నెహెమ్యా 6:1-19

  • నిర్మాణ పనికి వ్యతిరేకత ఆగలేదు (1-14)

  • 52 రోజుల్లో ప్రాకారం పూర్తయింది (15-19)

6  సన్బల్లటు, టోబీయా,+ అరబీయుడైన+ గెషెము, మా మిగతా శత్రువులు నేను ప్రాకారాన్ని తిరిగి కట్టాననీ,+ దానిలో పగుళ్లేవీ మిగిలి లేవనీ వినగానే (కానీ ఆ సమయానికి నేను ఇంకా ద్వారాలకు తలుపులు బిగించలేదు),+  సన్బల్లటు, గెషెము “రా, ఓనో+ లోయ మైదానం గ్రామాల్లో కలుసుకోవడానికి మనం ఒక సమయాన్ని నిర్ణయించుకుందాం” అని నాకు సందేశం పంపించారు. నిజానికి వాళ్లు నాకు హాని చేయాలని కుట్ర పన్నుతున్నారు.  అందుకే నేను వాళ్ల దగ్గరికి సందేశకుల్ని పంపించి ఇలా చెప్పాను: “నేను ఒక గొప్ప పనిలో ఉన్నాను, అక్కడికి రాలేను. నేను ఈ పని వదిలిపెట్టి మీ దగ్గరికి వస్తే, పని ఆగిపోతుంది.”  వాళ్లు అదే సందేశాన్ని నాలుగుసార్లు పంపారు, నేను ప్రతీసారి అదే జవాబు ఇచ్చాను.  కాబట్టి సన్బల్లటు తన సహాయకునితో అదే సందేశాన్ని ఐదోసారి పంపిస్తూ, తెరిచివున్న ఒక ఉత్తరాన్ని అతని చేతికి ఇచ్చి పంపాడు.  అందులో ఇలా రాసివుంది: “నువ్వూ, యూదులూ తిరుగుబాటు చేయడానికి కుట్ర పన్నుతున్నారని+ ఇతర దేశాలవాళ్లు చెప్పుకుంటున్నారు, గెషెము+ కూడా అదే అంటున్నాడు. అందుకే నువ్వు ప్రాకారాన్ని కడుతున్నావు; ఈ వార్తల్ని బట్టి నువ్వు వాళ్లకు రాజువు అవుతావని తెలుస్తోంది.  అంతేకాదు, ‘యూదాలో ఒక రాజు ఉన్నాడు!’ అని యెరూషలేము అంతటా నీ గురించి ప్రకటించడానికి నువ్వు ప్రవక్తల్ని నియమించావు, ఇప్పుడు ఈ విషయాలు రాజుకు తెలియజేయబడతాయి. కాబట్టి రా, మనం దీని గురించి మాట్లాడుకుందాం.”  అయితే నేను అతనికి, “నువ్వు చెప్తున్నవాటిలో ఒక్కటి కూడా నిజంకాదు. అవన్నీ నువ్వు ఊహించుకున్నవే” అని జవాబు పంపించాను.  ఎందుకంటే వాళ్లందరూ మమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నించారు. వాళ్లు ఇలా అనుకున్నారు: “ఈ పనిలో వాళ్ల చేతులు బలహీనమౌతాయి, ఆ పని పూర్తికాదు.”+ అయితే నా చేతుల్ని బలపర్చమని నేను ఇప్పుడు ప్రార్థిస్తున్నాను.+ 10  తర్వాత నేను మహేతబేలు మనవడూ దెలాయ్యా కుమారుడూ అయిన షెమయా ఇంటికి వెళ్లాను. అక్కడ అతను బంధించబడివున్నాడు. అతను, “మనం ఒక సమయం అనుకుని సత్యదేవుని మందిరంలో, ఆలయం లోపల కలుసుకొని ఆలయం తలుపుల్ని మూసేద్దాం; ఎందుకంటే వాళ్లు రాత్రి నిన్ను చంపడానికి వస్తున్నారు” అని అన్నాడు. 11  కానీ నేను, “నాలాంటి వ్యక్తి పారిపోవచ్చా? నాలాంటి వ్యక్తి ఆలయం లోపలికి వెళ్లి ప్రాణాలతో ఉండగలడా?+ నేను వెళ్లను!” అని అన్నాను. 12  దేవుడు అతన్ని పంపలేదు కానీ, టోబీయా, సన్బల్లటులే+ అతనికి డబ్బులిచ్చి నాకు వ్యతిరేకంగా అలా చెప్పించారని అప్పుడు నాకు అర్థమైంది. 13  నన్ను భయపెట్టడానికి, నాతో పాపం చేయించడానికి వాళ్లు అతనికి డబ్బులిచ్చారు. అప్పుడు నా పేరు పాడుచేసి, నన్ను నిందించడానికి వాళ్ల దగ్గర ఆధారాలు ఉంటాయి. 14  నా దేవా, టోబీయాను,+ సన్బల్లటును, వాళ్లు చేసిన పనుల్ని తప్పకుండా గుర్తుంచుకో. అలాగే నన్ను భయపెట్టాలని అదేపనిగా ప్రయత్నించిన ప్రవక్త్రి నోవద్యాను, మిగతా ప్రవక్తల్ని కూడా తప్పకుండా గుర్తుంచుకో. 15  ఏలూలు* నెల, 25వ రోజున ప్రాకారం పూర్తయింది. అది 52 రోజుల్లో పూర్తయింది. 16  అది విని మా శత్రువులందరూ, దాన్ని చూసి చుట్టుపక్కల దేశాల వాళ్లందరూ చాలా సిగ్గుపడ్డారు.+ ఈ పని మా దేవుని సహాయంతోనే జరిగిందని వాళ్లు గ్రహించారు. 17  ఆ రోజుల్లో యూదా ప్రముఖులు+ టోబీయాకు ఎన్నో ఉత్తరాలు పంపిస్తుండేవాళ్లు. టోబీయా వాటికి జవాబిస్తుండేవాడు. 18  యూదాలోని చాలామంది అతనికి మద్దతు ఇస్తామని ప్రమాణం చేశారు. ఎందుకంటే, టోబీయా ఆరహు+ కుమారుడైన షెకన్యాకు అల్లుడు; అలాగే టోబీయా కుమారుడైన యెహోహానాను, బెరెక్యా కుమారుడైన మెషుల్లాము+ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. 19  అంతేకాదు, వాళ్లు అతని గురించి నాకు ఎప్పుడూ మంచి విషయాలు చెప్పేవాళ్లు, తర్వాత నేను ఏమి అన్నానో అతనికి చెప్పేవాళ్లు. అప్పుడు టోబీయా నన్ను భయపెట్టడానికి+ ఉత్తరాలు పంపేవాడు.

అధస్సూచీలు

అనుబంధం B15 చూడండి.