న్యాయాధిపతులు 1:1-36
1 యెహోషువ చనిపోయిన తర్వాత+ ఇశ్రాయేలీయులు* యెహోవాను, “కనానీయుల మీద యుద్ధం చేయడానికి ముందుగా మాలో ఎవరు వెళ్తారు?” అని అడిగారు.+
2 దానికి యెహోవా, “యూదా గోత్రంవాళ్లు వెళ్తారు.+ ఇదిగో! నేను ఈ దేశాన్ని వాళ్ల చేతికి అప్పగిస్తున్నాను”* అని చెప్పాడు.
3 అప్పుడు యూదా గోత్రంవాళ్లు తమ సహోదరులైన షిమ్యోను గోత్రంవాళ్లతో, “కనానీయుల మీద యుద్ధం చేయడానికి మాతోపాటు మాకు ఇచ్చిన ప్రాంతంలోకి+ రండి. తర్వాత, మేము మీతోపాటు మీకు ఇచ్చిన ప్రాంతంలోకి వస్తాం” అన్నారు. దాంతో షిమ్యోనీయులు యూదావాళ్లతో కలిసి వెళ్లారు.
4 యూదా గోత్రంవాళ్లు యుద్ధానికి వెళ్లినప్పుడు యెహోవా కనానీయుల్ని, పెరిజ్జీయుల్ని వాళ్ల చేతికి అప్పగించాడు; వాళ్లు బెజెకులో 10,000 మందిని ఓడించారు.
5 వాళ్లు బెజెకులో అదోనీబెజెకును కనుగొని అక్కడ అతనితో యుద్ధం చేశారు; వాళ్లు కనానీయుల్ని,+ పెరిజ్జీయుల్ని+ ఓడించారు.
6 అదోనీబెజెకు పారిపోయినప్పుడు వాళ్లు అతన్ని తరిమి పట్టుకుని అతని చేతుల, కాళ్ల బొటనవేళ్లు కోసేశారు.
7 అప్పుడు అదోనీబెజెకు ఇలా అన్నాడు: “తమ చేతుల, కాళ్ల బొటనవేళ్లు కోయబడిన 70 మంది రాజులు నా బల్ల కింద భోజనం ఏరుకుంటున్నారు. నేను చేసినట్టే దేవుడు నాకు చేశాడు.” తర్వాత వాళ్లు అతన్ని యెరూషలేముకు తీసుకొచ్చారు, అతను అక్కడే చనిపోయాడు.
8 తర్వాత, యూదావాళ్లు యెరూషలేము మీద యుద్ధం చేసి+ దాన్ని స్వాధీనం చేసుకున్నారు; వాళ్లు అందులోని ప్రజల్ని కత్తితో చంపి ఆ నగరాన్ని తగలబెట్టారు.
9 దాని తర్వాత, యూదావాళ్లు పర్వత ప్రాంతంలో, నెగెబులో, షెఫేలాలో+ నివసిస్తున్న కనానీయులతో యుద్ధం చేయడానికి వెళ్లారు.
10 వాళ్లు హెబ్రోనులో (హెబ్రోనుకు అంతకుముందు కిర్యతర్బా అనే పేరు ఉండేది) నివసిస్తున్న కనానీయుల మీదికి వెళ్లారు; వాళ్లు షేషయిని, అహీమానును, తల్మయిని నాశనం చేశారు.+
11 వాళ్లు అక్కడి నుండి దెబీరు (దెబీరుకు అంతకుముందు కిర్యత్సేఫెరు అనే పేరు ఉండేది) నివాసుల మీదికి వెళ్లారు.+
12 అప్పుడు కాలేబు,+ “కిర్యత్సేఫెరు మీద దాడిచేసి దాన్ని స్వాధీనం చేసుకునే వ్యక్తికి నా కూతురు అక్సాను ఇచ్చి పెళ్లిచేస్తాను”+ అని అన్నాడు.
13 అప్పుడు కాలేబు తమ్ముడైన కనజు కుమారుడు+ ఒత్నీయేలు+ దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కాబట్టి కాలేబు అతనికి తన కూతురు అక్సాను ఇచ్చి పెళ్లిచేశాడు.
14 ఆమె తన భర్త ఇంటికి వెళ్లేటప్పుడు, తన తండ్రిని ఒక పొలం అడగమని భర్తను తొందరపెట్టింది. ఆమె గాడిద మీద నుండి దిగినప్పుడు* కాలేబు, “నీకు ఏమి కావాలి?” అని ఆమెను అడిగాడు.
15 ఆమె అతనితో, “దయచేసి నాకు ఒక దీవెన ఇవ్వు. నువ్వు దక్షిణాన* నాకు ఒక భూమి ఇచ్చావు; గుల్లోతు-మయిము* కూడా ఇవ్వు” అని అంది. అప్పుడు కాలేబు ఆమెకు ఎగువ గుల్లోతును, దిగువ గుల్లోతును ఇచ్చాడు.
16 కేనీయుడైన మోషే మామ+ వంశస్థులు+ యూదావాళ్లతో కలిసి ఖర్జూర చెట్ల నగరం*+ నుండి అరాదుకు+ దక్షిణాన ఉన్న యూదా ఎడారికి* వచ్చారు. వాళ్లు అక్కడికి వచ్చి స్థానిక ప్రజల మధ్య స్థిరపడ్డారు.+
17 అయితే యూదా గోత్రంవాళ్లు తమ సహోదరులైన షిమ్యోను గోత్రంవాళ్లతో కలిసి, జెఫతు నగరంలో నివసిస్తున్న కనానీయుల మీద దాడిచేసి ఆ నగరాన్ని నాశనం చేశారు.+ కాబట్టి వాళ్లు దానికి హోర్మా*+ అనే పేరు పెట్టారు.
18 తర్వాత యూదావాళ్లు గాజాను,+ దాని ప్రాంతాన్ని, అష్కెలోనును,+ దాని ప్రాంతాన్ని, ఎక్రోనును,+ దాని ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు.
19 యెహోవా యూదావాళ్లకు తోడుగా ఉన్నాడు కాబట్టి వాళ్లు పర్వత ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు; కానీ మైదానంలో నివసిస్తున్న ప్రజల్ని వెళ్లగొట్టలేకపోయారు, ఎందుకంటే ఆ ప్రజల దగ్గర చక్రాలకు ఇనుప కత్తులుగల యుద్ధ రథాలు* ఉన్నాయి.+
20 మోషే వాగ్దానం చేసినట్టు వాళ్లు హెబ్రోనును కాలేబుకు ఇచ్చారు;+ అతను అనాకు ముగ్గురు కుమారుల్ని+ అక్కడి నుండి వెళ్లగొట్టాడు.
21 అయితే బెన్యామీనీయులు యెరూషలేములో నివసిస్తున్న యెబూసీయుల్ని వెళ్లగొట్టలేదు, కాబట్టి యెబూసీయులు ఈ రోజు వరకు బెన్యామీనీయులతో కలిసి యెరూషలేములోనే నివసిస్తున్నారు.+
22 ఈలోగా యోసేపు వంశస్థులు+ బేతేలు మీదికి వెళ్లారు, యెహోవా వాళ్లకు తోడుగా ఉన్నాడు.+
23 ఆ సమయంలో యోసేపు వంశస్థులు బేతేలును (ఈ నగరానికి అంతకుముందు లూజు అనే పేరు ఉండేది)+ వేగు చూస్తున్నారు,
24 ఒకతను నగరం నుండి బయటికి వెళ్లడం ఆ వేగులవాళ్లు చూశారు. వాళ్లు అతనితో, “దయచేసి ఈ నగరంలోకి వెళ్లే దారి మాకు చూపించు, మేము నీ మీద దయ* చూపిస్తాం” అన్నారు.
25 అతను వాళ్లకు నగరంలోకి వెళ్లే దారి చూపించాడు. అప్పుడు వాళ్లు ఆ నగరంలోని ప్రజల్ని కత్తితో చంపారు; కానీ అతన్ని, అతని కుటుంబాన్నంతటినీ వెళ్లిపోనిచ్చారు.+
26 అతను హిత్తీయుల ప్రాంతానికి వెళ్లి ఒక నగరాన్ని కట్టి దానికి లూజు అని పేరు పెట్టాడు, ఈ రోజు వరకు దానికి అదే పేరు ఉంది.
27 మనష్షే గోత్రంవాళ్లు బేత్షెయానును, దాని చుట్టుపక్కల పట్టణాల్ని; తానాకును,+ దాని చుట్టుపక్కల పట్టణాల్ని; దోరును, దాని చుట్టుపక్కల పట్టణాల్ని; ఇబ్లెయామును, దాని చుట్టుపక్కల పట్టణాల్ని; మెగిద్దోను, దాని చుట్టుపక్కల పట్టణాల్ని స్వాధీనం చేసుకోలేదు.+ కనానీయులు మొండిగా అక్కడే ఉండిపోయారు.
28 ఇశ్రాయేలీయుల బలం పెరిగినప్పుడు వాళ్లు కనానీయుల చేత వెట్టిచాకిరి చేయించుకున్నారు,+ కానీ వాళ్లను పూర్తిగా వెళ్లగొట్టలేదు.+
29 అలాగే ఎఫ్రాయిమీయులు కూడా గెజెరులో నివసిస్తున్న కనానీయుల్ని వెళ్లగొట్టలేదు. కనానీయులు గెజెరులో వాళ్ల మధ్యే నివసిస్తూ వచ్చారు.+
30 జెబూలూను గోత్రంవాళ్లు కిత్రోనులో నివసిస్తున్నవాళ్లను, అలాగే నహలోలులో నివసిస్తున్నవాళ్లను వెళ్లగొట్టలేదు. కనానీయులు వాళ్ల మధ్యే నివసిస్తూ వచ్చారు; జెబూలూను గోత్రంవాళ్లు వాళ్లచేత వెట్టిచాకిరి చేయించుకున్నారు.+
31 ఆషేరు గోత్రంవాళ్లు అక్కోలో నివసిస్తున్నవాళ్లను, అలాగే సీదోనులో,+ అహ్లాబులో, అక్జీబులో, హెల్బాలో, అఫెకులో,+ రెహోబులో+ నివసిస్తున్నవాళ్లను వెళ్లగొట్టలేదు.
32 కాబట్టి ఆషేరీయులు దేశంలో ఉంటున్న కనానీయుల మధ్యే నివసిస్తూ వచ్చారు, ఎందుకంటే ఆషేరీయులు వాళ్లను వెళ్లగొట్టలేదు.
33 నఫ్తాలి గోత్రంవాళ్లు బేత్షెమెషులో నివసిస్తున్నవాళ్లను, అలాగే బేతనాతులో నివసిస్తున్నవాళ్లను వెళ్లగొట్టలేదు; అయితే వాళ్లు దేశంలో ఉంటున్న కనానీయుల మధ్యే నివసిస్తూ వచ్చారు.+ బేత్షెమెషు, బేతనాతు ప్రజలు వాళ్లకు వెట్టిచాకిరి చేసేవాళ్లయ్యారు.
34 దాను గోత్రంవాళ్లను అమోరీయులు పర్వత ప్రాంతానికే పరిమితం చేశారు, ఎందుకంటే అమోరీయులు వాళ్లను దిగువనున్న మైదానంలోకి రానివ్వలేదు.+
35 అమోరీయులు హెరెసు కొండ, అయ్యాలోను,+ షయల్బీము+ ప్రాంతాల్ని విడిచిపెట్టకుండా అక్కడే ఉండిపోయారు. అయితే యోసేపు వంశస్థుల బలం పెరిగినప్పుడు వాళ్లు అమోరీయులతో వెట్టిచాకిరి చేయించుకున్నారు.
36 అక్రబ్బీము పర్వత మార్గం+ నుండి, సెల నుండి పైకి ఉన్నది అమోరీయుల ప్రాంతం.
అధస్సూచీలు
^ అక్ష., “ఇశ్రాయేలు కుమారులు.”
^ లేదా “అప్పగించాను.”
^ లేదా “ఆమె గాడిద మీద ఉండి చప్పట్లు కొట్టినప్పుడు” అయ్యుంటుంది.
^ లేదా “నెగెబులో.”
^ “నీటి మడుగులు” అని అర్థం.
^ అంటే, యెరికో.
^ “నాశనం కోసం ప్రతిష్ఠించడం” అని అర్థం.
^ అక్ష., “ఇనుప రథాలు.”
^ అక్ష., “విశ్వసనీయ ప్రేమ.”