నహూము 3:1-19
3 రక్తసిక్తమైన నగరానికి శ్రమ!
అది పూర్తిగా మోసంతో, దోపిడీతో నిండిపోయింది.
దానికి ఎర దొరకని రోజంటూ లేదు!
2 కొరడా చప్పుడు, చక్రాల ధ్వని,పరుగెత్తుతున్న గుర్రాల చప్పుడు, రథాల శబ్దం వినిపిస్తోంది.
3 రౌతులు దౌడు తీస్తున్నారు, ఖడ్గాలు మెరుస్తున్నాయి, ఈటెలు తళతళలాడుతున్నాయి.ఎంతోమంది చనిపోతున్నారు, కళేబరాలు కుప్పలుకుప్పలుగా పడివున్నాయి.శవాల సంఖ్యకు లెక్కే లేదు.
శవాల మధ్య నడుస్తూ వాళ్లు తడబడుతున్నారు.
4 ఆ వేశ్య చేసిన ఎన్నో వ్యభిచార క్రియల వల్లే ఇదంతా జరిగింది,ఆమె అందగత్తె, సొగసైనది, మంత్రతంత్రాల్లో ఆరితేరినది,ఆమె తన వ్యభిచారంతో దేశాల్ని, తన మంత్రతంత్రాలతో కుటుంబాల్ని వలలో వేసుకుంటుంది.
5 సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: “ఇదిగో! నేను నీకు* వ్యతిరేకంగా ఉన్నాను,+నేను నీ వస్త్రాన్ని ముఖం వరకు పైకెత్తుతాను;దేశాలు నీ మానాన్ని,రాజ్యాలు నీ అవమానాన్ని చూసేలా చేస్తాను.
6 నీ మీద మురికి చల్లుతాను,నిన్ను నీచమైనదానిగా చేస్తాను;అందరూ నిన్ను చూసి భయపడేలా చేస్తాను.+
7 నిన్ను చూసే ప్రతీ ఒక్కరు నీ దగ్గర నుండి పారిపోయి,+ ఇలా అంటారు:‘నీనెవె పాడైపోయింది!
ఆమె మీద ఎవరు సానుభూతి చూపిస్తారు?’
నిన్ను ఓదార్చేవాళ్లను నేను ఎక్కడి నుండి తేవాలి?
8 నైలు కాలువల+ పక్కన కూర్చున్న నో-ఆమోను*+ కంటే నువ్వు గొప్పదానివా?
ఆమె చుట్టూ నీళ్లు ఉండేవి;సముద్రమే ఆమె సంపద, సముద్రమే ఆమె ప్రాకారం.
9 ఆమె అంతులేని శక్తికి ఇతియోపియా, ఐగుప్తులే* మూలం.
పూతు,+ లిబియా ప్రజలు నీ సహాయకులు.+
10 కానీ ఆమె కూడా బందీగా వెళ్లింది;ఆమె కూడా చెరపట్టబడింది.+
ఆమె పిల్లలు కూడా ప్రతి వీధి మూల దగ్గర ముక్కలుముక్కలు చేయబడ్డారు.
ఆమె ప్రముఖుల మీద వాళ్లు చీట్లు* వేశారు,ఆమె ఘనులందర్నీ సంకెళ్లతో బంధించారు.
11 నువ్వు కూడా తాగినదానిలా తూలతావు;+నువ్వు దాక్కుంటావు.
శత్రువు నుండి తప్పించుకోవడానికి ఆశ్రయాన్ని వెతుకుతావు.
12 నీ ప్రాకారాలన్నీ, తొలి అంజూర పండ్లు కాసిన అంజూర చెట్లలా ఉన్నాయి;వాటిని ఊపితే, ఆ పండ్లు తినేవాళ్ల నోట్లో పడతాయి.
13 ఇదిగో! నీ సైన్యాలు స్త్రీలలా ఉన్నాయి.
నీ దేశ ద్వారాలు నీ శత్రువుల కోసం పూర్తిగా తెరిచివుంటాయి.
నీ ద్వారాల అడ్డగడియల్ని అగ్ని దహించేస్తుంది.
14 ముట్టడి కోసం నీళ్లు చేదుకో!+
నీ ప్రాకారాలు బలపర్చుకో.
బురదలోకి దిగి బంకమట్టిని తొక్కు;ఇటుకల మూసను సిద్ధం చేయి.
15 అయినాసరే అగ్ని నిన్ను దహించేస్తుంది.
ఖడ్గం నిన్ను నరికేస్తుంది.+
మిడత పిల్లలు మింగేసినట్టు అది నిన్ను మింగేస్తుంది.+
నీ సంఖ్యను మిడత పిల్లలంత విస్తారంగా పెంచుకో!
అవును, నీ సంఖ్యను మిడతలంత విస్తారం చేసుకో!
16 నీ వర్తకులు ఆకాశ నక్షత్రాల కన్నా ఎక్కువమంది ఉన్నారు.
మిడత పిల్ల దాని చర్మాన్ని వదిలేసి, ఎగిరిపోతుంది.
17 నీ కాపలావాళ్లు మిడతల్లా ఉన్నారు,నీ అధికారులు మిడతల దండులా ఉన్నారు.
చల్లగా ఉన్న రోజున అవి బండ సందుల్లో విశ్రమిస్తాయి,కానీ సూర్యుడు ప్రకాశించగానే ఎగిరిపోతాయి;అవి ఎక్కడికి వెళ్లాయో ఎవరికీ తెలీదు.
18 అష్షూరు రాజా, నీ కాపరులు మగతగా ఉన్నారు.నీ ప్రముఖులు తమ ఇళ్లలో ఉన్నారు.
నీ ప్రజలు పర్వతాల మీద చెదిరిపోయారు,ఎవరూ వాళ్లను సమకూర్చడం లేదు.+
19 నీ ఉపద్రవానికి ఉపశమనం లేదు.
నీ గాయం నయంకానిది.
నీ గురించిన వార్త వినే వాళ్లంతా చప్పట్లు కొడతారు;+ఎడతెగని నీ క్రూరత్వం వల్ల బాధ అనుభవించనివాళ్లు ఎవరు?”+