నిర్గమకాండం 19:1-25
19 ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చాక, మూడో నెలలో అదే రోజున సీనాయి ఎడారికి చేరుకున్నారు.
2 వాళ్లు రెఫీదీము+ నుండి బయల్దేరి సీనాయి ఎడారికి వచ్చి, ఆ ఎడారిలో తమ డేరాలు వేసుకున్నారు. ఇశ్రాయేలీయులు అక్కడ పర్వతం ఎదుట తమ డేరాలు వేసుకున్నారు.+
3 తర్వాత మోషే సత్యదేవుని ముందు కనిపించడానికి పర్వతం పైకి వెళ్లాడు. అప్పుడు యెహోవా ఆ పర్వతం నుండి అతనితో ఇలా మాట్లాడాడు:+ “నువ్వు యాకోబు ఇంటివాళ్లతో, అంటే ఇశ్రాయేలీయులతో ఇలా అనాలి:
4 ‘మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసుకుంటూ+ నా దగ్గరికి తెచ్చుకోవడానికి నేను ఐగుప్తీయులకు ఏమి చేశానో మీరే స్వయంగా చూశారు.+
5 మీరు ప్రతీ విషయంలో నా మాటకు లోబడుతూ నా ఒప్పందానికి కట్టుబడి ఉంటే, ఖచ్చితంగా అన్నిదేశాల ప్రజల్లో మీరు నాకు ప్రత్యేకమైన సొత్తు* అవుతారు.+ ఎందుకంటే, భూమంతా నాదే కదా.+
6 మీరు నాకు యాజకులతో రూపొందిన రాజ్యంగా, పవిత్ర జనంగా తయారౌతారు.’+ నువ్వు ఇశ్రాయేలీయులతో చెప్పాల్సిన మాటలు ఇవే.”
7 కాబట్టి మోషే వెళ్లి ప్రజల పెద్దల్ని పిలిపించి, యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నిటినీ వాళ్లకు చెప్పాడు.+
8 అప్పుడు ప్రజలందరూ ముక్తకంఠంతో, “యెహోవా చెప్పినవన్నీ చేయడం మాకు ఇష్టమే” అన్నారు.+ వెంటనే మోషే ఆ ప్రజలు అన్న మాటల్ని యెహోవాకు చెప్పడానికి వెళ్లాడు.
9 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఇదిగో! నేను నీతో మాట్లాడేటప్పుడు ప్రజలు వినేలా, వాళ్లు నీ మీద కూడా విశ్వాసం ఉంచేలా నేను కారుమబ్బులో నీ దగ్గరికి వస్తున్నాను.” తర్వాత మోషే, ప్రజలు అన్న మాటల్ని యెహోవాకు చెప్పాడు.
10 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు ప్రజల దగ్గరికి వెళ్లి ఇవాళ, రేపు వాళ్లను పవిత్రపర్చు; అలాగే వాళ్లు తమ వస్త్రాలు ఉతుక్కోవాలి.
11 మూడో రోజు కోసం వాళ్లు సిద్ధంగా ఉండాలి, ఎందుకంటే మూడో రోజున యెహోవా ప్రజలందరి కళ్లముందు సీనాయి పర్వతం మీదికి దిగివస్తాడు.
12 ప్రజలు ఆ పర్వతం దగ్గరికి రాకుండా దాని చుట్టూ సరిహద్దులు ఏర్పాటుచేసి, వాళ్లకు ఇలా చెప్పు: ‘మీరు పర్వతం మీదికి వెళ్లకుండా, దాని అంచును తాకకుండా జాగ్రత్తపడండి. ఎవరైనా ఆ పర్వతాన్ని తాకితే అతన్ని ఖచ్చితంగా చంపేయాలి.
13 ఏ చెయ్యీ అతన్ని తాకకూడదు. అతన్ని రాళ్లతో కొట్టి చంపాలి, లేదా బాణాలు వేసి చంపాలి. అది జంతువైనా, మనిషైనా చావాల్సిందే.’+ అయితే బూర* శబ్దం వినబడినప్పుడు+ వాళ్లు ఆ పర్వతం దగ్గరికి రావచ్చు.”
14 అప్పుడు మోషే ఆ పర్వతం మీది నుండి కిందికి దిగి ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్లను పవిత్రపర్చడం మొదలుపెట్టాడు, వాళ్లు తమ వస్త్రాలు ఉతుక్కున్నారు.+
15 అతను ప్రజలతో, “మూడో రోజు కోసం సిద్ధపడండి. స్త్రీని ముట్టకండి”* అన్నాడు.
16 మూడో రోజు ఉదయం ఉరుములు, మెరుపులు వచ్చాయి; ఆ పర్వతం మీద దట్టమైన మేఘం కనిపించింది,+ చాలా బిగ్గరగా బూర* శబ్దం వినిపించింది; దాంతో పాలెంలో ఉన్న ప్రజలంతా భయంతో వణికిపోసాగారు.+
17 అప్పుడు ప్రజలు సత్యదేవుణ్ణి కలిసేలా మోషే వాళ్లను పాలెం బయటికి తీసుకొచ్చాడు; వాళ్లు వచ్చి పర్వతం అడుగుభాగం దగ్గర నిలబడ్డారు.
18 యెహోవా అగ్నిలో సీనాయి పర్వతం మీదికి దిగిరావడం వల్ల ఆ పర్వతమంతా పొగతో నిండిపోయింది;+ కొలిమిలో* నుండి పొగ పైకి లేచినట్టు ఆ పొగ పైకి లేస్తోంది, పర్వతమంతా భయంకరంగా కంపిస్తూ ఉంది.+
19 బూర* శబ్దం అంతకంతకూ బిగ్గరగా వినిపిస్తున్నప్పుడు మోషే మాట్లాడాడు, అప్పుడు సత్యదేవుని స్వరం అతనికి జవాబిచ్చింది.
20 యెహోవా సీనాయి పర్వత శిఖరం మీదికి దిగివచ్చాడు. తర్వాత యెహోవా మోషేను ఆ పర్వత శిఖరం మీదికి రమ్మని పిలిచాడు, మోషే దాని పైకి ఎక్కివెళ్లాడు.+
21 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు కిందికి వెళ్లి, యెహోవాను చూడడానికి సరిహద్దులు దాటి వచ్చే ప్రయత్నం చేయొద్దని ప్రజల్ని హెచ్చరించు. లేకపోతే వాళ్లలో చాలామంది చనిపోతారు.
22 అలాగే యెహోవా దగ్గరికి వస్తూ ఉండే యాజకులకు తమను తాము పవిత్రపర్చుకోమని చెప్పు, లేకపోతే యెహోవా వాళ్లను చంపేస్తాడు.”+
23 అప్పుడు మోషే యెహోవాతో ఇలా అన్నాడు: “ప్రజలు సీనాయి పర్వతం దగ్గరికి రాలేరు. ఎందుకంటే, ‘పర్వతం చుట్టూ సరిహద్దులు ఏర్పాటుచేసి, దాన్ని పవిత్రపర్చు’ అని నువ్వు మమ్మల్ని ముందే హెచ్చరించావు.”+
24 అయితే యెహోవా అతనితో ఇలా అన్నాడు: “నువ్వు కిందికి వెళ్లి అహరోనును వెంటబెట్టుకొని ఇక్కడికి ఎక్కిరా. అయితే సరిహద్దులు దాటి యెహోవా దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయొద్దని యాజకులకు, ప్రజలకు చెప్పు. లేకపోతే ఆయన వాళ్లను చంపేస్తాడు.”+
25 కాబట్టి మోషే కిందికి వెళ్లి ప్రజలకు ఆ మాటలు చెప్పాడు.
అధస్సూచీలు
^ లేదా “విలువైన సంపద.”
^ అక్ష., “పొట్టేలు కొమ్ము.”
^ లేదా “లైంగిక సంబంధాలకు దూరంగా ఉండండి.”
^ అక్ష., “కొమ్ము.”
^ లేదా “బట్టీలో.” ఇటుకలు, మట్టి పాత్రలు కాల్చడానికి ఉపయోగించే ఒక రకమైన పొయ్యి.
^ అక్ష., “కొమ్ము.”