నిర్గమకాండం 40:1-38
40 తర్వాత యెహోవా మోషేకు ఇలా చెప్పాడు:
2 “మొదటి నెల మొదటి రోజున నువ్వు గుడారాన్ని, అంటే ప్రత్యక్ష గుడారాన్ని నిలబెట్టాలి.+
3 నువ్వు సాక్ష్యపు మందసాన్ని దాని లోపల పెట్టి, అది కనిపించకుండా తెరను వేలాడదీయి.
4 నువ్వు బల్లను కూడా లోపలికి తీసుకొచ్చి, దానికి సంబంధించిన వస్తువుల్ని దానిమీద సర్దాలి; అలాగే దీపస్తంభాన్ని లోపలికి తీసుకొచ్చి, దాని దీపాల్ని వెలిగించాలి.
5 తర్వాత నువ్వు బంగారు ధూపవేదికను సాక్ష్యపు మందసం ఎదురుగా పెట్టి, గుడారపు ప్రవేశ ద్వారం తెరను వేలాడదీయి.
6 “దహనబలులు అర్పించే బలిపీఠాన్ని నువ్వు గుడారపు ప్రవేశ ద్వారం ముందు, అంటే ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం ముందు పెట్టాలి.
7 గంగాళాన్ని ప్రత్యక్ష గుడారానికి, బలిపీఠానికి మధ్య ఉంచి దానిలో నీళ్లు పోయాలి.
8 తర్వాత దాని చుట్టూ ప్రాంగణాన్ని+ నిలబెట్టి, ప్రాంగణ ప్రవేశ ద్వారం తెరను+ వేలాడదీయి.
9 ఆ తర్వాత నువ్వు అభిషేక తైలం+ తీసుకొని గుడారాన్ని, దానిలో ఉన్న వాటన్నిటినీ అభిషేకించి, దాన్నీ దాని పాత్రలన్నిటినీ పవిత్రపర్చాలి. అప్పుడది పవిత్రమౌతుంది.
10 దహనబలులు అర్పించే బలిపీఠాన్ని, దాని పాత్రలన్నిటినీ నువ్వు అభిషేకించి ఆ బలిపీఠాన్ని పవిత్రపర్చాలి. అప్పుడది అతి పవిత్రమైన బలిపీఠం అవుతుంది.+
11 అలాగే గంగాళాన్ని, దాని పీఠాన్ని అభిషేకించి దాన్ని పవిత్రపర్చు.
12 “తర్వాత అహరోనును, అతని కుమారుల్ని ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గరికి తీసుకొచ్చి వాళ్లకు నీళ్లతో స్నానం చేయించు.
13 నువ్వు అహరోనుకు పవిత్ర వస్త్రాలు తొడిగి,+ అతన్ని అభిషేకించి,+ పవిత్రపర్చాలి. అప్పుడతను నాకు యాజకుడిగా సేవచేస్తాడు.
14 తర్వాత అతని కుమారుల్ని దగ్గరికి తీసుకొచ్చి, వాళ్లకు చొక్కాలు తొడుగు.+
15 వాళ్లు నాకు యాజకులుగా సేవచేసేలా, నువ్వు వాళ్ల నాన్నను అభిషేకించినట్టే వాళ్లను కూడా అభిషేకించాలి.+ ఈ అభిషేకం వల్ల వాళ్లు తరతరాలపాటు యాజకులుగా సేవచేస్తారు, యాజకత్వం ఎప్పటికీ వాళ్లదౌతుంది.”+
16 యెహోవా తనకు ఆజ్ఞాపించిన వాటన్నిటి ప్రకారం మోషే చేశాడు.+ అతను సరిగ్గా అలాగే చేశాడు.
17 రెండో సంవత్సరం మొదటి నెల మొదటి రోజున గుడారాన్ని నిలబెట్టారు.+
18 మోషే ఆ గుడారాన్ని నిలబెట్టినప్పుడు అతను దాని దిమ్మల్ని+ కిందపెట్టి, వాటిలో చట్రాల్ని* నిలబెట్టాడు; తర్వాత దాని అడ్డకర్రల్ని+ వాటిలో పెట్టి, దాని స్తంభాల్ని నిలబెట్టాడు.
19 తర్వాత అతను గుడారం+ పైన దాని కప్పుల్ని పరిచాడు.+ యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే మోషే చేశాడు.
20 తర్వాత అతను సాక్ష్యపు పలకల్ని మందసంలో+ ఉంచి, దానికి కర్రలు+ పెట్టి, దానిపైన మూత+ పెట్టాడు.
21 అతను ఆ మందసాన్ని గుడారం లోపలికి తీసుకొచ్చి, ఆ సాక్ష్యపు మందసం కనిపించకుండా ఉండేలా తెరను+ వేలాడదీశాడు.+ యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే మోషే చేశాడు.
22 తర్వాత అతను బల్లను+ ప్రత్యక్ష గుడారంలోకి తీసుకొచ్చి, దాన్ని గుడారం ఉత్తరం వైపున, తెర బయట పెట్టాడు.
23 తర్వాత యెహోవా ముందు దానిమీద రొట్టెల వరుసను+ పెట్టాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే మోషే చేశాడు.
24 అతను దీపస్తంభాన్ని+ కూడా ప్రత్యక్ష గుడారంలోకి తీసుకొచ్చి, దాన్ని గుడారం దక్షిణం వైపున బల్ల ఎదురుగా పెట్టాడు.
25 తర్వాత అతను యెహోవా ముందు దీపాల్ని+ వెలిగించాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే మోషే చేశాడు.
26 తర్వాత అతను బంగారు వేదికను*+ ప్రత్యక్ష గుడారంలోకి తీసుకొచ్చి, దాన్ని తెర ఎదురుగా పెట్టాడు.
27 దానిమీద పరిమళ ధూపద్రవ్యాన్ని+ కాల్చి, పొగ పైకిలేచేలా చేస్తారు.+ యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే మోషే చేశాడు.
28 తర్వాత అతను గుడారపు ప్రవేశ ద్వారం తెరను వేలాడదీశాడు.+
29 అతను దహనబలిని,+ ధాన్యార్పణను అర్పించేలా దహనబలులు అర్పించే బలిపీఠాన్ని+ గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర, అంటే ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర పెట్టాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే మోషే చేశాడు.
30 తర్వాత అతను ప్రత్యక్ష గుడారానికి, బలిపీఠానికి మధ్య గంగాళాన్ని పెట్టి, యాజకులు కాళ్లూచేతులు కడుక్కోవడానికి అందులో నీళ్లు పోశాడు.
31 మోషే, అహరోను, అతని కుమారులు అక్కడ తమ కాళ్లూచేతులు కడుక్కునేవాళ్లు.
32 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే, వాళ్లు ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్లినప్పుడల్లా లేదా బలిపీఠం దగ్గరికి వెళ్లినప్పుడల్లా కాళ్లూచేతులు కడుక్కునేవాళ్లు.+
33 చివరిగా అతను గుడారం చుట్టూ ప్రాంగణాన్ని,+ బలిపీఠాన్ని నిలబెట్టి, ప్రాంగణ ప్రవేశ ద్వారం తెరను+ వేలాడదీశాడు.
అలా మోషే ఆ పనిని పూర్తిచేశాడు.
34 అప్పుడు ఆ మేఘం ప్రత్యక్ష గుడారాన్ని కప్పడం మొదలుపెట్టింది, గుడారం యెహోవా మహిమతో నిండిపోయింది.+
35 ఆ మేఘం ప్రత్యక్ష గుడారం పైన నిలిచివుండడం వల్ల, గుడారం యెహోవా మహిమతో నిండిపోవడం వల్ల మోషే దాని లోపలికి వెళ్లలేకపోయాడు.+
36 ఇశ్రాయేలీయులు తమ ప్రయాణమంతటిలో, ఆ మేఘం ఎప్పుడైతే గుడారం మీది నుండి పైకి లేస్తుందో అప్పుడు వాళ్లు తమ డేరాలు తీసేసి ప్రయాణం మొదలుపెట్టేవాళ్లు.+
37 కానీ ఆ మేఘం పైకి లేవకపోతే, అది లేచే రోజు వరకు వాళ్లు డేరాలు తీసేసేవాళ్లు కాదు.+
38 ఇశ్రాయేలీయుల ప్రయాణమంతటిలో వాళ్లందరి కళ్లముందు, పగటిపూట యెహోవా మేఘం గుడారం పైన ఉండేది, అలాగే రాత్రిపూట అగ్ని దాని పైన నిలిచివుండేది.+