ద్వితీయోపదేశకాండం 9:1-29

  • ఇశ్రాయేలుకు వాగ్దాన దేశాన్ని ఇవ్వడానికి కారణం (1-6)

  • ఇశ్రాయేలీయులు యెహోవాకు నాలుగుసార్లు కోపం తెప్పించారు (7-29)

    • బంగారు దూడ (7-14)

    • మోషే ఇశ్రాయేలీయుల తరఫున వేడుకోవడం (15-21, 25-29)

    • ఇంకో మూడుసార్లు కోపం తెప్పించారు (22)

9  “ఓ ఇశ్రాయేలూ, విను. నేడు నువ్వు యొర్దాను నది దాటి+ నీకన్నా బలమైన గొప్ప జనాలూ, ఆకాశమంత ఎత్తైన ప్రాకారాలుగల గొప్ప నగరాలూ ఉన్న దేశాన్ని+ స్వాధీనం చేసుకోబోతున్నావు.+  అక్కడి ప్రజలు పొడుగ్గా, బలంగా ఉంటారు. వాళ్లు అనాకీయులు.+ వాళ్ల గురించి మీకు తెలుసు. అంతేకాదు, ‘అనాకీయులకు ఎవరు ఎదురు నిలబడగలరు?’ అనే మాటను మీరు విన్నారు.  అయితే నేడు నువ్వు ఈ విషయం తెలుసుకోవాలి, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా ఈ నదిని దాటుతాడు.+ ఆయన దహించే అగ్ని,+ ఆయన వాళ్లను సమూలంగా నాశనం చేస్తాడు. యెహోవా నీకు ప్రమాణం చేసినట్టే నువ్వు వాళ్లను త్వరగా వెళ్లగొట్టి నాశనం చేసేలా ఆయన నీ కళ్ల ముందే వాళ్లను ఓడిస్తాడు.+  “నీ దేవుడైన యెహోవా వాళ్లను నీ ముందు నుండి వెళ్లగొట్టినప్పుడు, ‘నా నీతి వల్లే యెహోవా ఈ దేశాన్ని స్వాధీనపర్చుకోవడానికి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు’ అని నీ హృదయంలో అనుకోకూడదు.+ బదులుగా, ఆ జనాల దుష్టత్వం వల్లే+ యెహోవా వాళ్లను నీ ముందు నుండి వెళ్లగొడుతున్నాడు.  నువ్వు వాళ్ల దేశంలోకి అడుగుపెట్టి, దాన్ని స్వాధీనం చేసుకోబోతున్నది నీ నీతి వల్లో, నీ హృదయంలోని నిజాయితీ వల్లో కాదు. బదులుగా, ఆ జనాల దుష్టత్వం వల్లే యెహోవా వాళ్లను నీ ముందు నుండి వెళ్లగొడుతున్నాడు.+ అంతేకాదు, నీ పూర్వీకులైన అబ్రాహాము,+ ఇస్సాకు,+ యాకోబులకు+ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి యెహోవా అలా చేస్తున్నాడు.  కాబట్టి నువ్వు స్వాధీనపర్చుకోవడానికి నీ దేవుడైన యెహోవా నీకు ఈ మంచి దేశాన్ని ఇస్తున్నది నీ నీతి వల్ల కాదని తెలుసుకో. ఎందుకంటే మీరు తలబిరుసు ప్రజలు.+  “నువ్వు ఎడారిలో నీ దేవుడైన యెహోవాకు ఎలా కోపం తెప్పించావో గుర్తుంచుకో,+ ఆ విషయం ఎప్పుడూ మర్చిపోకు. మీరు ఐగుప్తు నుండి బయటికి వచ్చిన రోజు నుండి ఈ చోటికి వచ్చేవరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు.+  హోరేబులో కూడా మీరు యెహోవాకు కోపం తెప్పించారు. ఆ సమయంలో యెహోవాకు మీ మీద ఎంత కోపం వచ్చిందంటే, ఆయన మిమ్మల్ని సమూలంగా నాశనం చేయాలనుకున్నాడు.+  నేను రాతి పలకల్ని, అంటే యెహోవా మీతో చేసిన ఒప్పందపు రాతి పలకల్ని+ అందుకోవడానికి ఆ పర్వతం మీదికి వెళ్లినప్పుడు,+ 40 పగళ్లు, 40 రాత్రులు అక్కడే ఉన్నాను;+ అక్కడ నేను ఏమీ తినలేదు, నీళ్లు కూడా తాగలేదు. 10  అప్పుడు యెహోవా తన వేలితో రాసిన మాటలు ఉన్న రెండు రాతి పలకల్ని నాకు ఇచ్చాడు. మీరంతా సమావేశమైన రోజున, పర్వతం మీద అగ్నిలో నుండి యెహోవా మీతో మాట్లాడిన మాటలన్నీ వాటిమీద ఉన్నాయి.+ 11  ఆ 40 పగళ్లు, 40 రాత్రులు గడిచిన తర్వాత యెహోవా నాకు ఆ రెండు రాతి పలకల్ని అంటే ఒప్పందపు రాతి పలకల్ని ఇచ్చాడు. 12  అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు: ‘నువ్వు లేచి త్వరగా ఇక్కడి నుండి కిందికి వెళ్లు. ఎందుకంటే ఐగుప్తు నుండి నువ్వు బయటికి తీసుకొచ్చిన నీ ప్రజలు చెడిపోయారు.+ వాళ్లు అనుసరించాలని నేను ఆజ్ఞాపించిన మార్గం నుండి వాళ్లు చాలా త్వరగా పక్కకుమళ్లారు. వాళ్లు తమ కోసం పోత* విగ్రహాన్ని తయారు చేసుకున్నారు.’+ 13  తర్వాత యెహోవా నాతో ఇలా అన్నాడు: ‘నేను ఈ ప్రజల్ని చూశాను. ఇదిగో! వీళ్లు తలబిరుసు ప్రజలు.+ 14  కాబట్టి, వీళ్లను సమూలంగా నాశనం చేయనివ్వు, ఆకాశం కింద నుండి వీళ్ల పేరును తుడిచేసి వీళ్లకన్నా నిన్ను బలమైన, విస్తారమైన జనంగా చేయనివ్వు.’+ 15  “అప్పుడు నేను వెనక్కి తిరిగి పర్వతం దిగి వచ్చాను, అప్పటికింకా పర్వతం అగ్నితో మండుతూనే ఉంది.+ నా రెండు చేతుల్లో ఆ రెండు ఒప్పందపు పలకలు ఉన్నాయి.+ 16  తర్వాత నేను చూసినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశారని గమనించాను. మీరు పోతపోసిన దూడ విగ్రహాన్ని చేసుకున్నారు. మీరు అనుసరించాలని యెహోవా ఆజ్ఞాపించిన మార్గం నుండి చాలా త్వరగా పక్కకుమళ్లారు.+ 17  కాబట్టి నేను ఆ రెండు పలకల్ని పట్టుకొని, నా రెండు చేతులతో వాటిని కింద పారేసి, మీ కళ్లముందే ముక్కలుముక్కలు చేశాను.+ 18  తర్వాత నేను ముందులాగే 40 పగళ్లు, 40 రాత్రులు యెహోవా ఎదుట సాష్టాంగపడ్డాను. నేను ఏమీ తినలేదు, నీళ్లు కూడా తాగలేదు.+ మీరు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించి ఆయనకు కోపం తెప్పించడం ద్వారా చేసిన పాపాలన్నిటిని బట్టి నేను అలా చేశాను. 19  మీ మీద యెహోవాకు వచ్చిన విపరీతమైన కోపాన్ని బట్టి+ నేను చాలా భయపడ్డాను. ఆయనకు ఎంత కోపమొచ్చిందంటే, ఆయన మిమ్మల్ని నాశనం చేయాలనుకున్నాడు. అయితే, ఈసారి కూడా యెహోవా నా మనవి విన్నాడు.+ 20  “యెహోవాకు అహరోను మీద ఎంత కోపమొచ్చిందంటే, ఆయన అతన్ని నాశనం చేయాలనుకున్నాడు.+ అయితే నేను ఆ సమయంలో అహరోను కోసం కూడా వేడుకున్నాను. 21  తర్వాత నేను మీరు చేసిన పాపభరితమైన వస్తువును, అంటే ఆ దూడ విగ్రహాన్ని+ తీసుకొని, అగ్నిలో కాల్చేశాను; దాన్ని చితగ్గొట్టి, ధూళి అంత సన్నగా అయ్యేవరకు నలగ్గొట్టాను; తర్వాత ఆ ధూళిని పర్వతం నుండి పారుతున్న ప్రవాహంలో పారేశాను.+ 22  “తర్వాత మీరు తబేరా+ దగ్గర, మస్సా+ దగ్గర, కిబ్రోతు-హత్తావా+ దగ్గర కూడా యెహోవాకు కోపం తెప్పించారు. 23  ఆ తర్వాత యెహోవా మిమ్మల్ని కాదేషు-బర్నేయ+ నుండి పంపిస్తూ, ‘మీరు వెళ్లి, నేను మీకు ఖచ్చితంగా ఇవ్వబోయే దేశాన్ని స్వాధీనం చేసుకోండి!’ అని చెప్పినప్పుడు, మీరు మళ్లీ మీ దేవుడైన యెహోవా ఆదేశానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు,+ ఆయనపై విశ్వాసం చూపించలేదు,+ ఆయనకు లోబడలేదు. 24  మీరు నాకు తెలిసినప్పటి నుండి మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. 25  “కాబట్టి నేను 40 పగళ్లు, 40 రాత్రులు యెహోవా ఎదుట సాష్టాంగపడుతూనే ఉన్నాను.+ యెహోవా మిమ్మల్ని సమూలంగా నాశనం చేస్తానని చెప్పినందువల్ల నేను అలా సాష్టాంగపడ్డాను. 26  అప్పుడు నేను యెహోవాను ఇలా వేడుకోవడం మొదలుపెట్టాను: ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా, నీ ప్రజల్ని నాశనం చేయకు. వీళ్లు నీ సొత్తు,*+ నువ్వు నీ శక్తితో* వీళ్లను విడిపించావు, బలమైన చేతితో వీళ్లను ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చావు. 27  నీ సేవకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను గుర్తుచేసుకో.+ ఈ ప్రజల మొండితనాన్ని, దుష్టత్వాన్ని, పాపాన్ని పట్టించుకోకు.+ 28  లేదంటే, నువ్వు ఏ దేశంలో నుండైతే వీళ్లను బయటికి తీసుకొచ్చావో ఆ దేశస్థులు ఇలా అనుకుంటారు: “యెహోవా ఈ ప్రజలకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి వాళ్లను తీసుకెళ్లలేకపోయాడు; ఆయన వాళ్లను ద్వేషించాడు కాబట్టే ఎడారిలో చంపేయడానికి వాళ్లను బయటికి తీసుకొచ్చాడు.”+ 29  ఎంతైనా వీళ్లు నీ ప్రజలు, నీ సొత్తు.*+ వీళ్లను నువ్వు నీ గొప్ప శక్తితో, చాచిన బాహువుతో బయటికి తీసుకొచ్చావు.’+

అధస్సూచీలు

లేదా “లోహపు.”
లేదా “స్వాస్థ్యం.”
లేదా “గొప్పతనంతో.”
లేదా “స్వాస్థ్యం.”