ద్వితీయోపదేశకాండం 7:1-26

  • నాశనం చేయాల్సిన ఏడు జనాలు (1-6)

  • ఇశ్రాయేలును ఎంచుకోవడానికి కారణం (7-11)

  • లోబడివుంటే భవిష్యత్తులో వర్ధిల్లుతారు (12-26)

7  “నువ్వు అడుగుపెట్టి స్వాధీనం చేసుకోబోయే దేశంలోకి నీ దేవుడైన యెహోవా నిన్ను తీసుకొచ్చినప్పుడు, ఆయన ఎక్కువ జనాభాగల జనాల్ని, అంటే హిత్తీయుల్ని, గిర్గాషీయుల్ని, అమోరీయుల్ని, కనానీయుల్ని, పెరిజ్జీయుల్ని, హివ్వీయుల్ని, యెబూసీయుల్ని మొత్తం ఏడు జనాల్ని నీ ముందు నుండి వెళ్లగొడతాడు.+ అవి నీకన్నా పెద్దవి, బలమైనవి.+  నీ దేవుడైన యెహోవా వాళ్లను నీకు అప్పగిస్తాడు, నువ్వు వాళ్లను ఓడిస్తావు.+ నువ్వు తప్పకుండా వాళ్లను సమూలనాశనం చేయాలి.+ నువ్వు వాళ్లతో ఎలాంటి ఒప్పందం చేసుకోకూడదు, వాళ్ల మీద ఏమాత్రం జాలి చూపించకూడదు.+  నువ్వు వాళ్లతో పెళ్లి సంబంధాలు కలుపుకోకూడదు. నీ కూతుళ్లను వాళ్ల కుమారులకు ఇవ్వకూడదు, నీ కుమారుల కోసం వాళ్ల కూతుళ్లను తీసుకోకూడదు.+  ఎందుకంటే నన్ను అనుసరించడం మానేసి వేరే దేవుళ్లను పూజించేలా వాళ్లు నీ కుమారుల్ని తిప్పేస్తారు;+ అప్పుడు యెహోవా కోపం మీ మీద రగులుకుంటుంది, ఆయన నిన్ను చాలా త్వరగా నాశనం చేస్తాడు.+  “అయితే, మీరు వాళ్ల విషయంలో ఇలా చేయాలి: వాళ్ల బలిపీఠాల్ని కూలగొట్టాలి, వాళ్ల పూజా స్తంభాల్ని ధ్వంసం చేయాలి,+ వాళ్ల పూజా కర్రల్ని*+ విరగ్గొట్టాలి, వాళ్ల చెక్కిన విగ్రహాల్ని కాల్చేయాలి.+  ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాకు పవిత్రమైన ప్రజలు; భూమ్మీదున్న జనాలన్నిట్లో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని తన ప్రజలుగా, తన ప్రత్యేకమైన సొత్తుగా* ఎంచుకున్నాడు.+  “యెహోవా మీ మీద అనురాగం చూపించింది, మిమ్మల్ని ఎంచుకుంది మీరు జనాలన్నిట్లో ఎక్కువ జనాభాగల జనమని కాదు.+ ఎందుకంటే మీరు జనాలన్నిట్లో అత్యంత చిన్న జనం.+  బదులుగా, యెహోవాకు మీ మీద ఉన్న ప్రేమ వల్ల, మీ పూర్వీకులకు తాను వేసిన ఒట్టును నిలబెట్టుకున్నందు వల్ల+ యెహోవా మిమ్మల్ని బలమైన చేతితో బయటికి తీసుకొచ్చాడు. దాస్య గృహం నుండి, ఐగుప్తు రాజైన ఫరో చేతి నుండి మిమ్మల్ని విడిపించాలని ఆయన అలా చేశాడు.+  నీ దేవుడైన యెహోవా సత్యదేవుడని, నమ్మకమైన దేవుడని, తనను ప్రేమిస్తూ తన ఆజ్ఞల్ని పాటించేవాళ్ల విషయంలో వెయ్యి తరాల వరకు తన ఒప్పందానికి కట్టుబడి ఉంటాడని, విశ్వసనీయ ప్రేమ చూపిస్తాడని నీకు బాగా తెలుసు.+ 10  కానీ ఆయన తనను ద్వేషించేవాళ్లను నాశనం చేసి వాళ్లకు నేరుగా ప్రతిఫలమిస్తాడు.+ ఆయన తనను ద్వేషించేవాళ్లను శిక్షించే విషయంలో ఆలస్యం చేయడు; ఆయన వాళ్లకు నేరుగా ప్రతిఫలమిస్తాడు. 11  కాబట్టి, ఈ రోజు నేను నీకు ఇస్తున్న ఆజ్ఞల్ని, నియమాల్ని, న్యాయనిర్ణయాల్ని పాటిస్తూ వాటి ప్రకారం జీవించేలా జాగ్రత్తపడు. 12  “మీరు ఈ న్యాయనిర్ణయాల్ని వింటూ, వాటిని పాటిస్తూ వాటి ప్రకారం జీవిస్తూ ఉంటే, మీ దేవుడైన యెహోవా మీ పూర్వీకులకు ప్రమాణం చేసిన ఒప్పందానికి కట్టుబడి ఉంటాడు, మీ మీద విశ్వసనీయ ప్రేమ చూపిస్తాడు. 13  ఆయన నిన్ను ప్రేమిస్తాడు, దీవిస్తాడు, నువ్వు ఎక్కువమంది అయ్యేలా చేస్తాడు. అవును, ఆయన నీకు ఇస్తానని నీ పూర్వీకులకు ప్రమాణం చేసిన దేశంలో+ నీకు అనేకమంది పిల్లల్ని,*+ పంటను, ధాన్యాన్ని, కొత్త ద్రాక్షారసాన్ని, నూనెను, నీ పశువులకు-మందలకు పిల్లల్ని ఇచ్చి దీవిస్తాడు. 14  నువ్వు జనాలన్నిట్లో ఎక్కువగా దీవించబడిన జనం అవుతావు;+ నీ మధ్య సంతానం లేని పురుషులు గానీ, స్త్రీలు గానీ ఉండరు; నీ పశువుల్లో కూడా సంతానం లేనివంటూ ఉండవు.+ 15  యెహోవా నీ మధ్య నుండి జబ్బులన్నిటినీ తీసేస్తాడు; ఐగుప్తులో నీకు తెలిసిన భయంకరమైన రోగాల్లో దేన్నీ ఆయన నీమీదికి తీసుకురాడు.+ బదులుగా ఆయన వాటిని నిన్ను ద్వేషించే వాళ్లందరి మీదికి తీసుకొస్తాడు. 16  నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించే జనాలన్నిటినీ నువ్వు నాశనం చేయాలి.+ నువ్వు* వాళ్ల మీద జాలి పడకూడదు,+ వాళ్ల దేవుళ్లను పూజించకూడదు; ఎందుకంటే అది నీకు ఉరిగా ఉంటుంది.+ 17  “ఒకవేళ నీ హృదయంలో, ‘ఈ జనాలు మాకన్నా పెద్దవి. నేను వీళ్లను ఎలా వెళ్లగొట్టగలను?’ అనే ప్రశ్న వస్తే, 18  నువ్వు వాళ్లను చూసి భయపడకూడదు.+ నీ దేవుడైన యెహోవా ఫరోకు, ఐగుప్తు దేశమంతటికీ చేసినదాన్ని నువ్వు గుర్తుచేసుకోవాలి. 19  అంటే నువ్వు నీ కళ్లతో చూసిన గొప్ప తీర్పుల్ని,* నీ దేవుడైన యెహోవా నిన్ను బయటికి తీసుకురావడానికి చేసిన సూచనల్ని, అద్భుతాల్ని,+ ఆయన బలమైన చేతిని, చాచిన బాహువును నువ్వు గుర్తుచేసుకోవాలి. నువ్వు ఎవరికైతే భయపడుతున్నావో ఆ జనాలన్నిటికీ నీ దేవుడైన యెహోవా అలాగే చేస్తాడు.+ 20  వాళ్లలో మిగిలినవాళ్లు, నీ ముందుకు రాకుండా దాక్కున్నవాళ్లు నాశనమయ్యేవరకు నీ దేవుడైన యెహోవా వాళ్ల గుండెలు జారిపోయేలా చేస్తాడు.*+ 21  వాళ్లను చూసి భయపడకు, ఎందుకంటే నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు;+ ఆయన గొప్ప దేవుడు, సంభ్రమాశ్చర్యాలు పుట్టించే దేవుడు.+ 22  “నీ దేవుడైన యెహోవా ఖచ్చితంగా ఈ జనాల్ని మెల్లమెల్లగా నీ ముందు నుండి వెళ్లగొడతాడు. వాళ్లను త్వరగా నాశనం చేయడానికి ఆయన నిన్ను అనుమతించడు. లేదంటే, దేశం నిర్జనమై, అడవి జంతువుల సంఖ్య పెరిగి, వాటివల్ల నీకు హాని కలుగుతుంది. 23  నీ దేవుడైన యెహోవా వాళ్లను నీ చేతికి అప్పగించి, వాళ్లు సమూలంగా నాశనమయ్యే వరకు వాళ్లను చిత్తుచిత్తుగా ఓడిస్తాడు. 24  ఆయన వాళ్ల రాజుల్ని నీ చేతికి అప్పగిస్తాడు,+ నువ్వు వాళ్ల పేర్లను ఆకాశం కింద లేకుండా తుడిచిపెట్టేస్తావు.+ నువ్వు వాళ్లను పూర్తిగా నిర్మూలించేవరకు ఎవ్వరూ నీకు ఎదురు నిలబడలేరు.+ 25  నువ్వు వాళ్ల దేవుళ్ల చెక్కిన విగ్రహాల్ని మంటల్లో వేసి కాల్చేయాలి.+ వాటిమీద ఉన్న వెండిబంగారాల్ని నువ్వు ఆశించకూడదు, నీకోసం వాటిని తీసుకోకూడదు,+ లేదంటే నువ్వు వాటివల్ల ఉరిలో చిక్కుకుంటావు. ఎందుకంటే అవి నీ దేవుడైన యెహోవాకు అసహ్యమైనవి.+ 26  దేవుడు అసహ్యించుకునే ఏ వస్తువునూ నువ్వు నీ ఇంట్లోకి తీసుకురాకూడదు. లేదంటే వాటితోపాటు దేవుడు నిన్ను కూడా నాశనం చేస్తాడు. నువ్వు వాటిని పూర్తిగా అసహ్యించుకోవాలి, ఈసడించుకోవాలి. ఎందుకంటే అవి నాశనం చేయబడాల్సినవి.

అధస్సూచీలు

పదకోశం చూడండి.
లేదా “విలువైన సంపదగా.”
అక్ష., “గర్భఫలాన్ని.”
అక్ష., “నీ కన్ను.”
లేదా “పరీక్షల్ని.”
లేదా “వాళ్లకు భయాందోళన కలిగిస్తాడు” అయ్యుంటుంది.