న్యాయాధిపతులు 12:1-15
12 అప్పుడు ఎఫ్రాయిమువాళ్లు ఒకచోట కలుసుకున్నారు; వాళ్లు నది దాటి సఫోనుకు* వచ్చి యెఫ్తాతో, “అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి నీతోపాటు రమ్మని నువ్వు మమ్మల్ని ఎందుకు పిలవలేదు?+ నిన్ను మీ ఇంటితోపాటు తగలబెడతాం” అన్నారు.
2 అయితే యెఫ్తా వాళ్లతో ఇలా అన్నాడు: “నా ప్రజలతో కలిసి నేను అమ్మోనీయుల మీద పెద్ద యుద్ధం చేశాను. నేను మీ సహాయం కోరాను, కానీ మీరు వాళ్ల చేతిలో నుండి నన్ను కాపాడలేదు.
3 మీరు నన్ను కాపాడరని నాకు అర్థమైనప్పుడు, నా ప్రాణాలకు తెగించి అమ్మోనీయుల మీదికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను;+ యెహోవా వాళ్లను నా చేతికి అప్పగించాడు. అలాంటిది ఈ రోజు నాతో గొడవపడడానికి ఎందుకు వచ్చారు?”
4 అప్పుడు యెఫ్తా గిలాదు+ వాళ్లందర్నీ సమకూర్చాడు. వాళ్లు, “ఎఫ్రాయిము, మనష్షేలలో ఉన్న గిలాదు వాళ్లారా, మీరు ఎఫ్రాయిము నుండి పారిపోయి వచ్చినవాళ్లు మాత్రమే” అని అన్న ఎఫ్రాయిమువాళ్లతో యుద్ధం చేసి వాళ్లను ఓడించారు.
5 గిలాదువాళ్లు యొర్దాను రేవుల ప్రాంతాన్ని ఆక్రమించుకుని,+ ఎఫ్రాయిమువాళ్లు పారిపోకుండా అక్కడ మనుషుల్ని పెట్టారు. ఎఫ్రాయిమువాళ్లలో ఎవరైనా, “దయచేసి నన్ను దాటనివ్వు” అని అడిగితే వాళ్లు అతన్ని, “నువ్వు ఎఫ్రాయిము వాడివా?” అని అడిగేవాళ్లు. అతను, “కాదు!” అని అంటే,
6 వాళ్లు అతన్ని, “దయచేసి ‘షిబ్బోలెతు’ అను” అని అడిగేవాళ్లు. కానీ అతనికి ఆ మాట సరిగ్గా పలకడం రాక “సిబ్బోలెతు” అనేవాడు. అప్పుడు వాళ్లు అతన్ని పట్టుకుని యొర్దాను రేవుల దగ్గర చంపేవాళ్లు. ఆ విధంగా అప్పుడు 42,000 మంది ఎఫ్రాయిమువాళ్లు చనిపోయారు.
7 యెఫ్తా ఇశ్రాయేలులో ఆరు సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. తర్వాత గిలాదుకు చెందిన యెఫ్తా చనిపోయాడు, అతన్ని గిలాదులో ఉన్న అతని నగరంలో పాతిపెట్టారు.
8 అతని తర్వాత బేత్లెహేముకు చెందిన ఇబ్సాను ఇశ్రాయేలులో న్యాయాధిపతిగా ఉన్నాడు.+
9 అతనికి 30 మంది కుమారులు, 30 మంది కూతుళ్లు. అతను తన కూతుళ్లను తన వంశం కానివాళ్లకు ఇచ్చి పెళ్లిచేశాడు, అలాగే తన కుమారుల కోసం 30 మంది వేరే వంశం స్త్రీలను తెచ్చాడు. అతను ఏడు సంవత్సరాలు ఇశ్రాయేలులో న్యాయం తీర్చాడు.
10 తర్వాత ఇబ్సాను చనిపోయాడు, అతన్ని బేత్లెహేములో పాతిపెట్టారు.
11 అతని తర్వాత, జెబూలూనుకు చెందిన ఏలోను ఇశ్రాయేలులో న్యాయాధిపతిగా ఉన్నాడు, అతను ఇశ్రాయేలులో పది సంవత్సరాలు న్యాయం తీర్చాడు.
12 తర్వాత జెబూలూనుకు చెందిన ఏలోను చనిపోయాడు, అతన్ని జెబూలూను ప్రాంతంలోని అయ్యాలోనులో పాతిపెట్టారు.
13 అతని తర్వాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడు అబ్దోను ఇశ్రాయేలులో న్యాయాధిపతిగా ఉన్నాడు.
14 అతనికి 40 మంది కుమారులు, 30 మంది మనవళ్లు ఉండేవాళ్లు; వాళ్లు 70 గాడిదల మీద తిరిగేవాళ్లు. అతను ఇశ్రాయేలులో ఎనిమిది సంవత్సరాలు న్యాయం తీర్చాడు.
15 తర్వాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడు అబ్దోను చనిపోయాడు. అతన్ని ఎఫ్రాయిము ప్రాంతంలోని అమాలేకీయుల+ పర్వతంలో ఉన్న పిరాతోనులో పాతిపెట్టారు.
అధస్సూచీలు
^ లేదా “ఉత్తరం వైపుకు” అయ్యుంటుంది.