ద్వితీయోపదేశకాండం 26:1-19

  • ప్రథమఫలాల్ని అర్పించడం (1-11)

  • ఇంకో రకమైన పదోవంతు (12-15)

  • ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రత్యేకమైన సొత్తు (16-19)

26  “చివరికి నువ్వు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇస్తున్న దేశంలోకి ప్రవేశించి, దాన్ని స్వాధీనం చేసుకొని, అందులో నివసిస్తున్నప్పుడు,  నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న దేశంలో నీ భూమిలో పండిన పంట అంతట్లో నుండి ప్రథమఫలాలు కొన్ని తీసుకొని, ఒక గంపలో పెట్టుకొని, నీ దేవుడైన యెహోవా తన పేరును మహిమపర్చడానికి ఎంచుకున్న చోటుకు వెళ్లాలి.+  నువ్వు, ఆ సమయంలో సేవచేస్తున్న యాజకుని దగ్గరికి వెళ్లి, అతనితో ఇలా అనాలి: ‘మాకు ఇస్తానని యెహోవా మా పూర్వీకులకు ప్రమాణం చేసిన దేశంలోకి+ నేను వచ్చానని నీ దేవుడైన యెహోవా ముందు ఈ రోజు నేను ప్రకటిస్తున్నాను.’  “అప్పుడు యాజకుడు నీ చేతిలో నుండి ఆ గంపను తీసుకొని, నీ దేవుడైన యెహోవా బలిపీఠం ముందు దాన్ని పెడతాడు.  తర్వాత నువ్వు నీ దేవుడైన యెహోవా ముందు ఇలా ప్రకటించాలి: ‘మా పూర్వీకుడు ఒక చోటి నుండి మరో చోటికి సంచరించే* అరామీయుడు.+ అతను ఐగుప్తుకు వెళ్లి+ అక్కడ పరదేశిగా నివసించాడు, అప్పుడు అతని కుటుంబంలో కొద్దిమందే ఉండేవాళ్లు.+ కానీ అక్కడ అతను ఎంతోమంది ఉన్న బలమైన గొప్ప జనం అయ్యాడు.+  ఐగుప్తీయులు మమ్మల్ని హింసించి, అణగదొక్కి, మాతో వెట్టిచాకిరి చేయించారు.+  కాబట్టి మేము మా పూర్వీకుల దేవుడైన యెహోవాకు మొర పెట్టుకున్నాం, అప్పుడు యెహోవా మా మొర విని, మేము పడుతున్న బాధల్ని, కష్టాల్ని చూశాడు, వాళ్లు మమ్మల్ని ఎంతగా అణచివేస్తున్నారో గమనించాడు.+  చివరికి యెహోవా భీకర కార్యాలు, సూచనలు, అద్భుతాలు చేసి బలమైన చేతితో, చాచిన బాహువుతో మమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి రప్పించాడు.+  తర్వాత ఆయన మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి, పాలుతేనెలు ప్రవహించే ఈ దేశాన్ని మాకు ఇచ్చాడు.+ 10  ఇప్పుడు నేను, యెహోవా నాకు ఇచ్చిన భూమిలో పండిన పంటలోని ప్రథమఫలాల్ని తీసుకొచ్చాను.’+ “నువ్వు వాటిని నీ దేవుడైన యెహోవా ముందు పెట్టి, నీ దేవుడైన యెహోవా ముందు వంగి నమస్కారం చేయాలి. 11  తర్వాత నువ్వు నీ దేవుడైన యెహోవా నీకు, నీ ఇంటివాళ్లకు ఇచ్చిన మంచివాటన్నిటిని బట్టి సంతోషించాలి; నువ్వే కాదు, నీ మధ్య నివసించే లేవీయులు, పరదేశులు కూడా సంతోషించాలి.+ 12  “మూడో సంవత్సరంలో, అంటే పదోవంతు* ఇవ్వాల్సిన సంవత్సరంలో నువ్వు నీ పంట అంతట్లో పదోవంతును సమకూర్చిన తర్వాత,+ నువ్వు దాన్ని లేవీయులకు, పరదేశులకు, తండ్రిలేని పిల్లలకు,* విధవరాళ్లకు ఇవ్వాలి. నీ నగరాల లోపల వాళ్లు కడుపునిండా తింటారు.+ 13  తర్వాత నువ్వు నీ దేవుడైన యెహోవా ముందు ఇలా అనాలి: ‘నువ్వు నాకు ఆజ్ఞాపించినట్టే నేను నా ఇంట్లో నుండి పవిత్రమైన భాగాన్ని తీసేసి లేవీయులకు, పరదేశులకు, తండ్రిలేని పిల్లలకు, విధవరాళ్లకు ఇచ్చాను.+ నేను నీ ఆజ్ఞల్ని మీరలేదు, వాటిని నిర్లక్ష్యం చేయలేదు. 14  దుఃఖంలో ఉన్నప్పుడు నేను దానిలో నుండి ఏమీ తినలేదు, అపవిత్రంగా ఉన్నప్పుడు దానిలో నుండి ఏదీ తీసేయలేదు, చనిపోయినవాళ్ల కోసం దానిలో నుండి ఏదీ ఇవ్వలేదు. నేను నా దేవుడైన యెహోవా స్వరానికి లోబడి, నువ్వు నాకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేశాను. 15  ఇప్పుడు నువ్వు నీ పవిత్ర నివాసమైన పరలోకం నుండి కిందికి చూసి నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని, అలాగే నువ్వు మా పూర్వీకులకు ప్రమాణం చేసినట్టే+ మాకు ఇచ్చిన ఈ పాలుతేనెలు ప్రవహించే దేశాన్ని+ దీవించు.’+ 16  “ఈ నియమాల్ని, న్యాయనిర్ణయాల్ని పాటించమని నేడు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వు నీ నిండు హృదయంతో, నీ నిండు ప్రాణంతో* వాటిని పాటిస్తూ, వాటి ప్రకారం జీవించాలి.+ 17  నువ్వు ఆయన మార్గాల్లో నడుస్తూ, ఆయన నియమాల్ని,+ ఆజ్ఞల్ని,+ న్యాయనిర్ణయాల్ని+ పాటిస్తూ, ఆయన మాట వింటూ ఉండగా నీకు దేవుణ్ణి అవుతానని యెహోవా నేడు నీకు మాటిచ్చాడు. 18  అలాగే, ఆయన నీకు వాగ్దానం చేసినట్టే మీరు ఆయన ప్రజలు, ఆయన ప్రత్యేకమైన సొత్తు* అవుతామని,+ ఆయన ఆజ్ఞలన్నిటినీ పాటిస్తామని నేడు నువ్వు యెహోవాకు మాటిచ్చావు. 19  మీరు మీ దేవుడైన యెహోవా దృష్టికి పవిత్రమైన ప్రజలుగా ఉంటుండగా, తాను వాగ్దానం చేసినట్టే మీకు కీర్తిప్రతిష్ఠల్ని, ఘనతను ఇస్తూ, తాను సృష్టించిన ఇతర జనాలన్నిటి కన్నా మిమ్మల్ని ఎక్కువగా హెచ్చిస్తానని+ ఆయన అన్నాడు.”+

అధస్సూచీలు

లేదా “నశించిపోయే స్థితిలో ఉన్న” అయ్యుంటుంది.
లేదా “అనాథలకు.”
లేదా “దశమభాగం.”
పదకోశం చూడండి.
లేదా “విలువైన సంపద.”