నీ దేవుడైన యెహోవా ఖచ్చితంగా దాన్ని నీ నుండి అడుగుతాడు; ఆ మొక్కుబడి చెల్లించకపోతే, నువ్వు పాపం చేసినట్టే.+
22 కానీ నువ్వు మొక్కుబడి చేసుకోకపోతే, నీ మీద ఏ పాపం ఉండదు.+
23 నీ పెదాల నుండి వచ్చే మాటను నువ్వు నిలబెట్టుకోవాలి,+ నీ దేవుడైన యెహోవాకు స్వేచ్ఛార్పణగా ఇస్తానని నీ నోటితో చేసిన మొక్కుబడిని నువ్వు తీర్చాలి.+
24 “నువ్వు నీ పొరుగువాడి ద్రాక్షతోటలో అడుగుపెడితే, నీ ఆకలి తీరేవరకు అందులోని ద్రాక్షల్ని తినొచ్చు, కానీ ఒక్క ద్రాక్షను కూడా నీ గంపలో వేసుకోకూడదు.+
25 “నువ్వు నీ పొరుగువాడి పంటచేనులోకి వెళ్తే, దానిలోని వెన్నుల్ని చేతితో తుంచుకోవచ్చు, కానీ నీ పొరుగువాడి ధాన్యం మీద కొడవలి పెట్టకూడదు.+