నిర్గమకాండం 15:1-27
15 ఆ సమయంలో మోషే, ఇశ్రాయేలీయులు యెహోవాకు ఈ పాట పాడారు:+
“నేను యెహోవాకు పాట పాడతాను, ఎందుకంటే ఆయన ఘనవిజయం సాధించాడు.+
గుర్రాన్ని, దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోశాడు.+
2 నా శక్తి, నా బలం యెహోవాయే;* ఎందుకంటే నన్ను రక్షించేది ఆయనే.+
ఆయనే నా దేవుడు, నేను ఆయన్ని స్తుతిస్తాను;+ ఆయనే నా తండ్రికి దేవుడు,+ నేను ఆయన్ని ఘనపరుస్తాను.+
3 యెహోవా బలమైన యోధుడు.+ ఆయన పేరు యెహోవా.+
4 ఫరో రథాల్ని, అతని సైన్యాన్ని ఆయన సముద్రంలో పడద్రోశాడు.+అతని యోధుల్లో శ్రేష్ఠులు ఎర్రసముద్రంలో మునిగిపోయారు.+
5 ఉప్పొంగే జలాలు వాళ్లను ముంచేశాయి; వాళ్లు రాయిలా సముద్రం లోతుల్లోకి మునిగిపోయారు.+
6 యెహోవా, నీ కుడిచేతికి ఉన్న శక్తి గొప్పది;+యెహోవా, నీ కుడిచెయ్యి శత్రువును చితగ్గొడుతుంది.
7 నువ్వు నీ గొప్ప వైభవంతో, నీకు వ్యతిరేకంగా లేచేవాళ్లను పడద్రోస్తావు;+నువ్వు నీ కోపాగ్నిని పంపిస్తావు, అది వాళ్లను కొయ్యకాలును* కాల్చినట్టు కాల్చేస్తుంది.
8 నీ శ్వాసవల్ల నీళ్లు ఉవ్వెత్తున ఒక్కచోటికి వచ్చాయి;అవి గోడల్లా నిలిచి ప్రవాహాల్ని ఆపాయి;సముద్ర గర్భంలో, ఉప్పొంగే జలాలు గడ్డకట్టాయి.
9 శత్రువు ఇలా అన్నాడు: ‘నేను వాళ్లను వెంటాడతాను! వాళ్లను పట్టుకుంటాను!
నాకు తృప్తి కలిగేంతవరకు దోపుడుసొమ్ము పంచుకుంటాను!
నా కత్తి దూస్తాను! నా చెయ్యి వాళ్లను లోబర్చుకుంటుంది!’+
10 నువ్వు నీ శ్వాస ఊదావు, సముద్రం వాళ్లను కప్పేసింది;+వాళ్లు అగాధ జలాల్లో సీసంలా మునిగిపోయారు.
11 యెహోవా, దేవుళ్లలో నీలాంటివాడు ఎవడు?+
సాటిలేని పవిత్రతను చూపే నీలాంటివాడు ఎవడు?+
స్తుతిగీతాలు పాడుతూ నీకు భయపడాలి, నువ్వు అద్భుతాలు చేస్తావు.+
12 నువ్వు నీ కుడిచేతిని చాపావు, భూమి వాళ్లను మింగేసింది.+
13 నీ విశ్వసనీయ ప్రేమతో, నువ్వు విడిపించిన ప్రజల్ని నడిపించావు.+నీ బలంతో వాళ్లను నీ పవిత్ర నివాస స్థలానికి తీసుకెళ్తావు.
14 జనాలు వినాలి;+ వాళ్లు వణికిపోతారు;ఫిలిష్తియ నివాసులు భయాందోళనలకు గురౌతారు.
15 అప్పుడు ఎదోము షేక్‌లు* భయపడిపోతారు,మోయాబు శక్తివంతమైన పరిపాలకులు* వణికిపోతారు.+
కనాను నివాసులందరి గుండెలు జారిపోతాయి.+
16 తీవ్రమైన భయం వాళ్లను కమ్ముకుంటుంది.+
నీ బాహువు గొప్పతనం వల్ల వాళ్లు రాయిలా చలనం లేకుండా ఉండిపోతారు;యెహోవా, నీ ప్రజలు దాటిపోయేవరకు,నువ్వు సృష్టించిన ప్రజలు+ దాటిపోయేవరకు వాళ్లు అలాగే ఉండిపోతారు.+
17 నువ్వు నీ ప్రజల్ని తీసుకొచ్చి నీ సొత్తైన పర్వతం మీద నాటుతావు.+యెహోవా, అది నువ్వు నివసించడానికి నువ్వు తయారుచేసుకొని స్థాపించిన స్థలం.యెహోవా, అది నీ చేతులు స్థాపించిన పవిత్రమైన స్థలం.
18 యెహోవా యుగయుగాలు రాజుగా పరిపాలిస్తాడు.+
19 ఫరో గుర్రాలు, యుద్ధ రథాలు, అశ్వదళం సముద్రంలోకి వెళ్లినప్పుడు,+యెహోవా సముద్ర జలాల్ని వాళ్ల మీదికి తిరిగి రప్పించాడు,+ఇశ్రాయేలు ప్రజలు మాత్రం సముద్రం మధ్య ఆరిన నేల మీద నడిచారు.”+
20 అప్పుడు అహరోను సహోదరి, ప్రవక్త్రి అయిన మిర్యాము ఒక కంజీరను* పట్టుకుంది. స్త్రీలందరూ కంజీరలు తీసుకొని, నాట్యం చేస్తూ ఆమెను అనుసరించారు.
21 పురుషులు పాడిన పాటకు స్పందిస్తూ మిర్యాము ఇలా పాడింది:
“యెహోవాకు పాట పాడండి, ఎందుకంటే ఆయన ఘనవిజయం సాధించాడు.+
గుర్రాన్ని, దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోశాడు.”+
22 తర్వాత మోషే ఇశ్రాయేలీయుల్ని ఎర్రసముద్రం దగ్గర నుండి ముందుకు నడిపించాడు. వాళ్లు షూరు ఎడారిలోకి ప్రవేశించి దానిలో మూడు రోజులు ప్రయాణించారు. కానీ వాళ్లకు ఎక్కడా నీళ్లు దొరకలేదు.
23 వాళ్లు మారా* దగ్గరికి వచ్చారు.+ కానీ అక్కడున్న నీళ్లను తాగలేకపోయారు, ఎందుకంటే అవి చేదుగా ఉన్నాయి. అందుకే అతను ఆ చోటికి మారా అని పేరు పెట్టాడు.
24 అప్పుడు ప్రజలు, “మేము ఏం తాగాలి?” అంటూ మోషే మీద సణగడం మొదలుపెట్టారు.+
25 దాంతో అతను యెహోవాకు మొరపెట్టాడు,+ యెహోవా అతనికి ఒక చిన్న చెట్టును చూపించాడు. అతను ఆ చెట్టును నీళ్లలో వేసినప్పుడు అవి తియ్యగా మారిపోయాయి.
అక్కడ ఆయన వాళ్ల కోసం ఒక నియమాన్ని, చట్టాన్ని స్థాపించాడు; అక్కడ ఆయన వాళ్లను పరీక్షించాడు.+
26 ఆయన ఇలా చెప్పాడు: “మీరు మీ దేవుడైన యెహోవా స్వరాన్ని శ్రద్ధగా విని, ఆయన దృష్టికి ఏది మంచిదో అది చేస్తూ, ఆయన ఆజ్ఞల మీద మనసుపెట్టి ఆయన నియమాలన్నీ పాటిస్తే,+ ఐగుప్తీయుల మీదికి రప్పించిన జబ్బుల్లో దేన్నీ నేను మీ మీదికి రప్పించను.+ ఎందుకంటే, యెహోవానైన నేను మిమ్మల్ని బాగుచేస్తున్నాను.”+
27 తర్వాత వాళ్లు 12 నీటి ఊటలు, 70 ఖర్జూర చెట్లు ఉన్న ఏలీము దగ్గరికి వచ్చి, అక్కడే నీళ్ల పక్కన తమ డేరాలు వేసుకున్నారు.
అధస్సూచీలు
^ అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
^ పంట కోసిన తర్వాత నేలమీద మిగిలే కాడల దుబ్బు.
^ షేక్ అంటే గోత్రపు పెద్ద.
^ లేదా “నియంతలు.”
^ అంటే, గిలకల తప్పెట.
^ “చేదు” అని అర్థం.