ద్వితీయోపదేశకాండం 24:1-22

  • పెళ్లి, విడాకులు (1-5)

  • జీవం పట్ల గౌరవం (6-9)

  • పేదవాళ్ల మీద శ్రద్ధ చూపించడం (10-18)

  • పరిగె ఏరుకునే విషయంలో నియమాలు (19-22)

24  “ఒక వ్యక్తి ఓ స్త్రీని పెళ్లి చేసుకున్న తర్వాత, ఆమెలో అసభ్యకరమైనది ఏదైనా కనిపించడం వల్ల ఇక ఆమెతో కాపురం చేయడానికి అతను ఇష్టపడకపోతే అతను విడాకుల పత్రం రాసి,+ ఆమె చేతికిచ్చి, ఆమెను తన ఇంట్లో నుండి పంపించేయాలి.+  అతని ఇంట్లో నుండి వెళ్లిపోయిన తర్వాత ఆమె ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు.+  రెండో వ్యక్తి కూడా ఆమెను ద్వేషించి,* విడాకుల పత్రం రాసి, ఆమె చేతికిచ్చి, ఆమెను తన ఇంట్లో నుండి పంపించేస్తే, లేదా ఆమెను పెళ్లి చేసుకున్న ఆ రెండో వ్యక్తి చనిపోతే,  ఆమెను తన ఇంట్లో నుండి పంపించేసిన మొదటి భర్త ఆమెను మళ్లీ తన భార్యగా చేసుకోకూడదు, ఎందుకంటే ఆమె అపవిత్రపర్చబడింది; అది యెహోవాకు అసహ్యం. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇస్తున్న దేశంలోకి నువ్వు పాపాన్ని తీసుకురాకూడదు.  “కొత్తగా పెళ్లి చేసుకున్న పురుషుడు సైన్యంలో సేవ చేయకూడదు, అతనికి వేరే ఏ బాధ్యతలూ అప్పగించకూడదు. అతను ఒక సంవత్సరం పాటు వాటన్నిటికీ దూరంగా ఉంటూ, ఇంట్లోనే ఉండి తన భార్యను సంతోషపెట్టాలి.+  “అప్పు ఇచ్చినప్పుడు ఎవ్వరూ తిరుగలిని గానీ, దాని మీది రాయిని గానీ తాకట్టుగా* తీసుకోకూడదు.+ ఎందుకంటే అలాచేస్తే, ఒక వ్యక్తి జీవనాన్ని* తాకట్టుగా తీసుకున్నట్టే.  “ఎవరైనా తన ఇశ్రాయేలు సహోదరుల్లో ఒకర్ని అపహరించి, అతన్ని హింసించి, అతన్ని అమ్మేస్తే,+ ఆ అపహరించిన వ్యక్తిని చంపేయాలి.+ అలా నువ్వు నీ మధ్య నుండి చెడుతనాన్ని నిర్మూలించాలి.+  “కుష్ఠువ్యాధి* ఒక్కసారిగా బయటపడితే, లేవీయులైన యాజకులు మీకు నిర్దేశించే వాటన్నిటినీ చాలా జాగ్రత్తగా పాటించండి.+ సరిగ్గా నేను వాళ్లకు ఆజ్ఞాపించినట్టే చేసేలా చూసుకోండి.  మీరు ఐగుప్తు నుండి బయటికి వస్తున్నప్పుడు దారిలో మీ దేవుడైన యెహోవా మిర్యాముకు ఏమి చేశాడో గుర్తుంచుకోండి.+ 10  “నువ్వు నీ పొరుగువాడికి ఏదైనా అప్పు ఇస్తే,+ అతను తాకట్టు పెడతానని మాటిచ్చిన వస్తువును తెచ్చుకోవడానికి నువ్వు అతని ఇంట్లోకి వెళ్లకూడదు. 11  నువ్వు బయటే నిలబడి ఉండాలి, అప్పు తీసుకున్న వ్యక్తి తాను తాకట్టు పెడుతున్న వస్తువును బయటికి తీసుకొచ్చి నీకు ఇవ్వాలి. 12  ఒకవేళ ఆ వ్యక్తి పేదవాడైతే, ఆ తాకట్టు వస్తువును నీ దగ్గరే పెట్టుకొని నిద్రపోకూడదు.+ 13  సూర్యుడు అస్తమించిన వెంటనే నువ్వు ఖచ్చితంగా ఆ తాకట్టు వస్తువును అతనికి తిరిగిచ్చేయాలి. అప్పుడు అతను ఆ వస్త్రాన్ని కప్పుకొని నిద్రపోతాడు,+ నిన్ను దీవిస్తాడు; నీ దేవుడైన యెహోవా ముందు అది నీకు నీతిగా ఎంచబడుతుంది. 14  “అవసరంలో ఉన్న పేదవాణ్ణి నువ్వు కూలికి పెట్టుకున్నప్పుడు అతన్ని దగా చేయకూడదు. అతను నీ సహోదరుడే గానీ, నీ దేశంలోని నగరాల్లో నివసిస్తున్న పరదేశే గానీ నువ్వు అతన్ని దగా చేయకూడదు.+ 15  నువ్వు అదే రోజున, సూర్యుడు అస్తమించక ముందే అతని కూలి డబ్బులు అతనికి ఇచ్చేయాలి;+ ఎందుకంటే అతను పేదవాడు, అతని జీవితం* ఆ డబ్బులపైనే ఆధారపడి ఉంది. ఒకవేళ నువ్వు అలా ఇవ్వకపోతే, అతను నీకు వ్యతిరేకంగా యెహోవాకు మొరపెడతాడు, అప్పుడు నువ్వు పాపం చేసినవాడివౌతావు.+ 16  “పిల్లల తప్పుల్ని బట్టి తండ్రులకు మరణశిక్ష విధించకూడదు, తండ్రుల తప్పుల్ని బట్టి పిల్లలకు మరణశిక్ష విధించకూడదు.+ ఒక వ్యక్తికి కేవలం అతని సొంత పాపాన్ని బట్టే మరణశిక్ష విధించాలి.+ 17  “పరదేశికి గానీ, తండ్రిలేని పిల్లలకు* గానీ న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు;+ విధవరాలికి అప్పు ఇస్తున్నప్పుడు ఆమె వస్త్రాన్ని తాకట్టుగా* తీసుకోకూడదు.+ 18  ఒకప్పుడు నువ్వు ఐగుప్తులో బానిసగా ఉండేవాడివని గుర్తుంచుకో, నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడి నుండి విడిపించాడు.+ అందుకే నువ్వు ఇలా చేయాలని నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. 19  “నువ్వు నీ పొలంలో కోత కోసేటప్పుడు అక్కడ ఒక పనను* మర్చిపోతే, దాన్ని తెచ్చుకోవడానికి వెనక్కి వెళ్లకూడదు. పరదేశి కోసం, తండ్రిలేని పిల్లల కోసం, విధవరాలి కోసం దాన్ని వదిలేయాలి.+ అప్పుడే నీ దేవుడైన యెహోవా నువ్వు చేసే ప్రతీ పనిలో నిన్ను దీవిస్తాడు.+ 20  “నువ్వు నీ ఒలీవ చెట్టు కొమ్మల నుండి కాయల్ని రాలగొట్టేటప్పుడు, దాని కొమ్మల్ని రెండోసారి అలా కొట్టకూడదు; మిగిలిన కాయల్ని పరదేశి కోసం, తండ్రిలేని పిల్లల కోసం, విధవరాలి కోసం వదిలేయాలి.+ 21  “నీ ద్రాక్షతోటలోని ద్రాక్షల్ని సమకూర్చుకునేటప్పుడు, మిగిలిన ద్రాక్షల్ని ఏరుకోవడానికి వెనక్కి వెళ్లకూడదు. పరదేశి కోసం, తండ్రిలేని పిల్లల కోసం, విధవరాలి కోసం వాటిని వదిలేయాలి. 22  నువ్వు ఐగుప్తులో బానిసగా ఉండేవాడివని గుర్తుంచుకో. అందుకే నువ్వు ఇలా చేయాలని నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను.

అధస్సూచీలు

లేదా “తిరస్కరించి.”
లేదా “జామీనుగా.”
లేదా “ప్రాణాన్ని.”
“కుష్ఠు” అని అనువదించిన హీబ్రూ పదానికి విస్తృత అర్థం ఉంది. ఇందులో ఒకరి నుండి ఒకరికి సోకే రకరకాల చర్మవ్యాధులు ఉన్నాయి. అంతేకాదు బట్టలకు లేదా ఇళ్లకు వచ్చే కొన్ని అంటువ్యాధులు కూడా ఇందులో ఉండవచ్చు.
లేదా “ప్రాణం.”
లేదా “అనాథలకు.”
లేదా “జామీనుగా.”
లేదా “ధాన్యపు వెన్నుల కట్టను.”